బ్యాంకు లాకర్లు..  సురక్షితమేనా ?

బ్యాంకు లాకర్లు.. సురక్షితమేనా ?

బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానంతో పెరుగుతున్న అనుమానాలు

బ్యాంకు లాకర్లలో దాచుకున్న విలువైన వస్తువులకి ఉన్న బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన ప్రశ్నకి ఇలా సమాచారం ఇచ్చారు.

లాకర్లలో దాచిన వస్తువులను బ్యాంకు అధికారులు చూడరు (చూడడం బ్యాంకు రూల్స్ కి విరుద్ధం) కాబట్టి, వాటిని రికార్డు చేయరు, అంచేత వాటి విలువ రిజిస్టర్ కాదు. సో.. విలువ ఆధారంగా బీమా కవరేజీ ఇవ్వబడదు.

దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంకుల్లో మోసాలు వంటివి జరిగిన సందర్భాల్లో లాకర్లకు నష్టం వాటిల్లితే లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సొమ్ముని బ్యాంకులు పరిహారంగా చెల్లిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు .

బ్యాంకు లాకర్ చార్జీలవిషయానికొస్తే.. భారతదేశంలో అనేక రేంజ్ లు ఉన్నాయి. ముఖ్యమైన జాతీయ బ్యాంకుల్లో పరిశీలిస్తే ఏరియా లొకేషన్, లాకర్ సైజు ని బట్టి ఏడాదికి 1000 రూపాయలనుంచి 12000 వరకూ లాకర్ అద్దె ఉంటుంది. కొన్ని ఇతర బ్యాంకుల్లో అత్యధికంగా 25000 నుంచి 40000 వరకూ కూడా వార్షిక లాకర్ చార్జీలు ఉన్నాయి.

దీన్ని బట్టి గరిష్టంగా లక్ష రూపాయల నుంచి 40 లక్షల వరకూ మాత్రమే లాకర్ నష్టానికి వినియోగదారులు పరిహారం పొందగలరన్నమాట.

బ్యాంక్ లాకర్లు సర్వ సురక్షితం అని భావిస్తారు, కానీ అవి 100% భద్రతను హామీ ఇవ్వవు. ఇంట్లో విలువైన వస్తువులను ఉంచడం ప్రమాదం కాబట్టి లాకర్లు అంతకంటే సురక్షితమైనవి. అయినప్పటికీ, పెద్ద స్థాయి దొంగతనాలు, సిబ్బంది ప్రమేయంతో జరిగే మోసాలు, అలాగే చెదలు, తేనెటీగలు, ఎలుకలు, నీటి లీకేజీ వంటి ఘటనల కారణంగా లాకర్లకు నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం.

బ్యాంక్ లాకర్లు బలమైన స్ట్రాంగ్ రూమ్స్ లోనే ఉంటాయి. అలారమ్‌లు, సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. అయినప్పటికీ, దొంగతనం, అగ్ని ప్రమాదం, వరదలు వంటి ఘటనల్లో నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది.

RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంక్ నిర్లక్ష్యం లేదా సిబ్బంది మోసం వల్ల లాకర్ దెబ్బతిన్నాకూడా బ్యాంక్ చెల్లించే పరిహారం వార్షిక అద్దెకి 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు, ఒక లాకర్ అద్దె ₹2,000 అయితే, గరిష్ట పరిహారం ₹2,00,000 మాత్రమే. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదం వంటి సహజ విపత్తుల వల్ల నష్టం జరిగితే, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు నిరూపిస్తే బ్యాంక్ నష్టానికి పైసా పరిహారం కూడా ఇవ్వక్కర్లేదు.

లాకర్ ఎంత చిన్నదైనా అందులో కుక్కి కుక్కి మరీ బంగారం, నగదు విలువైన పత్రాలను దాచడం కొందరు వినియోగదారుల అలవాటు. ప్రధానంగా అక్రమార్జనపరులు కొందరు లాకర్లను తమ రహస్య సంపదని దాచడం కోసం తీసుకుంటూ ఉంటారు.

కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది లాకర్‌లను దెబ్బతీయడం లేదా వాటిలో సొమ్ముని దొంగతనం చేయడం జరిగిన ఘటనలు కూడా పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. ఒక లాకర్‌ను 7 సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే, అద్దె చెల్లించినా కూడా బ్యాంక్ కి దాన్ని తెరిచే అధికారం ఉంది. వస్తువుల జాబితా ఉండదు కాబట్టి దొంగతనం జరిగితే నిరూపించడం కష్టం. అక్రమ సంపద అయితే.. కొందరు వినియోగదారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా కూడా మారుతుంది.

సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు లాకర్‌ను ఓపెన్ చేసి తనిఖీ చేయాలనీ బ్యాంకులు చెబుతాయి. లాకర్లలో భద్రపరచిన వస్తువుల జాబితా, ఫోటోలు, బిల్లులు ఇంట్లో భద్రపరచుకోవాలి. అలాగే

నామినీ రికార్డు పర్ఫెక్ట్ గా ఉంటే వినియోగదారుడు మరణించిన సందర్భంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తవు . దీనిపై స్పష్టంగా ఉండాలి .

ఇరాన్‌ సైన్యం క్షిపణి దాడి- అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసం

ఇరాన్‌ సైన్యం క్షిపణి దాడి- అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసం

భూతలదాడులకు దిగితే అమెరికా సైనికులు సొరచేపలకు ఆహారం అవుతారు: ఇరాన్ డెడ్లీ వార్నింగ్​

ఇరాన్ – అమెరికా యుద్ధం ఎటుదారితీస్తుందోనన్న ఆందోళన ఎక్కువవుతోంది . ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఇరాన్‌ సైన్యం చేసిన క్షిపణిదాడిలో సౌదీఅరేబియాలోని ప్రిన్స్‌సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసమైంది. బోయింగ్‌-707 మోడల్‌లో మార్పులు చేసి గగనతలంలో ఓ కమాండ్‌ సెంటర్‌లా రూపొందించిన ఈ3-సెంట్రీ అవాక్స్‌ చాలా శక్తిమంతమైంది. 250 మైళ్ల పరిధిలో గగనతలంలో ఏం జరిగినా ఈ విమానం అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదు.

పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో యుద్ధం భీకరంగా మారుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు మద్దతుగా హూతీ రెబెల్స్ దాడులు మొదలుపెట్టగా, భూతల దాడుల ప్రచారం మధ్య అమెరికాకు చెందిన మెరైన్లు పశ్చిమాసియాకు చేరుకోవటం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎటాక్ చేస్తుండగా, మరోవైపు టెహ్రాన్‌ సహా ఇతర ప్రాంతాల్లో ఐడీఎఫ్​ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా భూతల దాడులు ప్రారంభిస్తే వారి సైన్యం పర్షియన్‌ గల్ఫ్‌ సొర చేపలకు ఆహారం అవుతారని ఇరాన్‌ హెచ్చరించిడాం చర్చకు దారితీసింది . యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో 216 మంది చిన్నారులు సహా 2076 మంది మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు ఇంతవరకు ససేమిరా అన్న ఇరాన్‌, కాస్త బెట్టువీడినట్లు తెలుస్తోంది. షరతులతో కూడిన చర్చలకు అంగీకరించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్‌లో ఆదివారం మధ్యవర్తిత్వ ప్రక్రియపై జరిగే ప్రతిపాదిత చర్చలు యుద్ధ విరమణ లేదా తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్‌ అంగీకరించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. తక్షణమే దాడులు ఆపాలని, భవిష్యత్తులో దాడులు చేయబోమని విశ్వసనీయమైన గ్యారంటీ ఇవ్వాలనే షరతులు పెట్టినట్లు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చలకు ఇరాన్‌ 5 షరతులు పెట్టినట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు గల్ఫ్‌దేశాలు ప్రకటించాయి. గల్ఫ్‌ దేశాలకు డ్రోన్లతో రక్షణ కల్పించనున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హామీ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళ ఆయుధ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) పేర్కొంది. ముఖ్యమైన ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై దాడులను కొన్నిరోజుల్లో పూర్తిచేస్తామని తెలిపింది.

మోదీకి  ట్రంప్ ఫోన్ – హర్ముజ్ జలసంధిపై  చర్చ

మోదీకి ట్రంప్ ఫోన్ – హర్ముజ్ జలసంధిపై చర్చ

పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించిన మోదీ, ట్రంప్‌-

హర్మూజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై మోదీ, ట్రంప్‌ మధ్య చర్చ

మోదీకి ట్రంప్ ఫోన్ చేసినట్లు చెప్పిన అమెరికా రాయబారి  సెర్గియా గోర్ 

 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో . .. కీలక పరిణామం చోటుచేసుకుంది . భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌ చేసారు . ఈ సందర్బంగా ట్రంప్ మోదీ మధ్య కీలక చర్చ నడిచింది . ఇరు దేశాధినేతలు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం గురించి చర్చించినట్లు సమాచారం . ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

అమెరికా – ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య చోటుచేసుకున్న యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ… మోడీ – ట్రంప్ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది .

గ్యాస్ మాయాజాలం –  తీరం దాటిన లాభం…

గ్యాస్ మాయాజాలం – తీరం దాటిన లాభం…

ఇరాన్‌పై దాడులను ముగించే యోచనలో తాను ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు . ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను ఇటీవలే అమెరికా తాత్కాలికంగా తొలగించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాకు ఎదురవుతున్న ఆటంకాలు సంక్షోభ స్థాయికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

మధ్య ప్రాచ్య ఉద్రిక్తతలపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ కామెంట్స్ చేశారు. అమెరికా తన లక్ష్యాలకు చేరవ అయ్యిందని ట్రంప్ చెప్పారు. మధ్య ప్రాచ్యంలో మిలిటరీ చర్యలకు ముగింపు పలికే యోచనలో ఉన్నామని అన్నారు.

శ్వేత సౌధం ప్రెస్ సెక్రెటరీ కెరొలైన్ లెవిట్ కూడా ఈ విషయమై కీలక ప్రకటన విడుదల చేశారు. నాలుగు నుంచి ఆరు వారాల్లో తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పెంటగాన్ అంచనా వేసినట్టు పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పోస్టు అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమెరికా సాయుధ దళాలు తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నాయి. రోజులు గడిచేకొద్దీ ఇరాన్ పాలకులు బలహీనమవుతున్నారు. అమెరికాపై వారు ఇక బెదిరింపులకు దిగలేరు.

ఇటీవలే అమెరికా ట్రెజరీ శాఖ ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలు తొలగించింది. మార్చ్ 20కి ముందే రవాణా నౌకల్లోకి చేర్చిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 19 వరకూ ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని యూఎస్ ట్రెజరీ పేర్కొంది. ఈ చర్యలతో 140 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర 112.19 డాలర్లకు చేరింది . ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే క్రుడ్ ఆయిల్ మరింత పెరిగే ప్రమాదం ఉంది .

దేవిన సిస్టర్స్ కి ఉగాది పురష్కారం . . సీఎం చేతులమీదుగా . .

దేవిన సిస్టర్స్ కి ఉగాది పురష్కారం . . సీఎం చేతులమీదుగా . .

సైకత శిల్ప కళద్వారా జనంలో అవగాహన కల్పిస్తున్నందుకు దక్కిన ఛాన్స్ . .

తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సోహిత , దేవిన ధన్యత సోదరీమణులు . వీరు పదేళ్లుగా సైకత శిల్ప కళ ద్వారా జనంలో అవగాహనా తీసుకువస్తున్నారు . వ్యవసాయ సంక్షోభం , ఆడపిల్లల పట్ల వివక్షత , వంటి సామాజిక వివక్షతలపై అవగాహన కల్పిస్తున్న వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది . ఈ అమ్మాయిల తండ్రి దేవిన శ్రీనివాస్ సైకత శిల్పి . ఆర్టిస్ట్ . జాతీయ , అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలలో శ్రీనివాస్ పాల్తొన్నారు .

ఉగాది సందర్బంగా గురువారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతులమీదుగా సోహిత , ధన్యత ఉగాది పురస్కారాలు అందుకున్నారు .