గూగుల్ డేటా సెంటర్ పైనా  కుట్రలా ? ?

గూగుల్ డేటా సెంటర్ పైనా కుట్రలా ? ?

మారీచ కుట్రలు

విశాఖపట్నం సమీపంలో 1.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్‌ సంస్థ ద్వారా ఏఐ హబ్‌ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కేంద్రం ప్రకటించింది. మన దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుసకొడుతున్న…

Google AI Hub Investment Near Visakhapatnam: మారీచ కుట్రలు

విశాఖపట్నం సమీపంలో 1.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్‌ సంస్థ ద్వారా ఏఐ హబ్‌ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కేంద్రం ప్రకటించింది. మన దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుసకొడుతున్న వేళ ఆ దేశానికి చెందిన గూగుల్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అతి పెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటుతో విశాఖకు పెట్టుబడుల వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇదొక మైలురాయి. భారీ పెట్టుబడి సాధించినందుకు ‘ఆహా’ అని మురిసిపోవాలి. అయితే పునాదులు కూడా దాటని వైద్య కళాశాలల నిర్మాణాలను చూసి ‘ఆహా’ అని ఆశ్చర్యపోవాలని చెప్పుకొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అండ్‌ కో మాత్రం విషం కక్కడం మొదలుపెట్టారు. గూగుల్‌ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఏడుపులు లంకించుకున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పర్యటనలకు వెళ్లినప్పుడు పచ్చని చెట్లను నరికేసినా పర్యావరణం గురించి ఒక్క నోరు కూడా పెగల్లేదు. ఇంతటితో ఆగకుండా ప్రతిపాదిత డేటా సెంటర్‌ను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలు మొదలయ్యాయి. డేటా సెంటర్‌ అంటే సాదా సీదా గోడౌన్‌ లాంటిది అని, కంప్యూటర్లను లోపల పెట్టి బయటి నుంచి తాళాలు వేస్తారని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్‌ అండ్‌ కోలో ఇంత మనోవికారం ఎందుకు ఏర్పడిందో అంతుపట్టదు. రాష్ర్టాభివృద్ధిని కాంక్షించే వారే అయితే తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబును మించి పెట్టుబడులు సాధిస్తామని చెప్పుకోవాలి. అలా కాకుండా పొరుగు రాష్ర్టాలకు ఈర్ష్యగా మారిన ఈ ఒప్పందంపై విషం చిమ్మడం ఏమిటి? దీన్నిబట్టి వారి మెదళ్లు ఎంత విషతుల్యం అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. గూగుల్‌ సంస్థ డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికాలోనూ భారత్‌లోనూ భారీగా పెట్టుబడులు పెడుతోందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌ ఈ నెల 11న ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న జగన్‌రెడ్డికి ఇలాంటి పెద్ద విషయాలు తెలియకపోవచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన మద్దతుదారుల్లో అంతో ఇంతో చదువుకున్న వాళ్లు ఉన్నారు. వారికి కూడా తెలియకపోతే ఎలా? రాష్ర్టానికి పెట్టుబడులు వస్తే చంద్రబాబుకు గానీ, ఐటీ మంత్రి లోకేశ్‌కు గానీ వ్యక్తిగతంగా లాభం ఏమీ ఉండదు. పెట్టుబడుల ఫలితాలను ప్రజలు అనుభవిస్తారు. హైదరాబాద్‌ మహానగరమే ఇందుకు నిదర్శనం. ఆహా అని మెచ్చుకోవాల్సిన సందర్భాలలో కూడా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.

గూగుల్‌తో ఒప్పందానికి సంబంధించిన వార్తను జగన్‌ మీడియా అస్సలు పట్టించుకోలేదు. అంటే సదరు రోత మీడియాకు రాష్ట్ర ప్రయోజనాలు అంత ముఖ్యం కాదు.. జగన్‌రెడ్డి ప్రయోజనాల కోసమే ఆ మీడియా పనిచేస్తోందన్న మాట! ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో గూగుల్‌ ఏఐ హబ్‌ గేమ్‌ చేంజర్‌ అనే చెప్పవచ్చు. అల్ప బుద్ధులు ఉన్న వారికి ఇది అర్థం కాదు. చేపలు, రొయ్యల దుకాణాలు ఏర్పాటు చేయించడమే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకొన్న వారికి ఇలాంటి పెద్ద విషయాలు అర్థం కావు. చేపలు, రొయ్యలను తాజాగా కొని తెచ్చుకొని తినవచ్చునని పులివెందుల ప్రజలు ఊహించారా? అని సెలవిచ్చిన జగన్‌రెడ్డి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేము! ప్రభుత్వం సరఫరా చేసే విషతుల్యమైన మద్యం తాగుతూ చేపలూ రొయ్యలూ వండుకొని నంజుకుతింటూ కునారిల్లుతూ ఉండాలన్నది జగన్‌ అండ్‌ కో కోరిక. థింక్‌ బిగ్‌.. డ్రీమ్‌ బిగ్‌ అని దివంగత అబ్దుల్‌ కలాం చెప్పేవారు. జగన్‌ అండ్‌ కో నుంచి అంత ఆశించలేము. వినూత్న ఆవిష్కరణలు, భారీ పెట్టుబడుల గురించి ఆలోచించకపోయినా ఫర్వాలేదు– రాష్ర్టాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలపై మారీచ, సుబాహుల వలె నిప్పులు పోయడం ఏమిటి? సంక్షేమం పేరిట ప్రభుత్వం విసిరే మెతుకులు తింటూ జనం ఎదుగూ బొదుగూ లేని జీవితం గడపాలన్నదే జగన్‌ అండ్‌ కో అభిలాష. అధికారంలో ఉన్నప్పుడు ఆ దిశగానే అడుగులు వేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి మొదలైంది. గూగుల్‌ నిర్ణయం తర్వాత మరెందరో ఏపీకి రావొచ్చు. ఇదే ఒరవడి కొనసాగితే ప్రజల్లో కూటమికి ఆదరణ పెరుగుతుంది. అదే జరిగితే తమకు రాజకీయంగా నష్టమని భావిస్తున్న జగన్‌ అండ్‌ కో కుత్సితపు ఆలోచనలకు తెర తీశారు. కుట్రల అమలు మొదలుపెట్టారు. ఏదో ఒకటి చేసి పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉండకుండా చేయాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వమేవాహం అంటే త్వమేవాహం అనుకొనేలా కాకుండా జగన్‌రెడ్డికి భిన్నంగా చంద్రబాబు పనిచేయడం ఏమిటి? ఆయన ప్రయత్నాలు ఫలించడం ఏమిటి? కేంద్రం నుంచి సహకారం అందడం ఏమిటి? అని రగిలిపోతున్నారు.

ఆ చావులు మరిచారా?

‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అన్నట్టుగా అధికారంలో ఉన్నంత కాలం విషతుల్యమైన మద్యాన్ని ప్రజలకు విక్రయించి మద్యం కొనుగోళ్లలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన జగన్‌ అండ్‌ కో, ఇప్పుడు కల్తీ మద్యాన్ని తెర మీదకు తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతోనే రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం వ్యాపారం జరుగుతోందని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి కల్తీ మద్యం అమ్మకాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉంటాయి. కల్తీ సారా, కల్తీ మద్యం తాగి మన తెలుగునాటే కాదు, ఇతర రాష్ర్టాలలోనూ ఎంతో మంది మరణించిన సంఘటనలను చూశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, రాష్ట్రం విడిపోయాక గానీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒక్క జగన్మోహన్‌రెడ్డి మినహా మరే ముఖ్యమంత్రి కూడా మద్యం ద్వారా సొమ్ములు దండుకొనే ఆలోచన కూడా చేయలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా మద్యం ద్వారా వెనుకేసుకోవాలని భావించలేదు. కాసులకు కక్కుర్తిపడి విషతుల్యమైన మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘనత మాత్రం జగన్‌రెడ్డికే దక్కుతుంది. ఇప్పుడు కల్తీ మద్యం గురించి గగ్గోలు పెడుతున్న జగన్‌ అండ్‌ కో పాలనలో కల్తీ మద్యం సరఫరా కాలేదా? అంటే జంగారెడ్డిగూడెంతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఆ మద్యం తాగి పలువురు మరణించిన విషయం అప్పుడే మరచిపోతే ఎలా? గతంలో ఏమి జరిగినా చర్యలు ఉండేవి కావు. ఇప్పుడు ములకలచెరువులో ఈ వ్యవహారం బయటకు రాగానే బాధ్యులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడానికే వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారుచేశానని ప్రధాన నిందితుడు జనార్దనరావు చెప్పారు. ఇందులో నిజానిజాలు త్వరలోనే బయటికొస్తాయి. పాపం పండే ప్రమాదం ఉందని తెలియడంతో జగన్‌రెడ్డి రోత మీడియా యథావిధిగా అభూత కల్పనలతో కథనాలను వండి వారుస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు నిజాలు చెప్పాలని ప్రయత్నిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ పత్రికపై మాజీ మంత్రి పేర్ని నాని విషం కక్కుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు జుగుప్స కలిగిస్తున్నాయని ఆయన నోరు పారేసుకున్నారు. నిజానికి ఒకప్పుడు సౌమ్యుడిగా పేరున్న నాని వైసీపీలో చేరిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉండేవారు. అప్పుడు ఆయన ప్రవర్తన సంస్కారవంతంగా ఉండేది. జగన్‌రెడ్డితో చేతులు కలిపిన తర్వాత ఆయన ప్రవర్తన మారింది. మంచివాడు అనిపించుకున్న పేర్ని నాని వంటి వారు కూడా వివేకం మరచి విజ్ఞత లేకుండా మాట్లాడటం చూస్తుంటే వారు ఏదైనా వైరస్‌ బారినపడ్డారా అన్న అనుమానం కలుగుతుంది. లేని పక్షంలో మంచివాళ్లు కూడా జగన్‌ పక్షం చేరగానే హద్దూ అదుపూ లేకుండా ఎలా వ్యవహరించగలరు? కల్తీ మద్యం తయారీ అనేది అసాధారణ సంఘటన ఏమీ కాదు. అయితే జగన్‌ అండ్‌ కో దీనికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారంటే, కారణం లేకపోలేదు. మద్యం ద్వారా నేను ఒక్కడినే సొమ్ములు వెనుకేసుకోలేదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారని ప్రజలను నమ్మించడానికే ఈ తాపత్రయం. అదే సమయంలో మద్యం కుంభకోణంలో సిట్‌ దర్యాప్తు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కూడా వారి లక్ష్యం కావచ్చు. జగన్‌రెడ్డి ఒక పార్టీకి అధిపతి కనుక ఇలాంటి ట్రిక్కులు చేయడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. చంద్రబాబుపై రాజకీయంగా బురద చల్లడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ, రాష్ట్రంపై కూడా విషం చిమ్మాలనుకోవడం ఏమిటి? అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఏమిటి? ఈ క్రమంలో జగన్‌ అండ్‌ కో గత కొంత కాలంగా చేస్తున్న ప్రచారం, అమలు చేస్తున్న కుట్రలను పరిశీలిస్తే వారికి ఇలాంటి విషపూరిత ఆలోచనలు ఎలా వస్తాయో అని ఆశ్చర్యం వేస్తుంది.

కులాల కుంపట్లలో చలి కాచుకుంటూ..

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో తప్పు లేదు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా పోరాటం చేయడం కూడా వారి హక్కు. అంతేగానీ జరగనిది జరిగినట్టుగా, ఏమీలేని చోట విద్వేషాలు రగిలించే ప్రయత్నాలు చేయడం, కులాల కుంపట్లు రగిలించడం ఏమిటి? దారి తప్పిన రాష్ర్టాన్ని గాడిలో పెట్టాలంటే కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్లు అధికారంలో ఉండాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. తెలుగుదేశం–జనసేన మధ్య విభేదాలు రాకపోతాయా? చంద్రబాబు–పవన్‌ కల్యాణ్‌ కొట్టుకొని విడిపోకపోతారా? అని జగన్‌ అండ్‌ కో ఇప్పటి వరకూ ఆశగా చూశారు. తాజాగా పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ప్రకటనలతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత కొంత కాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం– జనసేన మధ్య తగవులు పెట్టడానికి చెయ్యని ప్రయత్నం లేదు. అయితే వారికి నిరాశే మిగిలింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అభినందించాల్సిందే. కాపుల ముసుగులో జగన్‌రెడ్డి మద్దతుదారులు ఎంతగా రెచ్చగొడుతున్నా ఆయన సంయమనమే పాటిస్తున్నారు. జనసైనికులకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కనీసం పదిహేనేళ్ల పాటు కూటమి అధికారంలో కొనసాగాలని సూచిస్తున్నారు. అయితే అవతల ఉన్నది జగన్‌ అండ్‌ కో! హుందాతనంతో కూడిన రాజకీయాలను ఆ గుంపు నుంచి ఆశించలేము. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కందుకూరులో ఒక సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న వైషమ్యాల వల్ల ఒకరి హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. హత్య చేసిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంకేముందీ.. వైసీపీకి చెందిన రాబందులు వాలిపోయాయి.

కమ్మ–కాపు అంశాన్ని తెర మీదకు తెచ్చి వైషమ్యాల సృష్టికి చేయని ప్రయత్నం లేదు. నిజానికి హతుడు–హంతకుడు కొంత కాలం క్రితం వరకు సన్నిహితంగానే ఉండేవారు. కారణాలు ఏమైనా వారి మధ్య వైరం ఏర్పడింది. దీంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మదంతో విచక్షణ మరచి కారుతో తొక్కించి చంపాడు. జరిగినది హత్య అని తెలియగానే పోలీసులు ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడి తండ్రిని కూడా హత్యా నేరం కింద అరెస్టు చేశారు. ఇక్కడ కులాల గొడవ తలెత్తకూడదు. అయితే అలా వదిలేస్తే వారు జగన్‌ అండ్‌ కో ఎందుకవుతారు? వైసీపీకి మద్దతుగా ఉంటున్న కాపు సామాజికవర్గానికి చెందిన కొద్ది మంది అక్కడ వాలిపోయారు. కాపులను రెచ్చగొట్టే విధంగా వీడియోలు వదిలారు. ఫేక్‌ ఐడీలతో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ వీరంగం వేస్తున్నారు. అధికారంలో ఉన్నది కమ్మ సామాజిక వర్గమని, అందుకే కాపులకు రక్షణ లేకుండా పోయిందని, సొంత సామాజిక వర్గాన్ని రక్షించుకోవడంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విఫలమయ్యారని, కమ్మ వాళ్ల చేతిలో కాపులు మరోసారి మోసపోయారంటూ కాపులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ముస్లిం మహిళకు వంగవీటి శిరీష అనే పేరు తగిలించి పోస్టులు పెట్టించారు. చౌదరి గారు ఆశపడితే నాయుడు తన భార్యను పంపకపోతే పరిణామం ఇలాగే ఉంటుందని తీవ్రమైన వ్యాఖ్యలతో సదరు ఫేక్‌ ఐడీ ద్వారా పోస్టులను సోషల్‌ మీడియాలో తిప్పారు. రాజకీయాల్లో ఇంత నీచత్వం ఏమిటి? ఫేక్‌ ఐడీలతో ప్రజల మెదళ్లలో విషం నింపే ప్రయత్నాలు చేయడాన్ని మించిన దురాగతం ఉంటుందా?

కూటమిలో చిచ్చు కోసం తహతహ!

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు మరెక్కడైనా వ్యక్తుల మధ్య వివాదాలు ఏర్పడటం, ఘర్షణలు జరిగి హత్యలకు దారితీయడం కొత్త కాదు. అన్నదమ్ములే కొట్టుకు చస్తున్నారు. ఏ సంఘటనలోనైనా ఒకరు బాధితుడైతే మరొకరు నేరస్తుడవుతారు. కందుకూరులో కూడా ఇదే జరిగింది. అతడు కాపు.. చంపిన వ్యక్తి కమ్మ కావడం యాదృచ్ఛికం. ఈ దురాగతానికి పాల్పడిన వాడిని కాపాడటానికి ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ ప్రయత్నించలేదు కదా? హంతకుడు జైల్లోనే ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్‌ను అనేక విధాలుగా అవమానించడమే కాకుండా ఆయన నటించిన సినిమాలు కూడా నడవకుండా అడ్డుపడిన జగన్‌ అండ్‌ కో, ఇప్పుడు కాపులను రెచ్చగొట్టడం చూస్తే వారి ఆంతర్యం అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా కూటమిలో చిచ్చు పెట్టాలి. చంద్రబాబు–పవన్‌ కల్యాణ్‌ మధ్య విభేదాలు సృష్టించాలి. ఇందుకోసం గోతి కాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. కూటమి ఐక్యంగా ఉంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న తమ కోరిక కలగానే మిగిలిపోతుందన్నది వారి బాధ. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు కమ్మ–కాపులు సఖ్యంగానే ఉండేవారు. వంగవీటి రంగా హత్యానంతరం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రంగప్రవేశంతో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించారు. కందుకూరులో జరిగిన సంఘటన ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదే. ఇందులో ఆ రెండు కులాలకు చెందిన ఇతరుల ప్రమేయం ఏముంది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులే కాదు కమ్మ వారు కూడా హత్యలకు గురయ్యారు. ఈ హత్యలకు స్థానిక పరిస్థితులే కారణం కానీ కులాలు కావు కదా? మెదళ్ల నిండా విషం నింపుకొని రాజకీయం చేయాలనుకుంటున్న జగన్‌ అండ్‌ కోను అర్థం చేసుకోవడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ రాజకీయాలకు మాత్రమే అలవాటుపడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉండి కూడా జగన్‌ను ఎదుర్కోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.

విచిత్రమేమింటే, జగన్‌రెడ్డి విషపూరిత ఆలోచనలు, కుట్రలను అమలుచేయడానికి ఆయనకు మనుషుల కొరత లేదు. అదేమిటో గానీ, జగన్‌ను సమర్థించేవారు గానీ, కుట్రల అమలులో పాలుపంచుకొంటున్న వారు గానీ విచక్షణ కోల్పోతున్నారు. అంతుపట్టని ఉన్మాదం వారిని ఆవహిస్తోంది. లేనిపక్షంలో జగన్‌ కోసం అడ్డమైన పనులూ చేసి ఇబ్బందులపాలవడానికి ఎందుకు సిద్ధపడతారు? చేసిన పాపాలకు జైలుకు వెళ్లి వచ్చిన వారిలో కూడా పశ్చాత్తాపం కనిపించకపోవడమే ఇందుకు నిదర్శనం. నేరం చేస్తే దొరికిపోతామన్న భయం వారిలో కనిపించడం లేదు. దొరికిపోయినా ఫర్వాలేదు జగన్‌రెడ్డి కోసం జైలుకు వెళ్లడానికి, చివరకు చనిపోవడానికి కూడా సిద్ధపడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలాగోలా జగన్‌ అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని కేక్‌లా కోసుకు తినవచ్చునన్న ఆశల్లో విహరిస్తున్నారు. కందుకూరు సంఘటనపై ఫేక్‌ ఐడీతో పోస్టులు పెట్టిన మహిళ కేవలం డబ్బుల కోసమే ఆ పని చేశారని భావించలేము. ఆమెను అంతకు మించిన ఉన్మాదం ఏదో ఆవహించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి ఈ బెడద పోవాలంటే పులివెందులను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి దానికి జగన్‌రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా చేస్తే సరిపోతుందేమో! లేని పక్షంలో జగన్‌రెడ్డి వ్యాపింపజేస్తున్న వైరస్‌ ఇతర జిల్లాల ప్రజలకు సోకి మొత్తం రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే హైదరాబాద్‌లో ఉంటూ జగన్‌కు మద్దతు పలికే వారికి మాత్రం ఆంధ్రప్రదేశ్‌ పురోగమించడం నచ్చడం లేదు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు వచ్చినా, అభివృద్ధి జరిగినా ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నవారు ఎవరూ విమర్శించలేదు. జగన్‌రెడ్డికి జలుబు చేస్తే తెలంగాణలో ఆయన మద్దతుదారులు ముక్కు చీదుకుంటూ ఉపశమనం కలిగించాలనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేస్తున్నారు. వాళ్లంతా జగన్‌రెడ్డి హయాంలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినప్పుడు కళ్లు మూసుకొని ఆనందించారు.

ఇవాళ తన దాకా వచ్చేసరికి జగన్‌రెడ్డికి కూడా పత్రికా స్వేచ్ఛ గుర్తుకొచ్చింది. అధికారంలో ఉన్నంత కాలం ‘ఏబీఎన్‌’తో పాటు ‘టీవీ 5’ ప్రసారాలను నిలిపివేయించలేదా? శాసనసభ కార్యక్రమాలను కూడా కవర్‌ చేయకుండా ‘ఏబీఎన్‌’ను నిర్బంధించలేదా? సీఐడీ పోలీసులతో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక పైనా, సిబ్బందిపైనా కేసులు పెట్టించారు. ఆ కేసులకు సంబంధించి ఇప్పటికీ కోర్టులకు హాజరవుతున్నాం కదా? అధికారం కోల్పోయిన తర్వాత కూడా మా సంస్థలను దూరం పెట్టడం నిజం కాదా? జగన్‌ కార్యక్రమాలు, వైసీపీ నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్‌’లపై నిషేధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కదా? చివరకు నాపై కూడా దేశ ద్రోహం సెక్షన్ల కింద కేసులు పెట్టారు కదా? ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి గొంతు చించుకుంటున్న వాళ్లు అప్పుడు నోరు కట్టేసుకోవడానికి కారణం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అప్పుడు గుర్తుకురాలేదా? నీవు నేర్పిన విద్యనే నీరజాక్షా.. అన్నట్టుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని తప్పు పట్టే నైతిక హక్కు జగన్‌ అండ్‌ కోకు ఉందా? నాటి బాధితుల ఆక్రందనలు మీకు శ్రవణానందకరంగా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు మీ ఆక్రందనలు కూడా ఇతరులకు అదే విధంగా శ్రవణానందకరంగా ఉంటాయని సరిపెట్టుకోండి. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అని అంటారు. నాడు అధికార మదంతో విర్రవీగినందుకు ఇప్పుడు ఫలితం అనుభవించాలి కదా? ఇప్పుడు అద్దెకు తెచ్చుకున్న గొంతులు మీకు అనుకూలంగా మాట్లాడవచ్చు.

మీకు మద్దతుగా మాట్లాడవచ్చు. అయితే అలాంటి గొంతులకు విలువ ఉండదు. దుష్ట సంప్రదాయాలను నెలకొల్పే ముందే ఆలోచించుకోవాలి. రేపు మనకూ అదే గతి పడుతుందని తెలుసుకోవాలి కదా? అప్పట్లో ‘ఏబీఎన్‌’ ప్రసారాల నిలిపివేతపై న్యాయస్థానాలు ప్రశ్నించగా, మాకేమి సంబంధం అని బుకాయించారు. అప్పుడు మీరు ఏర్పాటు చేసిన దారిలోనే ఇప్పుడు అధికారంలో ఉన్న వారు నడిస్తే ఎలా తప్పు పట్టగలరు? సాటి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నది ఎవరు? ఇప్పుడు మీ మీడియాను కూడా అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థిగానే భావించడంలో తప్పేముంది? అధికారం శాశ్వతం అని విర్రవీగిన వారికి ప్రకృతి గుణపాఠం నేర్పుతుంది. అన్యాయం, అక్రమం, దుర్మార్గం, దారుణం అని ఇప్పుడు ఎంత ఘోషించినా అది అరణ్య రోదనే అవుతుంది. ఇప్పటికైనా జగన్‌రెడ్డి అండ్‌ కో బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. అలా కాకుండా తాము కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రం సర్వనాశనం అవుతుందని నిత్యం గగ్గోలు పెట్టినా నిజం ఏమిటో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరు. అధికారంలో ఉన్నప్పుడు గిట్టని మీడియాను అణచివేయడానికి ఎంత ప్రయత్నించినా మీ ఓటమిని తప్పించుకోలేకపోయారు కదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నిజంగా తప్పు చేస్తే దాన్ని శిక్షించే విషయం ప్రజలే చూసుకుంటారు. అయితే ముందుగా మీ విశ్వసనీయత ఏపాటిదో తెలుసుకుంటే మంచిది. రాష్ర్టానికి మంచి జరిగినప్పుడు కూడా హర్షించలేని మనస్తత్వం ఉన్నవాళ్లను ఆ దేవుడే కాపాడాలి!

ఆర్కే

(ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కృతజ్ఞతలు )

రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్లేనా? Is the real estate era over?

రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్లేనా? Is the real estate era over?

ఈ ప్రశ్నలకు ” ఔను … రానున్న రోజులలో రియల్ ఎస్టేట్ పతనం చూడాల్సి వస్తుంది. ఇపుడు నుంచే జాగ్రత్తగా ఉండాలి . .. 2026లోనే రియల్ పతనం స్టార్ట్ అవుతుంది . అది 2027 నాటికి పీక్ కి వెళ్లబోతోంది . ..” అంటూ ఆర్థికరంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి . అయితే కొన్ని సర్వే, ఏలాలసిస్ సంస్థలు మాత్రం ”2030 నాటికి ఇండియాలో రియల్ ఎస్టేట్ పతాక స్థాయికి వెళ్లబోతోంది . ..” అంటూ జీడీపీ పెరుగుదల , భారత్ లో జనాభా వంటి వాటిని పరిగణలోకి తీసుకుని అంచనాలు వేస్తున్నాయి . అయితే ప్రస్తుత అస్తవ్యస్త విధానాలు , మెజార్టీ ప్రజల (70 శాతం ) కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు .

ప్రపంచీకరణ తర్వాత ఏ దేశంలో సంక్షోభం తలెత్తినా . .. అవి ఇతర దేశాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి . రష్యా -ఉక్రెయిన్ యుద్ధం , ఇరాన్ – ఇరాక్ వార్ . .. అమెరికాలో ఆర్ధిక సంక్షోభ0, ట్రంప్ టారిఫ్ ల సంక్షోభం వంటివన్నీ మన సమాజంపై, మన ఆర్ధిక స్థితి – గతములపై కూడా అత్యంత ప్రభావం చూపుతున్నాయి .

ఐటీ భూమ్ సంక్షోభం వల్ల NRI ఇన్విస్ట్మెంట్స్ తగ్గుముఖం పట్టాయి . , ట్రాంప్ టారిఫ్ సంక్షోభం . .. వల్ల గోదావరి జిల్లాలలో ఆక్వా పరిశ్రమ బెంబేలెత్తిపోతోంది . ఈ ప్రభావం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై తీవ్రంగా పడింది . ఇది కూడా రియల్ పై ఎఫెక్ట్ చూపుతోంది .

ఐటీ భూమ్ తగ్గడం : గ్లోబల్ వైజ్ ఐటీ రంగం ఒడిదుడుకుల ప్రభావం మన దేశ ‘రియల్ ఎస్టేట్ ‘ రంగంపై తీవ్రంగా పడుతోంది . ముక్యంగా దక్షిణాదిలో రియల్ భూమ్ ఎక్కువ . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఐటీ ప్రొఫెషనల్స్ కూడా అధికంగా ఉన్నారు . దేశీయంగాను , విదేశాలలోని సౌత్ ఇండియా వారు ఎక్కువగా ఐటీ, ఫార్మా రంగాల నుంచి ఆర్జిస్తున్నారు . వీరి ఆదాయంలో 50-60 శాతం రియల్ ఎస్టేట్ పైనే పెట్టేవారు . గడచినా ఐదారేళ్లుగా ఇందులో కొంత మార్పు కనిపిస్తోంది. 2024-2025 నుంచి ఈ మార్పు మరింత స్పష్టంగా ఉంటోంది .

ధరలు బాగా ఎక్కువ : హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై వంటి నగరాలలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ , విల్లాలు , ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ ధరలు వాస్తవ పరిస్థితులకంటే చాలా ఎక్కువ. చదరపు గజం 6-8 వేలు ఉండాల్సిన చోట . .. రూ 12-15 వేల వరకు అమ్మేవారు . 2005 నుంచి 2015 వరకు చాలా చోట్ల బిల్డర్స్ కి ఇది నడిచింది . అప్పట్లో కనస్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎంటర్ అయిన వారు భారీగా ఆరగించారు . పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందాన . … ఇతర రంగాలలో ఉన్నవారు , అంత ఆర్ధిక స్తోమతలేకపోయినా అప్పులు చేసి . .. నిర్మాణ రంగంలోకి వేలాదిగా వచ్చేసారు . జనం అవసరాల కంటే అదనంగా అపార్టుమెంట్ల నిర్మాణం జరిగింది . ఈ ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ పై పడింది . అలాగే వెంచర్లలో కూడా భారీ ధరలు పెట్టి . .. NRI లను ఆకర్షించి . .. అధిక ధరలకు అమ్ముకున్నారు . ఈ మార్కెట్ కూడా 2019 వరకు బాగానే సాగింది . కరోనా దెబ్బతో వెంచర్ల బిజినెస్ డీలాపడింది .

జీడీపీ పెరిగినా…. భారత్ జీడీపీ వేగంగా పెరుగుతోంది. అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్న ప్రచారం జోరుగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తోంది . అయితే ఇదే సమయంలో సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గింది . జీడీపీ పెరిగినా ఆ ఫలితాలు సామాన్యులకు అందడంలేదు . . .. పారిశ్రేమికవేత్తలు , బడా బాబులకు చేరుతున్నాయని చెప్పాలి . 70 శాతం ఉన్న సామాన్య జనం కొనుగోలు శక్తి గణనీయంగా గట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి . ఈ ప్రభావం తయారీ రంగంపై పడుతుంది . ఇది పరోక్షంగా రియల్ ఎస్టేట్ ని వెనక్కిలాగుతుంది.

బ్యాంక్ లపై ఎఫెక్ట్ . .. రియల్ ఎస్టేట్ మందగమనం బ్యాంకింగ్ వ్యవస్థపై పెను ప్రభావం చూపునుండి . లోన్లు తీసుకున్న బిల్డర్స్ చాలామంది అపార్టుమెంట్లు అమ్ముడుపోక తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నారు . హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై వంటి నగరాలలో వేలకోట్ల బాకీలు బ్యాంకులకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు . ఈ ప్రభావం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది .

వెంచర్ల పరిస్థితి అగమ్యగోచరం … పట్టణాలు , పల్లెలు అన్న తేడా లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి వేసిన వెంచర్లో అమ్ముడుపోక ఖాళీగా ఉంటున్నాయి . ఉదాహరణకు రాజమండ్రి సమీపంలో పాలచర్ల , వెలుగుబండ , దివాన్ చెరువు , రాజానగరం , రాజవోలు , తదితర ప్రాంతాలలో 20 ఏళ్ల క్రితం వేసిన వెంచర్లలో సైతం అమ్ముడుపోని సైట్లు అనేకం ఉన్నాయి . వెంచర్లు వేసిన రియాల్తార్లు లాంచింగ్ ఆఫర్స్ , అనో మరో స్కీం పేరుతొ చాలా వరకు అమ్ముకున్నారు . వారి నుంచి కొనుగోలు చేసిన వారే రెండో సారి అమ్మడానికి కష్టం అవుతోంది . కొనేందుకు ఎవరు ముందుకు రాక . .. పెట్టిన పెట్టుబడి డెడ్ అయిపోతుంది .

‘రియల్ శకం ముగిసినట్లేనా ? ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్లేనా >? అంటే మెజార్టీ నిపుణులు ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదని ఘంటాపదంగా చెపుతున్నారు . ఎన్ని స్థలాలు కొంటారు . … >? ఎన్ని ఫ్లాట్స్ కొంటారు > కొనడానికి సరిపడా ఆదాయాలు వస్తున్నాయా > భూముల ధరలు అమాంతం పెరిగాయి . అవి కొని అపార్ట్మెంట్స్ నిర్మించే బిల్డర్స్ కి కూడా ఇది పెనుభారంగా మారింది . ఈ ప్రభావం కూడా హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్నం . రాజమండ్రి , కాకినాడ , తదితర నగరాలలో నిర్మాణ రంగంపై గణనీయంగా పడింది . “” ఐదారేళ్లలో రియల్ ఎస్టేట్ ఇలాగే ఉంటుంది . ఇంకా చెప్పాలంటే ధరలు తగ్గుతాయి . అయినా బిజినెస్ పుంజుకునే పరిస్థితులు వచ్చేలా లేవు . భవిష్యత్తులో వ్యవసాయ భూముల ధరలు కాస్త పెరుగుతాయి . 2030 నాటికి వ్యవసాయ భూముల ధరలు 50-60 శాతం పెరిగే ఛాన్స్ ఉంది . ..” అని రాజమండ్రికి చెందిన ఎనలిస్ట్ జె . చౌదరయ్య ”అభిన్యూస్ ‘ తో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించారు . రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 2000 నుంచి 2020 మధ్య ఇరవై ఏళ్లలో 15,650 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి . ఇందులో వెంచర్లు వేసిన రియాల్తర్లు 70-80 శాతం అమ్మేసుకున్నారు . కొనుగోలు చేసిన ఇన్వెస్టర్స్ మాత్రం . .. 20 శాతం కూడా రీ సేల్ చేయలేకపోయారు . .. అని రాజమండ్రికి చెందిన ప్రముఖ రియల్టర్ ఒకరు చెప్పారు .

అభివృద్ధి మంత్రం సరే.. కొంచెమైనా సమర్ధత చూపించండి

అభివృద్ధి మంత్రం సరే.. కొంచెమైనా సమర్ధత చూపించండి

జగన్నామ స్మరణ వదిలిపెట్టి … జరగాల్సిన పనులు చూడండి.. అరాచకవాదుల ఆగడాలకు కట్టడివేయలేకపోతున్నారెందుకు ?

అమరావతి మొదటి విడత పనులు మూడేళ్ళలో ఎలా పూర్తి చేస్తారు? లెక్కలేమైనా ఉన్నాయా ?

అభాసుపాలవుతారు ? రాష్ట్రాన్ని అధఃపాతాళానికి నెట్టేయకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక విజన్ తోనే పనిచేస్తారు. తాజా విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి దేశంలో 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదగాలి. ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధి అనే బాబు హయాంలో అభివృద్ధి ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. ప్రజల్లో ఆ ప్రభావం కూడా మిశ్రమంగా వుంది. ఆయన పార్టీ గెలుస్తోంది. ఓడిపోతుంది. గెలుస్తోంది. ఓడిపోతుంది. దీనంతటికీ బాధ్యత ముమ్మాటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిడే .

బాబు అభివృద్ధి మంత్రం ప్రజలను ఎంతగా కనెక్ట్ చేస్తోందో అధ్యయనం లేదు. జగన్ ప్రభావాన్ని దృష్టిలో వుంచుకుని  బాబు పేదల సంక్షేమ పధకాల సొమ్ము పెంచి ఇంకా హెచ్చుమందికి  విస్తరింపచేశారు. లబ్దిదారుల తృప్తి లేదా అసంతృప్తి ఇప్పటికిప్పుడే లెక్కతేలేది కాదు.

ఇన్వెస్టర్లు నేరుగా బాబు తో టచ్ లో వున్నారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తారేమో అనే భయం తప్ప వారికి మరో సంకోచమే లేదు.

క్షేత్రస్ధాయిలో ఎమ్మెల్యేలదే రాజ్యం. సంక్షేమ పధకాల లబ్ధిదారుల అకౌంట్లలోకే నేరుగా డబ్బు జమ అవుతుంది . వారి ఇతర సమస్యల పరిష్కారం, మధ్యతరగతి వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్యేలకు పెద్ద పని అవుతుంది. ఆచరణలో ఇది కూడా పెద్ద భారంకాదు. సమస్య స్టేటస్ ఆన్ లైన్ లో కనబడుతూనే వుంటుంది. దాన్ని పుష్ చేయడమే ప్రజాప్రతినిధులు చేయగలపని.

ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే వనరుల నిర్వహణ, అజమాయిషీ సిండికేట్లవే! ఈ సిండికేట్ల వెనుక ప్రజాప్రతినిధులు వున్నారు. శక్తివంతులైన ప్రతిపక్షం వాళ్ళు కూడా వున్నారు. లిక్కర్, ఇసుక, మట్టి పాటదారుల సిండికేట్లు నాయకుల మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చూసుకోవాలి. గ్రామాల్లో ఈ విషయం లెక్కలతో సహా ఓపెన్ గా చెప్పేస్తూ వుంటారు. “మాకేంటి” అనే నాయకులు కూడా వున్నారు.

ఇసుక మట్టి పనుల్లో ఎమ్మెల్యేలు ఎంత దూరంగా వుంటే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందని చంద్రబాబు హెచ్చరించడమే  పరిస్ధితి శృతిమించి రాగాన పడుతున్నదనడానికి ఒక సూచన!  ఎవరి కారణాలు వారికి వున్నా ఆదివారం జరిగిన అధికారపార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలను ముఖ్యనాయకులను పిలిచారు. మొత్తం ఆహ్వానితుల్లో  56 మంది హాజరు కాలేదంటే అది ఒక విధమైన లెక్కలేని తనానికి ఒక సూచనగా అర్ధం చేసుకోవచ్చు.

క్వాంటమ్ మొదలైన టెక్నాలజీ ప్రాజెక్టులు, రకరకాల పరిశ్రమలకు ఇన్వెస్టిమెంట్లు దీర్ఘకాలంలో  భవిష్యత్తుకి అవసరాలే! ఇవేమీ కళ్ళముందున్న ప్రజల అవసరాలు తీర్చలేవు. కనెక్టు కాలేవు.

అధికారపార్టీల్లో వున్న ఎమ్మెల్యేల పనితీరే ప్రభుత్వం ప్రతిష్టను పెంచుతుంది. ప్రజల్లో నిలబెడుతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తుంది.

రేపటి అభివృద్ధి జపంలో కూటమి ప్రభుత్వం ఇపుడు కళ్ళముందున్న ప్రజల్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి, క్రిమినల్స్ ను నేరుగా సమర్థిస్తున్న అనేక కేసుల్లో నిందితుడైన జగన్ మీద చర్యల్లో కూడా కూటమి ప్రభుత్వం అడుగు వేయలేకపోతోంది. జగన్ పై చర్య చంద్రబాబు వల్ల కాదని ఆయన పార్టీ వాళ్ళే అంటున్నారంటే పరిపాలనలో ఒక పార్శ్వాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమౌతోంది. జగన్ మీద వ్యతిరేకతతోనే కూటమిని గెలిపించిన వర్గాల మనోభావాలను బాబు పట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

బాబు సన్నిహితుడన్న బావసతో జగన్ ప్రభుత్వం వేధించిన ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు ఒంటరి పోరాటం చేసి తనపై పాత ప్రభుత్వం మోపిన అభియోగాలనుంచి విముక్తుడయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఏడాది గడచినా ఎబి పెన్షన్ సెటిల్ మెంట్ జరగలేదు. జీతంలో సగం బకాయిలు ఇంకా ఆయనకు చెల్లించనే లేదు. మధ్యతరగతి విద్యావంతుల్లో చంద్రబాబు పాలనపై పెరుగుతున్న నిరుత్సాహానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో వున్నాయి.

ప్రపంచంలో పెద్ద క్వాంటమ్ ప్రాజెక్టు మాకే వుంది. ఇంకో పాతికేళ్ళకు మేము ప్రపంచంలో గొప్పరాష్టం వాళ్ళమైపోతాం అనుకోడానికే తప్ప! బాబుగారి అభివృద్ధి మంత్రం వల్ల రోజువారీ బతుకుల్లో మార్పులు వుండవు. మాతోపాటు  ప్రభుత్వం వుందన్న భరోసా వుంటే చాలు. అదే ముందుకి నడిపిస్తుంది. సంక్షేమ పధకాల ద్వారా పేద వర్గాలకు జగన్ ఉన్నాడన్న ధీమాను ఆయన ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత చేసినా అది జగన్ పధకాల కొనసాగింపుగానే చూస్తారు. ఇందులో కూటమి లేబుల్ కాని బాబు లేబుల్ కాని లేవు.

బాబు గారూ! ప్రభుత్వం వుందన్న ప్రజెన్స్ ను మధ్యతరగతి వారికి, విద్యావంతులకు, జగన్ పై ఆగ్రహంతో మీకు అధికారాన్ని ఇచ్చిన వారికి చూపించండి. మీ ప్రభుత్వం  ఓడిపోవడం మీకు కొత్తకాదు. కానీ, మీ మీద నమ్మకం వుంచిన వారి ఆశలు కొన్నైనా నెరవేర్చండి!!

జగన్ జపం.. ఆపండి బాబూ..

జగన్ జపం.. ఆపండి బాబూ..

అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా.. వైసీపీ అధినేత జగన్ పై ఎందుకంత ఫోకస్

మీరు నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నా . .. నిత్యం జనంలో చర్చ జరిగేలా చేస్తున్నారు

”బాబాయ్ వివేకానంద్ రెడ్డిని చంపించి ఆ నెపాన్ని నాపై మోపారు . .. నారా సుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రికలో రాసారు.”

”మద్యం కుంభకోణంలో భారీగా దోచుకున్నారు . ఇసుక తిన్నారు . . మైన్స్ ను దోచుకున్నారు.”

” జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లారు . వీళ్ళు చేసిన ఆర్ధిక అరాచకాలకు ఇంకా ఇబ్బందులు పడుతున్నాం . ..”

ఇలా ప్రతి సందర్భంలోను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ,, వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు , కూటమి నేతలు చేస్తున్న విమర్శలలో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనేది పక్కన పెడితే… జనం కూడా జగన్ అరాచకాలు , అక్రమాలపై ఆందోళన చెంది వైసీపీని ఘోరంగా ఓడించారు.

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల వరకు జగన్ అండ్ కో అరాచకాలు , అక్రమాలు గురించి చెపుతూ ఉంటె జనం కూడా కాస్త ఓపిగ్గా విన్నారు. ఏడాది దాటుతున్నా ఈ పాటను చంద్రబాబు అండ్ కో వదలకపోతే జనంలోనూ చులకనయ్యే ప్రమాదం పొంచి ఉంది .

జనానికి కావలసింది అదికాదు : జగన్ పై రోజు విమర్శలు చేయడం కాదు జనానికి కావలసింది. అభివృద్ధి , సంక్షేమం , శాంతి , భద్రతల పరిరక్షణ వంటివి కోరుకుంటారు. ఇవన్నీ కూటమి పాలనలో చెప్పుకోదగ్గ రీతిలోనే సాగుతున్నాయి . అయితే జనంలో ఎక్సపెటేషన్స్ పెంచడంవల్ల ఇంకా ఏవేవో కావాలని కోరుకునే జనం సంఖ్య పెరుగుతోంది. దీన్ని రీచ్ అవ్వడం ఏ సర్కార్ కైనా సవాలే . జగన్ ప్రభుత్వంతో పోలిస్తే . .. కూటమి పాలన ఎన్నో రేట్లు మెరుగే . అయినా . .. జనానికి సంతృప్తి మాత్రం ఇంకా చాలడంలేదనే అనిపిస్తోంది . అంటే చంద్రబాబు . .. అవి చేస్తాం . . ఇవి చేస్తాం . . అని ఏ మీటింగులోను వదలకుండా చేస్తున్న ప్రచారం కూడా కూటమి పాలిట ఇబ్బందిగా తయారయిందని చెప్పాలి .

బనకచర్ల…. చంద్రబాబు తలకి రోకలి చుట్టుకున్నట్లే..

బనకచర్ల…. చంద్రబాబు తలకి రోకలి చుట్టుకున్నట్లే..

కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందా,,, ఏపీ – తెలంగాణ సమస్య పరిష్కరిస్తుందా?

“రెండు రాష్ట్రాలూ సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కట్టుకుని సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలి ‘ ‘ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు ఇచ్చారు. “బనకచర్ల” ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో రాజకీయ నాయకులు రాజేస్తున్న తగాదా రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉద్రిక్తతలు పెరగకముందే చంద్రబాబు నాయుడు, విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఈ సూచన లో వ్యూహాత్మకమైన, ఆచరణసాధ్యమైన దృక్పధాలు కనబడుతున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ఈ సూచనను పరిశీలించాలి. కేంద్రప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి

వాస్తవాలు సాంకేతికతల ప్రాతిపదికగా ఉభయ తారకంగా సమస్యకు ముగింపు ఇవ్వాలి.

బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చంద్రబాబు నుంచే వచ్చింది. “అన్ని అనుమతులూ తీసుకున్నాకే” పని ప్రారంభమౌతుందని కూడా చెప్పారు. అయితే రాజకీయపార్టీలు ప్రజల సెంటిమెంటు కేంద్రంగా రెచ్చగొట్టే మాటలు విసరడం మొదలు పెట్టాయి.

దీనికంటే ముందు … ఆంధ్రప్రదేశ్ ఉన్న క్లిష్ట పరిస్తుతులలో బనకచర్ల వంటి భారీ ఎత్తిపోతలను తలపెట్టడమే . . చంద్రబాబు తన తలకి రోకలి చుట్టుకున్నట్లే కనిపిస్తోంది .

బనకచర్ల తగాదా: నీటి కోసం రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత

తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపకంపై కొనసాగుతున్న వివాదాల్లో తాజా చిచ్చు – బనకచర్ల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రాణవాయువుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుపై తెలంగాణ మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. గోదావరి జలాల వినియోగంపై నానా రకాలుగా చర్చకు దారితీసిన ఈ అంశం, ఇప్పుడిప్పుడే రాజకీయ మలుపులు తిరుగుతోంది.

బనకచర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం – గోదావరి వరద నీటిని వృథా కాకుండా పట్టుకుని, శ్రీశైలం కుడికాలువ ద్వారా రాయలసీమలోకి తరలించడం. ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రంలో కలిసిపోయే సుమారు 200 టీఎంసీల వరద నీరు ఆంధ్రప్రదేశ్ ప్రకారం వృథా అవుతోంది. ఆ నీటిని కాలువల ద్వారా ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి బొల్లపల్లిలో నిల్వ చేసి, చివరకు రాయలసీమకు తరలించాలన్నదే ప్రణాళిక.

ఈ పథకంతో 12 లక్షల ఎకరాల సాగు భూములకు నీరు అందుతుందని, 40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెరపైకి వచ్చిన ఈ పథకాన్ని రాయలసీమలో శాశ్వత సాగునీటి ప్రణాళికగా అభివర్ణిస్తున్నారు. నిజమే . .. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అస్తవ్యస్థ పరిస్తుతులలో సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించకుండా తెరపైకి తీసుకురావడం చంద్రబాబు దుందుడుకు స్వభావానికి సంకేతంగా కనిపిస్తోంది .

తెలంగాణ అభ్యంతరం: నీటి హక్కుల ఉల్లంఘన

తెలంగాణ మాత్రం ఈ పథకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరి జలాలపై తమకున్న హక్కులను కాలరాశి, కొత్తగా నీటిని మళ్లించడమంటే పునర్విభజన చట్టం ఉల్లంఘన అని వాదిస్తోంది. ముఖ్యంగా, ప్రాజెక్టు నిర్మాణానికి ముందు అపెక్స్ కౌన్సిల్ అనుమతి, ట్రైబ్యునల్ అంగీకారం అవసరమన్న నిబంధనలను ఉల్లంఘించిందని అభిప్రాయం.

తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2025 జనవరిలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాసి ఈ ప్రాజెక్టు నివేదికను తిరస్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం స్పందించకపోవడం వల్ల తెలంగాణలో అసంతృప్తి, అనిశ్చితి పెరిగింది.

కేంద్రం మౌనం: సమస్యకే దారి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తటస్థ ధోరణిలో వ్యవహరిస్తోంది. ఈ పథకంపై ప్రీ-ఫీజిబిలిటీ నివేదిక కేంద్ర జలశక్తి శాఖకు పంపబడినప్పటికీ, ఆమోదం లేదా తిరస్కరణ గురించి ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఇది రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగకుండా అడ్డుకుంటోంది. అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపర్చని కేంద్రం, జల వివాద పరిష్కార విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది.

పనులు ప్రారంభం కాకముందే వివాదం ముదురుతుండటంతో, నీటి రాజకీయం మళ్లీ తెరపైకి వచ్చింది.

టీడీపీ (ఆంధ్రప్రదేశ్): చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును రైతుల పాలిట దైవిక వరంగా చూపిస్తున్నారు. కేంద్రంతో కలిసికట్టుగా పనిచేస్తున్నామని, ఈ పథకం వల్ల రాష్ట్రానికి భారీ లాభం చేకూరుతుందని వాదిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ (ఆంధ్రప్రదేశ్): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ పథకానికి సిద్ధాంత పరంగా మద్దతు ఇవ్వడమే కాకుండా, టీడీపీ దీనిని ప్రచార తంతుగా వాడుతోందని విమర్శిస్తున్నారు. తమ పాలనలో అమలు చేసిన వెలిగొండ, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులతో పోల్చుతూ బనకచర్లను అతిశయోక్తిగా చూపిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్: అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ పథకాన్ని గోదావరి జల ఒప్పందాల ఉల్లంఘనగా భావిస్తూ, న్యాయపరంగా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రంతో చర్చలు జరిపి, సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు.

బీఆర్ఎస్ (తెలంగాణ): ఈ పథకాన్ని గోదావరి నీటి దోపిడీగా చిత్రీకరిస్తూ, కేంద్రం, టీడీపీ మీద విమర్శలు గుప్పిస్తోంది. నేత విద్యాసాగర్ రావు, ఇది చట్టవిరుద్ధమని, తెలంగాణ రైతులకు నష్టం కలిగిస్తుందని వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం పాటిస్తోందని ఆరోపిస్తూ, రహస్య ఒప్పందాలపై ఆరోపణలు చేస్తున్నారు.

బీజేపీ (కేంద్రం & తెలంగాణ): కేంద్ర బీజేపీ మౌనం కొనసాగిస్తుండగా, తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర రైతులకు మద్దతు పలుకుతున్నారు. అపెక్స్ కౌన్సిల్‌ జోక్యం కావాలన్న ముద్దుబొమ్మను ఉపయోగిస్తూనే, గడువు పెడుతున్నారు.

రాజకీయ పార్టీలకు ఇది ఓట్ల కోసం మంచి అవకాశంగా కనిపిస్తున్నా, రాయలసీమ రైతులకు ఇది ఆశ, తెలంగాణ రైతులకు ఆందోళన. నీటి కోసం సాగుతున్న ఈ పోరాటం రాజకీయ ప్రయోజనాలకు, సమర్థ నీటి పాలనకు మధ్య సమరంగా మారుతోంది.

ఇలాంటి స్థితిలో చంద్రబాబు సూచనలో రాజకీయం కాక, రాజనీతి కనపడుతోంది. గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు ఇప్పటికే వినియోగిస్తున్నాయని, పోలవరం ప్రాజెక్టు తప్ప మిగిలినవన్నీ అనుమతి లేని ప్రాజెక్టులని, తాను ఎప్పుడూ తెలంగాణపై వివాదం సృష్టించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తుచేశారు. ఆయన్ని విశ్వసించడానికి ఈ వాస్తవాలు చాలు. 

బనకచర్ల వివాదానికి శాశ్వత పరిష్కారం రావాలంటే:

1.కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.

2.అపెక్స్ కౌన్సిల్‌ను తక్షణం సమావేశపర్చాలి.

3.రెండు రాష్ట్రాల మధ్య పారదర్శక చర్చలు జరగాలి.

4.ప్రాజెక్టు నివేదికను నిష్పాక్షికంగా సమీక్షించాలి.

బనకచర్ల ఒక నీటి ప్రాజెక్టు మాత్రమే కాదు – అది రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కల్పించాల్సిన అవసరాన్ని, హక్కుల పరిరక్షణకు లెక్కలు వేసే రాజకీయాలను, కేంద్ర ప్రభుత్వ పాత్రను ప్రతిబింబిస్తుంది. నీటి అంశాలు ఇక రాజకీయం కాకుండా సాంకేతికత, సమన్వయం, ఆధారంగా పరిష్కారమవ్వాలి. లేకపోతే తగాదాలు రాష్ట్రాల మధ్య విద్వేషాల్ని పెంచే ప్రమాదం వుంది.