by Rama Chandra P | Mar 18, 2026 | జనరల్
”భారీ మెజార్టీ . .. అంటే ఓడిపోయిన అభ్యర్థి కంటే భారీగా ఓట్లు రావడం . . ఇక్కడ జరిగిన ఎన్నికలలో భారీ కాదు . . అతి భారీ కూడా అనలేం . .. ఏమనాలి ? ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ తిరుగులేని మెజారిటీతో గెలిచారు. ఆయన సారథ్యంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని మిత్రపక్షాలు మార్చి 15న జరిగిన ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఏకంగా 99.93 శాతం ఓట్లను సాధించాయి. దేశంలోని కేవలం 0.07 శాతం మంది ప్రజలే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఓటర్లకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తున్నామనే ప్రచారం చేసుకునేందుకే ఈ అవకాశాన్ని ఓటర్లకు కిమ్ జోంగ్ ఉన్ ఇస్తున్నారని అంటున్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అత్యధికంగా 99.99 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పార్టీలకు చెందిన 687 మంది ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తర కొరియా 15వ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల సమాచారంతో ఈమేరకు ఆ దేశ మీడియాలో కథనాలు పబ్లిష్ అయ్యాయి . . ఈనేపథ్యంలో తదుపరిగా నూతన సభ్యులతో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశమై, కిమ్‌ను మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకునే అంశంపై ప్రకటన చేయనుంది. రాజ్యాంగంలో చేయాల్సిన కీలక సవరణలపై ఈ సభ చర్చించనుంది.
మళ్లీ దేశ అధ్యక్షుడిగా కిమ్
కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ లాంఛనంగా ఒక ప్రకటన విడుదల చేయాల్సిన ఇది . ఫిబ్రవరి నెలలో జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 9వ సమావేశంలో చేసిన తీర్మానాల ప్రకారం, రాజ్యాంగ సవరణలకు కసరత్తును మొదలుపెట్టనుంది. అధికారికంగా దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని కిమ్ జోంగ్ ఉన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రాజ్యాంగంలో సవరణలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా వ్యవస్థాపక పత్రంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు శత్రుదేశాలనే అంశం ఉందనే విషయాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 9వ సమావేశంలోనూ దీనిపై ప్రత్యేక తీర్మానాలు చేశారు. పార్టీ ఛార్టర్‌లో మార్పులు,చేర్పులు చేశారు.
దక్షిణ కొరియాపై కిమ్ ప్రకటన
దక్షిణ కొరియా తమకు శత్రుదేశమని 2024లోనే అధికారికంగా కిమ్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనకు రాజ్యాంగబద్ధత, చట్టపరమైన ఆమోదాన్ని కల్పించే దిశగా ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్ జోంగ్ ఉన్ చేసే అధికారిక ప్రకటన కోసం దక్షిణ కొరియా సహా ఇతర ఇరుగుపొరుగు దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఉత్తర కొరియా అంతర్జాతీయ సంబంధాలు, శత్రుదేశాలు, మిత్రదేశాలపై ఆయన చేయనున్న ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
రబ్బరు స్టాంపు ఉత్తర కొరియా అసెంబ్లీ
కిమ్ జోంగ్ ఉన్ కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీని రబ్బరు స్టాంపు లాంటిదని చెబుతుంటారు. వాస్తవానికి దేశంతో ముడిపడిన అన్ని చట్టాలను రూపొందించే, ఆమోదించే అధికారాలు ఈ సభకు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాలన్నీ కిమ్ ఆధ్వర్యంలో నడిచే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సిద్ధాంతాల ప్రకారమే జరుగుతుంటాయి.
ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది కొత్తవాళ్లే
ఉత్తర కొరియా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, దాదాపు 70 శాతం మంది పాత ప్రజాప్రతినిధుల స్థానంలో కొత్తవారు ఎన్నికయ్యారు. కిమ్ జోంగ్ ఉన్ అధికార పీఠానికి మరింత బలాన్ని చేకూర్చేందుకే, బలమైన ప్రజాప్రతినిధులు తయారుకాకుండా అడ్డుకునేందుకే ఇంతగా మార్పులు చేశారని పరిశీలకులు అంటున్నారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికైన 687 మందిలో జో యోంగ్ వన్, కిమ్‌కు అత్యంత సన్నిహితుడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిని ఈయనకే కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన చోయీ ర్యోంగ్ హయీకి ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని ఇవ్వలేదని సమాచారం. కొత్త ఎంపీల జాబితాలో కిమ్ సోదరి కిమ్ యో జాంగ్, విదేశాంగ మంత్రి చోయీ సన్ హుయీ కూడా ఉన్నారు. .
by Rama Chandra P | Mar 17, 2026 | జనరల్
హోర్ముజ్ జలసంధి వద్దకు యుద్ధనౌకలను పంపేందుకు బ్రిటన్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, డెన్మార్క్ , ఫ్రాన్స్ నో
- ఆ బాటలోనే ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు
- ముందు యుద్ధం ఆపండి: చైనా హితవు
- నేను కోరిన సాయం చేయకపోతే నాటో దేశాల భవిష్యత్తు చెడ్డగా ఉంటుంది: ట్రంప్
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
- దుబాయి ఎయిర్‌పోర్టు వద్ద ట్యాంకర్ ధ్వంసం
‘‘హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం వల్ల ఇబ్బందిపడే దేశాలన్నీ.. నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచే ఉంచేందుకు తమ నౌకాదళాలను పంపాలి. ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసికట్టుగా ఈ పని చేద్దాం’’ అంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపునకు అమెరికా మిత్రదేశాలే నిష్కర్షగా ‘నో’ చెప్పేశాయి. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే.. తదితర దేశాలు హోర్ముజ్ జలసంధి వద్దకు తమ తమ యుద్ధనౌకలను పంపుతాయని ఆయన ఆశించగా.. వాటిలో ఒక్క దక్షిణ కొరియా మాత్రమే ఆయన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. మిగతా దేశాలేవీ సానుకూలంగా స్పందించలేదు. తమకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని జపాన్ ప్రధాని టకైచీ ఆ దేశ పార్లమెంటు సాక్షిగా తెలుపగా.. ఆస్ట్రేలియా కూడా అదే మాట చెప్పింది. యుద్ధనౌకలను హోర్ముజ్ జలసంధికి పంపడం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయంటూ యూకే ప్రధాని స్టార్మర్ ట్రంప్ అభ్యర్థనను తోసిపుచ్చారు. విస్తృత యుద్ధంలో అడుగుపెట్టాలని బ్రిటన్ అనుకోవట్లేదన్న ఆయన.. తమ దేశం ఈ వివాదంలో వాషింగ్టన్‌ను అనుసరించదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి మిత్రదేశాలతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నానని.. కానీ, అది నాటో మిషన్ కాదని స్టార్మర్ స్పష్టం చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి జాన్ వేడ్‌ఫుల్ కూడా ట్రంప్ పిలుపునకు ప్రతికూలంగా స్పందించారు. సముద్ర మార్గాలను కాపాడుకునే విషయంలో జర్మనీ ఎప్పుడూ నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని.. కానీ, హోర్ముజ్ వద్దకు తమ దేశ నౌకలు ఇప్పటికిప్పుడు వెళాల్సిన అవసరం తనకు కనపడట్లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత శక్తిమంతమైన అమెరికా యుద్ధనౌకలు చేయలేని పనిని యూరప్ దేశాలకు చెందిన యుద్ధనౌకలు చేస్తాయని ట్రంప్ ఎలా అనుకుంటున్నారని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ప్రశ్నించారు. ఇది అసలు తమ యుద్ధం కాదని.. ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని వ్యాఖ్యానించారు. ఇక, ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్.. హోర్ముజ్‌కు తామేమీ యుద్ధనౌకలను పంపబోమని కిందటివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటో సభ్యదేశాలైన స్పెయిన్, బెల్జియం, ఇటలీ, డెన్మార్క్ కూడా ఈ యుద్ధంలో పాల్గొనబోమని సంకేతాలిచ్చాయి. దీనిపై నాటో ప్రతినిధులు స్పందించారు. కూటమిలోని సభ్యదేశంపై బయటి దేశాలేవైనా దాడి చేస్తే.. అప్పుడు నాటో దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడుతాయని, అదే నాటో దేశమే వేరే దేశంపై యుద్ధానికి దిగితే.. మిగతా సభ్యదేశాలు కూడా ఆ దేశంతో కలిసి దాడులకు దిగాలనే నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు.
ఏప్పుడో చెప్పా..
యూకే, జపాన్, ఆస్ట్రేలియా తమ నిర్ణయాలను ప్రకటించకముందే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరవడానికి మిత్రదేశాలు సహాయం చేయడంలో విఫలమైతే.. నాటో కూటమి భవిష్యత్తు చాలా చెడ్డగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు! ‘‘నాటో అని మనకి ఒక కూటమి ఉంది. దాని విషయంలో మేం చాలా మంచిగా ప్రవర్తించాం. ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిన అవసరం లేకపోయినా.. మేం వారికి సాయం చేశాం. ఇప్పుడు వారు (నాటో దేశాలు) మాకు సాయం చేస్తారో లేదో చూస్తాం. మేం వారి కోసం నిలబడతాంగానీ, వారు మాకోసం నిలబడరని నేనెప్పుడో చెప్పాను. ఈసారి కూడా వారు మా కోసం వస్తారని నేను అనుకోవట్లేదు. నాటో దేశాలు అసలు స్పందించకపోయినా.. ప్రతికూలంగా స్పందించినా అది కూటమి భవిష్యత్తుకు చెడు చేస్తుంది’’ అని పేర్కొన్నారు. అలాగే.. హోర్ముజ్ జలసంధిపై తాను ఏడు దేశాల సాయం కోసం కోరగా.. అందులో కొన్ని అంగీకరించినట్టు ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అయితే, అంగీకారం తెలిపిన దేశాలేవో ఆయన వెల్లడించలేదు. కాగా, హోర్ముజ్‌లో నౌకల సురక్షిత రాకపోకల విషయంలో మిత్రదేశాలన్నీ అమెరికాకు హ్యాండివ్వగా.. చైనా అత్యంత జాగ్రత్తగా స్పందించింది. ఉద్రిక్తతలు మరింతగా పెరగకుండా ఉండాలంటే ఇరుపక్షాలూ సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని సూచించింది.
జలసంధిని తెరవలేకపోతే..
హోర్ముజ్‌ను ఇరాన్ మరికొంతకాలం ఇలాగే మూసి ఉంచితే.. ట్రంప్ ఖార్గ్ ద్వీపం స్వాధీనం దిశగా అడుగులు వేయొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచా రం. అయితే, ఖార్గ్ స్వాధీనానికి కేవలం వైమానిక దాడులు చాలవని.. అమెరికా సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఆ పని చేస్తే.. చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేసే ప్రమాదం ఉందని, అప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుందని వారు పేర్కొంటున్నారు.
by Rama Chandra P | Mar 14, 2026 | జనరల్, పరిశీలన
”ఖర్గ్ ద్వీపం” ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆరో ప్రాణం అంటారు . ..ఎందుకు ?
ఇరాన్ ముడి చమురు బిజినెస్ లో అత్యంత కీలకమైనది . .. ఖర్గ్ ద్వీపం. ఆ దేశ ఆయిల్ ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటాయి. అటువంటి కీలకమైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతానికి ఖర్గ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, తమ నెక్ట్స్ టార్గెట్‌లో అక్కడి చమురు మౌలిక సదుపాయాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఖర్గ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ ఐలాండ్ ఇరాన్‌లో ఎక్కడుంది ? ఇది ఇరాన్‌కు అంతగా ముఖ్యమైందా ? దీన్ని అమెరికా ఎందుకు లక్ష్యంగా చేసుకుంది ? అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది ? ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే చర్చ . ..?
ఖర్గ్ ద్వీపం ఎక్కడుంది ?
ఖర్గ్ ద్వీపం ఇరాన్ నైరుతి సముద్ర తీరానికి 26 కి.మీ దూరంలో ఉంది. కీలకమైన హర్మూజ్ జలసంధికి వాయవ్య దిశలో దాదాపు 483 కి.మీ దూరంలో ఈ ఐలాండ్ ఉంది. ఇరాన్ ఓడరేవు నగరం బుషెహర్‌కు వాయవ్య దిశలో 55 కి.మీ దూరంలో ఖర్గ్ ఉంది. ఈ ద్వీపం చుట్టూ సహజసిద్ధంగానే చాలా లోతు వరకు సముద్రజలాలు ఉన్నాయి. దీంతో భారీ సైజు ముడి చమురు ట్యాంకర్లను పార్కింగ్ చేసేందుకు ఈ ద్వీపంలోని తీర ప్రాంతం అనువైంది. ఆయిల్ ట్యాంకర్లు, నౌకల పార్కింగ్ కోసం ఖర్గ్ ద్వీపం చుట్టూ పెద్దసంఖ్యలో టెర్మినళ్లను ఇరాన్ నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో ఇరాన్ సైనిక స్థావరాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పహారాలో ఖర్గ్ ఉంది. ఎందుకంటే ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటుంది. ఈవిధంగా దేశ ముడి చమురు వాణిజ్యంపైనా ఐఆర్‌జీసీకి బలమైన పట్టు ఏర్పడింది.
ఖర్గ్ ఇరాన్‌కు అత్యంత ముఖ్యమైంది? ఎందుకంటే . .
అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సేకరించిన 1984 నాటి డీక్లాసిఫైడ్ నోట్ ప్రకారం, ఖర్గ్ ద్వీపం ఇరాన్ పెట్రోలియం వ్యవస్థలో అత్యంత కీలకమైంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. 1980వ దశకంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం టైంలో, 2003లో జరిగిన అమెరికా – ఇరాక్ యుద్ధం వేళ ఖర్గ్ ద్వీపం ప్రధాన టార్గెట్‌గా మారింది. ఆనాడు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఇరాక్ వందలాది సార్లు ఖర్గ్ ద్వీపంపై బాంబు దాడులు చేసింది. ఈ ద్వీపంలోని టెర్మినళ్లకు భారీ చమురు నిల్వ సామర్థ్యం ఉంది. ఇరాన్‌లోని అబూజర్, ఫోరౌజాన్, డోరూడ్ చమురు, సహజ వాయువు క్షేత్రాల నుంచి ఖర్గ్ వరకు పైప్‌లైన్‌లు విస్తరించి ఉన్నాయి. ఈ పైప్‌లైన్ల వ్యవస్థ సముద్ర జలాల అడుగున ఉంది. దీని ద్వారా ఖర్గ్‌కు చేరుకునే చమురు, సహజ వాయువును భారీ నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల ద్వారా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తూ ఉంటారు .
ఖర్గ్ దెబ్బతింటే ఇరాన్‌కు ఇక్కట్ల
ఖర్గ్ ద్వీపం ఇరాన్ ప్రభుత్వానికి, సైన్యానికి నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ ఖర్గ్‌లో ముడి చమురు వాణిజ్యం ఆగిపోతే ఇరాన్ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతింటుంది. ఫలితంగా సైనికశక్తి కూడా బలహీనపడుతుంది. అమెరికా కోరుకుంటున్నది ఇదే. ఒకవేళ ఖర్గ్‌పై అమెరికా దాడులు తీవ్రతరమైతే, ఇరాన్ కూడా బలంగా ప్రతిఘటించే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
హర్మూజ్‌తో ఇరాన్- ఖర్గ్‌తో అమెరికా ఒత్తిడి
ఖర్గ్ ద్వీపంలో చమురు వాణిజ్యం స్తంభిస్తే ఇరాన్ ఆర్థికంగా బలహీనపడటం ఖాయం. ఎందుకంటే ఇరాన్ చమురు వాణిజ్యంలో 90 శాతం ఆ ఒక్క ద్వీపం నుంచే జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఖర్గ్‌పై అమెరికా ఫోకస్ పెట్టింది. తద్వారా హర్మూజ్ విషయంలో ఇరాన్ వైఖరిని మార్చాలని భావిస్తోంది. హర్మూజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడిని పెంచేందుకు ఇరాన్ యత్నిస్తోంది. దీనికి ప్రతిగా ఖర్గ్‌పై దాడులతో, ఇరాన్‌పై ఒత్తిడిని పెంచేందుకు అమెరికా యత్నిస్తోందని జేపీ మోర్గాన్ కంపెనీకి చెందిన గ్లోబల్ కమోడిటీ రీసెర్చ్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ చమురు శాఖకు చెందిన మూడు ప్రధాన ఇంధన సౌకర్యాలు ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు ఫలాత్ ఇరాన్ ఆయిల్ కంపెనీ. ఇది రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్‌లో చమురును ఉత్పత్తి చేసే నాలుగు శుద్ధి కర్మాగారాలలో ఇదే అతిపెద్దది. ఈ ద్వీపంలోనే ఖర్గ్ పెట్రోకెమికల్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ యూనిట్లలోనే చమురు, ద్రవీకృత సహజ వాయువును నిల్వ చేస్తారు, ఎగుమతి చేస్తారు. ఇరాన్ ప్రభుత్వం ఖర్గ్‌లోని చమురు టెర్మినల్ నిల్వ సామర్థ్యాన్ని 2 మిలియన్ బ్యారెళ్లకు విస్తరించిందని 2025లో నివేదికలు వచ్చాయి. ఇక్కడున్న ప్రతీ చమురు ట్యాంక్‌కు ఒక మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేసే కెపాసిటీ ఉంది.
ఇరాన్ ప్రతిదాడి ఎలా?
హర్మూజ్ మీదుగా ఇతర దేశాల ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. కానీ ఖర్గ్ ద్వీపం నుంచి చమురు సప్లైలను ఇరాన్ ఇంకా కొనసాగిస్తోందని తెలుస్తోంది. తాజాగా TankerTrackers.com చేసిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం, మార్చి 11న (బుధవారం) ఖర్గ్ ద్వీపంలో అనేక పెద్ద ముడి చమురు ట్యాంకర్లు లోడ్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి బుధవారం వరకు ఇరాన్ రోజుకు సగటున 1.1 మిలియన్ బ్యారెళ్ల నుంచి 1.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఖర్గ్‌పై అమెరికా దాడిని ఇరాన్ తీవ్రమైన అంశంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఖర్గ్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ ఘాటుగా బదులిచ్చే ఛాన్స్ ఉందని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
by Rama Chandra P | Mar 13, 2026 | జాతీయం
గృహావసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఇవేవీ ప్రస్తుతానికి దేశంలో ఏమాత్రం కొరత లేదు. జనం ఆందోళన చెందక్కర్లేదు
యుద్ధం ఇలాగే కొనసాగినా కూడా కనీసం మరో రెండు మాసాలు మనకి ఇంధనకొరత భయం లేదని కేంద్ర ప్రభుత్వపు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే కొరత వస్తుందనే భయంతో ప్రతి వాళ్ళూ ముందుజాగ్రత్తగా, స్వార్థంతో స్టోరేజ్ చేసుకునే ప్రయత్నాలు చేయడమే అసలైన సమస్య. బ్యాంకు నష్టాల్లో ఉందనే ప్రచారం జరిగిందంటే.. ఒక్కసారిగా డిపాజిటర్లు తమ సొమ్ము తీసేసుకోవడానికి లైన్లలో నిలబడతారు. అప్పటివరకూ బ్యాంకు బాగానే ఉన్నా.. ఈ లైన్ల దెబ్బకి నిజంగానే కుదేలైపోతుంది. అలాగే ఒకేసారి వందలు, వేలమంది వినియోగదారులు గ్యాస్ రీఫిల్ బుకింగ్ లు చేయడం, వందలాది వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం బ్యాంకులకు పోటెత్తడం వలన స్వతహాగానే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ క్యూ లు సైకలాజికల్ గా సమాజ స్టెబిలిటీని దెబ్బతీస్తాయి. ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దేశ రక్షణ, ఇంధన భద్రతకి చేపట్టాల్సిన అంతర్జాతీయ చర్యలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన భారం పాలకులపై ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి అనవసర ఒత్తిడి వారిపై పెంచకుండా, బాధ్యతగా వ్యవహరించడం పౌరుల విధి.
ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రం కొంత రిస్ట్రిక్షన్ వచ్చిందనేది నిజం. వచ్చిన కొరత కంటే ఆయా సంస్థలు, అసోసియేషన్లు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి బాగా ఎక్కువగా ఉంది. తినడానికి హోటల్ తప్ప మరోదారి లేనివాళ్లు కొంత ఇబ్బంది పడతారు తప్ప, అందరికీ ఇదేమీ సమస్యకాదు. చిన్న కాకా హోటళ్లు, ఇళ్లవద్ద ఆహారం తయారు చేసి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్రియాశీలకం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.
హర్ముజ్ జలసంధినుంచి ఇరాన్ మన దేశపు నౌకలను అనుమతించడం, రష్యా కోరినంత చమురుని భారత్ కి విక్రయించడం.. అలాగే క్లిష్ట సమయంలో ఒత్తిడి తగ్గించే ధోరణితో అమెరికా వ్యవహరించడం.. ఇవన్నీ భారత దౌత్య విజయాలే.. లేదా మనదేశంపై చిరకాలంగా ప్రపంచానికి ఉన్న గుడ్ విల్ కి ప్రతిగా లభించిన అవకాశాలే!
ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఎంతో కొంత ప్రభావితం అయ్యే దేశాల్లో భారత్ ముందుంటుంది. అలాగని మనమీద బాంబులు ఎప్పుడూ పడవు. స్వరాజ్యం తర్వాత (చైనా, పాకిస్థాన్ లతో మనం ప్రత్యక్షంగా చేసిన యుద్ధాల్లో మినహా) ఎప్పుడూ మనదేశంపై బాంబు పడలేదు. కానీ ప్రపంచపు ప్రతి సంక్షోభమూ పరోక్ష ప్రభావాన్ని చూపడంచేత భారత్ పై ధరల బాంబులు పడుతూ ఉంటాయి.
గతంలో గల్ఫ్ యుద్ధం సమయంలో మనం గల్ఫ్ సర్చార్జిలు కట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాలిబన్ యుద్ధం సమయంలో, ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకున్న సమయంలో కూడా భారత్ లో ధరలు పెరిగాయి. దిగుమతులపై ఎక్కువ ఆధారపడడం, ఎగుమతి దిగుమతులు జరిగే రవాణా మార్గాల్లోని దేశాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం వంటివే భారత్ ధరలపరంగా ప్రభావితం కావడానికి అసలు కారణాలు. కొరత వలన సమస్య రాదు.. కొరత వచ్చే అవకాశాలపై ప్రచారంతో భయపెట్టి… కృత్రిమ కొరత సృష్టించే అవినీతి పరులతోనే సమస్య వస్తుంది.
ప్రపంచం యుద్ధమేఘాలకింద అవస్థలు పడుతున్న ఈ కష్టసమయంలో ప్రకృతి, పరిస్థితులు, ఘనమైన మన వారసత్వం, ప్రస్తుత నాయకత్వం కలసి రాబట్టే మనం ఈమాత్రమైనా ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధం త్వరగా ముగిసిపోతే భారతదేశంలో వారం రోజుల్లోనే అంతా యథాతథ పరిస్థితికి వచ్చేస్తుంది. పరిస్థితి మరీ దిగజారిపోయి.. యుద్ధం మరింతకాలం, మరిన్ని దేశాలకు విస్తరించినా కూడా భారత్ కి ప్రత్యక్ష భయం అయితే లేదు. స్వరాజ్య భారతం సుమారుగా గత 77 సంవత్సరాల్లో అనుసరించిన విదేశాంగ విధానం, ఎన్నడూ దురాక్రమణకు, ముందస్తు యుద్ధానికి పాల్పడని మన వారసత్వపు మంచితనం ఇందుకు ప్రబల కారణాలు. నాటి నెహ్రూగారి అలీన విధానం మొదలు నేటి మోదీ గారి స్వతంత్ర విదేశాంగ విధానం వరకూ కూడా భారత్ సంప్రదాయబద్ధమైన లక్ష్మణరేఖను పాటిస్తూనే వస్తోంది…. అదే మన దేశానికి శ్రీరామరక్ష.
by Rama Chandra P | Mar 13, 2026 | జనరల్
పాటలతో జనంలో చైతన్యం నింపిన యువకుడు ప్రధాని . ..
—————————————-
నేపాల్.. హిమాలయాల ఒడిలో ఒదిగిపోయిన అందమైన దేశం. కానీ అక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ రణరంగమే. ఒకప్పుడు రాజుల ఏలుబడి, ఆ తర్వాత కుర్చీలాటలో మునిగిపోయిన నేతలు. సరిగ్గా ఇలాంటి టైంలోనే సీన్ లోకి వచ్చాడు బాలెన్ షా.
”చేతిలో మైక్ పట్టుకుని పాటలు పాడే ఒక రాపర్, ఇవాళ దేశ గమనాన్నే మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక గెలుపు కాదు, హిమాలయాల్లో పుట్టిన నిప్పుకణిక…” అంటూ యావత్ నేపాల్ కీర్తిస్తోంది .
మార్చి 2026. ఫలితాలు వస్తుంటే పాత తరం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 18 ఏళ్లలో 15 ప్రభుత్వాలను మార్చిన నేపాల్ ప్రజలు..
ఈసారి విసిగిపోయి ఒక కొత్త దారి వెతుక్కున్నారు. యువత ఐక్యమై బాలెన్ షా వెనుక నడిచింది. కాట్మండు మేయర్‌గా అక్రమ కట్టడాలను కూల్చినప్పుడే అర్థమైంది, ఇతను మామూలోడు కాదని!
ఆ రాత్రి.. కాట్మండు వీధుల్లో..
చలి గాలులు వీస్తున్నాయి. ఫలితాలు దాదాపు ఖాయమైపోయాయి. పాత పార్టీ ఆఫీసుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంటే, బాలెన్ అనుచరులు మాత్రం వీధుల్లో సందడి చేస్తున్నారు.
ఒక ముసలాయన అంటున్నాడు:
“ఒరేయ్.. రాజులు పోయారు, రౌడీలు వచ్చారు. ఇన్నాళ్లకు కష్టాలు తెలిసిన కుర్రాడు వస్తున్నాడురా!”
బాలెన్ షా మేడ మీద నుంచి జనాలను చూస్తూ నవ్వాడు. పక్కనే ఉన్న మిత్రుడు అడిగాడు, “ఏంటి బాలెన్.. గెలిచేశాం కదా? నెక్స్ట్ ఏంటి?”
“ఇది గెలుపు కాదు దోస్త్.. ఒక పెద్ద బాధ్యత. పాటల్లో విమర్శించడం ఈజీ, కానీ పాలనలో చేసి చూపించడం కష్టం. నేపాల్ ఇన్నాళ్లు చీకట్లో ఉంది, ఇక వెలుగు చూడాలి.”
ట్విస్ట్ ఏంటంటే..
నేపాల్ రాజకీయాల్లో ఎప్పుడూ భారత్, చైనాల ప్రమేయం ఉంటుంది. కానీ బాలెన్ షా మాత్రం ‘నేపాల్ ఫస్ట్’ అంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలా ఇతను కూడా ఒక ఎంటర్ టైనర్ నుంచి లీడర్ గా మారాడు. అయితే అధికారం అంటే పదునైన కత్తి. బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా తప్పులు చేస్తే ప్రజలు క్షమించరు.
హిమాలయాల్లో మంచు కరుగుతోంది.. పాత రాజకీయాల మకిలి కూడా వదులుతోంది. కానీ ఈ కొత్త కెరటం ఎంత కాలం నిలబడుతుంది? అప్పుడే కథ అయిపోలేదు.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! వెనుకబాటుతనంతో అల్లాడుతున్న నేపాలీలకు దారిదీపం దొరికింది .