జనం తగ్గుతున్నారు . .. కారణమేంటి?

జనం తగ్గుతున్నారు . .. కారణమేంటి?

ఇది ప్రపంచమంతటా పాకుతున్న సంక్షోభం….. జననాల తగ్గుముఖంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన

”ప్రపంచం “జనాభా పతనం” అనే అపూర్వమైన సంక్షోభం అంచున ఉంది. భవిష్యత్తులో ఈ సమస్య తీవ్రమైన సామాజిక, ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది” అని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. జూలై 11న జరుపుకునే ''ప్రపంచ జనాభా దినోత్సవం 2025'' సందర్భంగా, ఐరాస విడుదల చేసిన నివేదికలో ఆందోళన కలిగించే అనేక అంశాలు తేటతెల్లమవుతున్నాయ్ .

ఈ సంవత్సరం, “యువతకు సాధికారత: వారు కోరుకున్న కుటుంబాలను సృష్టించుకునేందుకు న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచం” అనే ధీమ్ తో , ఈ సమస్య కేవలం సంఖ్యలకు నివేదిక సంబంధించినది కాదని, మానవ హక్కులు, అవకాశాలు, మరియు యువత భవిష్యత్తుకు సంబంధించినదని ఐరాస స్పష్టం చేసింది.

ఐరాస నివేదిక ప్రకారం, ప్రపంచ సగటు సంతానోత్పత్తి రేటు (ఒక మహిళ తన జీవితకాలంలో జన్మనిచ్చే పిల్లల సగటు సంఖ్య) గత కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా క్షీణించింది. ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే, సంతానోత్పత్తి రేటు కనీసం 2.1గా ఉండాలి. దీనిని “రీప్లేస్‌మెంట్ లెవల్” అంటారు. అయితే, ప్రపంచంలోని మూడింట రెండు వంతుల జనాభా ఇప్పుడు ఈ స్థాయి కంటే తక్కువ సంతానోత్పత్తి రేట్లు ఉన్న దేశాలలో నివసిస్తున్నారు.

దక్షిణ కొరియా, జపాన్, స్పెయిన్, ఇటలీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రేటు 1.5 కంటే తక్కువకు పడిపోయింది. ఆశ్చర్యకరంగా, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా సంతానోత్పత్తి రేటు 2.0 కంటే దిగువకు చేరింది.

ఈ క్షీణతకు అనేక కారణాలు ఉన్నాయి. మహిళల విద్య, ఉద్యోగావకాశాలు పెరగడం, పట్టణీకరణ, పిల్లల పెంపకం ఖరీదైనదిగా మారడం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, మరియు కుటుంబ నియంత్రణ పద్ధతులపై పెరిగిన అవగాహన వంటి సామాజిక, ఆర్థిక మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్పులు వ్యక్తిగత స్థాయిలో సానుకూలమైనవే అయినప్పటికీ, సమిష్టిగా అవి జనాభా శక్తిసామర్థ్యాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి.

వృద్ధాప్య జనాభా: సంతానం తక్కువగా ఉండటం, ఆయుర్దాయం పెరగడంతో సమాజంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, సామాజిక భద్రతా పథకాలపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది.

కార్మిక శక్తి కొరత: పనిచేసే వయస్సులో ఉన్న యువత సంఖ్య తగ్గడంతో, దేశాలు తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటాయి. ఇది పారిశ్రామిక ఉత్పత్తి, ఆవిష్కరణలు, మరియు ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది.

ఆర్థిక మాంద్యం: వినియోగదారుల సంఖ్య తగ్గడంతో, మార్కెట్లు కుంచించుకుపోతాయి. ఇది దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోతుంది.

సామాజిక మార్పులు: యువతరంపై వృద్ధుల సంరక్షణ భారం పెరుగుతుంది. ఇది కుటుంబ నిర్మాణంలో మరియు సామాజిక సంబంధాలలో మార్పులకు కారణమవుతుంది.

ఐరాస ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతోంది. ఈ సమస్యను కేవలం జనాభా సంఖ్యలను పెంచేదిగా చూడకూడదు. చాలా మంది యువతీ యువకులు పిల్లలను కనాలని కోరుకుంటున్నప్పటికీ, ఆర్థిక అభద్రత, సరైన మద్దతు లేకపోవడం, మరియు సామాజిక ఒత్తిళ్ల కారణంగా వారు తమ కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారని ఐరాస పేర్కొంది. దీనినే “పునరుత్పత్తి ఏజెన్సీ” లేకపోవడం అంటారు.

ప్రజలు, ముఖ్యంగా యువత, వారు కోరుకున్నప్పుడు, కోరుకున్న సంఖ్యలో పిల్లలను కనగలిగే వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల బాధ్యత అని ఐరాస వాదిస్తోంది. దీనికోసం, కుటుంబాలకు అనుకూలమైన విధానాలను రూపొందించాలి. ఇందులో భాగంగా, సరసమైన పిల్లల సంరక్షణ, తల్లిదండ్రులిద్దరికీ వేతనంతో కూడిన సెలవులు, గృహ వసతి మద్దతు, మరియు ఉద్యోగ భద్రత కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. అయితే, దీనికి పరిష్కారం ప్రజలను ఎక్కువ మంది పిల్లలను కనమని బలవంతం చేయడం కాదు. బదులుగా, యువతకు సాధికారత కల్పించడం, వారి పునరుత్పత్తి హక్కులను గౌరవించడం, వారు తమ కుటుంబాలను నిర్మించుకోవడానికి అవసరమైన మద్దతును అందించడం ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలం… అని మేధావులు, జర్నలిస్టులు సూచిస్తున్నారు .

బ్రహ్మోత్సవాలు – శ్రీవారి సేవకులకు ఛాన్స్ !

సెప్టెంబరు 24 నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు

తరాల సాంప్రదాయబద్దమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. ఈ క్రమంలో సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక అన్నమయ్య భవనంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభాగాల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కీలక నిర్ణయాలు:

  • బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రొటోకాల్​ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్​ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్​ఆర్​ఐలు, దాతల కోటాలో దర్శనాలకు అనుమతి ఉండదు.
  • దర్శన క్యూ లైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాలలో అన్నప్రసాదాల పంపిణీ, లడ్డూల నిల్వను పెంచుకోవడం.
  • వివిధ సేవలకు శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులకు ఆహ్వానం
  • సెప్టెంబర్ 28న గరుడ వాహన సేవ నిర్వహించనుండటంతో, ఆ నెల 27 నుంచి 29 వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.

బ్రహ్మోత్సవాల వివరాలు :

  • బ్రహ్మోత్సవాలకు ముందే సెప్టెంబరు 16న కోయిల్​ ఆళ్వార్ తిరుమంజనం.
  • సెప్టెంబరు 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24 న ధ్వజారోహణం.
  • అక్టోబరు 1న రథోత్సవం, 2న చక్రస్నానం.
  • ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అదే విధంగా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రకృతి వ్యవసాయంపై ‘అమిత్ షా’ ఆసక్తి ఎందుకు ?

ప్రకృతి వ్యవసాయంపై ‘అమిత్ షా’ ఆసక్తి ఎందుకు ?

రిటైర్మెంట్ తర్వాత వేదాలు , ఉపనిషత్తులు చదువుతారట … నేచురల్ ఫార్మింగ్ చేస్తారట

అమిత్ షా . . కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలోనూ, కేంద్ర సర్కార్ లోనూ సెకండ్ ప్లేస్ లో ఉన్న అమిత్ షా తీసుకున్న నిర్ణయం దేశమంతా చర్చకు తెరతీసింది .

‘‘రిటైర్మెంట్‌ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవాలని కోరికగా ఉంది . ప్రకృతి వ్యవసాయానికీ కొంత సమయాన్ని కేటాంయిచాలనుకుంటున్నాను . రసాయన ఎరువులు , పురుగుమందులతో పండించే పంటలతో జీవనశైలి రోగాలైన బీపీ, డయాబెటిస్​, థైరాయిడ్​తో పాటు ప్రాణాంతక క్యాన్సర్​ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫర్టిలైజర్ల వాడకంపై రైతు సోదరులంతా సామూహికంగా ఆలోచించాల్సి ఉంది. బలమైన నిర్ణయం తీసుకోవాలి . ప్రకృతి వ్యవసాయంతో శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది.” అని అమిత్ షా తన రిటర్మెంట్ ప్రకటన సందర్బంగా చెప్పుకొచ్చారు .

మరో సహకార ఉద్యమం రావాలి .
కేంద్ర సహకార శాఖ నాలుగో ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సహకార్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గుజరాత్​లోని ఆనంద్​లో చేపట్టిన కార్యక్రమానికి అమిత్ షా తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ పాల్గొన్నారు. అమూల్​ డెయిరీకి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పీపుల్, పీఏసీఎస్​, ప్లాట్​ఫాం, పాలసీ, ప్రాస్పరిటీతో కూడిన కోపరేటివ్ ఉద్యమం దేశవ్యాప్తంగా రావాలని పిలుపునిచ్చారు.సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్‌ షా తెలిపారు. సహకార రంగం వల్ల అనేక మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్​లో అమ్ముకునేలా సాయ పడిందని గుర్తు చేశారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, నేను మాత్రం సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని పేదలు, రైతులు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

జగన్ … జనసమీకరణ డ్రామా

జగన్ … జనసమీకరణ డ్రామా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మామిడి రైతులను పరామర్శించే బంగారుపాళ్యం యాత్ర జనసమీకరణ డ్రామా గా మారింది . ఈ యాత్రకు 10 వేలమందిని అనుమతించాలని ఆయన పార్టీ ఆర్గనైజర్లు పోలీసులను కోరారు. మండలాల వారీగా ఎంతెంత మంది ఎన్నెన్ని వాహనాల్లో రావాలో స్థానిక వైసీపీ నేతలకు కోటాలు కూడా విధించారు. 500 మందికి మించి అనుమతించలేమని పోలీసులు సమాధానమిచ్చారు . జగన్ పార్టీవారికి లా అండ్ ఆర్డర్ తో పనిలేదు. ఈ సారికూడా పోలీసు ఆదేశాలను ధిక్కరించేసారు . ఇష్టానుసారం పేట్రేగిపోయారు .

జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పహారా కాస్తున్న పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వైసీపీ మూకల వీరంగం..

అయితే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా చేశారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్‌ యార్డ్‌లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించారు. పోలీసుల సూచనలను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

151 స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన పార్టీకి, జన సమీకరణ ఒక రాజకీయ అవసరంగా మారింది. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి: 1) ఓటమి తర్వాత పార్టీ బలహీనపడిందనే ముద్రను చెరిపేయడం, 2) కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచడం, 3) అధికార పక్షానికి తమ బలాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శించడం.

ఈ వ్యూహం నిస్సందేహంగా నిరాశలో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని చురుకుగా ఉంచుతుంది.

* కోర్ ఓటర్ బేస్, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతుంది.

* నాయకుడి ఉనికిని, ప్రాముఖ్యతను మీడియాలో, ప్రజలలో నిరంతరం నిలుపుతుంది.

* కొత్త వివాదాలను సృష్టించడం ద్వారా అధికార పక్షాన్ని నిరంతరం రక్షణాత్మక స్థితిలో ఉంచుతుంది…. అని భావిస్తున్న వైసీపీ ఆ పార్టీ కేడర్ పైనా , నేతలపైనా జనంలో ఉన్న అభిప్రాయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదు .

వైసీపీ హంగామా వల్ల నష్టాలు:

* ప్రజా విసుగు (Public Fatigue): నిరంతరం పునరావృతమయ్యే రాజకీయ నాటకంగా ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఈ డ్రామా

తటస్థ ఓటర్లను జగన్ పార్టీకి దూరం చేస్తుంది. కిడ్నాప్, హింస, ఎన్నికల అక్రమాలు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీలకు నాయకులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, నేర ప్రవర్తనను సమర్థించడంగా భావిస్తున్నారు.

పదే పదే జన ప్రదర్శనల వల్ల ప్రభుత్వంపై విధానపరమైన, వాస్తవ సమస్యల ఆధారంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశాన్ని జగన్ పార్టీ పోగొట్టుకుంది. .

ఇది పునరుజ్జీవనానికి స్థిరమైన మార్గమా?

జన సమీకరణ అనేది పార్టీ మనుగడకు అవసరమైన స్వల్పకాలిక సాధనం అయినప్పటికీ, అది పార్టీ పునరుజ్జీవనానికి దీర్ఘకాలిక వ్యూహంగా సరిపోదు. రాజకీయ పునరుజ్జీవనం అనేది కేవలం ధిక్కారం, వేధింపుల కథనంపై ఆధారపడి సాధ్యం కాదు. దానికి బదులుగా, పార్టీ తన భారీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవడం, తన కోర్ బేస్‌ను దాటి విస్తృత ఓటర్లతో తిరిగి కనెక్ట్ అవ్వడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ఆకర్షణీయమైన, సానుకూల దృష్టిని అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుంది

ట్రంప్ టారిఫ్​ల దెబ్బ  –  – భారత్​పై  ఎంత ఎఫెక్ట్ ?

ట్రంప్ టారిఫ్​ల దెబ్బ – – భారత్​పై ఎంత ఎఫెక్ట్ ?

ఫార్మా ఉత్పత్తులపై 200శాతం,రాగిపై 50, సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన ట్రంప్

భారత్​పై భారీ ప్రభావం పడుతుందంటున్న నిపుణులు

తన పిచ్చి చేష్టలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వాణిజ్య యుద్ధానికి దిగారు. ఇప్పటికే అమెరికాకు దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం టారిఫ్​లను విధించిన ట్రంప్, తాజాగా రాగిపై కూడా 50 శాతం సుంకాలను ప్రకటించారు. అలాగే అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక ఏడాది తర్వాత 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చారు. సుంకాల అమలు గడువును ఆగస్టు 1 తర్వాత పొడిగించేదిలేదని ట్రాంప్ క్లారిటీ ఇచ్చారు .

భారత్​పై ప్రభావం ఏ మేరకు . ..

విధించిన సుంకాలు మిగతా దేశాలతో పాటు భారత్​పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూఎస్​కు ఎక్కువగా రాగి, ఔషదాలను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2024-25లో ప్రపంచదేశాలకు 2 బిలియన్ డాలర్ల విలువైన రాగి, దాని అనుబంధ ఉత్పత్తులను సరఫరా చేసింది భారత్. ఇందులో అమెరికా మార్కెట్లకు 360 మిలియన్ డాలర్లు లేదా 17 శాతంగా రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వాణిజ్య డేటా ప్రకారం, సౌదీ అరేబియా (26 శాతం), చైనా (18 శాతం) తర్వాత అమెరికాకు ఎక్కువ రాగి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశంగా మన దేశం మూడవ స్థానంలో ఉంది .

ఫార్మాకు గట్టి దెబ్బె . .. ట్రంప్ సుంకాలు భారత ఫార్మా రంగాన్ని దెబ్బతీయనున్నాయి. రాగి ఉత్పత్తులతో పోలిస్తే ట్రంప్ సుంకాల ప్రభావం ఫార్మా రంగంపైనే ఎక్కువ పడనుంది. ప్రపంచ దేశాల్లో అమెరికాకే భారత్ ఎక్కువ ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను సరఫరా చేసింది. ఇది మునుపటి ఏడాది ఎగుమతులు 8.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. అలాగే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతంగా ఉంది. ఫార్మా రంగంపై 200 శాతం లెవీ విధించడం వల్ల ఈ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, అమెరికాతో ట్రేడ్ డీల్​ను కుదుర్చుకునే పనిలో భారత్ ఉంది. సుంకాల అమలు గడువు ఆగస్టు 1లోపు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే, కొత్త టారిఫ్ ల ప్రభావం భారత మార్కెట్లపై పడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.