వందేళ్ళ ఆర్ ఎస్ ఎస్ – భారత రాజకీయాల్లో ఒక ట్రాన్స్ ఫర్మేషన్

Rama Chandra P

October 11, 2025

భారత్ రాజకీయాలలో RSS పాత్ర అత్యంత కీలకం. ప్రయోగాత్మకం. అంతకుమించి పెనుమార్పునకు కారణమ్ . రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) శతాబ్ది ఉత్సవాలు భారత సామాజిక-రాజకీయ రంగంలో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ కు సంకేతం. ఒకప్పటి వివాదాస్పద సంస్థ ఇప్పుడు దేశ పాలక వ్యవస్థలో గట్టిగా స్థిరపడుతోంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ఇది హిందుత్వ ఆధారిత స్వచ్ఛంద సంస్థ. 1925లో విజయదశమి రోజున మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దీనిని స్థాపించారు. హిందూ క్రమశిక్షణ, ఏకీకరణ పెంపొందించడం, హిందూ రాష్ట్ర స్థాపన దీని ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వైఖరిపై హెడ్గేవార్ విభేదించారు. ముస్లింల ఖిలాఫత్ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై ఆయన విముఖత చూపారు.

ఈ శతాబ్ది ఉత్సవాల వేదిక నాగ్‌పూర్. దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.ఆర్ ఎస్ ఎస్ స్థాపన కేంద్రం నాగ్‌పూరే. ఈ శతాబ్ది వేడుకలు మహాత్మా గాంధీ జయంతి, డా. బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధంలోకి మారిన రోజు (ధమ్మచక్ర ప్రవర్తన దినం) తో ఏకకాలంలో రావడం గమనార్హం.

గాంధేయవాదం, అంబేద్కర్ వాదం, హిందుత్వ… ఈ మూడు ఆలోచనా స్రవంతులు దేశ రాజకీయ వ్యక్తిత్వాన్ని రూపొందించాయి. నాగ్‌పూర్ ఈ మూడు వారసత్వాలకు కేంద్రంగా నిలిచింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంసేవక్. ఆయన ఢిల్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శతాబ్ది ప్రయాణాన్ని ఆయన త్యాగం, నిస్వార్థ సేవ, దేశ నిర్మాణం, క్రమశిక్షణకు ఉదాహరణగా అభివర్ణించారు. ఆర్ ఎస్ ఎస్ శాఖలు ‘యజ్ఞ వేదీస్’ వంటివని కొనియాడారు.

సంఘ్ శతాబ్దికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ స్టాంప్, ₹100 నాణెం విడుదల చేసింది. నాణెంపై ‘భారత్ మాత’ చిత్రం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కరెన్సీపై భారత్ మాత చిత్రం ఇదే మొదటిది.

ఆర్ ఎస్ ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. విద్య, సామాజిక సేవ, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత వంటి అన్ని రంగాల్లో దాని అనుబంధ సంస్థలు విస్తరించాయి. పాలక పార్టీ బీజేపీ, అతిపెద్ద కార్మిక సంఘం బిఎంఎస్ , అతిపెద్ద విద్యార్థి సంస్థ ఎబివిపి, విద్యా భారతి పాఠశాల వ్యవస్థ సంఫ్‌ పరివార్‌లో భాగమే. ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం భారతదేశాన్ని కేవలం సమృద్ధ దేశంగానే కాకుండా, ‘నైతిక, సాంస్కృతిక విశ్వగురువుగా’ మార్చడం. దీనికి ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతమే పునాది.

అయితే, ఈ వేడుకలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ గౌరవం రాజ్యాంగాన్ని అవమానించడమే అని కాంగ్రెస్, సీపీఎం ఖండించాయి. ఆర్ ఎస్ ఎస్ స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండి, బ్రిటిష్ వారికి సహకరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. మహాత్మా గాంధీ హత్య తర్వాత సర్దార్ పటేల్ సంస్థను నిషేధించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

అంటరానితనంపై పోరాటం చేస్తున్నామని సంఘ్ వాదిస్తున్నా , ఇది అగ్రకులాల ఆధిపత్యంలో ఉందనే విమర్శ ఉంది. చరిత్రను వక్రీకరించి పాఠ్యాంశాలను ‘కాషాయీకరణ’కు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.

ఈ శతాబ్ది మైలురాయి సంఘ్ సైద్ధాంతిక, సంస్థాగత విజయాన్ని స్థిరీకరించింది. భవిష్యత్తులో దేశ జాతీయ కథనంపై దాని పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది.

You May Also Like…