by Abhi Correspondent | Nov 1, 2025 | జనరల్, పరిశీలన
భారత్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ సర్కార్ ప్రచారం . . అమెరికన్ యువతను రెచ్చగొట్టే రీతిలో పబ్లిసిటీ . .
టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు దక్కుతాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం స్థానికతను తెరపైకి తేవడం ద్వారా అమెరికన్ల హృదయాలలో తన స్థానాన్ని పదిలపరచుకోవాలని వేస్తున్న ఎత్తులు అన్నీ , ఇన్నీ కావు .
ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ ఉద్యోగాల విధానంపై దృష్టి మరింత పెట్టింది. తాజాగా అమెరికా కార్మిక శాఖ (U.S. Department of Labor) సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక కొత్త వీడియో ప్రకటన ఈ మార్పును బలంగా ప్రతిబింబిస్తోంది. American Dream Stolen అనే శీర్షికతో విడుదలైన ఈ ప్రచారం, కంపెనీలు H-1B వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చూపుతోంది . , తక్కువ వేతనాలపై విదేశీ కార్మికులను నియమించడం ద్వారా యువ అమెరికన్ల అవకాశాలను హరించాయని ఆరోపిస్తూ . .. ఇందులో ఉంది . ఇలాంటి వాటిని భారత్‌ను ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లబ్ధిదారుగా హైలైట్ చేస్తుండటం గమనార్హం . ప్రస్తుతం జారీ అయ్యే H-1B వీసాల్లో సుమారు 72 శాతం భారతీయ పౌరులకే వెళ్తున్నాయని, ఇది టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లో అత్యధికమని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రకటనలో స్పష్టంగా చెప్పకపోయినా, వీడియోలో చూపించిన గణాంకాలు, టెక్స్ట్‌లు భారతీయ ఐటీ నిపుణులను లక్ష్యంగా చేస్తున్నట్లు అర్ధం అవుతోంది .
1950ల కాలం నాటి అమెరికా దృశ్యాలను ఈ వీడియోలో చూపిస్తూ.. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న అమెరికన్లు, సంతోషంగా జీవిస్తున్న కుటుంబాలు.. ”The American Dream was built on hard work and opportunity” అనే టాగ్ లైన్‌తో ప్రారంభమవుతుంది. కానీ తరువాతి సెకన్లలో ”That dream was stolen from young Americans” అనే పదాలతో అమెరికా యొక్క వీసా దుర్వినియోగం కారణంగా ఈ దేశంలో యువతకు అవకాశాలు కోల్పోయినట్లు.. వాటిని వేరేవాళ్లు ఎత్తుకుపోతున్నట్లు చూపిస్తుంది. దీని లక్ష్యం ఏంటంటే.. అమెరికన్ కార్మికులను తక్కువ వేతనాలపై నియమించే విదేశీ వర్కర్లతో భర్తీ చేయకుండా కార్పొరేట్ కంపెనీలను అడ్డుకోవడం .. అని అక్కడివారు భావిస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు . ”ఒక అమెరికన్ ఉద్యోగం ముందుగా ఒక అమెరికన్‌కే చెందాలి. మేము చట్టబద్ధమైన వలసలకు వ్యతిరేకం కాదు, దాని దోపిడీకి వ్యతిరేకం” అంటూ స్థానిక యువతలో చైతన్యం కలిగిస్తున్నామంటూ చెప్పుకుంటున్నారు .
by Abhi Correspondent | Oct 3, 2025 | జనరల్
- ఆవిష్కరణల రంగంలో ఇండియా ఓ గ్లోబల్ లీడర్ అవుతుందంటూ కితాబు
- ‘వికసిత భారత్ 2047’ లక్ష్యానికి మద్దతుగా గేట్స్ ప్రకటన
- భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మేలు చేస్తాయని వ్యాఖ్య
. ”ఆవిష్కరణల రంగంలో భారత్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలుస్తోంది .., అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా ఉంది … అని బిల్ గేట్స్ కొనియాడారు. భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికాలోని సియాటిల్‌లో భారత కాన్సులేట్ జనరల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్ మాట్లాడుతూ… “ఈ రోజు భారత్ ఆవిష్కరణల్లో గ్లోబల్ లీడర్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను కాపాడి, మెరుగుపరిచే పరిష్కారాలను అందిస్తోంది. ‘వికసిత భారత్ 2047’ లక్ష్య సాధనలో భారత్‌తో మా భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు. గాంధీజీ ఆశయాలైన సమానత్వం, గౌరవం తమ ఫౌండేషన్ పనికి పునాది వంటివని గేట్స్ పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి, కళలు, సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. వాషింగ్టన్, సియాటిల్ నగర ప్రభుత్వాల నుంచి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ‘ప్రస్తుత ప్రపంచంలో గాంధీ విలువల ప్రాముఖ్యత’ అనే అంశంపై యూఎస్ గ్లోబల్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు జొనాథన్ గ్రానోఫ్ ప్రత్యేక ప్రసంగం చేశారు.
బెల్వ్యూ పబ్లిక్ లైబ్రరీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, సియాటిల్ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
by Abhi Correspondent | Sep 15, 2025 | జనరల్
ఇంజనీరింగ్ నైపుణ్యంలోనే కాదు . . నైతిక విలువల్లోనూ ఆణిముత్యం విశ్వేశ్వరరావు
2017 ఆగష్టులో జూబ్లీ హిల్ల్స్ పబ్లిక్ స్కూలు విద్యార్థులను ఉద్దేశించి పూజ్య గురువులు చేసిన ప్రసంగములో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నిజాయితీ ని గురించిన విశేషములు, శ్రీ విశ్వేశ్వరయ్య గారి జన్మదినము సందర్భముగా…
…ఆ రోజులలో ప్రభుత్వ ఇంజినీర్లు ఎన్నో గ్రామాలలో తిరిగి, వారి నివేదికలు చేతితో వ్రాసి, తయారు చేసి, ప్రభుత్వానికి ఇవ్వవలసిన పరిస్థితి. ఒకానొక సమయములో శ్రీ విశ్వేశ్వరయ్య గారు ఒక గ్రామములో ఒక నివేదిక తయారు చేయటము కొరకు ఆ గ్రామములోని ఒక పెద్ద మనిషి ఇంటిలో బస చేసారు. పగలంతా తిరిగి, అక్కడ జరిగే ప్రాజెక్టు పనులు అధ్యయనము చేసి, రాత్రికి నివేదిక తయారు చెయ్యటానికి ఉద్యుక్తులయ్యారు విశ్వేశ్వరయ్య గారు. ఆ రోజు రాత్రి అక్కడ విద్యుత్తు లేదు. కానీ ఆ నివేదిక వ్రాయటము వాయిదా వేస్తే తాను ఎమైనా మరచిపోతానేమోనని తన సంచీలోనుంచి ఒక కొవ్వొత్తిని తీసి దాని వెలుగులో తన నివేదిక పూర్తి చేసారు వారు.
సహజముగానే పుస్తక పఠనాసక్తులయిన విశ్వేశ్వరయ్య గారు ఆ కొవ్వొత్తిని ఆర్పి మరొక కొవ్వొత్తిని వెలిగించి, దాని వెలుగులో తన పుస్తక పఠన చేయసాగారు. ఇది చూచిన ఆ ఇంటి పెద్దాయన విశ్వేశ్వరయ్య గారి వద్దకు వెళ్ళి – “అయ్యా…ఈ రెండు కొవ్వొత్తులు ఏమిటి? ఒక కొవ్వొత్తి ఆర్పి, రెండవ కొవ్వొత్తి కాంతి లో ఎందుకు చదువుతున్నారు?” అని కుతూహలముగా అడిగారు. “నేను వాడిన మొదటి కొవ్వొత్తి నాకు ప్రభుత్వము వారు విద్యుత్తు లేనప్పుడు నా ఉద్యోగ ధర్మములో ఉపయోగపడుతుందని ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నది నా ఉద్యోగము కాదుగా…నాకు ఆసక్తయిన పుస్తక పఠనము. దీనికి వారిచ్చిన కొవ్వొత్తి వాడితే ప్రభుత్వ వనరులు దుర్వినియోగ పరచటమవుతుంది కదా…బాధ్యతగల పౌరులుగా మనము అది చేయకూడదు. అందుకే, నా సొంత పనులకు నా సొంత కొవ్వొత్తినే వాడుతా…” అని చెప్పారు విశ్వేశ్వరయ్య గారు. విశ్వేశ్వరయ్య గారి నిజాయితీకి ఆ పెద్దాయన అబ్బురపడ్డారు…
విశ్వేశ్వరయ్య గారి స్వామి భక్తి, నిజాయితీ మన అందరికీ…కేవలము ఇంజినీర్లకే కాదు, నేటి సమాజములో అందరికీ ఆదర్శము. అందుచేతనే వారు ప్రాతఃస్మరణీయులు అయ్యారు.
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కూడా తరచూ మోక్షగుండం విశ్వేశ్వరరావు గురించి , అయన నైతికత గురించి చెపుతూ ఉంటారు .
by Rama Chandra P | Sep 11, 2025 | జనరల్
నేపాల్: యువత ఆగ్రహం, రాజకీయ అనిశ్చితి
మనం బాగుంటే సరిపోదు . ఇరుగు పొరుగు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి అలజడులు , అశాంతి మన పక్కన ఉన్నా మనకు కూడా మనఃశాంతి కరువవుతుంది . ఇది కుటుంబాలకే కాదు . . దేశాలకు వర్తిస్తుంది .
నేపాల్‌లో చెలరేగిన యువత నిరసనలు, ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం తక్షణ కారణమైనప్పటికీ, అసలు కారణాలు నిరుద్యోగం, అవినీతి, పాలన వైఫల్యం. ఈ “జెన్-జీ” నిరసనల దెబ్బకు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభం మధ్య, ఖాట్మండు మేయర్ బలేంద్ర షా ఒక కొత్త నాయకుడిగా ఆవిర్భవించారు.
నేపాల్‌లో అస్థిరత అంటే, భారత్‌కు తలనొప్పే. మనకు నేపాల్‌తో స్వేచ్ఛా సరిహద్దు ఉంది. అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడితే, ఆ ప్రదేశాన్ని చైనా తన పలుకుబడి పెంచుకోవడానికి ఉపయోగించుకుంటుంది. ఇది భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం.
భారతదేశం ఒక సంక్లిష్టమైన, చారిత్రాత్మకమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది. అయితే, గడిచిన ఏడాది, రెండేళ్లలో ఈ ప్రాంతం అగ్నిగుండంలా మారింది. పాకిస్థాన్ నుంచి మాల్దీవుల వరకు, దాదాపు ప్రతి పొరుగు దేశం తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక పతనం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, జాతి ఘర్షణలు మన సరిహద్దుల వద్ద ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ అల్లకల్లోలం కేవలం వారి అంతర్గత సమస్య మాత్రమే కాదు, భారతదేశ జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది.
పాకిస్థాన్: ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, దాని రాజకీయ, భద్రతా పరిస్థితి మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉంది. బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐని రాజకీయంగా పక్కన పెట్టడంతో దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ అస్థిరతే ఉగ్రవాదులకు వరంగా మారింది. ముఖ్యంగా, తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడులు తీవ్రమయ్యాయి. 2025 మొదటి త్రైమాసికంలోనే పాకిస్థాన్‌లో 200లకు పైగా ఉగ్రదాడులు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పాకిస్థాన్ అస్థిరత భారత్‌కు ఎప్పుడూ ముప్పే. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పినట్లు, “పాకిస్థాన్ అనుసరిస్తున్న ప్రచ్ఛన్న యుద్ధ తంత్రం” భారత్ భద్రతకు రెండో అతిపెద్ద ముప్పు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పెరిగితే, అది కశ్మీర్‌లోకి చొరబాట్లను ప్రోత్సహిస్తుంది. ఆర్థిక పతనం అంచున ఉన్న అణ్వస్త్ర దేశం పక్కన ఉండటం, వ్యూహాత్మకంగా భారత్‌కు పెను సవాలు.
బంగ్లాదేశ్: రాజకీయ శూన్యత, మతతత్వం
ఒకప్పుడు స్థిరంగా కనిపించిన బంగ్లాదేశ్, ఇప్పుడు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. 2024 “జూలై విప్లవం” తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మే 2025లో, హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించారు. ఈ రాజకీయ శూన్యత భద్రతా వ్యవస్థను బలహీనపరిచింది. ఇదే అదనుగా అల్-ఖైదా, ఐఎస్ఐఎస్, హిజ్బ్ ఉత్-తహ్రీర్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు మళ్లీ బలపడుతున్నాయి.
బంగ్లాదేశ్‌లో మతతత్వ శక్తులు బలపడటం భారత్‌కు మంచిది కాదు. ఇది పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో భద్రతా సమస్యలను సృష్టిస్తుంది. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద నెట్‌వర్క్‌లు పునరుజ్జీవం పొందే ప్రమాదం ఉంది. దీనికి తోడు, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌లో ఉన్న పది లక్షల మందికి పైగా రోహింగ్యా శరణార్థుల సమస్య ఉంది. నిధుల కొరతతో వారి శిబిరాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఇది అక్రమ వలసలను, మానవ అక్రమ రవాణాను పెంచుతోంది.
శ్రీలంక: ఆర్థిక పునరుజ్జీవనం, జాతి విభేదాలు
2022లో ఘోరమైన ఆర్థిక పతనం తర్వాత, శ్రీలంక నెమ్మదిగా కోలుకుంటోంది. 2025 నాటికి విదేశీ మారక నిల్వలు 6.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి, ఆర్థిక వృద్ధి కనిపిస్తోంది. కానీ, రాజకీయంగా పరిస్థితి సున్నితంగానే ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన నేషనల్ పీపుల్స్ పవర్ (NPP) ప్రభుత్వం, తమిళ మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. దీనివల్ల జాతి విభేదాలు చాప కింద నీరులా ఉన్నాయి.
శ్రీలంకలో భారత్‌కు అతిపెద్ద ఆందోళన చైనా ప్రభావం. ఆర్థిక సహాయం పేరుతో చైనా, శ్రీలంకలో వ్యూహాత్మకంగా పాగా వేస్తోంది. హంబన్‌తోటలో చైనాకు చెందిన సినోపెక్ నిర్మిస్తున్న 3.7 బిలియన్ డాలర్ల ఆయిల్ రిఫైనరీ, హిందూ మహాసముద్రంలో భారత నౌకా భద్రతకు ప్రత్యక్ష సవాలు.
మాల్దీవులు: చైనా నీడ నుంచి బయటకు..
అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు “ఇండియా ఔట్” ప్రచారంతో అధికారంలోకి వచ్చినప్పుడు, మాల్దీవులు పూర్తిగా చైనా వైపు వెళ్లిపోతుందని భావించారు. కానీ, 2025 మధ్య నాటికి పరిస్థితి అనూహ్యంగా మారింది. జూలై 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన, సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భారత్ సుమారు 560 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని, రక్షణ సహకారాన్ని ప్రకటించింది. ఇది చైనాకు వ్యూహాత్మక చెక్ పెట్టింది.
హిందూ మహాసముద్రంలో మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలకమైనవి. అక్కడి ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా మారితే, మన సముద్ర భద్రతకు పెను ముప్పు. ప్రస్తుతం సంబంధాలు మెరుగుపడటం ఒక మంచి పరిణామం, కానీ ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేం.
భూటాన్: చైనాతో సరిహద్దు చర్చలు
ప్రశాంతంగా కనిపించే భూటాన్‌లో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి, యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, దానివల్ల “బ్రెయిన్ డ్రెయిన్”. రెండోది, చైనాతో జరుగుతున్న సరిహద్దు చర్చలు. డోక్లాం పీఠభూమికి బదులుగా, ఉత్తరాన ఉన్న కొన్ని లోయలను తీసుకోవాలని చైనా భూటాన్‌పై ఒత్తిడి తెస్తోంది.
ఈ ప్రభావం అత్యంత తీవ్రమైనది. డోక్లాం పీఠభూమి, భారత్ యొక్క “సిలిగురి కారిడార్” (చికెన్స్ నెక్) భద్రతకు అత్యంత కీలకం. ఒకవేళ డోక్లాం చైనా చేతికి వెళ్తే, ఈశాన్య రాష్ట్రాలకు మిగతా భారతదేశంతో ఉన్న కీలకమైన మార్గంపై చైనా నేరుగా నిఘా పెట్టగలదు. ఇది భారతదేశ భద్రతకు పెను ప్రమాదం.
సరిహద్దుల వెంబడి రగులుతున్న ఈ సంక్షోభాలు, భారతదేశ విదేశాంగ, భద్రతా విధాన రూపకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, శరణార్థుల ప్రవాహాన్ని నియంత్రించడం, చైనా వ్యూహాత్మక విస్తరణను అడ్డుకోవడం, అదే సమయంలో ఈ దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగించడం ఒక కత్తి మీద సాము లాంటిది. రాబోయే కాలంలో, భారత్ మరింత చురుకైన, దృఢమైన, వ్యూహాత్మక విదేశాంగ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
by Rama Chandra P | Aug 31, 2025 | జనరల్
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో చర్చ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ ఎస్‌సీఓ (Shanghai Cooperation Organization) 25వ శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారు. రష్యా, చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్న ఈ వేదికపై, అదీ చైనా గడ్డపై మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదు. సరిహద్దుల్లో ఘర్షణల తర్వాత భారత్, చైనా మధ్య నెలకొన్న అపనమ్మకం, అమెరికా వాణిజ్య ఆంక్షలతో మారుతున్న ప్రపంచ సమీకరణాల నడుమ ఈ సదస్సు జరుగుతోంది. అందుకే, యావత్ ప్రపంచం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.
సదస్సు ప్రాధాన్యత, పూర్వాపరాలు
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐదేళ్ల పాటు ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు జరగలేదు. అయితే, గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ (Brazil, Russia, India, China, South Africa)సదస్సులో మోదీ, జిన్‌పింగ్ సమావేశమవ్వడంతో ప్రతిష్టంభన తొలగిపోయే సూచనలు కనిపించాయి. ఈ క్రమంలోనే, ఆగస్టు 2025లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌లో పర్యటించారు. సరిహద్దు వివాద పరిష్కారానికి కొత్త యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఈ సానుకూల వాతావరణానికి మరో ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ పరిణామం భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో, తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ, ప్రాంతీయ వాణిజ్య మార్గాలను బలోపేతం చేసుకోవడం భారత్‌కు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలోనే చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి భారత్ మొగ్గు చూపుతోంది. ఈ సదస్సు ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ఒక పరీక్ష లాంటిది.
సదస్సులో భారత్ అజెండా: ఈ సమావేశంలో భారత్ రెండు కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
ప్రాంతీయ భద్రత: సరిహద్దు తీవ్రవాదం భారత్‌కు ఎప్పటినుంచో ఉన్న అతిపెద్ద సవాలు. ఈ సమస్యను ఎస్‌సీఓ వేదికగా గట్టిగా ప్రస్తావించాలని మోదీ భావిస్తున్నారు. సంస్థ ఉగ్రవాద నిరోధక విభాగం RATS (Regional Anti-Terrorist Structure — ఇది ఎస్‌సీఓ యొక్క శాశ్వత అవయవం, సభ్య దేశాల మధ్య ఉగ్రవాద వ్యతిరేక సమన్వయాన్ని నిర్వహిస్తుంది.) ద్వారా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని భారత్ డిమాండ్ చేయనుంది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా, వారి నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు సభ్య దేశాల మధ్య సమన్వయం పెరగాలని కోరనుంది.
వాణిజ్యం, అనుసంధానం: అమెరికా సుంకాల ప్రభావంతో ప్రాంతీయ వాణిజ్య మార్గాలను బలోపేతం చేసుకోవడం భారత్‌కు అత్యవసరం. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ INSTC – (International North-South Transport Corridor — భారత్, ఇరాన్, రష్యా మరియు యూరప్‌ను కలిపే బహుమాధ్య రవాణా మార్గాల సమూహం), చాబహార్ ఓడరేవు వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని భారత్ ప్రతిపాదించనుంది. ఇవి చైనా ఆధిపత్యంలోని వాణిజ్య మార్గాలకు ప్రత్యామ్నాయాలను అందిస్తాయి. మధ్య ఆసియా దేశాలతో భారత్‌కు నేరుగా సంబంధాలు పెంచుతాయి.
భారత్ ముందున్న సవాళ్లు
ఎస్‌సీఓలో చైనా, రష్యా వంటి దేశాలతో భారత్ వేదిక పంచుకుంటున్నప్పటికీ, అదే సమయంలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్ కూటమిలోనూ క్రియాశీలకంగా ఉంది. క్వాడ్ (Quadrilateral Security Dialogue — భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా) కూటమి చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికే ఏర్పడిందన్నది బహిరంగ రహస్యం. ఈ సదస్సుకు ముందు మోదీ జపాన్‌లో పర్యటించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని నొక్కి చెప్పడం గమనార్హం. ఇలా భిన్న ప్రయోజనాలున్న కూటములతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం భారత విదేశాంగ విధానానికి ఒక కత్తి మీద సాము లాంటిది.
మొత్తం మీద, ఈ ఎస్‌సీఓ సదస్సు భారత్‌కు ఒక పెద్ద అవకాశం, అదే సమయంలో ఒక సవాలు. తీవ్రవాదం, సమాన వృద్ధి, వాతావరణ మార్పులు వంటి అంశాలపై తన గొంతు వినిపించి, ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భారత్ చూస్తోంది. టియాంజిన్ సదస్సు ఈ దిశగా భారత్ ప్రయాణంలో ఒక కీలక మైలురాయి కానుంది.
by Abhi Correspondent | Aug 14, 2025 | జనరల్
పూర్ణిమ తణుకు – బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్న తొలి తెలుగు మహిళ
” మా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తయ్యాక అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కాలేజీలో డిగ్రీ చదివా. ఆపై ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేశా. నాన్న విశ్వేశ్వరయ్య, టైపు ఇన్‌స్టిట్యూట్ నడిపేవారు. అమ్మ రత్నాంబ, గృహిణి. లండన్‌లో సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్ వెంకట సూర్యనారాయణతో పెళ్లవడంతో ఇక్కడే స్థిరపడ్డా. మొదట ఇంజినీరింగ్ కంపెనీలో కెరియర్ ఆరంభించా. తర్వాత యువత, పిల్లల కోసం పనిచేసే ‘రీజనరేషన్ ట్రస్ట్’కి మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించా. ఆపై జైళ్లలో ఉన్నవారికి విద్యను అందించేందుకు కృషి చేసిన తొలి ఆసియా మహిళగానూ గుర్తింపు దక్కించుకున్నా. ”
బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్నారు మన తెలుగు మహిళ పూర్ణిమ తణుకు.
బాలల సంరక్షణku పోరాటం : ప్రస్తుతం నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్ (ఎన్‌డీఎన్‌ఏ)కు ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నాఋ పూర్ణిమ . . ఇది యూకేలో బాలల సంరక్షణ, హక్కుల కోసం పనిచేసే అతిపెద్ద ఛారిటీ-మెంబర్‌షిప్ అసోసియేషన్. 2004లో ఈ సంస్థలో చేరారు . అప్పటికి 20 మంది సిబ్బందితో చిన్నగా ఉండేది. ఇప్పుడు మూడు శాఖలతో 100మందికిపైగా ఉద్యోగులతో శక్తిమంతమైన స్వచ్ఛంద సంస్థగా మార్చగలిగారు పూర్ణిమ . . యూకేలోని 15000 డే నర్సరీల హక్కుల కోసం పోరాడి రికార్డ్ క్రియేట్ చేసారు . . దాదాపు పదిలక్షల మందికిపైగా చిన్నారులు, వారి కుటుంబాలకు అత్యున్నత సంరక్షణ విధానాలు అమలయ్యేలా చేయగలిగానని వినంరంగా చెపుతారీమె .
అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళ : ”ఇంగ్లండ్ సహా 22 దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇలా 20 ఏళ్ల పాటు ఎన్‌డీఎన్‌ఏకు నాయకత్వం వహిస్తూ బాలల విద్యకు చేయూత అందించినందుకు గానూ పలు పురస్కారాలు దక్కాయి. 2011లో బ్రిటన్ పౌర పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (ఓబీఈ)ను కింగ్ చార్లెస్ చేతుల మీదుగా తీసుకున్నా. తాజాగా కమాండర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (సీబీఈ)ని చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అనీ అందించారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, నోబెల్ గ్రహీత హెరాల్డ్ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్ పీటర్ విల్కిన్సన్‌తోపాటు మనదేశం నుంచి ఈ గౌరవాన్ని పొందినవారిలో లీనా నాయర్ ఒకరు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళను నేనే కావడం గర్వంగా ఉంది.” అంటూ తనకు అవార్డు రావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ తెలుగు ఆడపడచు పూర్ణిమ .