దుబాయ్‌లో బంగారం ధర చీప్- నిజమేనా ?

దుబాయ్‌లో బంగారం ధర చీప్- నిజమేనా ?

ఒక్కో వ్యక్తి దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ తెచ్చుకోవచ్చు

‘బంగారు నగరం’గా దుబాయ్ కి పేరు . పేరుకు తగ్గట్టే ఆ ‘గోల్డ్ సిటీ’లో రోజూ జోరుగా పసిడి షాపింగ్ జరుగుతుంటుంది. ప్రజలు దేశవిదేశాల నుంచి వచ్చి మరీ పెద్దఎత్తున స్వర్ణాన్ని కొనేస్తుంటారు. ఈ క్రేజ్ వల్లే గోల్డ్ సిటీగా దుబాయ్ విశ్వ ఖ్యాతిని గడించింది. ఇంతకీ దుబాయ్‌లో బంగారాన్ని కొనేందుకు జనం ఎందుకు ఎగబడుతున్నారు? అంటే, అక్కడ పసిడి రేట్లు తక్కువ. భారత్ కంటే దుబాయ్‌లో తక్కువ రేటుకే స్వర్ణం లభిస్తుంది. అక్కడ పసిడి ధర ఎందుకు తక్కువగా ఉంది? పన్నులేం విధించరా? అక్కడి బంగారం స్వచ్ఛత విషయంలో ఫర్వాలేదా ? లేక క్వాలిటీ తేడా ఉంటుందా ? ??

దుబాయ్‌ నుంచి భారత్‌, చైనాలకూ గోల్డ్
దుబాయ్‌లో బంగారం రేటు తక్కువగా ఉండటంపై పలువురిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అక్కడ బంగారు గనులు ఉండబట్టే, తక్కువ రేటుకు గోల్డ్‌ను అమ్ముతున్నారని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదు. దుబాయ్‌లో ఒక్క గోల్డ్ మైన్ కూడా లేదు. అక్కడ విక్రయిస్తున్న బంగారమంతా ఆఫ్రికా దేశాలు, తుర్కియే (టర్కీ), స్విట్జర్లాండ్, రష్యా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాలు భారత్‌, చైనా. ఈ రెండు దేశాలకు చెందిన బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు ఏటా వందల టన్నుల బంగారాన్ని దుబాయ్‌లోని హోల్‌సేల్ గోల్డ్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఇందుకోసం ఈ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. భారత, చైనాల పౌరులు కూడా దుబాయ్‌ టూర్‌కు వెళ్లినప్పుడు, బంగారాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే దీనికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది.

ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు? పన్నులు ఎంత ?

  • మన దేశంలో మనం ఎంతైనా బంగారాన్ని కొనొచ్చు. దానిపై ఎలాంటి పరిమితి లేదు. భారతీయులు దుబాయ్‌లో ఎంత బంగారాన్ని కొని తెచ్చుకోవచ్చు? అనే దానిపై నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. అంతకుమించిన మోతాదులో బంగారాన్ని దుబాయ్‌ నుంచి మనదేశానికి తీసుకురావడానికి వీల్లేదు.
  • లగేజీలో గరిష్ఠంగా ఒక కేజీ దాకా బంగారాన్ని దుబాయ్ నుంచి భారత్‌కు తెచ్చుకోవచ్చు. అయితే విదేశాల్లో కనీసం ఆరు నెలల పాటు గడిపి, భారత్‌కు తిరిగొస్తున్న వారికే ఈ పరిమితి వర్తిస్తుంది. ఈ బంగారంపై అన్ని రకాల సుంకాలను చెల్లించాలి. కొనుగోలుకు సంబంధించిన పత్రాలన్నీ కస్టమ్స్ అధికారులకు చూపించాలి.
  • పురుషులు 50 నుంచి 100 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 100 నుంచి 200 గ్రాముల బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
  • పురుషులు 100 గ్రాములకుపైగా బంగారం, మహిళలు/బాలల 200 గ్రాములకుపైగా బంగారంపై 10 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
  • వాణిజ్య అవసరాల కోసం బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై జీఎస్‌టీ, వ్యవసాయ మౌలిక సదుపాయాల వికాస సెస్ (ఏఐడీసీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ విధిస్తారు.
  • భారతీయ మహిళలు, 15 ఏళ్లలోపు బాలలు గరిష్ఠంగా 40 గ్రాములు లేదా రూ.1 లక్ష విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. భారతీయ పురుషులు గరిష్ఠంగా 20 గ్రాములు లేదా రూ.50వేలు విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ క్రమంలో భారతీయ మహిళలు, పురుషులు, బాలలు ఎలాంటి సుంకాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చే బంగారం బరువు ఒక కేజీకి మించకూడదు. కొనుగోలుకు సంబంధించిన రశీదులన్నీ విమానాశ్రయంలోని అధికార వర్గాలకు చూపించాలి.
  • వ్యక్తిగతంగా దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై, దాని మోతాదు ఆధారంగా 3 శాతం, 6 శాతం, 10 శాతం మేర భారత్‌లో కస్టమ్స్ సుంకాన్ని విధిస్తారు.
  • పురుషులు 20 నుంచి 50 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 40 నుంచి 100 గ్రాముల బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.

దుబాయ్‌లో గోల్డ్ రేట్లు ఎందుకు తక్కువ?
భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం రేట్లు తక్కువ. దీనికి ప్రధాన కారణం అక్కడి పన్నుల వ్యవస్థే. దుబాయ్‌లో బంగారం విక్రయాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను విధించరు. అయితే ప్రతీ విక్రయంపై 5 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను విధిస్తారు. వ్యాట్‌పై మనకు ఫుల్ రీఫండ్ లభిస్తుంది. అయితే దీన్ని పొందేందుకు నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. మొత్తం మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండానే దుబాయ్‌లో బంగారాన్ని కొనేయొచ్చన్న మాట. ఈ ప్రత్యేకత వల్లే బంగారు నగరంగా దుబాయ్ అవతరించింది.

దుబాయ్‌లో బంగారం క్వాలిటీ ???
దుబాయ్‌లో విభిన్న రకాల స్వచ్ఛతలతో కూడిన బంగారం లభిస్తుంది. 24 క్యారట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైంది. అంటే ఈ బంగారంలోని 1000 భాగాల్లో 1000 కూడా స్వచ్ఛంగా ఉంటాయన్న మాట. 22 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 916.66 భాగాలు స్వచ్ఛమైనవి. ఇందులో 22 క్యారట్ల బంగారం, 2 భాగాల్లో జింక్, కాపర్, నికెల్, ఐరన్, కాడ్మియం, అల్యూమినియం, సిల్వర్, ప్లాటినం, పలాడియంల మిశ్రమం ఉంటుంది. వీటిని ‘అలాయ్డ్ మెటల్స్’ అంటారు. ఇవన్నీ ఉండటం వల్ల 22 క్యారట్ల బంగారం ఆభరణాల తయారీకి అనువుగా ఉంటుంది. 21 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 875 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 875 అని కూడా పిలుస్తారు. ఇందులో 21 క్యారట్ల బంగారం, 3 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి. 18 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 750 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 750 అని అంటారు. ఇందులో 18 క్యారట్ల బంగారం, 6 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి.

ఆమె సక్సెస్   .. అచ్చమ్ సినిమా లాంటి స్టోరీ…

ఆమె సక్సెస్ .. అచ్చమ్ సినిమా లాంటి స్టోరీ…

వందేళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. ఎన్నో వేలమంది ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. కొన్నివేల మంది చేస్తున్నారు. అయితే ఒకామె ఈ కంపెనీలోని కెరీర్ ప్రారంభించి . .. ఇదే కంపీనీ సిఈవో స్థాయికి ఎదిగారు .  ఆ కంపెనీలో 30 ఏళ్లుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆమె.. ఎన్నో ఆటుపోట్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు..

ప్రియా నాయర్. చిన్న ఉద్యోగి నుంచి సీఈఓ స్థాయికి ఎదిగిన ప్రియా నాయర్ సక్సెస్‌ నేటి తరానికి ఎంతో ఆదర్శవంతం. అనుచరణీయం . ..

 ఆమె ప్రతీ అడుగులో అంకితభావం, ఎదురైన ప్రతీ సవాలును స్ఫూర్తిగా మలుచుకున్న ధైర్యం, ఆమె హృదయంలోని అచంచలమైన సంకల్పం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆమె విజయం కేవలం ఆమె ఒక్కరిదే కాదు.. అకుంఠిత దీక్షతో శ్రమించే వారికి మార్గదర్శనం . ..

 కంపెనీ వస్తువులను.. సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు.. ప్రియా నాయర్ మెదడులో వచ్చిన ఆలోచన ఆమెను సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా నిలిపింది. 2014లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరెంట్ ఎక్కువగా ఉండేది కాదు. పైగా కోతలు ఎక్కువ. ఇక ఇంటర్నెట్ అంటే చాలా మందికి పరిచయమే లేదు. టీవీలు ఉన్నా.. చాలా గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు. 1933లో ప్రారంభించిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అయితే అప్పటికే దేశంలోనే మంచి పేరున్న ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థగా కొనసాగుతోంది. ఇక ఈ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు కొనేవారు చాలా మంది గ్రామీణ ప్రాంతాల వారే . దీంతో సంస్థ తీసుకువచ్చిన కొత్త ఉత్పత్తులను వారికి పరిచయం చేయడం ఎలా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.

హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కొత్త సీఈఓ అండ్ ఎండీగా నియమితులైన ప్రియా నాయర్ ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ సంస్థ 92 సంవత్సరాల చరిత్రలో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ ప్రియా నాయర్ కావడం విశేషం. 1995లో హెచ్‌యూఎల్‌లో చేరిన ప్రియా నాయర్.. ఇప్పుడు సీఈఓ స్థాయికి చేరుకున్నారు. సంస్థలోని హోమ్ కేర్, బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్, పర్సనల్ కేర్ డిపార్ట్‌మెంట్‌లలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అనేక కీలక పాత్రలు పోషించారు. ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు.. ఆ సంస్థకు చెందిన బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్ విభాగానికి గ్లోబల్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సీఎంఓగా ఆమె గ్లోబల్ బ్రాండ్ స్ట్రాటజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. హెచ్‌యూఎల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆమె లండన్‌లో నివసించేవారు.  వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కర్బన ఉద్గారాలను వీలైనంత తగ్గించడం, నీటిని తక్కువగా ఉపయోగించుకోవడం సహా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చేందుకు అనుగుణంగా తమ కంపెనీ ఉత్పత్తులను ప్రియా తీసుకొచ్చారు.

”ప్రియా నాయర్ మనసుతో ఆలోచిస్తారు . ఎందుకంటే ఆమె ప్రచారం చేసిన బ్రాండ్‌లు అన్నీ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించేలా చూడటం ఆమె అలవాటు . …” అని సంస్థలో ఆమె గురించి బాగా తెలిసిన ఉన్నతోద్యోగులు చెపుతూ ఉంటారు . కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఈ మాటను అంగీకరిస్తారు .

మునగాకు – ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో  తెలుసా?

మునగాకు – ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో తెలుసా?

మనలో చాలా మందికి మునగకాడాలంటే మహా ఇష్టం. కాడలే కాదు . . మునగాకు అంతకంటే బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా ? మునగాకులో మన శరీరానికి అవసరమయ్యే చాలా ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు ఉన్నాయి. ఆకుల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది కాల్షియం, ప్రోటీన్, ఐరన్, అమైనో యాసిడ్‌లను కూడా కలిగి ఉంది. ఇవి మీ శరీరాన్ని నయం చేయడానికి, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉంటుంది. కణాలను దెబ్బతినకుండా రక్షించగల రోగనిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు ఇందులో ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్‌లలో కొన్ని రక్తపోటును తగ్గించగలవని , రక్తం , శరీరంలో కొవ్వును తగ్గించగలవని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయ్ .

పోషకాల గని మునగాకు మునగాకులో ఎ, సి, ఇ, కె, బి1, బి2, బి3 వంటి అనేక విటమిన్లు , కాల్షియం ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు, ప్రొటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ, నారింజ కంటే 7 రెట్లు అధికంగా విటమిన్ సి, పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయట. మునగాకును గాయాలు, నొప్పి, పూతల, కాలేయ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్, వాపులను నయం చేయడానికి ఉపయోగిస్తారని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ అధ్యయనంలో పేర్కొంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది మునగాకులో ఉండే విటమిన్ C, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరానికి సహాయపడుతుందంటున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడంలో మునగాకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.

రక్తహీనత నివారణ: మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

రక్తపోటు నియంత్రణ : మునగాకులోని ఫైటోకెమికల్స్ రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి, రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయంటున్నారు నిపుణులు. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని, బీపీ సమస్య ఉన్నవారు మునగాకు సూప్ లేదా రసం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

ఎముకల బలం : కాల్షియం, భాస్వరం అధికంగా ఉండటం వల్ల మునగాకు ఎముకలను దృఢం చేస్తుంది . ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు : మునగాకులో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, పాలిఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్​తో పోరాడి, కణ నష్టాన్ని నివారించి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయని, క్యాన్సర్ నివారణలో కూడా ఇవి సహాయపడతాయని తెలిపారు.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి  : మునగాకులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకులో కాల్షియం. మెగ్నీషియం మృద్ధిగా ఉంటుందని, కీళ్ల నొప్పులను తగ్గించడానికి, ఎముకల పటిష్టతకు సహాయపడుతుందని వివరించారు.

చర్మం, జుట్టు మెరుగైన ఆరోగ్యం : ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలతో పోరాడతాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకులో విటమిన్లు ఎ, ఇ అనేవి మొటిమలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా చేస్తాయని, జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుందని వివరించారు.

బరువు తగ్గడం : మునగాకు మెటబాలిజంను పెంచి, ఆకలిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రెండు నెలలపాటు . .. వారంలో రెండు , మూడుసార్లు మునగాకును ఆహారంలో తినేవారు 4-5 కిలోల బరువు తగ్గుతారు .

మునగ ఆకు అందుబాటులో లేనివారు మునగాకు పౌడర్ ని వాడవచ్చు . అనేక కంపెనీలు పౌడర్ ని ఆన్ లైన్ లో విక్రయిస్తున్నాయ్ . ఇటీవల కాలంలో మునగాకు పౌడర్ అమెరికా , బ్రిటన్ వంటి దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంది .

జనం తగ్గుతున్నారు . .. కారణమేంటి?

జనం తగ్గుతున్నారు . .. కారణమేంటి?

ఇది ప్రపంచమంతటా పాకుతున్న సంక్షోభం….. జననాల తగ్గుముఖంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన

”ప్రపంచం “జనాభా పతనం” అనే అపూర్వమైన సంక్షోభం అంచున ఉంది. భవిష్యత్తులో ఈ సమస్య తీవ్రమైన సామాజిక, ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది” అని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. జూలై 11న జరుపుకునే ''ప్రపంచ జనాభా దినోత్సవం 2025'' సందర్భంగా, ఐరాస విడుదల చేసిన నివేదికలో ఆందోళన కలిగించే అనేక అంశాలు తేటతెల్లమవుతున్నాయ్ .

ఈ సంవత్సరం, “యువతకు సాధికారత: వారు కోరుకున్న కుటుంబాలను సృష్టించుకునేందుకు న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచం” అనే ధీమ్ తో , ఈ సమస్య కేవలం సంఖ్యలకు నివేదిక సంబంధించినది కాదని, మానవ హక్కులు, అవకాశాలు, మరియు యువత భవిష్యత్తుకు సంబంధించినదని ఐరాస స్పష్టం చేసింది.

ఐరాస నివేదిక ప్రకారం, ప్రపంచ సగటు సంతానోత్పత్తి రేటు (ఒక మహిళ తన జీవితకాలంలో జన్మనిచ్చే పిల్లల సగటు సంఖ్య) గత కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా క్షీణించింది. ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే, సంతానోత్పత్తి రేటు కనీసం 2.1గా ఉండాలి. దీనిని “రీప్లేస్‌మెంట్ లెవల్” అంటారు. అయితే, ప్రపంచంలోని మూడింట రెండు వంతుల జనాభా ఇప్పుడు ఈ స్థాయి కంటే తక్కువ సంతానోత్పత్తి రేట్లు ఉన్న దేశాలలో నివసిస్తున్నారు.

దక్షిణ కొరియా, జపాన్, స్పెయిన్, ఇటలీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రేటు 1.5 కంటే తక్కువకు పడిపోయింది. ఆశ్చర్యకరంగా, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా సంతానోత్పత్తి రేటు 2.0 కంటే దిగువకు చేరింది.

ఈ క్షీణతకు అనేక కారణాలు ఉన్నాయి. మహిళల విద్య, ఉద్యోగావకాశాలు పెరగడం, పట్టణీకరణ, పిల్లల పెంపకం ఖరీదైనదిగా మారడం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, మరియు కుటుంబ నియంత్రణ పద్ధతులపై పెరిగిన అవగాహన వంటి సామాజిక, ఆర్థిక మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్పులు వ్యక్తిగత స్థాయిలో సానుకూలమైనవే అయినప్పటికీ, సమిష్టిగా అవి జనాభా శక్తిసామర్థ్యాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి.

వృద్ధాప్య జనాభా: సంతానం తక్కువగా ఉండటం, ఆయుర్దాయం పెరగడంతో సమాజంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, సామాజిక భద్రతా పథకాలపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది.

కార్మిక శక్తి కొరత: పనిచేసే వయస్సులో ఉన్న యువత సంఖ్య తగ్గడంతో, దేశాలు తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటాయి. ఇది పారిశ్రామిక ఉత్పత్తి, ఆవిష్కరణలు, మరియు ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది.

ఆర్థిక మాంద్యం: వినియోగదారుల సంఖ్య తగ్గడంతో, మార్కెట్లు కుంచించుకుపోతాయి. ఇది దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోతుంది.

సామాజిక మార్పులు: యువతరంపై వృద్ధుల సంరక్షణ భారం పెరుగుతుంది. ఇది కుటుంబ నిర్మాణంలో మరియు సామాజిక సంబంధాలలో మార్పులకు కారణమవుతుంది.

ఐరాస ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతోంది. ఈ సమస్యను కేవలం జనాభా సంఖ్యలను పెంచేదిగా చూడకూడదు. చాలా మంది యువతీ యువకులు పిల్లలను కనాలని కోరుకుంటున్నప్పటికీ, ఆర్థిక అభద్రత, సరైన మద్దతు లేకపోవడం, మరియు సామాజిక ఒత్తిళ్ల కారణంగా వారు తమ కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారని ఐరాస పేర్కొంది. దీనినే “పునరుత్పత్తి ఏజెన్సీ” లేకపోవడం అంటారు.

ప్రజలు, ముఖ్యంగా యువత, వారు కోరుకున్నప్పుడు, కోరుకున్న సంఖ్యలో పిల్లలను కనగలిగే వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల బాధ్యత అని ఐరాస వాదిస్తోంది. దీనికోసం, కుటుంబాలకు అనుకూలమైన విధానాలను రూపొందించాలి. ఇందులో భాగంగా, సరసమైన పిల్లల సంరక్షణ, తల్లిదండ్రులిద్దరికీ వేతనంతో కూడిన సెలవులు, గృహ వసతి మద్దతు, మరియు ఉద్యోగ భద్రత కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. అయితే, దీనికి పరిష్కారం ప్రజలను ఎక్కువ మంది పిల్లలను కనమని బలవంతం చేయడం కాదు. బదులుగా, యువతకు సాధికారత కల్పించడం, వారి పునరుత్పత్తి హక్కులను గౌరవించడం, వారు తమ కుటుంబాలను నిర్మించుకోవడానికి అవసరమైన మద్దతును అందించడం ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలం… అని మేధావులు, జర్నలిస్టులు సూచిస్తున్నారు .

‘కారు’ చౌక బేరం.. ఢిల్లీలో…

‘కారు’ చౌక బేరం.. ఢిల్లీలో…

”పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలు , 15 ఏళ్లు పైబడిన పెట్రోల్‌ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిషేధం.” అంటూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో . .. గడువు తీరిన కార్లను నామమాత్రపు ధరలకు అమ్మకానికి పెడుతున్నారు.

దేశ రాజధాని దిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహన పాలసీ ఎఫెక్ట్‌తో ఎంతోమంది ఇప్పటికే కార్లను కారుచౌకగా అమ్మేశారు.

దిల్లీ వాస్తవ్యుడు నితిన్ గోయల్ రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను రూ.8 లక్షలకే అమ్మేశారు. రూ.40 లక్షల మెర్సిడెజ్ సీ క్లాస్ 220 సీడీఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూ.4 లక్షలకే అమ్మారు. దిల్లీకే చెందిన రితేశ్ గందోత్ర రూ.55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీ కారును నామమాత్రపు రేటుకు విక్రయించారు. వాహన పాలసీపై దిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ సర్కారు పునరాలోచనలో పడింది. త్వరలోనే కొత్త వాహన పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తును మొదలుపెట్టింది. ఈ పనేదో కొన్ని నెలల ముందే మొదలుపెట్టి ఉంటే తాము కార్లను చౌకగా అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని బాధిత వాహనదారులు వాపోతున్నారు.

ఎన్‌జీటీ ఆదేశాలు అమల్లోకి- వాహనదారులకు చుక్కలు
దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కీలక ఆదేశాలిచ్చింది. పదేళ్లకుపైగా వినియోగించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకుపైగా వినియోగించిన పెట్రోలు వాహనాలను దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతించరాదని నిర్దేశించింది. ఆ ఆదేశాలను తదుపరిగా సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనదారులకు డెడ్‌లైన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్‌జీటీ ఆదేశాల అమలులో భాగంగానే జులై 1 నుంచి గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంధనమే పోయనప్పుడు కార్లను మాత్రం ఏం చేసుకుంటామని చాలామంది వాహనదారులు భావించారు. వారంతా తమ వాహనాలను తక్కువ రేట్లకే దిల్లీ అవతలి వ్యక్తులకు అమ్ముకున్నారు. అయితే దీనిపై వ్యతికేత వ్యక్తం కావడంతో సర్కారు మళ్లీ పునరాలోచనలో పడింది.

వీలైనంత త్వరగా ఒక పరిష్కారం చూపిస్తాం : దిల్లీ సర్కారు
కాలం చెల్లిన పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఇంధనం పోయకూడదనే నిర్ణయంపై దిల్లీ సర్కార్‌ వెనుకడుగు వేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని సాధించే దిశగా కసరత్తు చేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం రోజున ఈ అంశంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)కి దిల్లీ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరింది.

బ్యాన్‌తో ఇబ్బందిపడుతున్న జనం
గడువు తీరిన వాహనాలకు ఇంధనం కొట్టకుండా డిల్హే సర్కార్ తీసుకువచ్చిన పాలసీతో ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ విధించడం సరికాదని, దాని అమలులో సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బ్యాన్‌తో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ఆయా వాహనాలపై బ్యాన్‌ను వెంటనే అమల్లోకి తేవాలనేది అపరిపక్వ నిర్ణయమని మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. కొంత గడువు ఇచ్చిన తర్వాత బ్యాన్ చేయడం కరెక్ట్ అంటూ పలు వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది .