రిటైర్మెంట్ తర్వాత వేదాలు , ఉపనిషత్తులు చదువుతారట … నేచురల్ ఫార్మింగ్ చేస్తారట
అమిత్ షా . . కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలోనూ, కేంద్ర సర్కార్ లోనూ సెకండ్ ప్లేస్ లో ఉన్న అమిత్ షా తీసుకున్న నిర్ణయం దేశమంతా చర్చకు తెరతీసింది .
‘‘రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవాలని కోరికగా ఉంది . ప్రకృతి వ్యవసాయానికీ కొంత సమయాన్ని కేటాంయిచాలనుకుంటున్నాను . రసాయన ఎరువులు , పురుగుమందులతో పండించే పంటలతో జీవనశైలి రోగాలైన బీపీ, డయాబెటిస్, థైరాయిడ్‌తో పాటు ప్రాణాంతక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫర్టిలైజర్ల వాడకంపై రైతు సోదరులంతా సామూహికంగా ఆలోచించాల్సి ఉంది. బలమైన నిర్ణయం తీసుకోవాలి . ప్రకృతి వ్యవసాయంతో శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది.” అని అమిత్ షా తన రిటర్మెంట్ ప్రకటన సందర్బంగా చెప్పుకొచ్చారు .
మరో సహకార ఉద్యమం రావాలి .
కేంద్ర సహకార శాఖ నాలుగో ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సహకార్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గుజరాత్‌లోని ఆనంద్‌లో చేపట్టిన కార్యక్రమానికి అమిత్ షా తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. అమూల్ డెయిరీకి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పీపుల్, పీఏసీఎస్, ప్లాట్‌ఫాం, పాలసీ, ప్రాస్పరిటీతో కూడిన కోపరేటివ్ ఉద్యమం దేశవ్యాప్తంగా రావాలని పిలుపునిచ్చారు.సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా తెలిపారు. సహకార రంగం వల్ల అనేక మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేలా సాయ పడిందని గుర్తు చేశారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, నేను మాత్రం సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని పేదలు, రైతులు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.



