ఆహార ఉత్పత్తుల విషయంలో అమెరికా చిక్కుల్లో పడే ప్రమాదం
అమెరికా విచ్చలవిడిగా ప్రపంచ దేశాలని విధిస్తున్న సుంకాల వ్యవహారంలో భారత్ మాత్రం ఎక్కడ కాంప్రెమైజ్ కావడంలేదు . భారత్‌తో వాణిజ్య సంబంధాలలో ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1, 2025 నుంచి ఈ సుంకాలు అమలులోకి వస్తాయని, రష్యాతో భారత్ కొనసాగిస్తున్న రక్షణ, ఇంధన సంబంధాల కారణంగా అదనపు జరిమానాలు కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తించడమే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, భారత్‌ను “టారిఫ్ కింగ్” అని అభివర్ణించారు.
అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలను విధించడం, వాణిజ్యంలో ఉన్న అడ్డంకులను ఆయన ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. 2024లో అమెరికాకు భారత్‌తో ఉన్న వాణిజ్య లోటు 45.7 బిలియన్ డాలర్లకు పెరగడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో ముఖ్య కారణం.
అయితే, ఈ చర్య కేవలం వాణిజ్యపరమైనది కాదు. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున సైనిక పరికరాలు, ఇంధనాన్ని కొనుగోలు చేయడాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించడం, ఈ సుంకాలను ఒక భౌగోళిక-రాజకీయ సాధనంగా కూడా అమెరికా ఉపయోగిస్తోందని స్పష్టం చేస్తోంది.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే భారత ఆర్థిక మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 52 పైసలు పతనమై, నాలుగు నెలల కనిష్ట స్థాయి అయిన 87.43 వద్ద ముగిసింది. ఈ సుంకాలు ఆర్థిక సంవత్సరం మొత్తం కొనసాగితే, భారత జీడీపీ వృద్ధి 0.2% నుంచి 0.5% వరకు తగ్గే అవకాశం ఉందని, ఎగుమతి ఆదాయం 7 బిలియన్ డాలర్ల వరకు నష్టపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా విధిస్తున్న ఈ సుంకాల ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా ఉండదు. అమెరికా వ్యూహాత్మకంగా కొన్ని రంగాలను లక్ష్యంగా చేసుకుని, మరికొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ (స్మార్ట్‌ఫోన్లు), రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, ఉక్కు వంటి ఉపాధి కల్పించే కీలక రంగాలపై 25% సుంకం విధించారు. ఇది ఈ రంగాలలోని ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లను సరఫరా చేసే అతిపెద్ద దేశంగా భారత్ ఇటీవల అవతరించిన నేపథ్యంలో ఈ సుంకాలు పెద్ద దెబ్బ.
అమెరికా తన సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్ల వంటి కీలక రంగాలకు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ భారత జనరిక్ మందులపై ఎంతగానో ఆధారపడి ఉంది. భారత ఔషధాల వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్లు ఆదా అవుతున్నందున, ఈ రంగంపై సుంకాలు విధించడం ఆత్మహత్యాసదృశ్యం అవుతుందని అమెరికా భావించింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రదర్శిస్తోంది. అమెరికా ఒత్తిడికి లొంగకుండా, వ్యవసాయం, పాడి వంటి కీలక రంగాలలో రాయితీలు ఇచ్చే ప్రసక్తే లేదని గతంలోనే స్పష్టం చేసింది. అయితే, చర్చల మార్గాన్ని మూసివేయలేదు. ఆగస్టు చివరిలో అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం చర్చల కోసం న్యూఢిల్లీకి రానుంది. మరోవైపు, అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనల ప్రకారం ప్రతీకార సుంకాలను విధించే హక్కును భారత్ రిజర్వ్ చేసుకుంది.
ఈ వాణిజ్య వివాదం, చైనాను ఎదుర్కోవడానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరీక్షిస్తోంది. గతంలో రష్యా నుంచి S-400 క్షిపణులను కొనుగోలు చేసినప్పుడు CAATSA ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చిన అమెరికా, ఇప్పుడు అదే కారణంతో సుంకాలు విధించడం గమనార్హం. రాబోయే చర్చలు ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన బంధం, వాణిజ్య ఘర్షణలను ఎలా సమన్వయం చేస్తుందో తేలుస్తాయి
“ఒక వ్యక్తికి 75 ఏళ్లు నిండినప్పుడు శాలువాతో సత్కరిస్తే, దాని అర్థం ‘మీరు వృద్ధులయ్యారు, ఇప్పుడు పక్కకు తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వండి’ అని (ఆర్ ఎస్ ఎస్ పాతతరం నాయకుడు) మోరోపంత్ పింగ్లే అనేవారు.” ఈ మాటలు నాగ్ పూర్ లో ఒక పుస్తకావిష్కరణ సభలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా ప్రస్తావించారు.
దీంతో … పార్టీలో, ప్రతిపక్షాల్లో రాజకీయ వర్గాల్లో ప్రధాని 2025 సెప్టెంబర్‌లో 75 ఏళ్లు నిండనున్న నరేంద్ర మోదీకి ఈ నియమాన్ని వర్తింప చేస్తారా? లేదా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
బీజేపీలో “75 ఏళ్ల వయసు నిబంధన” గత కొన్నేళ్లుగా చర్చకు వస్తున్న అంశమే! 75 ఏళ్ళకు రిటైర్ అవ్వాలన్న నియమం ఇది బీజేపీ పార్టీ నియమావళి (పార్టీ కాస్టిట్యూషన్) లో అధికారికంగా పొందుపరిచినది కాదు.
2014లో నరేంద్ర మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, పార్టీలో సీనియర్ నాయకులకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ ఇచ్చేందుకు ఒక అనధికారిక మార్గదర్శకంగా దీనిని అమలులోకి తెచ్చారు. 75 ఏళ్లు దాటిన నాయకులను ఎన్నికల రాజకీయాల నుండి, ప్రభుత్వ పదవుల నుండి తప్పించి, వారికి “మార్గదర్శక్ మండల్” వంటి సలహా కమిటీలలో స్థానం కల్పించారు. ఈ నిబంధన ప్రకారమే బీజేపీ కురువృద్ధులైన ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా వంటి అనేక మంది సీనియర్ నాయకులను క్రియాశీల రాజకీయాల నుండి పక్కన పెట్టారు. ఇది పార్టీలో కొత్త తరానికి అవకాశం కల్పించేందుకూ, నాయకత్వ మార్పును మరింత పటిష్టం చేసేందుకూ ఉద్దేశించిన వ్యూహంగా చెపుతూ ఉంటారు .
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో, ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నాయకులు ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. “మోదీ గెలిస్తే, 2025లో 75 ఏళ్లు నిండిన తర్వాత ఆయన రిటైర్ అయి, అమిత్ షాను ప్రధానిని చేస్తారు” అని వారు ప్రచారం చేశారు. ఇది బీజేపీ ఓటర్లలో గందరగోళం సృష్టించే ప్రయత్నమని బీజేపీ నాయకులు కొట్టిపారేశారు.
ఈ ప్రచారంపై హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా వంటి అగ్ర నాయకులు స్పష్టత ఇచ్చారు. వారి వివరణ ప్రకారం బీజేపీ లో అలాంటి నిబంధన ఏదీ లేదు. ఇది కేవలం ఒక అవగాహన మాత్రమే. ఇది ప్రధాని మోదీకి వర్తించదని, ఆయన తన పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని (2029 వరకు) కొనసాగిస్తారని, ఆ తర్వాత కూడా దేశానికి నాయకత్వం వహిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇది కేవలం ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అపోహ మాత్రమేనని, బీజేపీలో నాయకత్వంపై ఎలాంటి సందిగ్ధత లేదని వారు పేర్కొన్నారు.
ఇపుడు భగవత్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో, ఆర్ఎస్ఎస్ వర్గాలు స్పందించి, ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, కేవలం పింగ్లే గారి వ్యక్తిత్వాన్ని వివరిస్తున్నప్పుడు చేసిన సాధారణ వ్యాఖ్యలని వివరణ ఇచ్చాయి.
మోదీయే ఇపుడు బిజెపి ముఖచిత్రం ఆయన చరిష్మా, ప్రజాదరణే పార్టీకి అతిపెద్ద బలం. ముఖ్యంగా, బీజేపీకి సొంత మెజారిటీ రాని ఈ సంకీర్ణ ప్రభుత్వంలో, మోదీ నాయకత్వం మరింత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను పక్కనపెట్టే సాహసం పార్టీ చేయకపోవచ్చు. ఈ “నియమం” పార్టీలో అంతర్గత పోటీని తగ్గించి, నాయకత్వాన్ని సుస్థిరం చేయడానికి గతంలో ఉపయోగపడింది. అయితే, ఆ నియమాన్ని దాని రూపకర్తకే వర్తింపజేయడం రాజకీయంగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. మోదీ వంటి అత్యంత బలమైన నేతలకు ఈ సూత్రం వర్తించే పరిస్థితి ప్రస్తుత బీజేపీ లో ఉండకపోవచ్చు. ‘బీజేపీ నీడన ఎదిగిన మోడీ వటవృక్షం అయ్యారు . .. మోడీ చాటున బీజేపీ మరుగుజ్జు అయింది . .” అంటూ వస్తున్నా వ్యాఖ్యానాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సిందే .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక విజన్ తోనే పనిచేస్తారు. తాజా విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి దేశంలో 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదగాలి. ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధి అనే బాబు హయాంలో అభివృద్ధి ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. ప్రజల్లో ఆ ప్రభావం కూడా మిశ్రమంగా వుంది. ఆయన పార్టీ గెలుస్తోంది. ఓడిపోతుంది. గెలుస్తోంది. ఓడిపోతుంది. దీనంతటికీ బాధ్యత ముమ్మాటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిడే .
బాబు అభివృద్ధి మంత్రం ప్రజలను ఎంతగా కనెక్ట్ చేస్తోందో అధ్యయనం లేదు. జగన్ ప్రభావాన్ని దృష్టిలో వుంచుకుని బాబు పేదల సంక్షేమ పధకాల సొమ్ము పెంచి ఇంకా హెచ్చుమందికి విస్తరింపచేశారు. లబ్దిదారుల తృప్తి లేదా అసంతృప్తి ఇప్పటికిప్పుడే లెక్కతేలేది కాదు.
ఇన్వెస్టర్లు నేరుగా బాబు తో టచ్ లో వున్నారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తారేమో అనే భయం తప్ప వారికి మరో సంకోచమే లేదు.
క్షేత్రస్ధాయిలో ఎమ్మెల్యేలదే రాజ్యం. సంక్షేమ పధకాల లబ్ధిదారుల అకౌంట్లలోకే నేరుగా డబ్బు జమ అవుతుంది . వారి ఇతర సమస్యల పరిష్కారం, మధ్యతరగతి వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్యేలకు పెద్ద పని అవుతుంది. ఆచరణలో ఇది కూడా పెద్ద భారంకాదు. సమస్య స్టేటస్ ఆన్ లైన్ లో కనబడుతూనే వుంటుంది. దాన్ని పుష్ చేయడమే ప్రజాప్రతినిధులు చేయగలపని.
ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే వనరుల నిర్వహణ, అజమాయిషీ సిండికేట్లవే! ఈ సిండికేట్ల వెనుక ప్రజాప్రతినిధులు వున్నారు. శక్తివంతులైన ప్రతిపక్షం వాళ్ళు కూడా వున్నారు. లిక్కర్, ఇసుక, మట్టి పాటదారుల సిండికేట్లు నాయకుల మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చూసుకోవాలి. గ్రామాల్లో ఈ విషయం లెక్కలతో సహా ఓపెన్ గా చెప్పేస్తూ వుంటారు. “మాకేంటి” అనే నాయకులు కూడా వున్నారు.
ఇసుక మట్టి పనుల్లో ఎమ్మెల్యేలు ఎంత దూరంగా వుంటే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందని చంద్రబాబు హెచ్చరించడమే పరిస్ధితి శృతిమించి రాగాన పడుతున్నదనడానికి ఒక సూచన! ఎవరి కారణాలు వారికి వున్నా ఆదివారం జరిగిన అధికారపార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలను ముఖ్యనాయకులను పిలిచారు. మొత్తం ఆహ్వానితుల్లో 56 మంది హాజరు కాలేదంటే అది ఒక విధమైన లెక్కలేని తనానికి ఒక సూచనగా అర్ధం చేసుకోవచ్చు.
క్వాంటమ్ మొదలైన టెక్నాలజీ ప్రాజెక్టులు, రకరకాల పరిశ్రమలకు ఇన్వెస్టిమెంట్లు దీర్ఘకాలంలో భవిష్యత్తుకి అవసరాలే! ఇవేమీ కళ్ళముందున్న ప్రజల అవసరాలు తీర్చలేవు. కనెక్టు కాలేవు.
అధికారపార్టీల్లో వున్న ఎమ్మెల్యేల పనితీరే ప్రభుత్వం ప్రతిష్టను పెంచుతుంది. ప్రజల్లో నిలబెడుతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తుంది.
రేపటి అభివృద్ధి జపంలో కూటమి ప్రభుత్వం ఇపుడు కళ్ళముందున్న ప్రజల్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి, క్రిమినల్స్ ను నేరుగా సమర్థిస్తున్న అనేక కేసుల్లో నిందితుడైన జగన్ మీద చర్యల్లో కూడా కూటమి ప్రభుత్వం అడుగు వేయలేకపోతోంది. జగన్ పై చర్య చంద్రబాబు వల్ల కాదని ఆయన పార్టీ వాళ్ళే అంటున్నారంటే పరిపాలనలో ఒక పార్శ్వాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమౌతోంది. జగన్ మీద వ్యతిరేకతతోనే కూటమిని గెలిపించిన వర్గాల మనోభావాలను బాబు పట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
బాబు సన్నిహితుడన్న బావసతో జగన్ ప్రభుత్వం వేధించిన ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు ఒంటరి పోరాటం చేసి తనపై పాత ప్రభుత్వం మోపిన అభియోగాలనుంచి విముక్తుడయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఏడాది గడచినా ఎబి పెన్షన్ సెటిల్ మెంట్ జరగలేదు. జీతంలో సగం బకాయిలు ఇంకా ఆయనకు చెల్లించనే లేదు. మధ్యతరగతి విద్యావంతుల్లో చంద్రబాబు పాలనపై పెరుగుతున్న నిరుత్సాహానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో వున్నాయి.
ప్రపంచంలో పెద్ద క్వాంటమ్ ప్రాజెక్టు మాకే వుంది. ఇంకో పాతికేళ్ళకు మేము ప్రపంచంలో గొప్పరాష్టం వాళ్ళమైపోతాం అనుకోడానికే తప్ప! బాబుగారి అభివృద్ధి మంత్రం వల్ల రోజువారీ బతుకుల్లో మార్పులు వుండవు. మాతోపాటు ప్రభుత్వం వుందన్న భరోసా వుంటే చాలు. అదే ముందుకి నడిపిస్తుంది. సంక్షేమ పధకాల ద్వారా పేద వర్గాలకు జగన్ ఉన్నాడన్న ధీమాను ఆయన ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత చేసినా అది జగన్ పధకాల కొనసాగింపుగానే చూస్తారు. ఇందులో కూటమి లేబుల్ కాని బాబు లేబుల్ కాని లేవు.
బాబు గారూ! ప్రభుత్వం వుందన్న ప్రజెన్స్ ను మధ్యతరగతి వారికి, విద్యావంతులకు, జగన్ పై ఆగ్రహంతో మీకు అధికారాన్ని ఇచ్చిన వారికి చూపించండి. మీ ప్రభుత్వం ఓడిపోవడం మీకు కొత్తకాదు. కానీ, మీ మీద నమ్మకం వుంచిన వారి ఆశలు కొన్నైనా నెరవేర్చండి!!
అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా.. వైసీపీ అధినేత జగన్ పై ఎందుకంత ఫోకస్
మీరు నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నా . .. నిత్యం జనంలో చర్చ జరిగేలా చేస్తున్నారు
”బాబాయ్ వివేకానంద్ రెడ్డిని చంపించి ఆ నెపాన్ని నాపై మోపారు . .. నారా సుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రికలో రాసారు.”
”మద్యం కుంభకోణంలో భారీగా దోచుకున్నారు . ఇసుక తిన్నారు . . మైన్స్ ను దోచుకున్నారు.”
” జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లారు . వీళ్ళు చేసిన ఆర్ధిక అరాచకాలకు ఇంకా ఇబ్బందులు పడుతున్నాం . ..”
ఇలా ప్రతి సందర్భంలోను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ,, వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు , కూటమి నేతలు చేస్తున్న విమర్శలలో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనేది పక్కన పెడితే… జనం కూడా జగన్ అరాచకాలు , అక్రమాలపై ఆందోళన చెంది వైసీపీని ఘోరంగా ఓడించారు.
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల వరకు జగన్ అండ్ కో అరాచకాలు , అక్రమాలు గురించి చెపుతూ ఉంటె జనం కూడా కాస్త ఓపిగ్గా విన్నారు. ఏడాది దాటుతున్నా ఈ పాటను చంద్రబాబు అండ్ కో వదలకపోతే జనంలోనూ చులకనయ్యే ప్రమాదం పొంచి ఉంది .
జనానికి కావలసింది అదికాదు : జగన్ పై రోజు విమర్శలు చేయడం కాదు జనానికి కావలసింది. అభివృద్ధి , సంక్షేమం , శాంతి , భద్రతల పరిరక్షణ వంటివి కోరుకుంటారు. ఇవన్నీ కూటమి పాలనలో చెప్పుకోదగ్గ రీతిలోనే సాగుతున్నాయి . అయితే జనంలో ఎక్సపెటేషన్స్ పెంచడంవల్ల ఇంకా ఏవేవో కావాలని కోరుకునే జనం సంఖ్య పెరుగుతోంది. దీన్ని రీచ్ అవ్వడం ఏ సర్కార్ కైనా సవాలే . జగన్ ప్రభుత్వంతో పోలిస్తే . .. కూటమి పాలన ఎన్నో రేట్లు మెరుగే . అయినా . .. జనానికి సంతృప్తి మాత్రం ఇంకా చాలడంలేదనే అనిపిస్తోంది . అంటే చంద్రబాబు . .. అవి చేస్తాం . . ఇవి చేస్తాం . . అని ఏ మీటింగులోను వదలకుండా చేస్తున్న ప్రచారం కూడా కూటమి పాలిట ఇబ్బందిగా తయారయిందని చెప్పాలి .
కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందా,,, ఏపీ – తెలంగాణ సమస్య పరిష్కరిస్తుందా?
“రెండు రాష్ట్రాలూ సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కట్టుకుని సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలి ‘ ‘ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు ఇచ్చారు. “బనకచర్ల” ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో రాజకీయ నాయకులు రాజేస్తున్న తగాదా రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉద్రిక్తతలు పెరగకముందే చంద్రబాబు నాయుడు, విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఈ సూచన లో వ్యూహాత్మకమైన, ఆచరణసాధ్యమైన దృక్పధాలు కనబడుతున్నాయి.అన్ని రాజకీయపార్టీలు ఈ సూచనను పరిశీలించాలి. కేంద్రప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి
వాస్తవాలు సాంకేతికతల ప్రాతిపదికగా ఉభయ తారకంగా సమస్యకు ముగింపు ఇవ్వాలి.
బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చంద్రబాబు నుంచే వచ్చింది. “అన్ని అనుమతులూ తీసుకున్నాకే” పని ప్రారంభమౌతుందని కూడా చెప్పారు. అయితే రాజకీయపార్టీలు ప్రజల సెంటిమెంటు కేంద్రంగా రెచ్చగొట్టే మాటలు విసరడం మొదలు పెట్టాయి.
దీనికంటే ముందు … ఆంధ్రప్రదేశ్ ఉన్న క్లిష్ట పరిస్తుతులలో బనకచర్ల వంటి భారీ ఎత్తిపోతలను తలపెట్టడమే . . చంద్రబాబు తన తలకి రోకలి చుట్టుకున్నట్లే కనిపిస్తోంది .
బనకచర్ల తగాదా: నీటి కోసం రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత
తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపకంపై కొనసాగుతున్న వివాదాల్లో తాజా చిచ్చు – బనకచర్ల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రాణవాయువుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుపై తెలంగాణ మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. గోదావరి జలాల వినియోగంపై నానా రకాలుగా చర్చకు దారితీసిన ఈ అంశం, ఇప్పుడిప్పుడే రాజకీయ మలుపులు తిరుగుతోంది.
బనకచర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం – గోదావరి వరద నీటిని వృథా కాకుండా పట్టుకుని, శ్రీశైలం కుడికాలువ ద్వారా రాయలసీమలోకి తరలించడం. ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రంలో కలిసిపోయే సుమారు 200 టీఎంసీల వరద నీరు ఆంధ్రప్రదేశ్ ప్రకారం వృథా అవుతోంది. ఆ నీటిని కాలువల ద్వారా ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి బొల్లపల్లిలో నిల్వ చేసి, చివరకు రాయలసీమకు తరలించాలన్నదే ప్రణాళిక.
ఈ పథకంతో 12 లక్షల ఎకరాల సాగు భూములకు నీరు అందుతుందని, 40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెరపైకి వచ్చిన ఈ పథకాన్ని రాయలసీమలో శాశ్వత సాగునీటి ప్రణాళికగా అభివర్ణిస్తున్నారు. నిజమే . .. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అస్తవ్యస్థ పరిస్తుతులలో సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించకుండా తెరపైకి తీసుకురావడం చంద్రబాబు దుందుడుకు స్వభావానికి సంకేతంగా కనిపిస్తోంది .
తెలంగాణ అభ్యంతరం: నీటి హక్కుల ఉల్లంఘన
తెలంగాణ మాత్రం ఈ పథకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరి జలాలపై తమకున్న హక్కులను కాలరాశి, కొత్తగా నీటిని మళ్లించడమంటే పునర్విభజన చట్టం ఉల్లంఘన అని వాదిస్తోంది. ముఖ్యంగా, ప్రాజెక్టు నిర్మాణానికి ముందు అపెక్స్ కౌన్సిల్ అనుమతి, ట్రైబ్యునల్ అంగీకారం అవసరమన్న నిబంధనలను ఉల్లంఘించిందని అభిప్రాయం.
తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2025 జనవరిలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాసి ఈ ప్రాజెక్టు నివేదికను తిరస్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం స్పందించకపోవడం వల్ల తెలంగాణలో అసంతృప్తి, అనిశ్చితి పెరిగింది.
కేంద్రం మౌనం: సమస్యకే దారి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తటస్థ ధోరణిలో వ్యవహరిస్తోంది. ఈ పథకంపై ప్రీ-ఫీజిబిలిటీ నివేదిక కేంద్ర జలశక్తి శాఖకు పంపబడినప్పటికీ, ఆమోదం లేదా తిరస్కరణ గురించి ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఇది రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగకుండా అడ్డుకుంటోంది. అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపర్చని కేంద్రం, జల వివాద పరిష్కార విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది.
పనులు ప్రారంభం కాకముందే వివాదం ముదురుతుండటంతో, నీటి రాజకీయం మళ్లీ తెరపైకి వచ్చింది.
టీడీపీ (ఆంధ్రప్రదేశ్): చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును రైతుల పాలిట దైవిక వరంగా చూపిస్తున్నారు. కేంద్రంతో కలిసికట్టుగా పనిచేస్తున్నామని, ఈ పథకం వల్ల రాష్ట్రానికి భారీ లాభం చేకూరుతుందని వాదిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ (ఆంధ్రప్రదేశ్): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ పథకానికి సిద్ధాంత పరంగా మద్దతు ఇవ్వడమే కాకుండా, టీడీపీ దీనిని ప్రచార తంతుగా వాడుతోందని విమర్శిస్తున్నారు. తమ పాలనలో అమలు చేసిన వెలిగొండ, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులతో పోల్చుతూ బనకచర్లను అతిశయోక్తిగా చూపిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్: అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ పథకాన్ని గోదావరి జల ఒప్పందాల ఉల్లంఘనగా భావిస్తూ, న్యాయపరంగా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రంతో చర్చలు జరిపి, సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు.
బీఆర్ఎస్ (తెలంగాణ): ఈ పథకాన్ని గోదావరి నీటి దోపిడీగా చిత్రీకరిస్తూ, కేంద్రం, టీడీపీ మీద విమర్శలు గుప్పిస్తోంది. నేత విద్యాసాగర్ రావు, ఇది చట్టవిరుద్ధమని, తెలంగాణ రైతులకు నష్టం కలిగిస్తుందని వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం పాటిస్తోందని ఆరోపిస్తూ, రహస్య ఒప్పందాలపై ఆరోపణలు చేస్తున్నారు.
బీజేపీ (కేంద్రం & తెలంగాణ): కేంద్ర బీజేపీ మౌనం కొనసాగిస్తుండగా, తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర రైతులకు మద్దతు పలుకుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ జోక్యం కావాలన్న ముద్దుబొమ్మను ఉపయోగిస్తూనే, గడువు పెడుతున్నారు.
రాజకీయ పార్టీలకు ఇది ఓట్ల కోసం మంచి అవకాశంగా కనిపిస్తున్నా, రాయలసీమ రైతులకు ఇది ఆశ, తెలంగాణ రైతులకు ఆందోళన. నీటి కోసం సాగుతున్న ఈ పోరాటం రాజకీయ ప్రయోజనాలకు, సమర్థ నీటి పాలనకు మధ్య సమరంగా మారుతోంది.
ఇలాంటి స్థితిలో చంద్రబాబు సూచనలో రాజకీయం కాక, రాజనీతి కనపడుతోంది. గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు ఇప్పటికే వినియోగిస్తున్నాయని, పోలవరం ప్రాజెక్టు తప్ప మిగిలినవన్నీ అనుమతి లేని ప్రాజెక్టులని, తాను ఎప్పుడూ తెలంగాణపై వివాదం సృష్టించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తుచేశారు. ఆయన్ని విశ్వసించడానికి ఈ వాస్తవాలు చాలు.
బనకచర్ల ఒక నీటి ప్రాజెక్టు మాత్రమే కాదు – అది రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కల్పించాల్సిన అవసరాన్ని, హక్కుల పరిరక్షణకు లెక్కలు వేసే రాజకీయాలను, కేంద్ర ప్రభుత్వ పాత్రను ప్రతిబింబిస్తుంది. నీటి అంశాలు ఇక రాజకీయం కాకుండా సాంకేతికత, సమన్వయం, ఆధారంగా పరిష్కారమవ్వాలి. లేకపోతే తగాదాలు రాష్ట్రాల మధ్య విద్వేషాల్ని పెంచే ప్రమాదం వుంది.
సాక్షిటివిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జర్నలిస్ట్ ని అని చెప్పుకునే కృష్ణంరాజు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలపై నమోదైన కేసులో జుడీషియల్ రిమాండ్ ఖైదీగా జైలు కి వెళ్లిన కొమ్మినేని శ్రీనివాసరావు కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినంత మాత్రాన జనం నోళ్ళ నుంచి తప్పించుకోలేరు . ..
మీడియామీద సామాన్యుల్లో జనరల్ గా వున్న కోపం, జగన్ అప్రజాస్వామిక, కక్షసాధింపు, నియంతృత్వాల మీదా, ఓడిపోయాక కూడా రాజధాని అమరావతిని వ్యతిరేకించి ద్వేషాన్ని వెళ్లగక్కే పైశాచికత్వాల మీద మధ్యతరగతి విద్యావంతుల్లో వున్న ఆగ్రహం- కృష్ణంరాజు మాటలతో బాంబులా పేలింది. ఇది కృష్ణంరాజుకు , కొమ్మినేని శ్రీనివాస్ కో నష్టం తెచ్చే అంశంకాకపోవచ్చు . కృష్ణంరాజు అంతగా తెలియని వ్యక్తి . ఈ ఎఫెక్ట్ జగన్ పైనా , అయన పార్టీ YSRCP పైనా … తీవ్ర ప్రభావం పడుతోంది .
మురికి వ్యాఖ్యలను నివారించగలిగి వుండి కూడా, కృష్ణంరాజుపై సోషల్ మీడియా ట్రోలింగ్ పెరిగిపోతుందని తెలిసి కూడా, ఆమేరకు హెచ్చరించి ఓ నవ్వు నవ్వేసి మౌనం పాటించిన కెఎస్ఆర్ దొరికిపోయారు. రిమాండ్ కు పంపడం శిక్షకాదు. ఆయన నేరంచేశాడు కాబట్టి శిక్షింపచేయడానికి మొదలైన పోలీసు ప్రక్రియలో ఒక భాగం మాత్రమే!
ఏ పార్టీ అధికారంలో వున్నా పోలీసు చర్య వెనుక రాజకీయ నిర్ణయాలే వుంటాయనేది కాదనలేని విషయం . పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించే పరిణతి మన సమాజానికి ఇంకా వచ్చినట్లు లేదు .
ఎమో షన్స్ ను రెచ్చగొట్టడంలో న్యూస్ టివిల పాత్ర అంతా ఇంతా కాదు. వార్తలకోసం సమాచారం కోసం 30 శాతం మంది వార్తా పత్రికలు చదువుతున్నారు. 65-70 శాతం వరకూ ప్రజలు న్యూస్ టివిలను చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల విస్తృతి పెరుగు తున్న ప్రస్తుత దశలో పేపర్లు చదివేవారు, టివిలు చూసేవారూ కలిసి 40 శాతం మందివరకూ యూ ట్యూబ్ చానళ్ళను, న్యూ యాప్ లనూ చూస్తున్నారు. వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
పాఠకుల కంటే ప్రేక్షకులే ఎక్కువ మంది వున్న ఈ పరిస్ధితుల్లో టివిలు రేటింగ్ కోసం ఎమోషన్లను రెచ్చగొట్టి వార్తల్ని కల్తీ చేయడంలో మునిగిపోయాయి.
ఇతర టివిలు కనీసం కొంత తటస్ధతను నటిస్తున్నా సాక్షి టివి పూర్తిగా ఏకపక్ష0గానే వ్యవహరిస్తోంది . వాళ్ళు పెట్టుకున్నదే అందుకు . టివిల్లో డిబేట్లు, పానల్ డిస్కషన్లకు మరో పార్టీవారిని పిలవడం మానేశారు. ఈ ధోరణి కి కెఎస్ఆర్ కేంద్రబిందువు అయ్యారు. ఇతర టివిలు కూడా జగన్ వార్టీని వెలివేశాయి. ఈ బాధ్యత జగన్ దే తప్ప కెఎస్ఆర్ ది కాదు. అయినా సీనియర్ హోదాలో తప్పొప్పుల్ని ఆయనే మోయక తప్పలేదు.
ఏకపక్ష టివిలో డిబేట్ ని బ్యాలెన్స్ చేసే కెఎస్ఆర్ ను చూసిచూసి విసుగొచ్చేది. చివరికి నటనాత్మకమైన బేలెన్స్ చేయడంలో కూడా విఫలమైపోయారు. ఆయన జైలుకి వెళ్ళే వరకూ దారితీసిన పరిస్ధితులను గుర్తుచేసుకుంటే అమరావతి పై వ్యాఖ్యలు కేవలం ట్రిగ్రర్ నొక్కడం మాత్రమేనని అర్ధమైపోతుంది.
ఈ కేసులో చట్టం, న్యాయం ఒక ఫ్రేములో తమపని తాము చేసుకుపోతాయి. అది ధర్మబద్ధంగా లేకపోతే ప్రజలు గుర్తుంచుకుంటారు. సమయం వచ్చినపుడు తమ ఇంగిత జ్ఞానం (కామన్ సెన్స్) మేరకు ప్రతిస్పందిస్తారు. ప్రజల నిర్ణయాలు, రాగద్వేషాలు వారి ఇంగిత జ్ఞానం నుంచే వస్తాయి. చట్టం, న్యాయం, ధర్మం కంటే ఇంగితజ్ఞానమే బలీయమైనది.