భూమికి రంగులు… భూముల గుర్తింపు కోసం ఏపీలో ఫస్ట్ టైమ్

భూమికి రంగులు… భూముల గుర్తింపు కోసం ఏపీలో ఫస్ట్ టైమ్

ప్రభుత్వ, ప్రైవేటు భూములు, చెరువులు, గ్రామ కంఠాలకు వేర్వేరు రంగులతో వర్గీకరణ

వెబ్ ల్యా0డ్ లో భూములకు రంగులెందుకు ? అనుకుంటున్నారా ? భూదర్శని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది .

 కొత్తగా తీర్చిదిద్దుతున్న వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల వంటి వివరాలు, రహదారులు ఇలాంటివన్నీ వేర్వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయా భూముల మీద క్లిక్‌ చేయగానే భూ విస్తీర్ణం, యజమాని పేరు తదితర సమాచారం స్పష్టంగా తెలిసేలా వెబ్‌ల్యాండ్‌ను తీర్చిదిద్దుతున్నారు.

వెబ్‌ల్యాండ్‌లో మనకు కావలసిన భూమిపై క్లిక్‌ చేయగానే యజమాని పేరు, సర్వే నంబరు తదితర వివరాలు సులువుగా తెలుస్తాయి

‘భూ దర్శిని’ పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌లో భూ విస్తీర్ణం, యజమాని పేరు, స్వభావం, ఇతర వివరాలు తెలుస్తున్నాయి. కొత్త విధానం ద్వారా ఆక్రమణలు, రహదారులు, జలవనరుల గురించి కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. రాష్ట్రంలో 16,816 గ్రామాలు (1,27,547.856 చదరపు కిలోమీటర్లు) ఉండగా, వాటిలో 6,690 గ్రామాల్లో రీసర్వే (34,984.18 చ.కి.మీ. మేర) పూర్తయింది. పొలాల కొలతలు, హద్దులు, భూముల వర్గీకరణను ఆధునిక పరిజ్ఞానం సాయంతో రోవర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు. ఆ వివరాలే రికార్డుల్లో నమోదవుతున్నాయి. ఆవి ఆటోమేటిగ్గా వెబ్‌ల్యాండ్‌లోకి చేరుతున్నాయి.

5 రంగులు: రీసర్వే ఆధారంగా కొత్తగా తయారైన గ్రామాల మ్యాపుల్లో ఉన్న భూములను 5 వేర్వేరు రంగుల్లో గుర్తించడానికి వీలు కలుగుతుంది. రీసర్వే పూర్తయిన చోట్ల భూముల వివరాలు సమగ్రంగా ఉన్నందున ఈ డేటాబేస్‌కు తగ్గట్లు మ్యాపులు తయారయ్యాయి. డ్రోన్లు, శాటిలైట్​ ఇమేజ్​ల ఆధారంగా దృశ్యరూపంలో నమోదుకు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వద్ద క్లిక్‌ చేయగానే పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఈ విధానం క్రయ, విక్రయాల సమయంలో జాగ్రత్త పడేందుకు దోహదం చేస్తుంది.

భుదర్శిని తో ప్రయోజనాలు

  • సరి హద్దులు కచ్చితంగా తెలిసిపోతాయి కనుక ఆక్రమణల గురించి తెలుసుకోవచ్చు.
  • ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న భూములను గుర్తించడం సులభతరం అవుతుంది.
  • ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగితే ఏ స్థాయిలో ఎంతవరకు జరిగాయో తెలుసుకోవచ్చు.
  • విపత్తుల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
  • అధికారులు రైతుల పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు మెరుగ్గా ఉపయోగపడుతుంది .
  • చెరువులు, కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, వంటివి గుర్తించవచ్చు.
  • పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చేవారు ఆయా గ్రామాల్లోని పంటల సాగు, భూముల స్వభావం తెలుసుకోవచ్చు.
  • గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా విద్యుత్తు ఉత్పాదనకు అనువైన పరిస్థితులు సదరు గ్రామాల్లో ఉన్నాయో లేవో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
బీహార్ ఓటర్ల జాబితా,  ప్రజాస్వామ్యమేనా?

బీహార్ ఓటర్ల జాబితా, ప్రజాస్వామ్యమేనా?

ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఓటర్ల జాబితాలో ఓటర్ల సవరణ, నమోదు అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ. ముసాయిదా జాబితాను విడుదల చేయడం, కొత్తగా చేర్చిన పేర్లు, తొలగించిన పేర్ల వివరాలను రాజకీయ పార్టీలతో అందజేయడం సర్వసాధారణం. దీనివల్ల అభ్యంతరాలుంటే తెలియజేయడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఈసారి బీహార్‌లో ఎన్నికల సంఘం ఈ పద్ధతికి తూట్లు పొడిచింది. “ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్” పేరుతో ఒక కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానంలో, ఏయే ఓటర్లను తొలగించారు, ఎవరిని కొత్తగా చేర్చారు అనే వివరాలతో కూడిన ప్రత్యేక జాబితాలను (Addition and Deletion Lists) రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదు. కేవలం ఒకే ఒక ఏకీకృత జాబితాను అందిస్తున్నారు.

ఇది “గడ్డివాములో సూదిని వెతకడం” లాంటిదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లక్షలాది ఓటర్లున్న నియోజకవర్గాల్లో, పాత జాబితాతో కొత్త జాబితాను బేరీజు వేసుకుని, ఏ పేరు పోయిందో, ఏ పేరు వచ్చిందో తెలుసుకోవడం అసాధ్యమని వాపోతున్నాయి. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని, అక్రమాలకు ఆస్కారం కల్పించడానికే ఈ గోప్యత నాటకమని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు వంటి పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.. తమకు అనుకూలంగా లేని ఓటర్లను గుట్టుచప్పుడు కాకుండా జాబితా నుంచి తొలగించి, దొంగ ఓట్లను చేర్చే కుట్ర కోణం ఇందులో దాగి ఉందని వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు .

ఎలక్షన్ కమిషన్ పై నీలినీడలు

ప్రతిపక్షాలు వారు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) నుంచి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వరకు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల, ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ మార్పులు చేశామని చెబుతున్నారు. పాత జాబితాలను, మార్పులను పరిశీలించుకోవడానికి ఆన్‌లైన్‌లో సౌకర్యం ఉందని, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఈ వాదనతో ప్రతిపక్షాలు ఏకీభవించడం లేదు. ఆన్‌లైన్ వ్యవస్థలు అంత పటిష్టంగా లేవని, లక్షలాది ఓటర్ల వివరాలను అలా పరిశీలించడం ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు కూడా సహకరించడం లేదని, కావాలనే సమాచారాన్ని దాచిపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి . …

ఓటర్ల జాబితాలో గందరగోళాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ, ఒక వ్యవస్థీకృత పద్ధతిలో, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే పారదర్శకత లోపించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇది కేవలం ఓటర్ల పేర్ల తొలగింపు, చేర్పులకు సంబంధించినది కాదు. ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉండే నమ్మకానికి సంబంధించినది. “మా ఓటు భద్రంగా ఉందా? మా పేరు జాబితాలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో మేమెలా ఓటు వేయాలి?” అనే సందేహం ఒక్కసారి ప్రజల్లో కలిగితే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రజల నుంచి ప్రతిఘటన లేకపోతే, ప్రజాస్వామ్య వాదులు దీనిపై ఉద్యమాల్ని నిర్మించకపోతే ఈ దుర్నీతి అన్ని రాష్ట్రాలకూ విస్తరించే ప్రమాదం వుంది.

అభివృద్ధి మంత్రం సరే.. కొంచెమైనా సమర్ధత చూపించండి

అభివృద్ధి మంత్రం సరే.. కొంచెమైనా సమర్ధత చూపించండి

జగన్నామ స్మరణ వదిలిపెట్టి … జరగాల్సిన పనులు చూడండి.. అరాచకవాదుల ఆగడాలకు కట్టడివేయలేకపోతున్నారెందుకు ?

అమరావతి మొదటి విడత పనులు మూడేళ్ళలో ఎలా పూర్తి చేస్తారు? లెక్కలేమైనా ఉన్నాయా ?

అభాసుపాలవుతారు ? రాష్ట్రాన్ని అధఃపాతాళానికి నెట్టేయకండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక విజన్ తోనే పనిచేస్తారు. తాజా విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి దేశంలో 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదగాలి. ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధి అనే బాబు హయాంలో అభివృద్ధి ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. ప్రజల్లో ఆ ప్రభావం కూడా మిశ్రమంగా వుంది. ఆయన పార్టీ గెలుస్తోంది. ఓడిపోతుంది. గెలుస్తోంది. ఓడిపోతుంది. దీనంతటికీ బాధ్యత ముమ్మాటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిడే .

బాబు అభివృద్ధి మంత్రం ప్రజలను ఎంతగా కనెక్ట్ చేస్తోందో అధ్యయనం లేదు. జగన్ ప్రభావాన్ని దృష్టిలో వుంచుకుని  బాబు పేదల సంక్షేమ పధకాల సొమ్ము పెంచి ఇంకా హెచ్చుమందికి  విస్తరింపచేశారు. లబ్దిదారుల తృప్తి లేదా అసంతృప్తి ఇప్పటికిప్పుడే లెక్కతేలేది కాదు.

ఇన్వెస్టర్లు నేరుగా బాబు తో టచ్ లో వున్నారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తారేమో అనే భయం తప్ప వారికి మరో సంకోచమే లేదు.

క్షేత్రస్ధాయిలో ఎమ్మెల్యేలదే రాజ్యం. సంక్షేమ పధకాల లబ్ధిదారుల అకౌంట్లలోకే నేరుగా డబ్బు జమ అవుతుంది . వారి ఇతర సమస్యల పరిష్కారం, మధ్యతరగతి వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్యేలకు పెద్ద పని అవుతుంది. ఆచరణలో ఇది కూడా పెద్ద భారంకాదు. సమస్య స్టేటస్ ఆన్ లైన్ లో కనబడుతూనే వుంటుంది. దాన్ని పుష్ చేయడమే ప్రజాప్రతినిధులు చేయగలపని.

ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే వనరుల నిర్వహణ, అజమాయిషీ సిండికేట్లవే! ఈ సిండికేట్ల వెనుక ప్రజాప్రతినిధులు వున్నారు. శక్తివంతులైన ప్రతిపక్షం వాళ్ళు కూడా వున్నారు. లిక్కర్, ఇసుక, మట్టి పాటదారుల సిండికేట్లు నాయకుల మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చూసుకోవాలి. గ్రామాల్లో ఈ విషయం లెక్కలతో సహా ఓపెన్ గా చెప్పేస్తూ వుంటారు. “మాకేంటి” అనే నాయకులు కూడా వున్నారు.

ఇసుక మట్టి పనుల్లో ఎమ్మెల్యేలు ఎంత దూరంగా వుంటే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందని చంద్రబాబు హెచ్చరించడమే  పరిస్ధితి శృతిమించి రాగాన పడుతున్నదనడానికి ఒక సూచన!  ఎవరి కారణాలు వారికి వున్నా ఆదివారం జరిగిన అధికారపార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలను ముఖ్యనాయకులను పిలిచారు. మొత్తం ఆహ్వానితుల్లో  56 మంది హాజరు కాలేదంటే అది ఒక విధమైన లెక్కలేని తనానికి ఒక సూచనగా అర్ధం చేసుకోవచ్చు.

క్వాంటమ్ మొదలైన టెక్నాలజీ ప్రాజెక్టులు, రకరకాల పరిశ్రమలకు ఇన్వెస్టిమెంట్లు దీర్ఘకాలంలో  భవిష్యత్తుకి అవసరాలే! ఇవేమీ కళ్ళముందున్న ప్రజల అవసరాలు తీర్చలేవు. కనెక్టు కాలేవు.

అధికారపార్టీల్లో వున్న ఎమ్మెల్యేల పనితీరే ప్రభుత్వం ప్రతిష్టను పెంచుతుంది. ప్రజల్లో నిలబెడుతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తుంది.

రేపటి అభివృద్ధి జపంలో కూటమి ప్రభుత్వం ఇపుడు కళ్ళముందున్న ప్రజల్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి, క్రిమినల్స్ ను నేరుగా సమర్థిస్తున్న అనేక కేసుల్లో నిందితుడైన జగన్ మీద చర్యల్లో కూడా కూటమి ప్రభుత్వం అడుగు వేయలేకపోతోంది. జగన్ పై చర్య చంద్రబాబు వల్ల కాదని ఆయన పార్టీ వాళ్ళే అంటున్నారంటే పరిపాలనలో ఒక పార్శ్వాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమౌతోంది. జగన్ మీద వ్యతిరేకతతోనే కూటమిని గెలిపించిన వర్గాల మనోభావాలను బాబు పట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

బాబు సన్నిహితుడన్న బావసతో జగన్ ప్రభుత్వం వేధించిన ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు ఒంటరి పోరాటం చేసి తనపై పాత ప్రభుత్వం మోపిన అభియోగాలనుంచి విముక్తుడయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఏడాది గడచినా ఎబి పెన్షన్ సెటిల్ మెంట్ జరగలేదు. జీతంలో సగం బకాయిలు ఇంకా ఆయనకు చెల్లించనే లేదు. మధ్యతరగతి విద్యావంతుల్లో చంద్రబాబు పాలనపై పెరుగుతున్న నిరుత్సాహానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో వున్నాయి.

ప్రపంచంలో పెద్ద క్వాంటమ్ ప్రాజెక్టు మాకే వుంది. ఇంకో పాతికేళ్ళకు మేము ప్రపంచంలో గొప్పరాష్టం వాళ్ళమైపోతాం అనుకోడానికే తప్ప! బాబుగారి అభివృద్ధి మంత్రం వల్ల రోజువారీ బతుకుల్లో మార్పులు వుండవు. మాతోపాటు  ప్రభుత్వం వుందన్న భరోసా వుంటే చాలు. అదే ముందుకి నడిపిస్తుంది. సంక్షేమ పధకాల ద్వారా పేద వర్గాలకు జగన్ ఉన్నాడన్న ధీమాను ఆయన ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత చేసినా అది జగన్ పధకాల కొనసాగింపుగానే చూస్తారు. ఇందులో కూటమి లేబుల్ కాని బాబు లేబుల్ కాని లేవు.

బాబు గారూ! ప్రభుత్వం వుందన్న ప్రజెన్స్ ను మధ్యతరగతి వారికి, విద్యావంతులకు, జగన్ పై ఆగ్రహంతో మీకు అధికారాన్ని ఇచ్చిన వారికి చూపించండి. మీ ప్రభుత్వం  ఓడిపోవడం మీకు కొత్తకాదు. కానీ, మీ మీద నమ్మకం వుంచిన వారి ఆశలు కొన్నైనా నెరవేర్చండి!!

ఆషాడం… దేవతల నిద్ర సమయమా ?

ఆషాడం… దేవతల నిద్ర సమయమా ?

ఈ నెలలో అన్నీ స్తబ్ద0గా ఉండటానికి కారణం తెలుసుకుందామా . ..

ఆషాఢ మాసం వచ్చిందంటే బట్టల షాపుల్లో భారీ డిస్కౌంట్స్ . ఇలా చాలా బిజినెస్ ల వారు డిస్కౌంట్ల మేళాలు పెట్టడం తెలుగు రాష్ట్రాలలో రెండు దశాబ్దాలుగా వస్తోంది . ఎందుకంటే ఈ నెలలో ఎక్కువ వ్యాపారాలు తగ్గుముఖం పడతాయి, డబ్బు చెలామణి తగ్గిపోతుంది అన్ని రంగాల్లో ఒక రకమైన స్తబ్దత ఆవరిస్తుంది. దీని వెనుక స్పష్టమైన మతపరమైన, సామాజిక, వ్యవసాయ ఆర్థిక కారణాలు ఉన్నాయి.

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసాన్ని ‘శూన్య మాసం’గా పరిగణిస్తారు.

దీనికి ప్రధాన కారణాలు:

దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఈ కాలాన్ని దేవతలకు రాత్రి సమయంగా భావిస్తారు. అందుకే ఈ సమయంలో దేవతలు యోగనిద్రలో ఉంటారని, వారి అనుగ్రహం పూర్తిగా ఉండదని ఒక నమ్మకం. అందువల్ల, వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, భూమి కొనుగోళ్లు వంటి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసే శుభకార్యాలను ఈ మాసంలో జరపరు. హిందూ కుటుంబాలలో ఇది సెంటిమెంట్

శుభకార్యాల ప్రభావం: పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరగనప్పుడు వాటిపై ఆధారపడిన అనేక వ్యాపారాలు సహజంగానే దెబ్బతింటాయి. బట్టల దుకాణాలు, బంగారం షాపులు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, డెకరేషన్, రవాణా వంటి ఎన్నో రంగాల్లో వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. ఇది మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని ఒక్కసారిగా తగ్గిస్తుంది.

వ్యవసాయ పనుల ముమ్మరం: ఆషాఢ మాసం వర్షాకాలం ఆరంభాన్ని సూచిస్తుంది. ఇది రైతులకు అత్యంత కీలకమైన సమయం. పెట్టుబడి అనంతరం విరామం: రైతులు అప్పటికే ఖరీఫ్ సీజన్ కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం తమ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి ఉంటారు. ఆషాఢ మాసంలో పొలం దున్నడం, నాట్లు వేయడం వంటి పనులలో నిమగ్నమై ఉంటారు.

చేతిలో డబ్బు తక్కువ: వారి పెట్టుబడి అంతా భూమిలో ఉంటుంది. పంట చేతికి రావడానికి మరో మూడు, నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో రైతుల చేతిలో డబ్బు తక్కువగా ఉంటుంది. వారు అనవసర ఖర్చులు చేయరు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతులు వెన్నెముక కాబట్టి, వారి కొనుగోలు శక్తి తగ్గడం మొత్తం మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది.

వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఈ కాలంలో జలుబు, జ్వరం, అంటువ్యాధులు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు మరియు అనవసర ప్రయాణాలను, బయట తినడాన్ని మానుకుంటారు. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక రంగాలపై ప్రభావం చూపుతుంది.

ఆషాడ మాసంలో . .. (జులై ) వర్షాల కారణంగా ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి . ప్రజలు సొంత ఊళ్ళుమ్ ఇళ్లకే పరిమితం కావడానికి ఇది కూడా ఒక కారణం, తద్వారా వారి ఖర్చులు కూడా తగ్గుతాయి.

ఆర్థిక చక్రంలో ఒక భాగం: ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం పండుగలకు, శుభకార్యాలకు పెట్టింది పేరు. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి వంటి పండుగలతో మార్కెట్లో మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రజలు ఆషాఢంలో ఆదా చేసిన డబ్బును శ్రావణ మాసంలో ఖర్చు చేయడానికి మానసికంగా సిద్ధపడతారు. ఇలాంటి వాటిని బట్టే . .. కాబట్టి, ఆషాఢ మాసంలోని ఈ మందగమనం, రాబోయే పండుగల సీజన్‌కు ముందు వచ్చే ఒక సహజమైన ఆర్థిక విరామం లాంటిది.

ఆషాఢ మాసంలో కనిపించే ఆర్థిక మందగమనం కేవలం ఒక్క కారణం వల్ల ఏర్పడేది కాదు. శతాబ్దాలుగా పాటిస్తున్న సంప్రదాయాలు, వ్యవసాయ ఆధారిత జీవనశైలి, మరియు సహజమైన ఆర్థిక చక్రాలు అన్నీ కలిసి ఈ పరిస్థితికి దారితీస్తాయి. ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. శ్రావణం రాకతో మళ్లీ అన్ని రంగాల్లోనూ కొత్త కళ సంతరించుకుంటుంది

‘కారు’ చౌక బేరం.. ఢిల్లీలో…

‘కారు’ చౌక బేరం.. ఢిల్లీలో…

”పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలు , 15 ఏళ్లు పైబడిన పెట్రోల్‌ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిషేధం.” అంటూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో . .. గడువు తీరిన కార్లను నామమాత్రపు ధరలకు అమ్మకానికి పెడుతున్నారు.

దేశ రాజధాని దిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహన పాలసీ ఎఫెక్ట్‌తో ఎంతోమంది ఇప్పటికే కార్లను కారుచౌకగా అమ్మేశారు.

దిల్లీ వాస్తవ్యుడు నితిన్ గోయల్ రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను రూ.8 లక్షలకే అమ్మేశారు. రూ.40 లక్షల మెర్సిడెజ్ సీ క్లాస్ 220 సీడీఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూ.4 లక్షలకే అమ్మారు. దిల్లీకే చెందిన రితేశ్ గందోత్ర రూ.55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీ కారును నామమాత్రపు రేటుకు విక్రయించారు. వాహన పాలసీపై దిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ సర్కారు పునరాలోచనలో పడింది. త్వరలోనే కొత్త వాహన పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తును మొదలుపెట్టింది. ఈ పనేదో కొన్ని నెలల ముందే మొదలుపెట్టి ఉంటే తాము కార్లను చౌకగా అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని బాధిత వాహనదారులు వాపోతున్నారు.

ఎన్‌జీటీ ఆదేశాలు అమల్లోకి- వాహనదారులకు చుక్కలు
దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కీలక ఆదేశాలిచ్చింది. పదేళ్లకుపైగా వినియోగించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకుపైగా వినియోగించిన పెట్రోలు వాహనాలను దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతించరాదని నిర్దేశించింది. ఆ ఆదేశాలను తదుపరిగా సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనదారులకు డెడ్‌లైన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్‌జీటీ ఆదేశాల అమలులో భాగంగానే జులై 1 నుంచి గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంధనమే పోయనప్పుడు కార్లను మాత్రం ఏం చేసుకుంటామని చాలామంది వాహనదారులు భావించారు. వారంతా తమ వాహనాలను తక్కువ రేట్లకే దిల్లీ అవతలి వ్యక్తులకు అమ్ముకున్నారు. అయితే దీనిపై వ్యతికేత వ్యక్తం కావడంతో సర్కారు మళ్లీ పునరాలోచనలో పడింది.

వీలైనంత త్వరగా ఒక పరిష్కారం చూపిస్తాం : దిల్లీ సర్కారు
కాలం చెల్లిన పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఇంధనం పోయకూడదనే నిర్ణయంపై దిల్లీ సర్కార్‌ వెనుకడుగు వేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని సాధించే దిశగా కసరత్తు చేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం రోజున ఈ అంశంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)కి దిల్లీ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరింది.

బ్యాన్‌తో ఇబ్బందిపడుతున్న జనం
గడువు తీరిన వాహనాలకు ఇంధనం కొట్టకుండా డిల్హే సర్కార్ తీసుకువచ్చిన పాలసీతో ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ విధించడం సరికాదని, దాని అమలులో సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బ్యాన్‌తో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ఆయా వాహనాలపై బ్యాన్‌ను వెంటనే అమల్లోకి తేవాలనేది అపరిపక్వ నిర్ణయమని మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. కొంత గడువు ఇచ్చిన తర్వాత బ్యాన్ చేయడం కరెక్ట్ అంటూ పలు వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది .