మేధావుల చర్చలలో జాతీయ స్థాయి డిబేట్ … సరికొత్త సూచనలు . .
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో ఒక చర్చను మొదలుపెట్టింది. “ఆరోగ్య కారణాలు” అని రాజీనామా పేర్కొన్నప్పటికీ, దీని వెనుక బీజేపీ అధిష్టానం వైఖరితో విభేదాలు, రాజ్యాంగ పదవికి జరిగిన అవమానమే అసలు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ అనూహ్య పరిణామం ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక పెద్ద అంతర్గత తిరుగుబాటుకు సంకేతమంటూ, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో భాగంగా, ఇద్దరు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది. అయితే, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ధన్‌ఖడ్, ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా స్వతంత్ర వైఖరిని ప్రదర్శించారు. ముఖ్యంగా, జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన ప్రతిపాదనలో సాంకేతిక లోపాలున్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడమే కాకుండా, ఆ తీర్మానాలను సభలో లిస్ట్ చేయాలని పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించారు. చైర్మన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం బీజేపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ధన్‌ఖడ్ వైఖరికి ప్రతిగా, బీజేపీ తన అసంతృప్తిని పరోక్షంగా కానీ బలంగా కానీ తెలియజేసింది. పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే కీలకమైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC) సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ గైర్హాజరయ్యారు. చైర్మన్‌కు కనీస ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ చర్యను ధన్‌ఖడ్ తీవ్ర అవమానంగా, తన ఆత్మగౌరవానికి భంగంగా భావించారు. రాజ్యాంగబద్ధమైన తన విధులకు అడ్డుకట్ట వేయడాన్ని సహించలేక, మౌనంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.
ఇటీవల గుండెకు స్టెంట్ వేయించుకున్నప్పటికీ, ఆయన చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, జైపూర్ పర్యటనకు కూడా సిద్ధమయ్యారని, కాబట్టి “ఆరోగ్య కారణం” అనేది గౌరవంగా తప్పుకోవడానికి చూపిన ఒక సాకు మాత్రమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పదేళ్ల తర్వాత స్పష్టమైన మెజారిటీ లేకుండా, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ధన్‌ఖడ్ రాజీనామా ఒక గట్టి హెచ్చరిక లాంటిది. మెజారిటీ ఉంది కదా అని రాజ్యాంగ పదవులను, వాటి నిబంధనలను తేలికగా తీసుకోకూడదని, సంకీర్ణ ధర్మాన్ని, రాజ్యాంగ విలువలను గౌరవించాలని ఈ సంఘటన ఒక బలమైన సందేశం పంపింది.
బీజేపీ నియమించిన వ్యక్తే, ఆ పార్టీ వైఖరిని నిరసిస్తూ పదవిని త్యజించడం, ఒకరకంగా ఇది తీవ్రమైన అంతర్గత తిరుగుబాటుగానే పరిగణించాలి.
ఒకప్పుడు ధన్‌ఖడ్ పక్షపాత వైఖరితో ఉన్నారని ఆయనపై అవిశ్వాసం ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు ఆయనను “విలువలకు కట్టుబడిన వ్యక్తి” అని ప్రశంసించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ధన్ ఖడ్ రాజీనామా ఉపసంహరింపచేసే బాధ్యత ప్రధానమంత్రిదే అని కాంగ్రెస్ ఓపెన్ గా చేసిన విన్నపంలో “మీరు నియమించిన వ్యక్తినే మీరు ఒప్పించలేకపోతున్నారు” అనే దెప్పిపోటు కూడా వుంది.
ప్రస్తుతం, ఎన్డీఏ ప్రభుత్వం ముందు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన తక్షణ సవాలు నిలిచింది. “ఒకే దేశం, ఒకే ఎన్నికలు” వంటి కీలక బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలంటే, సభను సమర్థవంతంగా నడిపించే చైర్మన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఎంపిక కోసం మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలతో విస్తృత సంప్రదింపులు జరపడం బీజేపీకి తప్పనిసరి.
జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ ప్రస్థానం ఇక్కడితో ముగియదని, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా జాట్ సామాజిక వర్గం రైతుల ప్రతినిధిగా ఆయన ఒక కొత్త రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన రాజీనామా భారత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది, రాబోయే రోజుల్లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
రిటైర్మెంట్ తర్వాత వేదాలు , ఉపనిషత్తులు చదువుతారట … నేచురల్ ఫార్మింగ్ చేస్తారట
అమిత్ షా . . కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలోనూ, కేంద్ర సర్కార్ లోనూ సెకండ్ ప్లేస్ లో ఉన్న అమిత్ షా తీసుకున్న నిర్ణయం దేశమంతా చర్చకు తెరతీసింది .
‘‘రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవాలని కోరికగా ఉంది . ప్రకృతి వ్యవసాయానికీ కొంత సమయాన్ని కేటాంయిచాలనుకుంటున్నాను . రసాయన ఎరువులు , పురుగుమందులతో పండించే పంటలతో జీవనశైలి రోగాలైన బీపీ, డయాబెటిస్, థైరాయిడ్‌తో పాటు ప్రాణాంతక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫర్టిలైజర్ల వాడకంపై రైతు సోదరులంతా సామూహికంగా ఆలోచించాల్సి ఉంది. బలమైన నిర్ణయం తీసుకోవాలి . ప్రకృతి వ్యవసాయంతో శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది.” అని అమిత్ షా తన రిటర్మెంట్ ప్రకటన సందర్బంగా చెప్పుకొచ్చారు .
మరో సహకార ఉద్యమం రావాలి . కేంద్ర సహకార శాఖ నాలుగో ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సహకార్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గుజరాత్‌లోని ఆనంద్‌లో చేపట్టిన కార్యక్రమానికి అమిత్ షా తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. అమూల్ డెయిరీకి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పీపుల్, పీఏసీఎస్, ప్లాట్‌ఫాం, పాలసీ, ప్రాస్పరిటీతో కూడిన కోపరేటివ్ ఉద్యమం దేశవ్యాప్తంగా రావాలని పిలుపునిచ్చారు.సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా తెలిపారు. సహకార రంగం వల్ల అనేక మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేలా సాయ పడిందని గుర్తు చేశారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, నేను మాత్రం సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని పేదలు, రైతులు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఇంధన బ్యాన్ ఎఫెక్ట్- రూ.70 లక్షల కారు రూ.10 లక్షలకే
‘న్యూ పాలసీ’ ఎఫెక్ట్‌తో లగ్జరీ కార్లను సైతం తక్కువ ధరకు అమ్మేస్తున్న దిల్లీ వాసులు
”పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలు , 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిషేధం.” అంటూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో . .. గడువు తీరిన కార్లను నామమాత్రపు ధరలకు అమ్మకానికి పెడుతున్నారు.
దేశ రాజధాని దిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహన పాలసీ ఎఫెక్ట్‌తో ఎంతోమంది ఇప్పటికే కార్లను కారుచౌకగా అమ్మేశారు.
దిల్లీ వాస్తవ్యుడు నితిన్ గోయల్ రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను రూ.8 లక్షలకే అమ్మేశారు. రూ.40 లక్షల మెర్సిడెజ్ సీ క్లాస్ 220 సీడీఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూ.4 లక్షలకే అమ్మారు. దిల్లీకే చెందిన రితేశ్ గందోత్ర రూ.55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీ కారును నామమాత్రపు రేటుకు విక్రయించారు. వాహన పాలసీపై దిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ సర్కారు పునరాలోచనలో పడింది. త్వరలోనే కొత్త వాహన పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తును మొదలుపెట్టింది. ఈ పనేదో కొన్ని నెలల ముందే మొదలుపెట్టి ఉంటే తాము కార్లను చౌకగా అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని బాధిత వాహనదారులు వాపోతున్నారు.
ఎన్‌జీటీ ఆదేశాలు అమల్లోకి- వాహనదారులకు చుక్కలు దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కీలక ఆదేశాలిచ్చింది. పదేళ్లకుపైగా వినియోగించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకుపైగా వినియోగించిన పెట్రోలు వాహనాలను దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతించరాదని నిర్దేశించింది. ఆ ఆదేశాలను తదుపరిగా సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనదారులకు డెడ్‌లైన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్‌జీటీ ఆదేశాల అమలులో భాగంగానే జులై 1 నుంచి గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంధనమే పోయనప్పుడు కార్లను మాత్రం ఏం చేసుకుంటామని చాలామంది వాహనదారులు భావించారు. వారంతా తమ వాహనాలను తక్కువ రేట్లకే దిల్లీ అవతలి వ్యక్తులకు అమ్ముకున్నారు. అయితే దీనిపై వ్యతికేత వ్యక్తం కావడంతో సర్కారు మళ్లీ పునరాలోచనలో పడింది.
వీలైనంత త్వరగా ఒక పరిష్కారం చూపిస్తాం : దిల్లీ సర్కారు కాలం చెల్లిన పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఇంధనం పోయకూడదనే నిర్ణయంపై దిల్లీ సర్కార్ వెనుకడుగు వేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని సాధించే దిశగా కసరత్తు చేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం రోజున ఈ అంశంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)కి దిల్లీ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరింది.
బ్యాన్‌తో ఇబ్బందిపడుతున్న జనం గడువు తీరిన వాహనాలకు ఇంధనం కొట్టకుండా డిల్హే సర్కార్ తీసుకువచ్చిన పాలసీతో ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్ విధించడం సరికాదని, దాని అమలులో సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బ్యాన్‌తో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ఆయా వాహనాలపై బ్యాన్‌ను వెంటనే అమల్లోకి తేవాలనేది అపరిపక్వ నిర్ణయమని మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. కొంత గడువు ఇచ్చిన తర్వాత బ్యాన్ చేయడం కరెక్ట్ అంటూ పలు వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది .
జగన్ మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు కాంగ్రెస్ ఏపీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ సంచలన పోస్ట్
తెలంగాణలో కవిత , ఢిల్లీలో సీఎం , డిప్ట్యూటీ సీఎంల అరెస్ట్ . .. జగన్ ని వదిలేసినట్లు ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం లో వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఫోకస్ పెరిగింది. కూటమి సర్కార్ ఇప్పటికే మద్యం కుంభకోణంపై పలువురు కీలక నేతలపై కేసులు పెట్టడం , కొందరి అరెస్ట్ జరిగాయి. ఇప్పటి వరకు అరెస్టయిన నేతలు , అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా జగన్ పై కూడా మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది . అయితే కేంద్రం పెద్దల గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో జగన్ వరకు వచ్చి . .. ఈ కేసు ఆగింది.
మాణికం ఠాకూర్ సంచలన పోస్ట్
వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం – జగన్ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ పోస్ట్
జగన్ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాకూర్ ఆరోపించారు . వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణంపై మాణికం ఠాగూర్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జగన్ మద్యం కుంభకోణం శాస్త్రీయ అవినీతి మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్ మద్యం కుంభకోణం, విదేశాల్లో పెట్టుబడులు, కుట్ర కోణాలు అంటూ పలు ఆరోపణలు చేశారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను జగన్ క్యాష్ క్యారియర్లుగా వాడుకున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి, అమరావతిలోని ఫ్లాట్లలో కరెన్సీని బాక్సుల్లో దాచారని మద్యం డబ్బుతో విదేశాల్లో లిక్కర్ ఫ్యాక్టరీలు నెలకొల్పారని అన్నారు. ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు దుబాయ్, టాంజానియా, దక్షిణాఫ్రికాలో భేటీ అయ్యేవారని తెలిపారు. దీనిపై కేంద్రం మౌనంగా ఉండి ఈ మద్యం కుంభకోణానికి సహకరించిందని మాణికం ఠాకూర్ విమర్శించారు . కేంద్ర బీజేపీ పెద్దల సహకారం లేకపోతె జగన్ ఎప్పుడో అరెస్టయ్యేవారని పేర్కొన్నారు .
యోగాంధ్రకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ – అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
” యోగాకు మతం లేదు . కులంలేదు . అందరు హ్యాపీగా చేయొచ్చు . . గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది . గ్రామగ్రామాల్లో యువకులు, మహిళలు , చిన్నారులు యోగాను అనుసరిస్తున్నారు.యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని భారత్ నిరూపించింది . యోగాదినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి . . 175 దేశాల్లో యోగా చేయడం అసాధారణ విషయం” ” అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు . విశాఖలో యోగాంధ్ర లో ముఖ్య అతిధిగా పాలొన్న ప్రధాని ఈ సందర్బంగా యోగాసనాలు వేశారు . ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అని, చంద్రబాబు, పవన్ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారని కొనియాడారు.
నూనె తగ్గంపు ఛాలెంజ్ “ యోగాడే సందర్బంగా వంటల్లో 10 శాతం నూనె తగ్గించి వాడటం ప్రారంభిద్దాం . .. ఇది ఛాలెంజ్గా తీసుకుందాం . ..అని మోడీ ఇచ్చిన ఛాలెంజ్ ను యోగాంధ్రలో పాల్గొన్న వారంతా కరతాళ ధ్వనులతో స్వీకరించారు .
వ్యక్తిగత క్రమశిక్షణ ప్రకృతిలో మనిషి భాగస్వామి అని, యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్న , యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని మోడీ స్పష్టం చేసారు. క్రమం తప్పకుండ యోగ చేసే వారిలో వ్యక్తిగత క్రమశిక్షణ అలవాడుతుందన్నారు. ఇది వ్యక్తి అనూహ్య విజయాలకు దారిదీపం చూపుతుందని పేర్కొన్నారు .
భారతీయ సంస్కృతి అందరి క్షేమం కాంక్షిస్తుందన్న ప్రధాని, యోగాపై దేశంలోని అనేక వైద్యసంస్థలు పరిశోధన చేస్తున్నాయని తెలిపారు. యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయని, గుండె, నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందని చెప్పారు. మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతుందన్న ప్రధాని, అంతర్జాతీయ చికిత్సా కేంద్రంగా భారత్ మారుతోందన్నారు.
మోడీతో యోగా ట్రెండ్ సెట్టర్ . .. చంద్రబాబు
ప్రధాని మోడీ చొరవతో యోగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ గా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు . యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని చెప్పారు . – యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించడం మోడీ వల్లే సాధ్యమైందన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ప్రధాని మోడీని అందరూ ప్రశంసించాలన్నారు .
గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..
విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో విజయం సాధించింది . ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది . విశాఖపట్నం రామకృష్ణ బీచ్ సందడిగా మారింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేసి . .. రికార్డ్ క్రియేట్ చేశారు .
విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 25వేల మంది గిరిజన విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సాధనలో భాగంగా ఏయూ మైదానంలో 25వేల మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ విద్యార్థులను సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేశ్ అభినందించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ సింధూరం మొక్కను నాటారు . ‘ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం ద్వారా 700 కి.మీ మేర విస్తరించి ఉన్న ఆరావళి పర్వతశ్రేణులను హరితభరితం చేయాలనేది మా లక్ష్యం. ప్రజలతో మొక్కలు నాటించి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును బలోపేతం చేయడమే మా సంకల్పం. ఆరావళి పర్వతశ్రేణులు ఈ భూమిపైనే అత్యంత ప్రాచీనమైనవి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హరియాణా, దిల్లీలలో విస్తరించి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పర్వతశ్రేణులు సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. పర్యావరణపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆయా సవాళ్లను అధిగమించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆరావళి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంచేందుకు మా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎక్కడికక్కడ స్థానిక అధికార యంత్రాంగాలతో కలిసి పనిచేయబోతున్నాం. జల వ్యవస్థల నిర్వహణను మెరుగుపర్చడం, ఇసుక తుఫానులకు నిరోధించడం, థార్ ఎడారి తూర్పు వైపుగా విస్తరించకుండా నిలువరించడం వంటివన్నీ చేయబోతున్నాం’’ అని పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు .
‘ఆపరేషన్ సిందూర్’ను గుర్తు చేస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ సిందూరం మొక్కను నాటారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గురువారం తన అధికారిక నివాసానికి సమీపంలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్క నాటి ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలోని ప్రతీ ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడి, పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పేరు ‘ఆపరేషన్ సిందూర్’. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని మోదీ సిందూరం మొక్కను నాటడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రత్యేకంగా హాజరయ్యారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, దిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కూడా పాల్గొన్నారు.