ఇంధన బ్యాన్ ఎఫెక్ట్- రూ.70 లక్షల కారు రూ.10 లక్షలకే
‘న్యూ పాలసీ’ ఎఫెక్ట్‌తో లగ్జరీ కార్లను సైతం తక్కువ ధరకు అమ్మేస్తున్న దిల్లీ వాసులు
”పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలు , 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిషేధం.” అంటూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో . .. గడువు తీరిన కార్లను నామమాత్రపు ధరలకు అమ్మకానికి పెడుతున్నారు.
దేశ రాజధాని దిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహన పాలసీ ఎఫెక్ట్‌తో ఎంతోమంది ఇప్పటికే కార్లను కారుచౌకగా అమ్మేశారు.
దిల్లీ వాస్తవ్యుడు నితిన్ గోయల్ రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను రూ.8 లక్షలకే అమ్మేశారు. రూ.40 లక్షల మెర్సిడెజ్ సీ క్లాస్ 220 సీడీఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూ.4 లక్షలకే అమ్మారు. దిల్లీకే చెందిన రితేశ్ గందోత్ర రూ.55 లక్షల లగ్జరీ ఎస్యూవీ కారును నామమాత్రపు రేటుకు విక్రయించారు. వాహన పాలసీపై దిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ సర్కారు పునరాలోచనలో పడింది. త్వరలోనే కొత్త వాహన పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తును మొదలుపెట్టింది. ఈ పనేదో కొన్ని నెలల ముందే మొదలుపెట్టి ఉంటే తాము కార్లను చౌకగా అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని బాధిత వాహనదారులు వాపోతున్నారు.
ఎన్జీటీ ఆదేశాలు అమల్లోకి- వాహనదారులకు చుక్కలు
దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కీలక ఆదేశాలిచ్చింది. పదేళ్లకుపైగా వినియోగించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకుపైగా వినియోగించిన పెట్రోలు వాహనాలను దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతించరాదని నిర్దేశించింది. ఆ ఆదేశాలను తదుపరిగా సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనదారులకు డెడ్‌లైన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్జీటీ ఆదేశాల అమలులో భాగంగానే జులై 1 నుంచి గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంధనమే పోయనప్పుడు కార్లను మాత్రం ఏం చేసుకుంటామని చాలామంది వాహనదారులు భావించారు. వారంతా తమ వాహనాలను తక్కువ రేట్లకే దిల్లీ అవతలి వ్యక్తులకు అమ్ముకున్నారు. అయితే దీనిపై వ్యతికేత వ్యక్తం కావడంతో సర్కారు మళ్లీ పునరాలోచనలో పడింది.
వీలైనంత త్వరగా ఒక పరిష్కారం చూపిస్తాం : దిల్లీ సర్కారు
కాలం చెల్లిన పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఇంధనం పోయకూడదనే నిర్ణయంపై దిల్లీ సర్కార్ వెనుకడుగు వేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని సాధించే దిశగా కసరత్తు చేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం రోజున ఈ అంశంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి దిల్లీ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరింది.
బ్యాన్‌తో ఇబ్బందిపడుతున్న జనం
గడువు తీరిన వాహనాలకు ఇంధనం కొట్టకుండా డిల్హే సర్కార్ తీసుకువచ్చిన పాలసీతో ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్ విధించడం సరికాదని, దాని అమలులో సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బ్యాన్‌తో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ఆయా వాహనాలపై బ్యాన్‌ను వెంటనే అమల్లోకి తేవాలనేది అపరిపక్వ నిర్ణయమని మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. కొంత గడువు ఇచ్చిన తర్వాత బ్యాన్ చేయడం కరెక్ట్ అంటూ పలు వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది .



