by Srinivas Vedulla | Apr 9, 2025 | జనరల్
టారిఫ్ లు వద్దన్న టెస్లా అధినేత – పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల మంట.. తన సన్నిహితుడు , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మంట పెడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహితుడు ఎలాన్ మస్క్ మధ్య టారిఫ్ ల వ్యవహారం చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది . ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఇరువురి మధ్య అభిప్రాయ విబేధానికి కారణమని ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా ప్రత్యేక కథనం కూడా పబ్లిష్ చేసింది . సుంకాలు విధించ వద్దని మస్క్ ఎంత చెప్పినా ట్రంప్ వినలేదనేది ఆ కధనం సారాంశం . వెనక్కి తగ్గేది లేదని టెస్లా అధిపతికి అధ్యక్షుడు బల్ల గుద్ది మరీ చెప్పేశారట. సుంకాల దెబ్బకు తన సంపద భారీగా తరిగిపోవడంతో పాటు టెస్లా కార్ల కంపెనీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో ట్రంప్ పై మస్క్ గుర్రుగా ఉన్నట్లు సదరు కధనం స్పష్టం చేసింది .
నాలుగు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ అత్యంత కీలక భూమిక పోషించారు . తన ట్విటర్ (X ), ఇతర ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా అమెరికా ప్రజలలో ట్రంప్ వైపు తిప్పడంలో క్రియాశీల పాత్ర పోషించారు .
ప్రతీకార సుంకాలకు తాను వ్యతిరేకమని మస్క్ చెప్పకనే చెప్పారు. గత వారంలో ట్రంప్ సుంకాలు ప్రకటించిన కొద్ది సేపటికే ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్మాన్ స్వేచ్ఛా వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే ఇందుకు నిదదర్శనం. అంతేకాదు, యూర్‌పతో సుంకాలు లేని వాణిజ్యం నెరపాలని కోరారు. అయితే, సుంకాలపై మస్క్ వైఖరిని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం మస్క్, నవారో మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మస్క్, వైట్‌హౌ్‌సకు మధ్య అగాధం పెరిగిందన్న వార్తలను ఇది మరింత బలపరుస్తోంది.
ట్రంప్ విధించిన టారిఫ్ ల ప్రభావం వల్ల అమెరికాలో కూడా నిరుద్యోగం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళనలో లక్షలాది ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గేదిలేదంటూ హుంకరిస్తున్నారు .
రూ.11.61 లక్షల కోట్లు హాంఫట్ ట్రంప్ సుంకాల దెబ్బకు మస్క్ సంపద ఈ ఏడాదిలో 13,500 కోట్ల డాలర్ల (రూ.11.61 లక్షల కోట్లు) మేర తరిగిపోయి ప్రస్తుతం 30,000 కోట్ల డాలర్ల దిగువకు (రూ.25.80 లక్షల కోట్లు) పడిపోయింది. గత గురు, శుక్రవారాల్లోనే మస్క్ నెట్‌వర్త్ 3,100 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. సోమవారం నాడు మరో 440 కోట్ల డాలర్ల ఆస్తిని కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత నష్టం వాటిల్లబోతోందని టెస్లా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | జనరల్
లోతైన గోతిలోకి . . పెద్ద యంత్రాన్ని దించే పనిలో రైతు ఉపాయం గ్రేట్ … ముప్పయ్ – నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది కధ లాంటి నిజం . . 2 నిముషాలు కేటాయించి చదవండి..
కేరళ రాష్ట్రంలో అలెప్పి సమీపంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు . ఆ ప్లాంట్ కనస్ట్రక్షన్ సమయంలో ఒక పెద్ద సమస్య తలెత్తింది . . ఫ్యాక్టరీలో లోతైన గొయ్యి తవ్వారు. ఆ గొయ్యిలో ఒక భారీ యంత్రం పెట్టాలి. కానీ ఆ యంత్రం చాలా బరువుగా ఉండడం వల్ల దాన్ని లోపల పెట్టడం కష్టంగా మారింది.
యంత్రం సైట్‌కి తీసుకొచ్చారు. కానీ 30 అడుగుల లోతైన గుంతలో దించడం ఎలా అన్నది పెద్ద తలనొప్పిగా మారింది!
యంత్రాన్ని సరిగ్గా ఉంచకపోతే, ఫౌండేషన్‌కి మరియు యంత్రానికీ నష్టం కలుగుతుంది.
అప్పుడు (1980-85 మధ్య కాలంలో ) పెద్ద బరువులు ఎత్తగలిగే క్రేన్లు అంతగా అందుబాటులో లేవు. కొన్ని క్రేన్లు ఉండవచ్చు, కానీ అవి ఆ లోతు వరకు దించలేవు. దించినా సేఫ్ గా దించడం సాధ్యం కాదని ఇంజినీర్లు చేతులెత్తేశారు.
చివరికి ఆ కంపెనీ ఇంజినీర్లు , ఇతర నిపుణులు తాము చేయలేమని తేల్చేసి, ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపుతారో తెలుసుకోడానికి టెండర్ పిలిచారు . చాలా మందే తమ తమ ఐడియాలు పంపారు. ఎక్కువమంది క్రేన్ వాడే ఆలోచనతోనే వచ్చారు.
వాళ్లు 10 నుంచి 15 లక్షల వరకు టెండర్ కోడ్ చేశారు.
అయితే, ఆ ఊరికి సమీపంలో ఉండే ఒక రైతు వచ్చి కంపెనీ ఇంజినీర్లను అడిగాడు:
“ఈ మెషిన్ నీటిలో తడిసితే ఏమైనా సమస్య ఉంటుందా?”
కంపెనీ ఇంజినీర్లు : “ఏమీ సమస్య లేదు.”
అయితే ఆ రైతు కూడా టెండర్ వేసాడు. కానీ అతడు కేవలం 5 లక్షలకె పని పూర్తిచేస్తామని కోడ్ చేసాడు . అందుకే ఆ పని అతనికే అప్పగించారు.
అయితే ఆశ్చర్యంగా, అతను తన ప్లాన్ చెప్పలేదు. “నా దగ్గర ఈ పని చేయగలిగే టీమ్ ఉంది, నేను పనిని పూర్తి చేస్తాను” అని మాత్రమే అని వెళ్ళిపోయి . . మరుసటి రోజు వచ్చాడు .
రాగానే కంపెనీ ఉద్యోగులు, మేనేజర్లు, బాస్ అందరూ ఆ పని ఎలా చేస్తాడో చూడడానికి ఉత్కంఠగా ఎదురుచూశారు.
సైట్‌కి ఎటువంటి ప్రిపరేషన్ కనిపించలేదు. కానీ నిర్ణయించిన సమయానికి చాలా ట్రక్కులు వచ్చాయి. ఆ ట్రక్కులన్నీ మంచు పలకలతో నిండినవి. ఆ మంచు బ్లాక్‌లను గుంతలో వేసారు.
ఆ తరువాత యంత్రాన్ని తీసుకొచ్చి, మంచు బ్లాక్‌ల మీద పెట్టారు.
తరువాత మినీ వాటర్ పంప్ ద్వారా గుంత నుంచి నీటిని బయటకి పంపారు. మంచు కరిగిపోయింది, నీరు తిసే కొద్దీ యంత్రం క్రిందకి దిగింది.
4-5 గంటల్లోనే పని పూర్తయ్యింది. మొత్తం ఖర్చు లక్ష రూపాయల లోపే అయ్యింది.
యంత్రం సరిగ్గా స్థిరంగా అమరింది. ఆ వ్యక్తికి నాలుగు లక్షల పైన లాభం వచ్చింది!
ఇది చూస్తే తెలుసుతుంది – వ్యాపారం అయినా , వ్యవహారం అయినా తెలివిగా , సులువుగా చేయడానికి చదువు ఒక్కటే సరిపోదు . అనుభవం , సమయస్ఫూర్తి , సందర్భానుసారం.. వ్యవహార జ్జ్ఞానం ముఖ్యమని . . .
సమస్యలకు సింపుల్ సొల్యూషన్ కనుగొనడం ఒక కళ. అది మన తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది.
ఆ మనిషి తన ఆచరణాత్మక జ్ఞానంతో పెద్ద సమస్యకు సులభమైన పరిష్కారం చూపించి . . ఇంజినీర్లను సైతం నోటిమీద వేలువేసుకునేలా చేసాడు. పదిమందితో శబాష్ అనిపించుకున్నాడు .
by Srinivas Vedulla | Apr 4, 2025 | జనరల్
అమెరికా ఉత్పత్తులపై 34% టారిఫ్స్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదలెట్టిన వాణిజ్య యుద్ధం ముదిరిపాకాన పడేలా కనిపిస్తోంది. రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న చైనా కూడా అమెరికాపై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. చైనాలో విక్రయించే అమెరికా ఉత్పత్తులపై 34% టారిఫ్ ప్రకటించింది. ఇది ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వచ్చేలా చైనా ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది. అమెరికా నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే అన్ని వస్తువులపైనా 34 శాతం సుంకాలు విధిస్తామని చైనా తాజాగా చేసిన ప్రకటనతో వరల్డ్ వైడ్ వాణిజ్య సంబంధాలకు విఘాతం కలిగేలా కనిపిస్తోంది . ఈనెల 10 నుంచి నూతన టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో వినియోగించే ఏడు కీలక ఖనిజాల దిగుమతులపైనా చైనా వాణిజ్య శాఖ నియంత్రణలు విధించింది. అటు అమెరికా విధించిన ప్రతీకార సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేసింది. చైనా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ 34 శాతం సుంకాలు విధించడంతో తాజాగా డ్రాగన్ అదే స్థాయిలో సుంకాలను వడ్డించింది.
చైనా-అమెరికా మిలిటరీ అధికారుల చర్చలు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక, మొదటిసారి చైనా-అమెరికా మధ్య మిలిటరీ చర్చలు జరిగాయి. చైనాలోని షాంఘై నగరం వేదికగా ఈ ఇరుదేశాలు సైనిక భద్రతపై చర్చలు జరిపాయి. ఈ విషయాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ సహా, అమెరికా సైనిక ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ కూడా దీనిని ధ్రువీకరించాయి. ఇవి వర్కింగ్ లెవల్లో జరిగిన చర్చలుగా పెంటగాన్ పేర్కొంది. ఈ చర్చలకు అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్, కోస్ట్‌గార్డ్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.