వర్షాలు తక్కువే!  నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం

వర్షాలు తక్కువే! నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం

ఈ ఏడాది  సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడుతాయని ఐఎండీ అంచనా – సాధారణ సగటులో 92 శాతం వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడి – ఎల్‌నినో వల్ల వర్షాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా

ఎల్ నినో… ఇపుడు ఈ పేరు మన రైతాంగానికి నిద్రలేకుండా చేస్తోంది . తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తబోతున్నాయని ఇటీవల జరిగిన పరిశోధనలను ఐఎండీ నిర్ధారించడంతో మరింత అలజడి రేగింది .

దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీర్ఘకాలిక వర్షపాత అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో వర్షపాతం సాధారణ సగటులో 92 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. దీనికి అదనంగా లోటుగా 5 శాతం మార్పు ఉండవచ్చని తెలిపింది. ఐఎండీ అంచనాల ప్రకారం వర్షపాత అంచనా 1971-2020 మధ్య కాలంలో దేశ సగటు వర్షపాతం 87 సెం.మీ.గా ఉంది. ఈ ఏడాది వర్షపాతం ఇందులో 90 నుంచి 95 శాతం మధ్య (సాధారణం కంటే తక్కువ) నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని IMD అంచనా వేసింది.

ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీన ఎల్​నినో పరిస్థితులు తటస్థ స్థితికి మారుతున్నాయని అయితే రుతుపవన కాలంలో ఎల్​నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది సాధారణంగా వర్షాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నప్పటికీ, సీజన్ ముగిసే సమయానికి ‘పాజిటివ్ ఐఓడీ’ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ మోడల్స్ సూచిస్తున్నాయి.

మన దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఈశాన్య, వాయువ్య ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల గమనానికి సంబంధించి మరిన్ని ఖచ్చితమైన వివరాలతో కూడిన రెండో విడత అంచనాలను మే చివరి వారంలో విడుదల చేస్తామని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడు ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలను వెల్లడించనున్నారు.

ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాడ్పులు:  రాష్ట్రంలో రోజురోజుకీ ఎండలు, వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 11 గంటలు దాటిందంటే ప్రజల ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడతున్నారు. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఎల్ నినో దెబ్బ . .. జూన్ , జులై నెలల్లో వర్షాలు బాగా తక్కువ కురుస్తాయని చెపుతున్నారు . అంతేకాకుండా . . వర్షానికి , వర్షానికి మధ్య 40-50 రోజుల గ్యాప్ ఉంటుందని వేస్తున్న అంచనాలు ముక్యంగా మెట్ట ప్రాంత రైతాంగాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది .

అమరావతికి సైకత శిల్ప హారతి . ..

అమరావతికి సైకత శిల్ప హారతి . ..

సైకత శిల్పం….. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఫైనల్ చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించిన సందర్భంగా ”అమరావతి మన రాజధాని ‘ ‘ అన్న నినాదంతో రూపొందించిన సైకత శిల్పం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ , అతని కుమార్తెలు సోహిత, ధన్యత కలసి రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంది . ఆలోచింపచేస్తుంది .

స్వర్ణాంధ్రప్రదేశ్ కు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ పటం, ఆంధ్రప్రదేశ్ పచ్చగా ప్రకృతితో ఉండాలన్నట్టుగా చుట్టూ మొక్కలు, అభివృద్ధికి సూచికగా బుల్లెట్ ట్రైన్, ఆకాశ హార్మ్యాలు,విమానం, అమరావతికి గుర్తుగా బుద్ధుడు, ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం 35 వేల ఎకరాలను ఇచ్చిన రైతులకు గుర్తుగా ఒక రైతును ఈ సైకత శిల్పంలోరూపొందించడం జరిగింది…

పోలీసులకు మరణ శిక్ష …. హౌ డేర్ యు జస్టిస్ ? ?

పోలీసులకు మరణ శిక్ష …. హౌ డేర్ యు జస్టిస్ ? ?

తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్​డెత్ కేసు- 9మంది పోలీసులకు మరణశిక్ష

సత్తాంకుళం లాకప్​డెత్ కేసు- ఒక ఇన్​స్పెక్టర్ సహా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన మధురై సెషన్స్ కోర్టు

Sathankulam Father-Son Murder Case

 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాంకుళం లాకప్‌ డెత్ కేసులో మధురైలోని ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమ్ సృష్టించింది . వ్యాపారి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేయగా, విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కొవిడ్‌ కారణంగా మృతిచెందారు.

ఏమి జరిగింది . .. నిర్దేశించిన సమయం కంటే అదనపు సమయం మొబైల్ షాప్ తెరచి ఉంచారని కోవిద్ సమయంలో పోలీసులు జయరాజ్ ను, అతడి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు .

2020 జూన్‌ 19న జయరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కుమారుడు బెనిక్స్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని తన తండ్రిని కొట్టడాన్ని అడ్డుకున్నాడు. కోపోద్రికులైన పోలీసులు రెచ్చిపోయారు . విచక్షణ మరిచారు . ”పోలీసులతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాం . .మీకు తగిన బుద్ధి చెబుతాం” అంటూ ఇద్దరినీ రాత్రంతా పోలీస్ స్టేటషన్ లోనే విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికుడితో రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ వాంగ్మూలం, మెడికల్ రిపోర్ట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం సుమోటోగా స్పందించి, పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించారు . అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. సెప్టెంబర్ 2020లో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా, సోమవారం న్యాయస్థానం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది.

అయితే ఈ కేసులో మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలక0గా మారింది . స్టేషన్ లో రక్తపు మరకలను కూడా పోలీసులు తుడిపించేసారు . ప్రధాన సాక్షిగా ఉన్న సదరు మహిళా కానిస్టేబుల్ కి అత్యంత భారీ భద్రత కల్పించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి .

బ్యాంకు లాకర్లు..  సురక్షితమేనా ?

బ్యాంకు లాకర్లు.. సురక్షితమేనా ?

బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానంతో పెరుగుతున్న అనుమానాలు

బ్యాంకు లాకర్లలో దాచుకున్న విలువైన వస్తువులకి ఉన్న బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన ప్రశ్నకి ఇలా సమాచారం ఇచ్చారు.

లాకర్లలో దాచిన వస్తువులను బ్యాంకు అధికారులు చూడరు (చూడడం బ్యాంకు రూల్స్ కి విరుద్ధం) కాబట్టి, వాటిని రికార్డు చేయరు, అంచేత వాటి విలువ రిజిస్టర్ కాదు. సో.. విలువ ఆధారంగా బీమా కవరేజీ ఇవ్వబడదు.

దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంకుల్లో మోసాలు వంటివి జరిగిన సందర్భాల్లో లాకర్లకు నష్టం వాటిల్లితే లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సొమ్ముని బ్యాంకులు పరిహారంగా చెల్లిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు .

బ్యాంకు లాకర్ చార్జీలవిషయానికొస్తే.. భారతదేశంలో అనేక రేంజ్ లు ఉన్నాయి. ముఖ్యమైన జాతీయ బ్యాంకుల్లో పరిశీలిస్తే ఏరియా లొకేషన్, లాకర్ సైజు ని బట్టి ఏడాదికి 1000 రూపాయలనుంచి 12000 వరకూ లాకర్ అద్దె ఉంటుంది. కొన్ని ఇతర బ్యాంకుల్లో అత్యధికంగా 25000 నుంచి 40000 వరకూ కూడా వార్షిక లాకర్ చార్జీలు ఉన్నాయి.

దీన్ని బట్టి గరిష్టంగా లక్ష రూపాయల నుంచి 40 లక్షల వరకూ మాత్రమే లాకర్ నష్టానికి వినియోగదారులు పరిహారం పొందగలరన్నమాట.

బ్యాంక్ లాకర్లు సర్వ సురక్షితం అని భావిస్తారు, కానీ అవి 100% భద్రతను హామీ ఇవ్వవు. ఇంట్లో విలువైన వస్తువులను ఉంచడం ప్రమాదం కాబట్టి లాకర్లు అంతకంటే సురక్షితమైనవి. అయినప్పటికీ, పెద్ద స్థాయి దొంగతనాలు, సిబ్బంది ప్రమేయంతో జరిగే మోసాలు, అలాగే చెదలు, తేనెటీగలు, ఎలుకలు, నీటి లీకేజీ వంటి ఘటనల కారణంగా లాకర్లకు నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం.

బ్యాంక్ లాకర్లు బలమైన స్ట్రాంగ్ రూమ్స్ లోనే ఉంటాయి. అలారమ్‌లు, సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. అయినప్పటికీ, దొంగతనం, అగ్ని ప్రమాదం, వరదలు వంటి ఘటనల్లో నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది.

RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంక్ నిర్లక్ష్యం లేదా సిబ్బంది మోసం వల్ల లాకర్ దెబ్బతిన్నాకూడా బ్యాంక్ చెల్లించే పరిహారం వార్షిక అద్దెకి 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు, ఒక లాకర్ అద్దె ₹2,000 అయితే, గరిష్ట పరిహారం ₹2,00,000 మాత్రమే. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదం వంటి సహజ విపత్తుల వల్ల నష్టం జరిగితే, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు నిరూపిస్తే బ్యాంక్ నష్టానికి పైసా పరిహారం కూడా ఇవ్వక్కర్లేదు.

లాకర్ ఎంత చిన్నదైనా అందులో కుక్కి కుక్కి మరీ బంగారం, నగదు విలువైన పత్రాలను దాచడం కొందరు వినియోగదారుల అలవాటు. ప్రధానంగా అక్రమార్జనపరులు కొందరు లాకర్లను తమ రహస్య సంపదని దాచడం కోసం తీసుకుంటూ ఉంటారు.

కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది లాకర్‌లను దెబ్బతీయడం లేదా వాటిలో సొమ్ముని దొంగతనం చేయడం జరిగిన ఘటనలు కూడా పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. ఒక లాకర్‌ను 7 సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే, అద్దె చెల్లించినా కూడా బ్యాంక్ కి దాన్ని తెరిచే అధికారం ఉంది. వస్తువుల జాబితా ఉండదు కాబట్టి దొంగతనం జరిగితే నిరూపించడం కష్టం. అక్రమ సంపద అయితే.. కొందరు వినియోగదారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా కూడా మారుతుంది.

సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు లాకర్‌ను ఓపెన్ చేసి తనిఖీ చేయాలనీ బ్యాంకులు చెబుతాయి. లాకర్లలో భద్రపరచిన వస్తువుల జాబితా, ఫోటోలు, బిల్లులు ఇంట్లో భద్రపరచుకోవాలి. అలాగే

నామినీ రికార్డు పర్ఫెక్ట్ గా ఉంటే వినియోగదారుడు మరణించిన సందర్భంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తవు . దీనిపై స్పష్టంగా ఉండాలి .

ఇరాన్‌ సైన్యం క్షిపణి దాడి- అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసం

ఇరాన్‌ సైన్యం క్షిపణి దాడి- అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసం

భూతలదాడులకు దిగితే అమెరికా సైనికులు సొరచేపలకు ఆహారం అవుతారు: ఇరాన్ డెడ్లీ వార్నింగ్​

ఇరాన్ – అమెరికా యుద్ధం ఎటుదారితీస్తుందోనన్న ఆందోళన ఎక్కువవుతోంది . ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఇరాన్‌ సైన్యం చేసిన క్షిపణిదాడిలో సౌదీఅరేబియాలోని ప్రిన్స్‌సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసమైంది. బోయింగ్‌-707 మోడల్‌లో మార్పులు చేసి గగనతలంలో ఓ కమాండ్‌ సెంటర్‌లా రూపొందించిన ఈ3-సెంట్రీ అవాక్స్‌ చాలా శక్తిమంతమైంది. 250 మైళ్ల పరిధిలో గగనతలంలో ఏం జరిగినా ఈ విమానం అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదు.

పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో యుద్ధం భీకరంగా మారుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు మద్దతుగా హూతీ రెబెల్స్ దాడులు మొదలుపెట్టగా, భూతల దాడుల ప్రచారం మధ్య అమెరికాకు చెందిన మెరైన్లు పశ్చిమాసియాకు చేరుకోవటం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎటాక్ చేస్తుండగా, మరోవైపు టెహ్రాన్‌ సహా ఇతర ప్రాంతాల్లో ఐడీఎఫ్​ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా భూతల దాడులు ప్రారంభిస్తే వారి సైన్యం పర్షియన్‌ గల్ఫ్‌ సొర చేపలకు ఆహారం అవుతారని ఇరాన్‌ హెచ్చరించిడాం చర్చకు దారితీసింది . యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో 216 మంది చిన్నారులు సహా 2076 మంది మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు ఇంతవరకు ససేమిరా అన్న ఇరాన్‌, కాస్త బెట్టువీడినట్లు తెలుస్తోంది. షరతులతో కూడిన చర్చలకు అంగీకరించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్‌లో ఆదివారం మధ్యవర్తిత్వ ప్రక్రియపై జరిగే ప్రతిపాదిత చర్చలు యుద్ధ విరమణ లేదా తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్‌ అంగీకరించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. తక్షణమే దాడులు ఆపాలని, భవిష్యత్తులో దాడులు చేయబోమని విశ్వసనీయమైన గ్యారంటీ ఇవ్వాలనే షరతులు పెట్టినట్లు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చలకు ఇరాన్‌ 5 షరతులు పెట్టినట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు గల్ఫ్‌దేశాలు ప్రకటించాయి. గల్ఫ్‌ దేశాలకు డ్రోన్లతో రక్షణ కల్పించనున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హామీ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళ ఆయుధ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) పేర్కొంది. ముఖ్యమైన ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై దాడులను కొన్నిరోజుల్లో పూర్తిచేస్తామని తెలిపింది.