by Srinivas Vedulla | Apr 26, 2025 | జనరల్
జమ్మూ కాశ్మీర్ సమీపంలో పహల్గాంలో జరిగిన మారణహోమం తరువాత భారతదేశానికి ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతోంది. పాకిస్థాన్ ఏకాకి అయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ పై క్రమంగా ఒత్తడి పెరుగుతోంది. దీనితో ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నోరు మెదిపారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
“జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఓ విషాదకర ఘటన జరిగింది. దీంతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతికే మేము ప్రాధాన్యత ఇస్తాం” అని షరీఫ్ పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.
చర్చల ద్వారానే పరిష్కారం!
ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పరోక్షంగా స్పందించారు. “మా దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో ఎన్నటికీ రాజీపడం. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘ఇండియా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఇలాంటి చర్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మేము చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలువురు పాక్ మంత్రులు భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను బలితీసుకుని నరమేధం సృష్టించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు ఆంక్షలు విధించింది. పాక్ పౌరులు తక్షణమే భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని లోలోపల భయంగానే ఉన్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు .
by Srinivas Vedulla | Apr 18, 2025 | జనరల్
యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు- భరతముని రచించిన నాట్యశాస్త్రానికి గుర్తింపు
హిందువుల ఆరాధ్య గ్రంథం … ఆధునిక వ్యక్తిత్వ వికాస గ్రందంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతోపాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. అత్యుత్తమ విలువ కలిగిన డాక్యుమెంటరీని సంరక్షించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఈనెల 17న కొత్తగా 74 డాక్యుమెంటరీలు యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చేరాయి. ఫలితంగా మొత్తం సంఖ్య 570కి చేరింది.
ప్రధాని నరేంద్రమోదీ భగవత్ గీత కు యునెస్కో గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమన్నారు. యునెస్కో మెమోరీ ఆ ఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్రానికి చోటు దక్కటం కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి లభించిన గుర్తింపు అని ప్రధాని పేర్కొన్నారు.
by Srinivas Vedulla | Apr 15, 2025 | జనరల్
ఏకకాలంలో 50వేల మందితో భోజనాలు- ఉజ్జయినిలోని నాగర్ భోజ్ భండారా వరల్డ్ రికార్డు- 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్‌తో నోరూరించే వంటకాలతో పసందైన విందు
వెయ్యి మందికి భోజనాలు పెట్టాలంటేనే పెద్ద హంగామా చేయాలి. పదిమంది ఆ పనిలో నాలుగైదు రోజులు బిజీగా ఉండాల్సిన పరిస్థితి . అలాంటిది ఏకంగా 50 వేల మందికి ఏకకాలంలో భోజనాలు పెట్టడమంటే మాటలా … అందుకే ఇది వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది.
ఆంజనేయ స్వామి జయంతి సందర్బంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని.. అంబాపూర్‌లో ఈ ఘనత చోటుచేసుకుంది . ఆ ఊరిలో ఉన్న పురాతన ‘జై వీర హనుమాన్’ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక భోజన కార్యక్రమం (భండారా) గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్తానం సంపాదించింది. ఈ కార్యక్రమానికి ‘నాగర్ భోజ్’ అని పేరు పెట్టారు . ఇందులో 50 వేల మంది హనుమాన్ భక్తులు ఏకకాలంలో ఆలయ ప్రసాదాన్ని తిన్నారు. వారంతా ఆలయ ప్రాంగణంలో బల్లలు, కుర్చీలపై కూర్చొని సాంప్రదాయ మాల్వా వంటకాలైన దాల్ బఫ్లా, లడ్డూ, కడీలను భుజించారు. భక్తులకు 600 మంది వాలంటీర్లు , కార్మికులు ఆహారాన్ని వడ్డించారు.
ఆహార పదార్దాల తయారీ కోసం 45 క్వింటాళ్ల బాఫ్లా గోధుమ పిండి, 7 క్వింటాళ్ల కంది పప్పు, 5 క్వింటాళ్ల పెరుగు, 6 క్వింటాళ్ల రవ్వ, 200 లీటర్ల పాలు, 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్‌ను వినియోగించారు.
— సామూహిక భోజన కార్యక్రమంలో వడ్డించిన వంటకాలను 70 మంది పాకశాస్త్ర నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది.
-ఏకకాలంలో 50వేల మందితో జరిగిన ఈ విందు కార్యక్రమాన్ని దిల్లీకి చెందిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం లార్జ్ స్కేల్ ఫుడ్ సర్వింగ్ ఆన్ చైర్-టేబుల్ విభాగం చేర్చింది. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను జైవీర్ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులకు ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్, న్యాయ నిర్ణేత వేదాంత్ జోషి ప్రదానం చేశారు.
by Srinivas Vedulla | Apr 14, 2025 | జనరల్
ఏ దేశానికీ సుంకాల నుంచి మినహాయింపు లేదని ట్రంప్ స్పష్టం- చైనా విషయంలో ఇక తగ్గేదిలేదని మరోమారు ప్రకటన
“అమెరికా నుంచి అసంబద్ధమైన వాణిజ్య మిగులు కలిగిన, నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికీ, ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపు లభించదు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి మినహాయింపు లభించదు. ఆ దేశం మాతో చాలా దారుణంగా వ్యవహరించింది. శుక్రవారం ఎలాంటి టారిఫ్ మినహాయింపు ప్రకటించలేదు. ఆ ఉత్పత్తులు అన్నీ 20% ఫెంటనిల్ పన్ను పరిధిలోకి వస్తాయి. అవి కేవలం ప్రత్యేకమైన టారిఫ్ బకెట్లోకి మారాయి.” – డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
వాళ్ళ చేతిలో బందీలుగా ఎందుకు ఉండాలి ?
“నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా సెమీకండెక్టర్లు సహా, అమెరికా ప్రజలకు అవసరమైన ఎలక్ట్రానిక్ సామగ్రిని పరిశీలించాం. దీనిని బట్టి దేశీయంగా వాటిన్నింటినీ ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. మన దేశంలోనే వస్తువులు తయారుచేసి, గతంలో ఇతర దేశాలు ఎలా వ్యవహరించాయో చూశాం. ముఖ్యంగా చైనా, అమెరికా పట్ల ఎలా వ్యవహరించిందో, ఇప్పుడు మనం కూడా అలానే చేద్దాం. చివరిగా చెప్పేదేంటంటే, మన దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా, బలమైందిగా మార్చబోతున్నాం.అప్పుడు మాత్రమే మనం చైనా కబంద హస్తాల్లో బందీగా మారకుండా ఉంటాం. డ్రాగన్ అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని బాగా వాడుకొంటోంది. దానిని నేను కొనసాగనీయను. ఇక ఆ రోజులు పూర్తిగా ముగిశాయి. ఇప్పుడు అమెరికా స్వర్ణయుగం మొదలైంది. భవిష్యత్తులో పన్ను నియంత్రణ వల్ల భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
అమెరికాలో తయారీపై ఫోకస్
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై చైనాతో సహా పలు దేశాలపై ఆధారపడుతూ వస్తుంది . ఇకపై వాటి ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించడంపై దృష్టిపెట్టినట్లు లుట్నిక్ చెప్పారు. “మాకు సెమీకండక్టర్లు, చిప్స్, ఫ్లాట్ ప్యానల్స్ చాలా అవసరం. అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వీటి పాత్ర ఎంతో ఉంది. ఇకపై మాకు అవసరమైన వస్తువుల కోసం, ఆగ్నేయాసియాపై ఆధారపడదల్చుకోలేదు. అందుకే వారిని రివెంజ్ టారిఫ్‌ల నుంచి మినహాయించి, సెమీకండక్టర్ పన్నుల పరిధిలోకి తీసుకొద్దామని ట్రంప్ అంటున్నారు. బహుశా ఒకటి లేదా రెండు నెలల్లో ఈ సెమీకండక్టర్ సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది” అని లుట్నిక్ పేర్కొన్నారు.
by Srinivas Vedulla | Apr 12, 2025 | జనరల్
చంద్రుడిపై నిల్వ ఉన్న వ్యర్థాలను తొలగించే ఐడియా ఇస్తే .. రూ.25 కోట్లు బహుమతి : నాసా ప్రకటన
చంద్రుడిపై దాగి ఉన్న విశ్వ రహస్యాలను శోధించేందుకు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది. అయితే అపోలో మిషన్‌లో భాగంగా చంద్రడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది. ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు, ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు. లూనార్ మాడ్యూల్స్‌లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని 96 సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వస్తున్నారు.
రూ.25 కోట్ల ఆఫర్
చంద్రుడిపైనే ఉండిపోయిన వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించాలని ‘నాసా ‘ దృష్టి సారించింది . ” లూనా రీసైకిల్” పేరిట ఒక ఛాలెంజ్‌ను ప్రకటించింది. వ్యర్థాలను నీరు, ఇంధనం, ఎరువుగా మార్చేందుకు సృజనాత్మక ఐడియాలు ఇవ్వాలంటూ ఆహ్వానం పలికింది. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి సుమారు . .. రూ.25 కోట్లు వరకు బహుమతి మనీ అందజేస్తామని చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది . శాస్త్రవేత్తలతోపాటు , సృజన శీలురూ బుర్రలకు పదునుపెట్టండి . .. పాతిక కోట్లు గెలుచేసుకోండి .
by Srinivas Vedulla | Apr 9, 2025 | జనరల్
టారిఫ్ లు వద్దన్న టెస్లా అధినేత – పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల మంట.. తన సన్నిహితుడు , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మంట పెడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహితుడు ఎలాన్ మస్క్ మధ్య టారిఫ్ ల వ్యవహారం చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది . ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఇరువురి మధ్య అభిప్రాయ విబేధానికి కారణమని ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా ప్రత్యేక కథనం కూడా పబ్లిష్ చేసింది . సుంకాలు విధించ వద్దని మస్క్ ఎంత చెప్పినా ట్రంప్ వినలేదనేది ఆ కధనం సారాంశం . వెనక్కి తగ్గేది లేదని టెస్లా అధిపతికి అధ్యక్షుడు బల్ల గుద్ది మరీ చెప్పేశారట. సుంకాల దెబ్బకు తన సంపద భారీగా తరిగిపోవడంతో పాటు టెస్లా కార్ల కంపెనీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో ట్రంప్ పై మస్క్ గుర్రుగా ఉన్నట్లు సదరు కధనం స్పష్టం చేసింది .
నాలుగు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ అత్యంత కీలక భూమిక పోషించారు . తన ట్విటర్ (X ), ఇతర ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా అమెరికా ప్రజలలో ట్రంప్ వైపు తిప్పడంలో క్రియాశీల పాత్ర పోషించారు .
ప్రతీకార సుంకాలకు తాను వ్యతిరేకమని మస్క్ చెప్పకనే చెప్పారు. గత వారంలో ట్రంప్ సుంకాలు ప్రకటించిన కొద్ది సేపటికే ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్మాన్ స్వేచ్ఛా వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే ఇందుకు నిదదర్శనం. అంతేకాదు, యూర్‌పతో సుంకాలు లేని వాణిజ్యం నెరపాలని కోరారు. అయితే, సుంకాలపై మస్క్ వైఖరిని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం మస్క్, నవారో మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మస్క్, వైట్‌హౌ్‌సకు మధ్య అగాధం పెరిగిందన్న వార్తలను ఇది మరింత బలపరుస్తోంది.
ట్రంప్ విధించిన టారిఫ్ ల ప్రభావం వల్ల అమెరికాలో కూడా నిరుద్యోగం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళనలో లక్షలాది ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గేదిలేదంటూ హుంకరిస్తున్నారు .
రూ.11.61 లక్షల కోట్లు హాంఫట్ ట్రంప్ సుంకాల దెబ్బకు మస్క్ సంపద ఈ ఏడాదిలో 13,500 కోట్ల డాలర్ల (రూ.11.61 లక్షల కోట్లు) మేర తరిగిపోయి ప్రస్తుతం 30,000 కోట్ల డాలర్ల దిగువకు (రూ.25.80 లక్షల కోట్లు) పడిపోయింది. గత గురు, శుక్రవారాల్లోనే మస్క్ నెట్‌వర్త్ 3,100 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. సోమవారం నాడు మరో 440 కోట్ల డాలర్ల ఆస్తిని కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత నష్టం వాటిల్లబోతోందని టెస్లా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు .