కార్యకర్తలకే బిజెపిలో పెద్దపీట – ఇది ఎపిలో వ్యూహం – నాలుగు దశాబ్దాల నిబద్దత కలిగిన కార్యకర్తకు రాజ్యసభ
పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో, అత్యంత విధేయతతో సుదీర్ఘ కాలం పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు బీజేపీ పెద్ద పీట వేస్తోంది. రాజకీయంగా ఉనికి కోసం యత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఇది మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది .
నమ్మకంతో కట్టుబడి పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఊహించలేనంత పెద్ద అవకాశాలు ఇవ్వగలమన్న సంకేతాలను బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది కాలంలోనే కల్పించింది .
పక్కజిల్లాలో సొంత పార్టీ కార్యకర్తలకు కూడా కు తెలియని బి. శ్రీనివాసవర్మకు నరసాపురం నుంచి లోక్ సభ టికెట్ ఇచ్చారు. జగన్ వ్యతిరేకప్రభంజనంలో వర్మగెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు.
రాజ్యసభకు రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు విజయసాయిరెడ్డి స్ధానంలో పి వెంకట
సత్యనారాయణను ఎంపిక చేసినట్టు బిజెపి ప్రకటించింది. కూటమి బలం కారణంగా ఆయన ఎన్నిక ఎన్నిక కేవలం లాంఛనమే!
శ్రీనివాస్ వర్మ పశ్చిమగోదావరి జిల్లా స్థాయి లో పార్టీపరంగా అనేక బాధ్యతలు నిర్వహించారు. సత్యనారాయణ బిజెపి క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ గా వున్నారు. ఇద్దరిదీ భీమవరమే! ఇద్దరూ స్వయం సేవకులే! ఇద్దరూ పటాటోపాలకు దూరంగా వుండే కార్యకర్తలుగా గుర్తింపు పొందినవారే కావడం గమనార్హం. బిజెపి బలంలేని ఆంధ్రప్రదేశ్ లో పెద్దపెద్ద పదవులు వున్నవారి ప్రభావం కూడా సహజంగా తక్కువగానే వుంటుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి చిన్నగా విస్తరిస్తోంది. బిజెపికి పార్లమెంటులో ఆధిక్యత వున్నపుడు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు మొదలైన అనేక అంశాల్లో దగా చేసినందుకు ప్రజలు ఆపార్టీ ప్రజలు ఆగ్రహంగా వున్నారు. 2024 ఎన్నికల్లో మెజారిటీలేక తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్రంలో (రాష్ట్రంలో కూడా) కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక “పట్టి విడిచినట్టు” రాష్ట్రం కోర్కెలను కేంద్రం చిన్నగా తీరుస్తోంది. ఇందువల్ల ప్రజల ఆగ్రహం తగ్గింది. ఒకప్పుడు పార్టీ జెండా మోయడానికి కార్యకర్తలు లేని ఎపిలో బిజెపి సభ్యత్వాల సఖ్యపెరుగుతోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1 లక్షా 50 వేలమంది కంటే ఎక్కువ మందే బిజెపిలో సభ్యులుగా వున్నారు. పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి ఏ నియోజక వర్గంలోనైనా పాతిక ముప్పై మంది క్రియాశీలక సభ్యులే పార్టీకి వున్నారు.
కొద్దినెలల క్రితం బిజిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్సీ పదవి దక్కింది. బిజెపి, తెలుగుదేశం మధ్య పొత్తు వున్న కాలంలోనే వీర్రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు కి వ్యతిరేకంగా విమర్శలు చేసి రెండుపార్టీల మద్య వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. అలాంటి వీర్రాజు మళ్ళీ ఎమ్మెల్సీ కావడం అనూహ్యమే! టీడీపీని కాదని వీర్రాజు ఆర్ఎస్ఎస్ పెద్దల ద్వారా ఎమ్మెల్సే కొట్టగలిగారు . అదీ బీజేపీలో జరిగే రాజకీయం . చంద్రబాబు విధిలేక ఒప్పుకోవడం లేదా హుందాగా అంగీకరించడంలో బిజెపి మేనేజిమెంటు చాతుర్యం కూడా వుంది.
తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిలో పార్టీ బలం పెంచుకోడానికి సొంత ఎత్తుగడలు వున్నాయి. తెలుగుదేశంపార్టీ తన ఎమ్మెల్యేలు లేనిచోట ఇంచార్జ్ లను నియమించి వారి ద్వారా రోజువారీ పాలనలో కూడా జోక్యం చేసుకుంటోంది. జనసేనకు పవన్ కళ్యాణ్ నాయకత్వం తప్ప సంస్ధాగత నిర్మాణం దాదాపు లేదనే చెప్పొచ్చు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ అధికార కేంద్రాలు బలపడుతున్నాయి. తెలుగుదేశం ఇన్ చార్జ్ వ్యవస్థకు జనసేన అధికార కేంద్రాలకు మధ్య స్పర్ధలు వున్నాయి. అవి రోడ్డున పడే పరిస్ధితి ఇప్పట్లో వుండకపోవచ్చు .
పార్టీ కమిట్ మెంట్ ఉంటే పదవి అదే వస్తుంది
పార్టీకి కట్టుబడిన వారికే పదవులు అనే బిజెపి ఎత్తుగడ, లాయలిస్టుల్లో నిరాసక్తత ను తొలగించి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అది ఆ పార్టీ విధానం… దానిని తప్పుపట్టడం పెద్దతప్పే అవుతుంది. ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెడుతోంది. “ఎంతపని చేసినా ఇంతే! లాయల్టీకి గుర్తింపు గౌరవం లేవు. బాబు మారడు. అధికారంలో లేనపుడు కార్యకర్తలే ప్రాణ సమానం అంటాడు. అధికారంలోకి వచ్చాక అదంతా మరచిపోతాడు……” ఇలాంటి కామెంట్లు తెలుగుదేశంలో తరచూ వినిపిస్తుంటాయి.
ఏరాజకీయ పార్టీ అయినా బలంపెంచుకోవలసిందే! అయితే ప్రజల్లోకి వెళ్ళడానికంటే కంటే కేంద్రం లో వున్న అధికారాన్ని ఇందుకు ఉపయోగించడం ఒక నైతిక ప్రశ్న! బిజెపికి ఇలాంటి నైతికమీమాంసలేమీ వుండవు అని రకరకాల పరిణామాల ద్వారా దేశప్రజలందరికీ తెలుసు!
బీజేపీ మింగేస్తుంది
బిజెపికి అవకాశం వచ్చినపుడు, ఇతరపార్టీలు ఆదమరచి వున్నపుడు బిజెపి ఆన్ని విధాలా ఆక్రమించేస్తుందని జనసేన కు తెలుస్తుందోలేదో కానీ , , తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ మర్మం ఖచ్చితంగా తెలుసు. అయినా కొన్ని పదవులు , కొన్ని పనులు వ్యవహారంలో వైసీపీకి సపోర్టుగా ఉండే బీజేపీ నేతలకు సైతం పెద్ద పీట వేయాల్సి రావడం టీడీపీ కి గత్యంతరంలేని పరిస్థితిగా కనిపిస్తోంది . అమరావతి , పోలవరం వంటి వాటిని నెరవేర్చాలంటే బీజేపీ పెద్దల అండదండలు కావాల్సిందే . అందుకోసం కొన్నింటిలో కాంప్రమైజ్ కాక తప్పడంలేదు .