by Ram Maddipati | Jun 19, 2026 | జాతీయం
వానలు కురవడకపోవడానికి అదే కారణమా? ? నిపుణులు ఏం అంటున్నారు?
వర్షాలు కురవకపోవడానికి కారణం సూపర్ ఎల్‌నినో అని చెబుతున్న పర్యావరణవేత్తలు- మన దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని వివరణ- సూపర్ ఎల్‌నినో విషయంపై … ప్రముఖ మీడియా సంస్థ తో తన అభిప్రాయాలు వెల్లడించిన Nitin సింఘ్వీ
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది పెద్ద దెబ్బ కొట్టేలా భయపెడుతున్నాయి. రైతాంగం ఇప్పటికే వర్షాభావం దెబ్బకి బెంబేలెత్తిపోతున్నారు. ఇక రానున్న రోజులలో వర్షాలు మొహం చాటేస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో రైతన్నలు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు.
దేశంలోకి ముందుగానే ప్రవేశించి రైతుల్లో ఆశలు నింపిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఆందోళనకు కారణమవుతున్నాయి. జూన్ 5వ తేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తొలి దశలో వేగంగా విస్తరించినప్పటికీ, ఆ తర్వాత వాటి కదలికలు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణంగా జూన్ మధ్య నాటికి దేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేయాల్సిన రుతుపవనాలు ఈసారి మధ్యలోనే స్తంభించడంతో దేశవ్యాప్తంగా వర్షపాత లోటు తీవ్రంగా పెరిగింది. ఇదే సమయంలో ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు, బలహీనమైన సముద్ర గాలులు కలిసి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.
జూన్ 5న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు జూన్ 16నాటికి దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాలను తాకాయి. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా వాటి పురోగతి ఆగిపోయింది. జూన్ 1 నుంచి జూన్ 18 వరకు దేశవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దేశానికి అన్నపూర్ణగా భావించే మధ్య భారతదేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ ఏకంగా 62 శాతం వర్షపాత లోటు నమోదైంది.
రుతుపవనాల అరేబియా సముద్ర శాఖ జూన్ 8 నుంచి దాదాపు ఒకే ప్రాంతంలో నిలిచిపోగా, బంగాళాఖాతం శాఖ మాత్రమే కొద్దిపాటి చురుకుదనం ప్రదర్శిస్తోంది. శాటిలైట్ చిత్రాల ప్రకారం సముద్రాలపై మేఘాల సాంద్రత చాలా తక్కువగా ఉంది. జూన్ 23 వరకు కూడా రుతుపవనాల పురోగతిలో పెద్దగా మార్పు కనిపించే సూచనలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒకటి లేదా రెండు కారణాల వల్ల వర్షాలు ఆలస్యమవుతుంటాయి. కానీ ఈసారి ఏకకాలంలో ఐదు ప్రతికూల వాతావరణ అంశాలు ప్రభావం చూపుతుండటమే ఆందోళనకు కారణమవుతోంది.
రుతుపవనాలను అడ్డుకుంటున్న Main కారణాలు
- రుతుపవనాల బలహీనతకు ప్రధాన కారణంగా ఎల్‌నినోను నిపుణులు పేర్కొన్నారు పర్యావరణవేత్త నితిన్ సింఘ్వీ. ఆయన అభిప్రాయం ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఈ వాతావరణ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వర్షపాత విధానాలను ప్రభావితం చేస్తుంది. అమెరికా వాతావరణ సంస్థలు ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితులు బలపడుతున్నాయని ప్రకటించాయి.
- రెండో కారణం మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (ఎంజేఓ) బలహీనంగా ఉండటం. ఉష్ణమండల ప్రాంతాల్లో మేఘాల ఏర్పాటుకు, వర్షాల కురిసేందుకు కీలకమైన ఈ వ్యవస్థ ప్రస్తుతం హిందూ మహాసముద్రానికి దూరంగా ఉండటంతో భారతదేశానికి పెద్దగా ప్రయోజనం కలగడం లేదు.
- మూడో కారణం ఉత్తర భారతదేశంలో ఏర్పడిన బలమైన పశ్చిమ అలజడులు. వీటి కారణంగా పొడి గాలులు దక్షిణ దిశగా విస్తరించి తేమతో కూడిన గాలులను అడ్డుకుంటున్నాయి. దీంతో మేఘాలు ఏర్పడే ప్రక్రియ దెబ్బతింటోంది.
- నాలుగో కారణం బలహీనమైన సోమాలి జెట్. సాధారణంగా హిందూ మహాసముద్రం నుంచి భారతదేశానికి భారీగా తేమను తీసుకొచ్చే ఈ గాలులు ఈసారి బలహీనంగా ఉండటంతో రుతుపవనాలకు అవసరమైన శక్తి అందడం లేదు.
- ఇండియన్ ఓషన్ డైపోల్ తటస్థ స్థితిలో ఉండటం. ఇది పాజిటివ్ దశలో ఉంటే భారతదేశంలో వర్షపాతం పెరగడానికి దోహదపడుతుంది. కానీ ప్రస్తుతం తటస్థంగా ఉండటంతో రుతుపవనాలకు అదనపు బలం లభించడం లేదు.
తేమ ఉంది- కానీ వర్షం లేదు!
దేశంలోకి తేమతో కూడిన గాలులు ప్రవేశిస్తున్నప్పటికీ వర్షాలు మాత్రం పడటం లేదని దీనికి ప్రధాన కారణం ‘అట్మాస్ఫిరిక్ సబ్సిడెన్స్’ అని పర్యావరణవేత్త నితిన్ సింఘ్వీ ‘ఈటీవీ భారత్’తో చెప్పారు. “అంటే గాలి పైకి ఎగసి మేఘాలు ఏర్పడే బదులు కిందికి అణచివేస్తోంది. దీంతో మేఘాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అలాగే బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు సరైన విధంగా కలవడం లేదు. దీనివల్ల రుతుపవన ద్రోణి ఆకారం కూడా మారిపోయింది. ఫలితంగా ఈశాన్య భారతదేశంలో మాత్రమే అక్కడక్కడా వర్షాలు పడుతుండగా, దేశంలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాలు పొడిగా మారుతున్నాయి” అని ఆయన తెలిపారు
సూపర్ ఎల్‌నినో లేదా గాడ్జిల్లా ఎల్‌నినో అంటే ఏమిటి?
ప్రస్తుతం ప్రపంచం మరో బలమైన ఎల్‌నినో దిశగా అడుగులు పడుతున్నాయని పర్యావరణవేత్త నితిన్ సింఘ్వీ ఈటీవీ భారత్‌కు చెప్పుకొచ్చారు. ‘2026-27 కాలంలో ఏర్పడే అవకాశం ఉన్న ఈ పరిస్థితిని కొందరు శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్‌నినోగా అభివర్ణిస్తున్నారు. దీన్నే సూపర్ ఎల్‌నినో అంటారు. సాధారణంగా ఎల్‌నినో 2 నుంచి 7 సంవత్సరాల మధ్య వ్యవధిలో పునరావృతమవుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది అత్యంత బలంగా మారి ప్రపంచ వాతావరణ వ్యవస్థను కుదిపేస్తుంది’ అని ఆయన అన్నారు.
చరిత్రను పరిశీలిస్తే 1976-78 మధ్య కాలంలో సంభవించిన బలమైన ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువు, ఆహార కొరత, వ్యాధులకు కారణమైంది. ఆ సమయంలో ప్రపంచ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రభావితమయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని ఫలితంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పుడు ప్రపంచ జనాభా భారీగా పెరిగిన నేపథ్యంలో మరో సూపర్ ఎల్‌నినో వస్తే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌పై ఎలాంటి ప్రభావం?
భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలు ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు. భారీ వరదలు, తుఫానులు, ఆకస్మిక వర్షాలు, నీటి కొరత వంటి సమస్యలు పెరగొచ్చు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఆహార భద్రత, తాగునీటి సరఫరా, వ్యవసాయ ఉత్పత్తిపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని నితిన్ సింఘ్వీ హెచ్చరిస్తున్నారు.
ఆశాజనక సంకేతాలు కూడా!
ప్రస్తుతం పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ జూన్ చివరి వారంలో రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మాడెన్-జూలియన్ ఆసిలేషన్ భారత్‌కు అనుకూల దశలోకి రావడం, క్రాస్- ఈక్వటోరియల్ గాలులు బలపడటం వల్ల పొడి వాతావరణం తగ్గి వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అప్పటి వరకు దేశవ్యాప్తంగా రైతులు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
రైతులు ఏం చేయాలి?
ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలను ధాన్యాగారాలుగా పరిగణిస్తారు. అక్కడ రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు భారత వాతావరణ శాఖ సూచనలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలపై స్పష్టత వచ్చే వరకు విత్తనాలు, ఎరువులు పెద్ద ఎత్తున వినియోగించకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ అంచనాలు కూడా చాలాసార్లు విఫలమవుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
“1850 నుంచి జరిగిన పారిశ్రామికీకరణ కారణంగా విడుదలైన గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల ఉత్పన్నమైన అదనపు వేడిలో దాదాపు 90 శాతం భాగాన్ని సముద్రాలు గ్రహించాయి. సముద్రాలు వేడెక్కడం వల్ల మరింత తేమ వాతావరణంలోకి చేరుతుంది. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పుడు ఈ తేమ భారీ వర్షాలు లేదా తీవ్ర వాతావరణ ఘటనలకు దారితీయవచ్చు. అందుకే భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి బలమైన ఎల్‌నినో ఘటనలు మరింత తరచుగా సంభవించే అవకాశం ఉంది”
— పర్యావరణవేత్త నితిన్ సింఘ్వీ
అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్న నగరాలు
కాంక్రీట్ భవనాలు, డాంబర్ రహదారులు పగటిపూట వేడిని పీల్చుకుని రాత్రి విడుదల చేయడం వల్ల నగరాలు అర్బన్ హీట్ ఐలాండ్లుగా మారుతున్నాయని నితిన్ సింఘ్వీ చెప్పారు. దీనికి పరిష్కారంగా నగరాల్లో పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్టులు అభివృద్ధి చేయాలని సూచించారు. మియావాకీ పద్ధతిలో వేగంగా పెరిగే చెట్లను నాటడం ద్వారా నగర ఉష్ణోగ్రతలను 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గించే అవకాశం ఉందన్నారు. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీట్ షోల్డర్లు, పేవర్లను తొలగించి వర్షపు నీరు భూమిలోకిచేరేలా చర్యలు చేపట్టాలని అయన సూచిస్తున్నారు.
by Ram Maddipati | May 4, 2026 | జాతీయం
ఈ భారీ సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ వీరే!
కేంద్ర నాయకత్వం నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అనేక మంది నేతల కృషి-
– అత్యధికంగా 66 ర్యాలీలు, 63 ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించిన అమిత్ షా
15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు పశ్చిమ బెంగాల్ లో .. బీజేపీ చెక్ పెట్టగలిగింది . చరిత్రలో తొలిసారిగా బంగాల్లో కమలం పార్టీ పాగా వేయడం రికార్డ్ . కాషాయదళానికి దక్కిన ఈ విజయం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు > అనేది రాజకేయన్గా ఆసక్తికరం . ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పక్కా వ్యూహంతో అడుగులు వేయడం బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని దక్కించుకుంది . ఈ క్రమంలోనే బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన బంగాల్ మాస్టర్ మైండ్స్ ఎవరనేది ఇపుడు హాట్ టాపిక్ .
ప్రధాని మోదీ
బెంగాల్ లో అధికారం చేపట్టాలని మోడీ ముందు నుంచీ బలంగా ప్రయత్నించారు . బీజేపీ గెలుపు బాధ్యతలను ప్రధాని మోదీ తన భుజాలపై వేసుకుని విస్తృత ప్రచారం చేశారు. బంగాల్ సంప్రదాయంలో భాగమైన ఝాల్‌మురి తినడంతో పాటు కాలీ మాత ఆలయాలను సందర్శించి ప్రజలను ఆకర్షించారు. మమతా బెనర్జీ లక్ష్యంగా మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగాలు కాషాయ క్యాడర్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అభివృద్ధి పనులతో పాటు డబుల్ ఇంజిన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు .
అమిత్ షా చాణిక్యము . ..
బంగాల్ గెలుపులో అమిత్ షా చాణక్య వ్యూహాలు ఎక్కువ ఫలితాలు నిచ్చాయి . బంగాల్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అత్యధికంగా 65 ర్యాలీలు, 63 ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ‘మిషన్ బంగాల్’తో పార్టీ బూత్ స్థాయి నుంచి బలోపేతం కోసం పనిచేశారు. స్థానిక నేతలను సమంవ్యం చేయగలిగారు . అమిత్‌షానే స్వయంగా 152కు పైగా నియోజకవర్గాల్లోని 44,000 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగిన సమావేశాలను పర్యవేక్షించారంటే బీజేపీ ఏ స్థాయిలో దృష్టిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
శాంతిభద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో తనదైన శైలిలో ప్రచారం చేశారు అమిత్ షా. పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 100% కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఇస్తామని తెలిపారు.
భూపేంద్ర యాదవ్ ఇంచార్జ్ బాధ్యతలు . ..
బంగాల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్. ఎన్నికల నేపథ్యంలో గతేడాది బంగాల్ ఇంఛార్జ్‌గా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను నియమించింది అధిష్ఠానం. సంస్థాగత వ్యవహరాలు, సమన్వయం చేయడంలో తెర వెనుక ఎంతో కష్టపడ్డారు. అభ్యర్థుల ఎంపిక నుంచి కూటమి ఏర్పాటు వరకు పాలుపంచుకున్నారు. ముఖ్యంగా గెలుపు గుర్రాలను గుర్తించి, తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేశారు. నెలరోజులపాటు బెంగాల్ లో ఎక్కువ సమయం గడిపి . .. ఎన్నికల నిర్వహణలో భూపేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించారు.
శామిక్ భట్టాచార్య,, సువెందు అధికారి . ,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శామిక్ భట్టాచార్య ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయంతో పాటు వ్యూహాలను అమలు చేశారు. అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి సన్నద్ధత, పార్టీ సంస్థాగత వ్యవస్థ పనితీరు విషయంలో సాయం అందించారు. అటు అమిత్ షా లాంటి నేతల ప్రసంగాలను స్థానిక బంగాలీలోకి అనువాదం చేస్తూ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయుడిగా ఉన్న సువేందు అధికారి, బంగాల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన దూకుడు ప్రచారం, అవినీతి, రాజకీయ హింస వంటి సమస్యలపై దృష్టి పెట్టడం, కీలక ఓటు బ్యాంకులను ఏకీకృతం చేయడానికి కృషి చేశారు.
సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్‌లో వేలాది ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. నందిగ్రామ్‌తోపాటు సింగూర్ ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి, 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి సహకరించాయి. తృణమూల్ సర్కారులో ఆయన వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. మమత ప్రధాన అనుచరుడిగా, పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా సువేందు అధికారి ఎదిగారు. ఆ తర్వాత కాలక్రమేణా మమతతో సువేందుకు విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వంటి కారణాలతో ఆయన 2020లో టీఎంసీతో 22 ఏళ్ల అనుబంధాన్ని వదులుకున్నారు . ఇవన్నీ బిజెపి గెలుపులో కీలకంగా ఉపయోగపడ్డాయి .
by Ram Maddipati | May 4, 2026 | జాతీయం
విజయ్ దెబ్బకు ‘ద్రవిడ’ పార్టీల విలవిలా — TVK గెలుపునకు కారణాలు ఇవే!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది .. సుమారు ఐదు దశాబ్దాలుగా డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే దోబూచులాడిన రాజకీయం . .. ఇప్పుడు కొత్త నాయకుడి చేతికి చిక్కింది . తమిళ తెరపై విశేష ప్రజాదరణ పొందిన దళపతి విజయ్ స్థాపించిన ”తమిళగ వెట్రి కళగం” (టీవీకే) తొలి ఎన్నికల్లోనే చారిత్రక విజయాన్ని దక్కించుకుని చరిత్రను తిరగరాసింది . ఈ అప్రతిహత విజయానికి దారి తీసిన ప్రధాన కారణాలపై ”అభి న్యూస్ ‘ ‘ ప్రత్యేక కథనం.
తమిళనాటలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది . 1967 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే అధికారంలో ఉండటం, విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన వంటి అంశాలు తమిళ ఓటర్లలో తీవ్ర విసుగు కలిగించాయి . మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న తమిళులకు టీవీకే ఆశాకిరణంగా కనిపించింది.
స్పష్టమైన సిద్ధాంతపరంగా
విజయ్ వ్యక్తిగత నిర్ణయాలు కూడా పార్టీ విజయానికి కీలకంగా మారాయి. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయడం ఆయనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తున్నానని ఇచ్చిన సందేశం ఓటర్లను బలంగా ఆకట్టుకుంది. ఇక సిద్ధాంతపరంగా కూడా టీవీకే స్పష్టమైన దిశను చూపించింది. మత, కుల విభజనలకు దూరంగా ఉండే సెక్యులర్ భావజాలం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లింది. పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఆలోచనలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
ఫ్యాన్ బేస్ మరింత బలంగా . …
విజయ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ ఈ ఎన్నికల్లో ప్రధాన బలం అయింది. సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ మక్కల్ ఇయక్కం క్రమంగా శక్తిమంతమైన రాజకీయ క్యాడర్‌గా మారింది. రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. యువత మద్దతు టీవీకే విజయానికి కీలకం. మొదటిసారి ఓటు వేసిన యువత పెద్దఎత్తున విజయ్‌కు మద్దతు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్కరణలు, పారదర్శక పరీక్షా విధానం వంటి హామీలు వారికి ఆకర్షణీయంగా మారాయి. మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు కూడా సైలెంట్ ఓటును టీవీకే వైపు మళ్లించాయి.
విజయ్ వ్యక్తిత్వం కలసివచ్చింది . ..
డిజిటల్ ప్రచారం కూడా పార్టీకి బలంగా పనిచేసింది. సోషల్ మీడియా వేదికల్లో విజయ్ అభిమానులు ముందుండి ప్రచారం నిర్వహించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రజలకు చేరేలా చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపింది. విజయ్ వ్యక్తిత్వం కూడా ఓటర్లను ఆకట్టుకుంది. సాధారణ జీవనశైలి, ప్రజల్లోకి వెళ్లి మమేకం కావడం, అభిమానులతో దగ్గర సంబంధం పెట్టుకోవడం వంటి లక్షణాలు ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. అన్నాగా పిలిచే ఈ అనుబంధం ఓట్ల రూపంలో ప్రతిఫలించింది.
by Ram Maddipati | Apr 14, 2026 | జాతీయం
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడుతాయని ఐఎండీ అంచనా – సాధారణ సగటులో 92 శాతం వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడి – ఎల్‌నినో వల్ల వర్షాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా
ఎల్ నినో… ఇపుడు ఈ పేరు మన రైతాంగానికి నిద్రలేకుండా చేస్తోంది . తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తబోతున్నాయని ఇటీవల జరిగిన పరిశోధనలను ఐఎండీ నిర్ధారించడంతో మరింత అలజడి రేగింది .
దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీర్ఘకాలిక వర్షపాత అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో వర్షపాతం సాధారణ సగటులో 92 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. దీనికి అదనంగా లోటుగా 5 శాతం మార్పు ఉండవచ్చని తెలిపింది. ఐఎండీ అంచనాల ప్రకారం వర్షపాత అంచనా 1971-2020 మధ్య కాలంలో దేశ సగటు వర్షపాతం 87 సెం.మీ.గా ఉంది. ఈ ఏడాది వర్షపాతం ఇందులో 90 నుంచి 95 శాతం మధ్య (సాధారణం కంటే తక్కువ) నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని IMD అంచనా వేసింది.
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీన ఎల్‌నినో పరిస్థితులు తటస్థ స్థితికి మారుతున్నాయని అయితే రుతుపవన కాలంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది సాధారణంగా వర్షాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నప్పటికీ, సీజన్ ముగిసే సమయానికి ‘పాజిటివ్ ఐఓడీ’ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ మోడల్స్ సూచిస్తున్నాయి.
మన దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఈశాన్య, వాయువ్య ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల గమనానికి సంబంధించి మరిన్ని ఖచ్చితమైన వివరాలతో కూడిన రెండో విడత అంచనాలను మే చివరి వారంలో విడుదల చేస్తామని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడు ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలను వెల్లడించనున్నారు.
ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాడ్పులు: రాష్ట్రంలో రోజురోజుకీ ఎండలు, వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 11 గంటలు దాటిందంటే ప్రజల ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడతున్నారు. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎల్ నినో దెబ్బ . .. జూన్ , జులై నెలల్లో వర్షాలు బాగా తక్కువ కురుస్తాయని చెపుతున్నారు . అంతేకాకుండా . . వర్షానికి , వర్షానికి మధ్య 40-50 రోజుల గ్యాప్ ఉంటుందని వేస్తున్న అంచనాలు ముక్యంగా మెట్ట ప్రాంత రైతాంగాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది .
by Ram Maddipati | Mar 31, 2026 | జాతీయం
బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానంతో పెరుగుతున్న అనుమానాలు
బ్యాంకు లాకర్లలో దాచుకున్న విలువైన వస్తువులకి ఉన్న బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన ప్రశ్నకి ఇలా సమాచారం ఇచ్చారు.
లాకర్లలో దాచిన వస్తువులను బ్యాంకు అధికారులు చూడరు (చూడడం బ్యాంకు రూల్స్ కి విరుద్ధం) కాబట్టి, వాటిని రికార్డు చేయరు, అంచేత వాటి విలువ రిజిస్టర్ కాదు. సో.. విలువ ఆధారంగా బీమా కవరేజీ ఇవ్వబడదు.
దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంకుల్లో మోసాలు వంటివి జరిగిన సందర్భాల్లో లాకర్లకు నష్టం వాటిల్లితే లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సొమ్ముని బ్యాంకులు పరిహారంగా చెల్లిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు .
బ్యాంకు లాకర్ చార్జీలవిషయానికొస్తే.. భారతదేశంలో అనేక రేంజ్ లు ఉన్నాయి. ముఖ్యమైన జాతీయ బ్యాంకుల్లో పరిశీలిస్తే ఏరియా లొకేషన్, లాకర్ సైజు ని బట్టి ఏడాదికి 1000 రూపాయలనుంచి 12000 వరకూ లాకర్ అద్దె ఉంటుంది. కొన్ని ఇతర బ్యాంకుల్లో అత్యధికంగా 25000 నుంచి 40000 వరకూ కూడా వార్షిక లాకర్ చార్జీలు ఉన్నాయి.
దీన్ని బట్టి గరిష్టంగా లక్ష రూపాయల నుంచి 40 లక్షల వరకూ మాత్రమే లాకర్ నష్టానికి వినియోగదారులు పరిహారం పొందగలరన్నమాట.
బ్యాంక్ లాకర్లు సర్వ సురక్షితం అని భావిస్తారు, కానీ అవి 100% భద్రతను హామీ ఇవ్వవు. ఇంట్లో విలువైన వస్తువులను ఉంచడం ప్రమాదం కాబట్టి లాకర్లు అంతకంటే సురక్షితమైనవి. అయినప్పటికీ, పెద్ద స్థాయి దొంగతనాలు, సిబ్బంది ప్రమేయంతో జరిగే మోసాలు, అలాగే చెదలు, తేనెటీగలు, ఎలుకలు, నీటి లీకేజీ వంటి ఘటనల కారణంగా లాకర్లకు నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం.
బ్యాంక్ లాకర్లు బలమైన స్ట్రాంగ్ రూమ్స్ లోనే ఉంటాయి. అలారమ్‌లు, సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. అయినప్పటికీ, దొంగతనం, అగ్ని ప్రమాదం, వరదలు వంటి ఘటనల్లో నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది.
RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంక్ నిర్లక్ష్యం లేదా సిబ్బంది మోసం వల్ల లాకర్ దెబ్బతిన్నాకూడా బ్యాంక్ చెల్లించే పరిహారం వార్షిక అద్దెకి 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు, ఒక లాకర్ అద్దె ₹2,000 అయితే, గరిష్ట పరిహారం ₹2,00,000 మాత్రమే. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదం వంటి సహజ విపత్తుల వల్ల నష్టం జరిగితే, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు నిరూపిస్తే బ్యాంక్ నష్టానికి పైసా పరిహారం కూడా ఇవ్వక్కర్లేదు.
లాకర్ ఎంత చిన్నదైనా అందులో కుక్కి కుక్కి మరీ బంగారం, నగదు విలువైన పత్రాలను దాచడం కొందరు వినియోగదారుల అలవాటు. ప్రధానంగా అక్రమార్జనపరులు కొందరు లాకర్లను తమ రహస్య సంపదని దాచడం కోసం తీసుకుంటూ ఉంటారు.
కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది లాకర్‌లను దెబ్బతీయడం లేదా వాటిలో సొమ్ముని దొంగతనం చేయడం జరిగిన ఘటనలు కూడా పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. ఒక లాకర్‌ను 7 సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే, అద్దె చెల్లించినా కూడా బ్యాంక్ కి దాన్ని తెరిచే అధికారం ఉంది. వస్తువుల జాబితా ఉండదు కాబట్టి దొంగతనం జరిగితే నిరూపించడం కష్టం. అక్రమ సంపద అయితే.. కొందరు వినియోగదారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా కూడా మారుతుంది.
సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు లాకర్‌ను ఓపెన్ చేసి తనిఖీ చేయాలనీ బ్యాంకులు చెబుతాయి. లాకర్లలో భద్రపరచిన వస్తువుల జాబితా, ఫోటోలు, బిల్లులు ఇంట్లో భద్రపరచుకోవాలి. అలాగే
నామినీ రికార్డు పర్ఫెక్ట్ గా ఉంటే వినియోగదారుడు మరణించిన సందర్భంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తవు . దీనిపై స్పష్టంగా ఉండాలి .
by Rama Chandra P | Mar 13, 2026 | జాతీయం
గృహావసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఇవేవీ ప్రస్తుతానికి దేశంలో ఏమాత్రం కొరత లేదు. జనం ఆందోళన చెందక్కర్లేదు
యుద్ధం ఇలాగే కొనసాగినా కూడా కనీసం మరో రెండు మాసాలు మనకి ఇంధనకొరత భయం లేదని కేంద్ర ప్రభుత్వపు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే కొరత వస్తుందనే భయంతో ప్రతి వాళ్ళూ ముందుజాగ్రత్తగా, స్వార్థంతో స్టోరేజ్ చేసుకునే ప్రయత్నాలు చేయడమే అసలైన సమస్య. బ్యాంకు నష్టాల్లో ఉందనే ప్రచారం జరిగిందంటే.. ఒక్కసారిగా డిపాజిటర్లు తమ సొమ్ము తీసేసుకోవడానికి లైన్లలో నిలబడతారు. అప్పటివరకూ బ్యాంకు బాగానే ఉన్నా.. ఈ లైన్ల దెబ్బకి నిజంగానే కుదేలైపోతుంది. అలాగే ఒకేసారి వందలు, వేలమంది వినియోగదారులు గ్యాస్ రీఫిల్ బుకింగ్ లు చేయడం, వందలాది వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం బ్యాంకులకు పోటెత్తడం వలన స్వతహాగానే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ క్యూ లు సైకలాజికల్ గా సమాజ స్టెబిలిటీని దెబ్బతీస్తాయి. ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దేశ రక్షణ, ఇంధన భద్రతకి చేపట్టాల్సిన అంతర్జాతీయ చర్యలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన భారం పాలకులపై ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి అనవసర ఒత్తిడి వారిపై పెంచకుండా, బాధ్యతగా వ్యవహరించడం పౌరుల విధి.
ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రం కొంత రిస్ట్రిక్షన్ వచ్చిందనేది నిజం. వచ్చిన కొరత కంటే ఆయా సంస్థలు, అసోసియేషన్లు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి బాగా ఎక్కువగా ఉంది. తినడానికి హోటల్ తప్ప మరోదారి లేనివాళ్లు కొంత ఇబ్బంది పడతారు తప్ప, అందరికీ ఇదేమీ సమస్యకాదు. చిన్న కాకా హోటళ్లు, ఇళ్లవద్ద ఆహారం తయారు చేసి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్రియాశీలకం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.
హర్ముజ్ జలసంధినుంచి ఇరాన్ మన దేశపు నౌకలను అనుమతించడం, రష్యా కోరినంత చమురుని భారత్ కి విక్రయించడం.. అలాగే క్లిష్ట సమయంలో ఒత్తిడి తగ్గించే ధోరణితో అమెరికా వ్యవహరించడం.. ఇవన్నీ భారత దౌత్య విజయాలే.. లేదా మనదేశంపై చిరకాలంగా ప్రపంచానికి ఉన్న గుడ్ విల్ కి ప్రతిగా లభించిన అవకాశాలే!
ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఎంతో కొంత ప్రభావితం అయ్యే దేశాల్లో భారత్ ముందుంటుంది. అలాగని మనమీద బాంబులు ఎప్పుడూ పడవు. స్వరాజ్యం తర్వాత (చైనా, పాకిస్థాన్ లతో మనం ప్రత్యక్షంగా చేసిన యుద్ధాల్లో మినహా) ఎప్పుడూ మనదేశంపై బాంబు పడలేదు. కానీ ప్రపంచపు ప్రతి సంక్షోభమూ పరోక్ష ప్రభావాన్ని చూపడంచేత భారత్ పై ధరల బాంబులు పడుతూ ఉంటాయి.
గతంలో గల్ఫ్ యుద్ధం సమయంలో మనం గల్ఫ్ సర్చార్జిలు కట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాలిబన్ యుద్ధం సమయంలో, ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకున్న సమయంలో కూడా భారత్ లో ధరలు పెరిగాయి. దిగుమతులపై ఎక్కువ ఆధారపడడం, ఎగుమతి దిగుమతులు జరిగే రవాణా మార్గాల్లోని దేశాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం వంటివే భారత్ ధరలపరంగా ప్రభావితం కావడానికి అసలు కారణాలు. కొరత వలన సమస్య రాదు.. కొరత వచ్చే అవకాశాలపై ప్రచారంతో భయపెట్టి… కృత్రిమ కొరత సృష్టించే అవినీతి పరులతోనే సమస్య వస్తుంది.
ప్రపంచం యుద్ధమేఘాలకింద అవస్థలు పడుతున్న ఈ కష్టసమయంలో ప్రకృతి, పరిస్థితులు, ఘనమైన మన వారసత్వం, ప్రస్తుత నాయకత్వం కలసి రాబట్టే మనం ఈమాత్రమైనా ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధం త్వరగా ముగిసిపోతే భారతదేశంలో వారం రోజుల్లోనే అంతా యథాతథ పరిస్థితికి వచ్చేస్తుంది. పరిస్థితి మరీ దిగజారిపోయి.. యుద్ధం మరింతకాలం, మరిన్ని దేశాలకు విస్తరించినా కూడా భారత్ కి ప్రత్యక్ష భయం అయితే లేదు. స్వరాజ్య భారతం సుమారుగా గత 77 సంవత్సరాల్లో అనుసరించిన విదేశాంగ విధానం, ఎన్నడూ దురాక్రమణకు, ముందస్తు యుద్ధానికి పాల్పడని మన వారసత్వపు మంచితనం ఇందుకు ప్రబల కారణాలు. నాటి నెహ్రూగారి అలీన విధానం మొదలు నేటి మోదీ గారి స్వతంత్ర విదేశాంగ విధానం వరకూ కూడా భారత్ సంప్రదాయబద్ధమైన లక్ష్మణరేఖను పాటిస్తూనే వస్తోంది…. అదే మన దేశానికి శ్రీరామరక్ష.