ఇస్రో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమూనా ఇదిగో

Rama Chandra P

August 23, 2025

అంతరిక్ష రంగంలో ప్రపంచం మనవైపు ఆసక్తిగా చూస్తోంది . దీనికి కారణం భారత్‌ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. 2035 నాటికి సొంతగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిశ్చయించుకుంది. అందులో భాగంగా తాజాగా ‘భారతీయ అంతరిక్ష్‌ స్టేషన్‌ (BAS​)’ నమూనాను తాజాగా విడుదల చేసింది. దిల్లీలోని భారత మండపంలో శుక్రవారం నుంచి నేషనల్‌ స్పేస్‌ డే వేడుకలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. అవి :

  1. ఐదు దేశాల స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌’ (ఐఎస్​ఎస్​)
  2. చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌.

2035 సంవసరం నాటికి భారత్‌ కూడా సొంతంగా 5 మాడ్యుల్స్‌తో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌’ను నిర్మించాలని కృతనిశ్చయంతో ఉంది. 2028 నాటికి తొలి మాడ్యుల్‌ను నింగిలోకి పంపించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది.

10 టన్నుల బరువున్న మాడ్యూల్​
బాస్‌-1 మాడ్యుల్‌ సుమారుగా 10 టన్నులు ఉండవచ్చని అంచనా. దీనిని భూమికి 450 కి.మీ ఎత్తులో ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇన్విరాన్‌మెంటల్‌ కంట్రోల్‌ అండ్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌(ఈసీఎల్‌ఎస్‌ఎస్‌), భారత్‌ డాకింగ్‌ సిస్టమ్‌, భారత్‌ బెర్తింగ్‌ మెకానిజమ్‌, ఆటోమెటెడ్‌ హ్యాచ్‌ సిస్టమ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ బాస్​-1 మాడ్యుల్‌ వేదిక కానుంది.

40 అంతస్తుల భవనమంత ఎత్తైన రాకెట్‌ నిర్మాణం
“అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు అబ్బురపడేలా భారత్​ అద్భుత ప్రగతి సాధించింది. ప్రస్తుతం 40 అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే రాకెట్‌ను నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో నౌకాదళం కోసం ప్రత్యేక ఉపగ్రహం ప్రయోగించనున్నాం” అని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన 84వ స్నాతకోత్సవంలో, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్‌ ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ అందుకున్నారు.

ఈ సందర్భంగా వి . నారాయణన్ మాట్లాడారు . “రష్యా, అమెరికాలకు దీటుగా మనం ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నాం. యూఎస్​కు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాం. రానున్న 10 ఏళ్లలో భారత్‌ సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించనుంది. తొలిసారిగా శుక్రగ్రహంపై ప్రయోగాలు చేస్తున్నది మనమే. ఇస్రో పరిశోధనల లక్ష్యం- కర్షకులు, కార్మికులు సహా ప్రజలందరి దైనందిన జీవితాల్లో వెలుగు నింపడమే” అని అయన స్పష్టం చేసారు .

You May Also Like…