మోదీ అమరావతికి ఏమిస్తారు ?

మోదీ అమరావతికి ఏమిస్తారు ?

రాజధాని మారకుండా పార్లమెంటులో చట్టబద్దత హామీ అయినా ఇస్తారా?

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంబించి . .. ఏయే వరాలు ప్రకటిస్తారు? 2015లో అమరావతి శంఖుస్థాపన చేసినపుడు నీళ్లు – మట్టి ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్న అప్పటి NDA సర్కార్ . .. 2025 లో ఏమి చేయబోతోంది. ఇప్పటి వరకు వరల్డ్ బాంక్ నుంచి, ఇతర సంస్థల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించారు . ఇంతవరకు బాగానే ఉంది . కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వబోయే పథకాలపై మోదీ క్లారిటీ ఇవ్వాలని ఆంధ్రప్రజలు కోరుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారు . దానిపై గట్టిగా అడిగే సత్తా ఉన్న నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కనిపించరు. 2019-2024 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ , ఈడీ కేసుల భయంతో స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రాన్ని అడదకుండా దొంగాట ఆడేసారు .

ఇపుడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2014-2019 మధ్య సీయంగా ఉన్నారు . చంద్రబాబుకు కేసుల భయం లేకపోయినా … మెతక వైఖరి అవలంబించి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు . ఇపుడు అడిగే పరిస్థితి ఉన్నా , , అమరావతి , పోలవరం పనులకు భారీగా నిధులు రాబట్టుకోవాలన్న కుతూహలంతో స్పెషల్ స్టేటస్ గురించి ఎలాగూ మోదీ ని అడగే పరిస్థితి ఉండదు .

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఆధారపడి ఉందన్న విషయం తెలిసిందే . రాజకేయగ మన అవసరం ఉన్నా . .. ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి.

అమరావతికి చట్టబద్దత హామీ ఇస్తారా ? రాజధాని ఏర్పాటు సమయంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సపోర్టుగా మాట్లాడారు. 33 వేల ఎకరాలు కూడా సరిపోదన్నారు . 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని సర్వనాశనం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు . అమరావతిపైనా , ఆ ప్రాంతంలో ఒక సామాజిక వర్గంపైనా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు . రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై రాక్షసత్వం చూపారు . దేవుడు కరుణించి వారి ఉద్యమం సక్సెస్ అయింది . వారి మనోభీష్టం మేరకు జగన్ ని ఆంధ్రప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు . ఇంతవరకు బాగానే ఉంది . చంద్రబాబు నాయుడు , కూటమి నేతలు తామే ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా అధికారంలో ఉంటామన్న భ్రమలలో తేలియాడుతున్నారు . అయితే ప్రజలు మాత్రం కొన్ని అనుమానాలలోనే ఉంటారు . ఆంధ్రప్రదేశ్ గ్రహపాటు బాగోక మరోమారు జగన్ అధికారంలోకి వస్తే . . పరిస్థితి ఏమిటి ? అన్న భయంలో మాత్రం కొందరు ఉన్నారు . వీరికి కూటమి ఎటువంటి భరోసా ఇస్తుంది . అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీతో ‘అమరావతి చట్టబద్దత ‘ హామీ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు . చంద్రబాబు ఈ పని చేయగలిగితే సక్సెస్ అయినట్లే . అమరావతి చట్టబద్దత అంశంపై మోదీ ఎటువంటి హామీ ఇవ్వకపోతే మాత్రం అమరావతి భవితవ్యంపై నీలినీడలు అలుముకునే ప్రమాదం పొంచి ఉంటుంది .

ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తారు. అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభిస్తుండటంతో ఈ పర్యటన కీలకంగా మారింది. ఈ సందర్భంగా మోదీ.. లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ….. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2.55కి కేరళలోని తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.15కి అమరావతి హెలిప్యాడ్‌కి చేరతారు. తర్వాత 3.25కి సభా వేదిక దగ్గరకు వెళ్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4.45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అప్పుడే అమరావతి పెవిలియన్‌ను పరిశీలిస్తారు .

ఏపీలో బీజేపీ వ్యూహం ఇదేనా

ఏపీలో బీజేపీ వ్యూహం ఇదేనా

కార్యకర్తలకే బిజెపిలో పెద్దపీట – ఇది ఎపిలో వ్యూహం – నాలుగు దశాబ్దాల నిబద్దత కలిగిన కార్యకర్తకు రాజ్యసభ

పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో, అత్యంత విధేయతతో సుదీర్ఘ కాలం పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు బీజేపీ పెద్ద పీట వేస్తోంది. రాజకీయంగా ఉనికి కోసం యత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఇది మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది .

నమ్మకంతో కట్టుబడి పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఊహించలేనంత పెద్ద అవకాశాలు ఇవ్వగలమన్న సంకేతాలను బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది కాలంలోనే కల్పించింది .

పక్కజిల్లాలో సొంత పార్టీ కార్యకర్తలకు కూడా కు తెలియని బి. శ్రీనివాసవర్మకు నరసాపురం నుంచి లోక్ సభ టికెట్ ఇచ్చారు. జగన్ వ్యతిరేకప్రభంజనంలో వర్మగెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు.

రాజ్యసభకు రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు విజయసాయిరెడ్డి స్ధానంలో పి వెంకట

సత్యనారాయణను ఎంపిక చేసినట్టు బిజెపి ప్రకటించింది. కూటమి బలం కారణంగా ఆయన ఎన్నిక ఎన్నిక కేవలం లాంఛనమే!

శ్రీనివాస్ వర్మ పశ్చిమగోదావరి జిల్లా స్థాయి లో పార్టీపరంగా అనేక బాధ్యతలు నిర్వహించారు. సత్యనారాయణ బిజెపి క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ గా వున్నారు. ఇద్దరిదీ భీమవరమే! ఇద్దరూ స్వయం సేవకులే! ఇద్దరూ పటాటోపాలకు దూరంగా వుండే కార్యకర్తలుగా గుర్తింపు పొందినవారే కావడం గమనార్హం. బిజెపి బలంలేని ఆంధ్రప్రదేశ్ లో పెద్దపెద్ద పదవులు వున్నవారి ప్రభావం కూడా సహజంగా తక్కువగానే వుంటుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి చిన్నగా విస్తరిస్తోంది. బిజెపికి పార్లమెంటులో ఆధిక్యత వున్నపుడు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు మొదలైన అనేక అంశాల్లో దగా చేసినందుకు ప్రజలు ఆపార్టీ ప్రజలు ఆగ్రహంగా వున్నారు. 2024 ఎన్నికల్లో మెజారిటీలేక తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్రంలో (రాష్ట్రంలో కూడా) కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక “పట్టి విడిచినట్టు” రాష్ట్రం కోర్కెలను కేంద్రం చిన్నగా తీరుస్తోంది. ఇందువల్ల ప్రజల ఆగ్రహం తగ్గింది. ఒకప్పుడు పార్టీ జెండా మోయడానికి కార్యకర్తలు లేని ఎపిలో బిజెపి సభ్యత్వాల సఖ్యపెరుగుతోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1 లక్షా 50 వేలమంది కంటే ఎక్కువ మందే బిజెపిలో సభ్యులుగా వున్నారు. పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి ఏ నియోజక వర్గంలోనైనా పాతిక ముప్పై మంది క్రియాశీలక సభ్యులే పార్టీకి వున్నారు.

కొద్దినెలల క్రితం బిజిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్సీ పదవి దక్కింది. బిజెపి, తెలుగుదేశం మధ్య పొత్తు వున్న కాలంలోనే వీర్రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు కి వ్యతిరేకంగా విమర్శలు చేసి రెండుపార్టీల మద్య వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. అలాంటి వీర్రాజు మళ్ళీ ఎమ్మెల్సీ కావడం అనూహ్యమే! టీడీపీని కాదని వీర్రాజు ఆర్ఎస్ఎస్ పెద్దల ద్వారా ఎమ్మెల్సే కొట్టగలిగారు . అదీ బీజేపీలో జరిగే రాజకీయం . చంద్రబాబు విధిలేక ఒప్పుకోవడం లేదా హుందాగా అంగీకరించడంలో బిజెపి మేనేజిమెంటు చాతుర్యం కూడా వుంది.

తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిలో పార్టీ బలం పెంచుకోడానికి సొంత ఎత్తుగడలు వున్నాయి. తెలుగుదేశంపార్టీ తన ఎమ్మెల్యేలు లేనిచోట ఇంచార్జ్ లను నియమించి వారి ద్వారా రోజువారీ పాలనలో కూడా జోక్యం చేసుకుంటోంది. జనసేనకు పవన్ కళ్యాణ్ నాయకత్వం తప్ప సంస్ధాగత నిర్మాణం దాదాపు లేదనే చెప్పొచ్చు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ అధికార కేంద్రాలు బలపడుతున్నాయి. తెలుగుదేశం ఇన్ చార్జ్ వ్యవస్థకు జనసేన అధికార కేంద్రాలకు మధ్య స్పర్ధలు వున్నాయి. అవి రోడ్డున పడే పరిస్ధితి ఇప్పట్లో వుండకపోవచ్చు .

పార్టీకి కట్టుబడిన వారికే పదవులు అనే బిజెపి ఎత్తుగడ, లాయలిస్టుల్లో నిరాసక్తత ను తొలగించి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అది ఆ పార్టీ విధానం… దానిని తప్పుపట్టడం పెద్దతప్పే అవుతుంది. ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెడుతోంది. “ఎంతపని చేసినా ఇంతే! లాయల్టీకి గుర్తింపు గౌరవం లేవు. బాబు మారడు. అధికారంలో లేనపుడు కార్యకర్తలే ప్రాణ సమానం అంటాడు. అధికారంలోకి వచ్చాక అదంతా మరచిపోతాడు……” ఇలాంటి కామెంట్లు తెలుగుదేశంలో తరచూ వినిపిస్తుంటాయి.

ఏరాజకీయ పార్టీ అయినా బలంపెంచుకోవలసిందే! అయితే ప్రజల్లోకి వెళ్ళడానికంటే కంటే కేంద్రం లో వున్న అధికారాన్ని ఇందుకు ఉపయోగించడం ఒక నైతిక ప్రశ్న! బిజెపికి ఇలాంటి నైతికమీమాంసలేమీ వుండవు అని రకరకాల పరిణామాల ద్వారా దేశప్రజలందరికీ తెలుసు!

బీజేపీ మింగేస్తుంది

బిజెపికి అవకాశం వచ్చినపుడు, ఇతరపార్టీలు ఆదమరచి వున్నపుడు బిజెపి ఆన్ని విధాలా ఆక్రమించేస్తుందని జనసేన కు తెలుస్తుందోలేదో కానీ , , తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ మర్మం ఖచ్చితంగా తెలుసు. అయినా కొన్ని పదవులు , కొన్ని పనులు వ్యవహారంలో వైసీపీకి సపోర్టుగా ఉండే బీజేపీ నేతలకు సైతం పెద్ద పీట వేయాల్సి రావడం టీడీపీ కి గత్యంతరంలేని పరిస్థితిగా కనిపిస్తోంది . అమరావతి , పోలవరం వంటి వాటిని నెరవేర్చాలంటే బీజేపీ పెద్దల అండదండలు కావాల్సిందే . అందుకోసం కొన్నింటిలో కాంప్రమైజ్ కాక తప్పడంలేదు .

రంగరాయ ప్రిన్సిపల్ గా డాక్టర్ విష్ణువర్ధన్

రంగరాయ ప్రిన్సిపల్ గా డాక్టర్ విష్ణువర్ధన్

తెలుగు రాష్ట్రాలలో అత్యున్నతమైన మెడికల్ కాలేజ్ రంగరాయ ప్రిన్సిపాల్ గా డాక్టర్ అత్తలూరి విష్ణ వర్ధన్ నియమితులయ్యారు . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధ0గా ఉన్న మెడికల్ కాలేజీలో అనస్తీసియా విభాగం HOD గా విధులు నిర్వహిస్తున్న విష్ణు రెండేళ్లుగా ఇదే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు . డాక్టర్ విష్ణు వర్ధన్ కు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ గుర్తింపుతోపాటు , పేషేంట్స్ పట్ల సేవాభావం చూపుతారని మంచి పేరుంది . 1997లో కాకినాడ జీజీహెచ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన విష్ణు తర్వాత 2006లో అసోసియేట్ ప్రొఫెస్సర్ గా పదోన్నటి పొందారు . 2015 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు . 2018 లో విష్ణు సేవలకు గాను , ప్రభుత్వం నుంచి ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్నారు .

టీడీపీ కేడర్ అసంతృప్తి  ఆగుతుందా?

టీడీపీ కేడర్ అసంతృప్తి ఆగుతుందా?

అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా.. గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడి , అక్రమాలకు ఒడిగట్టిన బడాబాబులపై చర్యలు జాప్యం కావడంతో ఇన్నాళ్లు టీడీపీ, జనసేన కేడర్ లో అసంతృప్తి చెలరేగింది. అడపా , దడపా చిన్న చిన్న అరెస్టులు చేసి తూతుమంత్రంగా చేతులు దులుపుకుంటున్నారన్న అక్కసుతో ఉన్న కేడర్ … వారం రోజులుగా జరుగుతున్న అరెస్టులతో సంతృప్తి చెందుతుందా? అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్న సోషల్ మీడియా సైన్యం ఆక్రోశం ఈ అరెస్టులతో కాస్త చల్లారుతుందా >

వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొంత మందికి కంటిమీద కునుకు కరువైంది . అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోంది . జగన్ అండ్ కో అండ చూసుకుని చెలరేగిపోయిన అరాచకవాదులు , అక్రమార్కులకు సెగ పుడుతోంది .

జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అక్రమాలు , అరాచకాలు రాజ్యమేలాయి . పలు అధరాలు దొరికినా మొదట్లో కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాన్చుడు ధోరణితో వ్యవహరించారు . ఈ మెతక వైఖరితో ప్రధానంగా టీడీపీ కేడర్ , సొంత పార్టీకి వాలంటీర్ గా పనిచేస్తున్న సోషల్ మీడియా ఏకంగా చంద్రబాబుపైనే తిరుగుబాటు ప్రకటించింది . దీంతో గత్యంతరం లేక అరాచకుల అరెస్టులు మొదలుపెట్టారన్న ప్రచారం సాగుతోంది .

ఐదు సంవత్సరాల పాటు జరిగిన రాజ్యాంగ వ్యతిరేక, నేరస్తుల పాలనపై వ్యతిరేకతతో ప్రజలు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేశారు. తమను చిత్ర హింసలు పెట్టిన వారి సంగతి తేల్చాలని కూటమి పార్టీలు టీడీపీ , జనసేన కేడర్ తో పాటు ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నింపాదిగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. అయితే ప్రభుత్వం ఓ ప్రణాళికతో ఉందని స్పష్టమయింది. మాజీ మంత్రి విడదల రజని మరిది గోపీనాధ్ అరెస్టు దగ్గర నుంచి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ పై చార్జెస్ వరకూ అన్నీ ప్రణాళికాబద్దంగా, క్రమబద్ధంగా.. చట్టబద్దంగా జరిగిపోతున్నాయి. కింగ్ పిన్ ను పూర్తి స్థాయిలో బుక్ చేసే వరకూ ఇవి సాగిపోతాయి.

పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో టెన్షన్: జగన్ సీఎంగా ఉన్నపుడు ఇంటెలెన్గ్స్ డీజీ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆంజనేయులు అరెస్టుతో వైసీపీ అరాచకవాదులతోపాటు , అప్పట్లో ఆ ఆపార్టీకి తొత్తులుగా వ్యవహరించి , అక్రమాలలో భాగస్వాములైన ఉన్నతాధికారుల వెన్నులో వణుకుపుడుతోంది .

ముంబై నటి జత్వానిని అక్రమంగా అరెస్ట్ చేసి , వేధింపులకు గురిచేసి , చివరికి వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను కూడా ముంబై నుంచి చట్ట విరుధ్దగా తీసుకువచ్చి నిర్బంధించిన కేసులో ఆంజనేయులు అరెస్ట్ కావడం గమనార్హం . ఈ కేసులో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ , కాంతి రానా టాటా లు అరెస్ట్ కాకుండా తాత్కాలికంగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు .

  • మద్యం కుంభకోణం కేసులో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి , , అలియాస్ రాజ్ కసిరెడ్డి ని సిఐడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు . విచారణల్లో ఇప్పటికే అతను కీలక విషయాలు వెల్లడించినట్లు చెపుతున్నారు . ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి , మిదున్ రెడ్డి , మాజీ సీఎం జగమ్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైసీపీ వర్గాలే బాహాటంగా వెల్లడిచేస్తున్నాయ్ .

మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లను దహనం చేసిన ఘటనలో మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. కానీ పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేయించి మరీ అరెస్టు చేశారు. ఇలా చేస్తారని ఏ మాత్రం ఊహించలేకపోయాడు మాధవరెడ్డి. ఈయన పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు. ఈ ఫైళ్ల కాల్చివేతలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వచ్చాయి . అయితే డైరెక్ట్ గా పెద్దిరెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయడానికి బలమైన అధరాలు దొరకలేదు . అయితే మాధవరెడ్డి వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందిని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • అరెస్ట్ చేసి జైలుకెస్తే , ,, కొన్నాళ్ళకి బెయిల్ వస్తుంది . బయటకు వచ్చి సదరు నేతలు , అధికారులే తొడకొట్టి కూటమి సర్కార్ నేతలతో ఆటలాడుకునే పరిస్థితి తలెత్తుతుంది . దీనిని దృష్టిలో పెట్టుకుని , చట్ట ప్రకారం బలమైన అధరాలు సేకరించిన తర్వాతే అరెస్టులు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు చెపుతున్నారు .
  • మాజీ మంత్రి కొడాలి నాని , మాజీ ఎమ్మెల్యే, జగన్ ముఖ్య అనుచరుడు, బియ్యం స్మగింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , అటవీ భూములను నకిలీ రికార్డులతో కానేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . .. ఇలా పలువురు కీలక నేతల అరెస్టులపై టీడీపీ , జనసేన కేడర్ ఎదురు చూస్తోంది . నెమ్మదిగా వీరంతా కూడా జైలుకెళ్లి పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయ్ .

మోదీ సభకు  ఏర్పాట్లు ఇవిగో.. అతి భారీగా

మోదీ సభకు ఏర్పాట్లు ఇవిగో.. అతి భారీగా

మూడు వేదికలు – ఎనిమిది మార్గాలు.. 5 లక్షల మంది వస్తారని అంచనా

మే 2వ తేదీన ఖరారైన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారు

 ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది . మే 2వ తేదీన అమరావతికి వస్తున్నారు భారత్ ప్రధాని . రాజధాని అమరావతిలో 15 నిమిషాల పటు రోడ్డుషో, గంట పాటు సాగే ఈ పర్యటనకు అమరావతి చరిత్ర తెలిపే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.

మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుని హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కి వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర 15 నిమిషాలపాటు రోడ్డు షోలో పాల్గొంటారు. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 5.20కి గన్నవరం నుంచి దిల్లీకి వెళతారు.

లక్ష కోట్ల ప్రాజెక్టులకు మోడీ చేతుల మీదుగా . ..ప్రధాని సభకు చేరుకునేందుకు దాదాపు 8 మార్గాలను పరిశీలించి ఖరారు చేసారు . దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రాజధాని పనుల పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

పటిష్టమైన వేదికలు . . ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్‌ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనకవైపు అమరావతి పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

జనం రాక కోసం . .రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి మీదుగా ప్రధాని సభకు చేరుకునేందుకు 8 మార్గాలను గుర్తించారు. మొత్తం 9 పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రముఖులు ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, రాజధానిలోని సీడ్‌యాక్సెస్‌ రోడ్డు, ఎన్‌10 రహదారుల మీదుగా వేదిక వద్దకు చేరుకుంటారు.

గుంటూరు, తెనాలి, మంగళగిరి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా వచ్చేవారు ఇ8, ఎన్‌9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. కాజా టోల్‌ప్లాజా సమీపంలోని మురుగన్‌ హోటల్‌ వద్ద ఎన్‌హెచ్‌-16 సర్వీసు రోడ్డులోంచి, ఎన్‌హెచ్‌ బైపాస్‌ జంక్షన్, నిడమర్రు, కురగల్లు మీదుగా ఎన్‌9 రహదారిలోకి ప్రవేశిస్తారు. గుంటూరు అమరావతి రోడ్డు, ఐఆర్‌ఆర్‌ జంక్షన్, గోరంట్ల, లామ్‌-తాడికొండ క్రాస్‌రోడ్లు, పెదపరిమి మీదుగా వచ్చేవారు ఇ6, ఎన్‌11, ఇ8, ఎన్‌10 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు. నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, గుంటూరు, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, దొండపాడు మీదుగా వచ్చేవారు ఇ3, ఎన్‌11, ఇ8 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు.

హైదరాబాద్, ఏలూరు, విజయవాడ నుంచి వచ్చేవారు జాతీయ రహదారి బైపాస్‌ బ్రిడ్జి మీదుగా రాజధానిలోకి ప్రవేశించి ఇ8, ఎన్‌8 రహదారుల ద్వారా వద్దకు చేరతారు. విజయవాడ నుంచి కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా వచ్చేవారు భారతమాత విగ్రహం, ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా ఈ8, ఎన్‌9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. పోలీస్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు .

600/600 మార్కులు.. కాకినాడ విద్యార్థి రికార్డ్

600/600 మార్కులు.. కాకినాడ విద్యార్థి రికార్డ్

తెలుగు రాష్ట్రాల చరిత్రలో సరికొత్త రికార్డ్

పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 98 శాతం , 99 శాతం మార్కులు సాధిస్తేనే అత్యంత ఘనతగా చెప్పుకుంటాం . అలాంటిది 600 కి 600 మార్కులు సాధించి కాకినాడ విద్యార్థి అత్యంత అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది . నేహంజని అనే కాకినాడకు చెందిన స్టూడెంట్ కి ఈ ఘనత దక్కింది . ఈ బాలిక కాకినాడ భాష్యం స్కూల్ లో చదువుతోంది.

ఎలమంచిలి చైతన్య స్కూల్‌లో ఎండ అనితకు 599 – ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌ పావని చంద్రికకు 598 మార్కులు

మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది.

ఇంతటి ఘనత సాధించిన ఈ చిన్నారులను అభినందించాల్సిందే . అలా అని అందరి పిల్లలూ ఈ మాదిరిగా మార్కులు సాధించాలని ఒత్తిడి చేయడం మాత్రం సరికాదని పేరెంట్స్ గుర్తించుకోవాలి . మార్కులు అవసరమే కానీ , అవి ఒక్కటే కొలమానం కాదని మర్చిపోకూడదు .