by Rama Chandra P | Jul 10, 2025 | జాతీయం
రిటైర్మెంట్ తర్వాత వేదాలు , ఉపనిషత్తులు చదువుతారట … నేచురల్ ఫార్మింగ్ చేస్తారట
అమిత్ షా . . కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలోనూ, కేంద్ర సర్కార్ లోనూ సెకండ్ ప్లేస్ లో ఉన్న అమిత్ షా తీసుకున్న నిర్ణయం దేశమంతా చర్చకు తెరతీసింది .
‘‘రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవాలని కోరికగా ఉంది . ప్రకృతి వ్యవసాయానికీ కొంత సమయాన్ని కేటాంయిచాలనుకుంటున్నాను . రసాయన ఎరువులు , పురుగుమందులతో పండించే పంటలతో జీవనశైలి రోగాలైన బీపీ, డయాబెటిస్, థైరాయిడ్‌తో పాటు ప్రాణాంతక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫర్టిలైజర్ల వాడకంపై రైతు సోదరులంతా సామూహికంగా ఆలోచించాల్సి ఉంది. బలమైన నిర్ణయం తీసుకోవాలి . ప్రకృతి వ్యవసాయంతో శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది.” అని అమిత్ షా తన రిటర్మెంట్ ప్రకటన సందర్బంగా చెప్పుకొచ్చారు .
మరో సహకార ఉద్యమం రావాలి .
కేంద్ర సహకార శాఖ నాలుగో ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సహకార్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గుజరాత్‌లోని ఆనంద్‌లో చేపట్టిన కార్యక్రమానికి అమిత్ షా తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. అమూల్ డెయిరీకి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పీపుల్, పీఏసీఎస్, ప్లాట్‌ఫాం, పాలసీ, ప్రాస్పరిటీతో కూడిన కోపరేటివ్ ఉద్యమం దేశవ్యాప్తంగా రావాలని పిలుపునిచ్చారు.సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా తెలిపారు. సహకార రంగం వల్ల అనేక మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేలా సాయ పడిందని గుర్తు చేశారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, నేను మాత్రం సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని పేదలు, రైతులు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
by Rama Chandra P | Jul 9, 2025 | ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం యాత్రలో బెంబేలెత్తిన జనం
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మామిడి రైతులను పరామర్శించే బంగారుపాళ్యం యాత్ర జనసమీకరణ డ్రామా గా మారింది . ఈ యాత్రకు 10 వేలమందిని అనుమతించాలని ఆయన పార్టీ ఆర్గనైజర్లు పోలీసులను కోరారు. మండలాల వారీగా ఎంతెంత మంది ఎన్నెన్ని వాహనాల్లో రావాలో స్థానిక వైసీపీ నేతలకు కోటాలు కూడా విధించారు. 500 మందికి మించి అనుమతించలేమని పోలీసులు సమాధానమిచ్చారు . జగన్ పార్టీవారికి లా అండ్ ఆర్డర్ తో పనిలేదు. ఈ సారికూడా పోలీసు ఆదేశాలను ధిక్కరించేసారు . ఇష్టానుసారం పేట్రేగిపోయారు .
జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పహారా కాస్తున్న పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వైసీపీ మూకల వీరంగం..
అయితే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా చేశారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్ యార్డ్‌లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించారు. పోలీసుల సూచనలను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
జగన్ కి జనసమీకరణ అవసరం :
151 స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన పార్టీకి, జన సమీకరణ ఒక రాజకీయ అవసరంగా మారింది. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి: 1) ఓటమి తర్వాత పార్టీ బలహీనపడిందనే ముద్రను చెరిపేయడం, 2) కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచడం, 3) అధికార పక్షానికి తమ బలాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శించడం.
ఈ వ్యూహం నిస్సందేహంగా నిరాశలో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని చురుకుగా ఉంచుతుంది.
* కోర్ ఓటర్ బేస్, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతుంది.
* నాయకుడి ఉనికిని, ప్రాముఖ్యతను మీడియాలో, ప్రజలలో నిరంతరం నిలుపుతుంది.
* కొత్త వివాదాలను సృష్టించడం ద్వారా అధికార పక్షాన్ని నిరంతరం రక్షణాత్మక స్థితిలో ఉంచుతుంది…. అని భావిస్తున్న వైసీపీ ఆ పార్టీ కేడర్ పైనా , నేతలపైనా జనంలో ఉన్న అభిప్రాయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదు .
వైసీపీ హంగామా వల్ల నష్టాలు:
* ప్రజా విసుగు (Public Fatigue): నిరంతరం పునరావృతమయ్యే రాజకీయ నాటకంగా ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఈ డ్రామా
తటస్థ ఓటర్లను జగన్ పార్టీకి దూరం చేస్తుంది. కిడ్నాప్, హింస, ఎన్నికల అక్రమాలు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీలకు నాయకులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, నేర ప్రవర్తనను సమర్థించడంగా భావిస్తున్నారు.
పదే పదే జన ప్రదర్శనల వల్ల ప్రభుత్వంపై విధానపరమైన, వాస్తవ సమస్యల ఆధారంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశాన్ని జగన్ పార్టీ పోగొట్టుకుంది. .
ఇది పునరుజ్జీవనానికి స్థిరమైన మార్గమా?
జన సమీకరణ అనేది పార్టీ మనుగడకు అవసరమైన స్వల్పకాలిక సాధనం అయినప్పటికీ, అది పార్టీ పునరుజ్జీవనానికి దీర్ఘకాలిక వ్యూహంగా సరిపోదు. రాజకీయ పునరుజ్జీవనం అనేది కేవలం ధిక్కారం, వేధింపుల కథనంపై ఆధారపడి సాధ్యం కాదు. దానికి బదులుగా, పార్టీ తన భారీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవడం, తన కోర్ బేస్‌ను దాటి విస్తృత ఓటర్లతో తిరిగి కనెక్ట్ అవ్వడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ఆకర్షణీయమైన, సానుకూల దృష్టిని అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుంది
by Rama Chandra P | Jul 9, 2025 | పరిశీలన, బిజినెస్
ఫార్మా ఉత్పత్తులపై 200శాతం,రాగిపై 50, సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన ట్రంప్
భారత్‌పై భారీ ప్రభావం పడుతుందంటున్న నిపుణులు
తన పిచ్చి చేష్టలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి దిగారు. ఇప్పటికే అమెరికాకు దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం టారిఫ్‌లను విధించిన ట్రంప్, తాజాగా రాగిపై కూడా 50 శాతం సుంకాలను ప్రకటించారు. అలాగే అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక ఏడాది తర్వాత 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చారు. సుంకాల అమలు గడువును ఆగస్టు 1 తర్వాత పొడిగించేదిలేదని ట్రాంప్ క్లారిటీ ఇచ్చారు .
భారత్‌పై ప్రభావం ఏ మేరకు . ..
విధించిన సుంకాలు మిగతా దేశాలతో పాటు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూఎస్‌కు ఎక్కువగా రాగి, ఔషదాలను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2024-25లో ప్రపంచదేశాలకు 2 బిలియన్ డాలర్ల విలువైన రాగి, దాని అనుబంధ ఉత్పత్తులను సరఫరా చేసింది భారత్. ఇందులో అమెరికా మార్కెట్లకు 360 మిలియన్ డాలర్లు లేదా 17 శాతంగా రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వాణిజ్య డేటా ప్రకారం, సౌదీ అరేబియా (26 శాతం), చైనా (18 శాతం) తర్వాత అమెరికాకు ఎక్కువ రాగి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశంగా మన దేశం మూడవ స్థానంలో ఉంది .
ఫార్మాకు గట్టి దెబ్బె . .. ట్రంప్ సుంకాలు భారత ఫార్మా రంగాన్ని దెబ్బతీయనున్నాయి. రాగి ఉత్పత్తులతో పోలిస్తే ట్రంప్ సుంకాల ప్రభావం ఫార్మా రంగంపైనే ఎక్కువ పడనుంది. ప్రపంచ దేశాల్లో అమెరికాకే భారత్ ఎక్కువ ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను సరఫరా చేసింది. ఇది మునుపటి ఏడాది ఎగుమతులు 8.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. అలాగే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతంగా ఉంది. ఫార్మా రంగంపై 200 శాతం లెవీ విధించడం వల్ల ఈ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, అమెరికాతో ట్రేడ్ డీల్‌ను కుదుర్చుకునే పనిలో భారత్ ఉంది. సుంకాల అమలు గడువు ఆగస్టు 1లోపు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే, కొత్త టారిఫ్ ల ప్రభావం భారత మార్కెట్లపై పడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
by Rama Chandra P | Jul 8, 2025 | ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ, ప్రైవేటు భూములు, చెరువులు, గ్రామ కంఠాలకు వేర్వేరు రంగులతో వర్గీకరణ
వెబ్ ల్యా0డ్ లో భూములకు రంగులెందుకు ? అనుకుంటున్నారా ? భూదర్శని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది .
కొత్తగా తీర్చిదిద్దుతున్న వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల వంటి వివరాలు, రహదారులు ఇలాంటివన్నీ వేర్వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయా భూముల మీద క్లిక్ చేయగానే భూ విస్తీర్ణం, యజమాని పేరు తదితర సమాచారం స్పష్టంగా తెలిసేలా వెబ్‌ల్యాండ్‌ను తీర్చిదిద్దుతున్నారు.
వెబ్‌ల్యాండ్‌లో మనకు కావలసిన భూమిపై క్లిక్ చేయగానే యజమాని పేరు, సర్వే నంబరు తదితర వివరాలు సులువుగా తెలుస్తాయి
‘భూ దర్శిని’ పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌లో భూ విస్తీర్ణం, యజమాని పేరు, స్వభావం, ఇతర వివరాలు తెలుస్తున్నాయి. కొత్త విధానం ద్వారా ఆక్రమణలు, రహదారులు, జలవనరుల గురించి కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. రాష్ట్రంలో 16,816 గ్రామాలు (1,27,547.856 చదరపు కిలోమీటర్లు) ఉండగా, వాటిలో 6,690 గ్రామాల్లో రీసర్వే (34,984.18 చ.కి.మీ. మేర) పూర్తయింది. పొలాల కొలతలు, హద్దులు, భూముల వర్గీకరణను ఆధునిక పరిజ్ఞానం సాయంతో రోవర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు. ఆ వివరాలే రికార్డుల్లో నమోదవుతున్నాయి. ఆవి ఆటోమేటిగ్గా వెబ్‌ల్యాండ్‌లోకి చేరుతున్నాయి.
5 రంగులు: రీసర్వే ఆధారంగా కొత్తగా తయారైన గ్రామాల మ్యాపుల్లో ఉన్న భూములను 5 వేర్వేరు రంగుల్లో గుర్తించడానికి వీలు కలుగుతుంది. రీసర్వే పూర్తయిన చోట్ల భూముల వివరాలు సమగ్రంగా ఉన్నందున ఈ డేటాబేస్‌కు తగ్గట్లు మ్యాపులు తయారయ్యాయి. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా దృశ్యరూపంలో నమోదుకు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వద్ద క్లిక్ చేయగానే పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఈ విధానం క్రయ, విక్రయాల సమయంలో జాగ్రత్త పడేందుకు దోహదం చేస్తుంది.
భుదర్శిని తో ప్రయోజనాలు
- సరి హద్దులు కచ్చితంగా తెలిసిపోతాయి కనుక ఆక్రమణల గురించి తెలుసుకోవచ్చు.
- ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న భూములను గుర్తించడం సులభతరం అవుతుంది.
- ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరిగితే ఏ స్థాయిలో ఎంతవరకు జరిగాయో తెలుసుకోవచ్చు.
- విపత్తుల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
- అధికారులు రైతుల పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు మెరుగ్గా ఉపయోగపడుతుంది .
- చెరువులు, కుంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి? సాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, వంటివి గుర్తించవచ్చు.
- పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చేవారు ఆయా గ్రామాల్లోని పంటల సాగు, భూముల స్వభావం తెలుసుకోవచ్చు.
- గ్రీన్ ఎనర్జీలో భాగంగా విద్యుత్తు ఉత్పాదనకు అనువైన పరిస్థితులు సదరు గ్రామాల్లో ఉన్నాయో లేవో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
by Rama Chandra P | Jul 7, 2025 | పరిశీలన
ఓటర్ల జాబితాలో చిన్న చిన్న తప్పులు , పొరపాట్లు సహజం. ఇటీవల కాలంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఓటర్ల జాబితాలను ఇష్టానుసారం మార్చేస్తున్నారు . ఇది తెలుగు రాష్ట్రాలలోను జరుగుతోంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఓటర్ల జాబితాలో ఓటర్ల సవరణ, నమోదు అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ. ముసాయిదా జాబితాను విడుదల చేయడం, కొత్తగా చేర్చిన పేర్లు, తొలగించిన పేర్ల వివరాలను రాజకీయ పార్టీలతో అందజేయడం సర్వసాధారణం. దీనివల్ల అభ్యంతరాలుంటే తెలియజేయడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఈసారి బీహార్‌లో ఎన్నికల సంఘం ఈ పద్ధతికి తూట్లు పొడిచింది. “ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్” పేరుతో ఒక కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానంలో, ఏయే ఓటర్లను తొలగించారు, ఎవరిని కొత్తగా చేర్చారు అనే వివరాలతో కూడిన ప్రత్యేక జాబితాలను (Addition and Deletion Lists) రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదు. కేవలం ఒకే ఒక ఏకీకృత జాబితాను అందిస్తున్నారు.
ఇది “గడ్డివాములో సూదిని వెతకడం” లాంటిదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లక్షలాది ఓటర్లున్న నియోజకవర్గాల్లో, పాత జాబితాతో కొత్త జాబితాను బేరీజు వేసుకుని, ఏ పేరు పోయిందో, ఏ పేరు వచ్చిందో తెలుసుకోవడం అసాధ్యమని వాపోతున్నాయి. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని, అక్రమాలకు ఆస్కారం కల్పించడానికే ఈ గోప్యత నాటకమని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు వంటి పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.. తమకు అనుకూలంగా లేని ఓటర్లను గుట్టుచప్పుడు కాకుండా జాబితా నుంచి తొలగించి, దొంగ ఓట్లను చేర్చే కుట్ర కోణం ఇందులో దాగి ఉందని వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు .
ఎలక్షన్ కమిషన్ పై నీలినీడలు
ప్రతిపక్షాలు వారు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) నుంచి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వరకు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల, ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ మార్పులు చేశామని చెబుతున్నారు. పాత జాబితాలను, మార్పులను పరిశీలించుకోవడానికి ఆన్‌లైన్‌లో సౌకర్యం ఉందని, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈ వాదనతో ప్రతిపక్షాలు ఏకీభవించడం లేదు. ఆన్‌లైన్ వ్యవస్థలు అంత పటిష్టంగా లేవని, లక్షలాది ఓటర్ల వివరాలను అలా పరిశీలించడం ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు కూడా సహకరించడం లేదని, కావాలనే సమాచారాన్ని దాచిపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి . …
ఓటర్ల జాబితాలో గందరగోళాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ, ఒక వ్యవస్థీకృత పద్ధతిలో, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే పారదర్శకత లోపించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇది కేవలం ఓటర్ల పేర్ల తొలగింపు, చేర్పులకు సంబంధించినది కాదు. ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉండే నమ్మకానికి సంబంధించినది. “మా ఓటు భద్రంగా ఉందా? మా పేరు జాబితాలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో మేమెలా ఓటు వేయాలి?” అనే సందేహం ఒక్కసారి ప్రజల్లో కలిగితే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రజల నుంచి ప్రతిఘటన లేకపోతే, ప్రజాస్వామ్య వాదులు దీనిపై ఉద్యమాల్ని నిర్మించకపోతే ఈ దుర్నీతి అన్ని రాష్ట్రాలకూ విస్తరించే ప్రమాదం వుంది.