by Ram Maddipati | Jun 21, 2025 | జనరల్
అప్పుల ఊబిలో అగ్రరాజ్యం.. ఏటా వడ్డీలకే ట్రిలియన్ డాలర్ల ఖర్చు
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలోని ప్రధాన దేశాలు బలహీనపడటంతో ప్రపంచంలోనే ఆర్థికంగా సైనికంగా తిరుగులేని అగ్రరాజ్యంగా ఆవిర్భవించే అవకాశం అమెరికాకు దక్కింది. ఆ తరువాత దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సోవియట్ యూనియన్ నుంచి రాజకీయంగా సైనిక ఆయుధశక్తిపరంగా తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నా అంతిమంగా గెలిచింది అమెరికానే. సోవియట్ యూనియన్ విచ్చిన్నమయ్యాక అమెరికా ఏకైక అగ్రదేశంగా నిలిచి ప్రపంచదేశాలను అన్నివిధాలుగా శాసిస్తూ వచ్చింది. అయితే ఈ వైభవం ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చన్న విశ్లేషణలు కొంతకాలంగా ఆర్థిక రంగంలోని నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. విశ్వవాణిజ్యంలో ఇప్పటిదాకా ప్రధాన కరెన్సీగా ఆమెరికా డాలర్ చలామణిలో ఉంది. బంగారం వంటి విలువైన లోహాల నుంచి ముడి చమురు వ్యాపారం దాకా అత్యధిక శాతం మారకం డాలర్లలోనే సాగుతోంది. అయితే ఈ పరిస్థితి భవిష్యత్తులో మారే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా చైనా దేశం నుంచి అమెరికాకు ఎదురవుతున్న పోటీయేనని చెప్పుకోవాలి. చైనాకు అమెరికా మధ్య సాగుతున్న ఆర్థిక పోటీ, వ్యూహాత్మక వేడి, డాలర్‌పై ఆధిపత్యాన్ని తగ్గించాలన్న చైనాకి ఉన్న ప్రణాళికల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ప్రపంచ తయారీ రంగంపై పెరిగిన చైనా ఆధిపత్యం..
ప్రపంచ తయారీ రంగంలో గడచిన రెండున్నర దశాబ్దాలుగా చైనా శరవేగంగా దూసుకెళుతోంది. 2023 నాటికి గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్‌లో చైనాకి ఉన్న వాటా దాదాపు 28.8 శాతంగా ఉంది, ఇది పెద్దన్న అమెరికా (15.5%) కంటే ఇంచుమించు రెట్టింపు. రెండు దశాబ్దాల క్రితం ఇది కేవలం 8 శాతం మాత్రమే. చైనా తయారీ సామర్థ్యం ఏ స్థాయిలో పెరిగిందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. చైనా దూకుడు ఉత్పత్తి రంగంతో మాత్రమే ఆగలేదు. ‘Made in China 2025’ వంటి ప్రణాళికలతో దేశీయ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహిస్తూ నూతన సాంకేతిక రంగంలో సైతం ఆధిపత్యాన్నిసాధించేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా టెక్ జెయింట్లు వేల కోట్ల డాలర్లు వ్యయం చేసి తయారు చేసిన చాట్ జీపీటీ వంటి అద్భుత సాంకేతిక సాధనాలకు పోటీగా తక్కువ వ్యయంతోనే డీప్‌సీక్ వంటి డిజిటల్ ఉత్పత్తులతో ఆ రంగంలోనూ అమెరికాకు సవాల్ విసురుతోంది.
టెక్నాలజీ, పరిశోధనలో గణనీయ పెట్టుబడులు
చైనా తన జాతీయ ఆదాయంలో 2.6 శాతానికి పైగా నిధులను పరిశోధన & అభివృద్ధి రంగానికి ఖర్చు చేస్తోంది. 2024లో ఈ ఖర్చు దాదాపు $70 బిలియన్లకు చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, చిప్ తయారీ వంటి కీలక రంగాల్లో చైనా స్వావలంబన వైపు వేగంగా కదులుతోంది. ఇది తన ఆధిపత్యాన్ని సవాల్ చేయగలదు అనే భయం అమెరికాలో నెలకొంది. అందుకే అక్కడ నుండి టెక్నాలజీ ఎగుమతులపై ఆంక్షలు పెడుతోంది.
డాలర్ కు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ?
చైనా పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో అమెరికన్ డాలర్‌కు బదులుగా, తమ కరెన్సీ అయిన రెమ్మిన్బి (యువాన్)లో లావాదేవీలు జరిపేలా ప్రోత్సహిస్తోంది. 2024 నాటికి ట్రేడ్ ఫైనాన్స్‌లో రెమ్మిన్బి వాడకం స్విఫ్ట్ డేటా ప్రకారం రెండో స్థానానికి చేరింది. ఇది డాలర్ ఆధిపత్యానికి గండికొట్టే దిశగా బలమైన అడుగుగా పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఇప్పటికే చైనా ఎదిగింది. అమెరిక సహా అనేక దేశాలతో వాణిజ్యంలో చైనాకు మిగులు ఆదాయం ఉంది. అంటే ఆయా దేశాలనుంచి చైనాకు దిగుమతి అయ్యే వస్తువుల విలువ కంటే చైనా ఎగుమతి చేసేవాటి విలువ ఎంతో ఎక్కువ. ఇదే సమయంలో బ్రిక్స్ దేశాలు కూడా అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాయి.
అమెరికా రక్షణాత్మక చర్యలు
చైనా సహా ఇతర దేశాలు సాధిస్తున్న వృద్ధి తనకు ప్రతికూలంగా మారుతున్నందుకు ప్రతిస్పందనగా అమెరికా తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు పలు రక్షణాత్మక చర్యలు తీసుకుంటోంది. చైనా టెక్ సంస్థలపై ఆంక్షలు, హై-ఎండ్ చిప్స్ ఎగుమతులకు అడ్డుపడే విధంగా చర్యలు, మిత్ర దేశాల్లో చైనా దూకుడును తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాక స్థానికంగా తయారీని ప్రోత్సహిస్తూ చైనాపై ఆధారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు అమెరికా చేస్తోంది. కానీ ఆ దేశంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువ కావడంతో అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
అమెరికాను భయపెడుతున్న అప్పులు
అగ్రరాజ్యం అమెరికాకు అప్పులు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం అవి సుమారు 37 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏటా అమెరికా వీటిపై కడుతున్న వడ్డీనే ఏటా 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారింది. అమెరికాతో వాణిజ్య మిగులు ఆదాయంలో కొంత భాగాన్ని చైనా తిరిగి ఆదేశంలోనే బాండ్లలో పెట్టుబడి పెడుతూ వచ్చింది. పదేళ్లక్రితం ఈ పెట్టుబడులు దాదాపు 1.3 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవి. ఆ తరువాత అమెరికాలో అత్యధిక పెట్టుబడులు ఉన్న దేశాలుగా జపాన్, యూకే ఉండేవి. అయితే ఈ దశాబ్ద కాలంలో చైనా అమెరికా బాండ్లలో తన పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం అవి 785 ట్రిలియన్ డాలర్లకు తగ్గడంతో చైనా అమెరికా పెట్టుబడుల్లో 3వ స్థానానికి పడిపోయింది. ఒకరకంగా ఇది అమెరికా డాలర్‌పై వత్తిడి పెంచేందుకు చైనా అనుసరించిన వ్యూహాత్మక విధానమేనని చెప్పాలి. ఆర్థికంగా బలంగా ఉన్న చైనా తన పెట్టుబడులు ఉపసంహరించుంటే అమెరికాకు రుణ సేకరణ భారమవుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఆంక్షలంటూ చైనా సహా పలు దేశాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేస్తున్న విన్యాసాల వెనుక నేపథ్యమిదే.
కమ్యూనిస్టు దేశం కావడమే చైనాకు అడ్డంకి..
అయితే ఇప్పటికిప్పుడు చైనా పూర్తిగా అమెరికా స్థానాన్ని సొంతం చేసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ. కానీ చైనా కొన్ని సరళ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నా మౌళికంగా కమ్యూనిస్టు దేశం. ఇంకా పర్-క్యాపిటా ఆదాయం, బహుళరాజకీయ విధానాలు, ఫైనాన్షియల్ వ్యవస్థలు వంటి విషయాల్లోనూ అమెరికాతో పోలిస్తే చైనా వెనుకబడి ఉంది. అయితే దీర్ఘకాలంలో చూసినప్పుడు, చైనా ముందస్తు ప్రణాళికలతో, క్రమంగా అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న విషయం కాదనలేని వాస్తవం.
by Ram Maddipati | Jun 18, 2025 | ఆంధ్రప్రదేశ్
ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దుల్లో తగ్గిన మావోల అలజడి . .. ఛత్తీస్ ఘడ్ లోనూ తగ్గిన ప్రభావం
తాజాగా ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం.. అల్లూరి జిల్లాలో ఘటన
ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. వరుస ఎన్ కౌంటర్ల తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ వందల సంఖ్యలో సభ్యులను కోల్పోయింది. AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఎక్కువగా సంచరించే మావోలు . … దేవీపట్నం మండలంలోకి వచ్చేసారు. దశాబ్ద కాలంగా దేవీపట్నం మండల పరిసరాలలో మావోల కదలికలు లేవనే చెప్పాలి . అయితే AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో నిఘా పెరగడంతో ఆయా ప్రాంతాలలో సురక్షితం కాదని భావించిన మావోలు . …దేవీపట్నం ఏరియాపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది .
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో భద్రతా దళాల గాలింపు చర్యల్లో భాగంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళ సహా ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మరణించారు. రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల సమీపంలోని కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూరు వద్ద ఇరువర్గాలకు భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో చనిపోయిన వారిని మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య అరుణ, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అంజు గా గుర్తించిట్టు తెలుస్తోంది. చలపతిరావు ఈ ఏడాది జనవరిలో చత్తీస్‌గఢ్ ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో జరిగిన భద్రతాదళాల కూంబింగ్‌లో జరిగిన కాల్పుల్లో మరణించాడు.
మూడు ఏకే 47 రైఫిల్స్ స్వాధీనం
కాగా ఘటనా స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ సహా భారీగా ఆయుధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. హతుల్లో అరుణ మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు కాగా గాజర్ల రవి కేంద్ర కమిటీ సభ్యుడిగా, అంజు ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎంగా ఉన్నట్టు తెలుస్తోంది. అరుణ 2018లో జరిగిన నాటి టీడీపీ ఎమ్యెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఆమెపై రూ. 20 లక్షల రివార్డు కూడా ఉంది. చనిపోయినవారి మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్‌కౌంటర్‌తో ఉలికిపాటుకు గురైన ప్రజలు
ఇటీవలికాలంలో ఈ తరహా ఘటనలు జరగకపోవడంతో ఈ ప్రాంతమంతా ఉన్న సమయంలో ప్రజలు తాజా పరిణామాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకప్పుడు ఏవోబీ తో పాటు విశాఖ, తూర్పుగోదావరిజిల్లాల్లోని దండకారణ్య ప్రాంతం మావోయిస్టులకు పెట్టనికోటగా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి పలువురు యువకులు ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులై చేరడంతోపాటు, గ్రామాల్లో పలువురు సానుభూతిపరులు సైతం ఉండేవారు. అందుకే మావోయిస్టు ఉద్యమం బలంగా విస్తరించింది. భద్రతా దళాలకు.. మావోయిస్టులకు తరచుగా కాల్పులు జరుగుతూ ఇరువైపులా ప్రాణనష్టం జరిగేది. కూంబింగ్ భారీస్థాయిలో జరుగుతున్న సమయంలో వ్యూహాత్మకంగా తీవ్రవాదులు సరిహద్దుల్లోని చత్తీస్‌గఢ్ ఒడిశా ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో తరలిపోయి షెల్టర్ తీసుకునేవారు. తమకు అనువైన సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడి ఎదురుదాడి చేసేవారు. ఈ కారణంగానే వారిని ఎదుర్కోవడం పోలీసులకు పెనుసవాల్‌గా ఉండేది.
గతంలో ప్రభుత్వాలకు వణుకు పుట్టించిన మావోయిస్టు దాడులు
కొన్నేళ్ల క్రితం తీవ్రవాద ఉద్యమం బలంగా ఉన్న సమయంలో ఏవోబీలోను, బస్తర్ అడవుల్లోనూ కూంబింగ్‌కు వెళ్లిన భద్రతాదళాలపై ఊహించనివిధంగా చుట్టుముట్టి మావోలు భీకరమైన దాడులు చేశారు. 2008 జూన్ 29న ఒడిశా రాష్ట్రంలోని బలిమెల జలాశయంలో గ్రేహౌండ్స్ దళాలు ప్రయాణిస్తున్న పడవపై మావోయిస్టులు తూటాల వర్షం కురిపించడంతో 32మంది గ్రేహౌండ్స్ సిబ్బంది, ఐదుగురు పోలీసులు సహా మొత్తం 38 మంది మరణించారు. 2010 ఏప్రిల్‌లో చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని చింతల్నార్ వద్ద కూంబింగ్‌కు వెళ్లిన 200 మంది భద్రతాదళాలను దాదాపు వెయ్యిమంది మావోయిస్టులు చక్రవ్యూహంలో బంధించి జరిపిన మారణహోమంలో 76మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జరిగిన మావోయిస్టు దాడుల్లోనే ఇది అతిపెద్దది. 2023 ఏప్రిల్ నెలలో మళ్లీ దంతెవాడ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు వస్తున్న ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చి 10మందిని బలిగొన్నారు. మావోల దాడుల్లో ఇవి కొన్ని మాత్రమే.
వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన మావోయిస్టులు
మావోయిస్టుల సమస్యను బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర హోం శాఖ.. మావోయిస్టు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించింది. దీంతో సీఆర్‌పీఎఫ్ కోబ్రా దళాలు మావోల ప్రాబల్యమున్న రాష్ట్రాల పోలీసుల సహకారం సమన్వయంతో వారున్న అటవీ ప్రాంతాలను కొన్ని నెలలుగా ప్రణాళిక ప్రకారం జల్లెడ పడుతున్నాయి. గతంలో ఎన్నడూ జరుగని స్థాయిలో మావోలతో దాదాపు యుద్ధం చేస్తున్నాయి. గత రెండు మూడు నెలల్లోనే మావోయిస్టు అగ్రనాయకత్వంతో సహా రెండువందలమందికి పైగా భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న మావోయిస్టులు చెల్లాచెదురై షెల్టర్ తీసుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చినట్టు విశ్లేషణలు వస్తున్నాయి.
ఉద్యమం బలహీనపడటానికి కారణాలెన్నో..!
ఆయుధాలు చేతబట్టి హింసావాదంతో వ్యవస్థలను మార్చవచ్చని నమ్మే కాలం చెల్లిన ఆలోచనావిధానం, మారిన సామాజిక ఆర్థిక అంశాలను గుర్తించలేని పిడివాదం.. సామాన్య ప్రజల్లో ఉద్యమంపై ఒకనాటి సానుభూతి క్రమేణా కరిగిపోవడం మావోయిస్టు ఉద్యమం బలహీనపడటానికి ప్రధాన కారణాలుగా చెప్పాలి. మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా యువతకు అభివృద్ధి ఫలాలు అందడంతో కొత్తగా ఉద్యమం వైపు ఆకర్షితమయ్యేవారు కరువయ్యారు. ఇదే సమయంలో కొందరు మావోయిస్టు పార్టీ నేతలు తెలంగాణలోనూ ఇటు ఏపీ, రాయలసీమ ప్రాంతాల్లోనూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు అనుకూలంగా వ్యవహరించి ఉద్యమాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకరకంగా వారి వెన్నుపోటు పార్టీని తప్పుడు మార్గం పట్టించింది. మావోయిస్టులను తమ రాజకీయ ఎదుగుదలకు, రాజ్యాధికారం చేజిక్కించుకునేందుకు అత్యంత వ్యూహాత్మకంగా వాడుకున్న ఆ నేతలు తమకు అధికారం దక్కాక ఉద్యమాన్ని అంతం చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. ఉద్యమం బలహీనం కావడం మొదలైంది ఆ కాలంలోనే. ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాలపై పోరాడాల్సింది పోయి వ్యవస్థపైనే పోరాటం సాగిస్తామనడం అర్థరహితం అవివేకం. మావోయిస్టు ఉద్యమం ఉత్ధాన పతనాలు చెప్పే పాఠమదే. అక్రమాలను ప్రశ్నించే ధైర్యమున్న అతికొద్దిమంది యువత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పోరాడిఉంటే జాతిని ముందుకు నడిపించే నాయకులుగా ఎదిగేవారు. ఆవేశం, అతివాదంతో ఆయుధాలు పట్టి అడవిపాలై తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.
by Ram Maddipati | Jun 18, 2025 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
జగన్ కోసం చంద్రబాబు ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించినట్లు కేసీఆర్ పై బలమైన ఆరోపణలు
రాజకీయమా.. అరాచకమా..? కేసిఆర్ వ్యవహారశైలిపై తెలుగు రాష్ట్రాలలో ఛీ కొడుతున్న జనం
ఫోన్ ట్యాపింగ్. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సంచలనంగా మారింది . తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS చీఫ్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలై ఆ తర్వాత ఇటు ఏపీకి కూడా ఈ అరాచకం విస్తరించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ దర్యాప్తులో వెలుగుచూసినట్టు వస్తున్న వార్తలు అటు రాజకీయ పార్టీల నాయకులతోపాటు ఇటు సామాన్య ప్రజలను కూడా నివ్వెరపరచేవే. రాజకీయ ప్రత్యర్థులతోపాటు పలువురుపారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపారులు కూడా ఈ ఘటనలో బాధితులేనని వార్తలు వెలువడుతుండటం వర్తమాన రాజకీయాల్లో కొందరు నేతల కారణంగా విలువలు ఎంతగా దిగజారిపోయాయో స్పష్టం అవుతోంది .
రాజకీయ ప్రత్యర్థుల వేటే లక్ష్యంగా . .
గతంలో ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో నాడు టీడీపీ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఓటుకు నోటు కేసు. రాజకీయంగా అప్పట్లో అదో సంచలనం. తెలంగాణలో తమ పార్టీని శాశ్వతంగా అంతం చేయాలని జరిగిన రాజకీయ కుట్రగా టీడీపీ ఆ ఘటనను చెప్పుకున్నా.. టీడీపీకి రేవంత్‌రెడ్డికి అదో మచ్చగా మిగిలిందనే చెప్పాలి. ఈ కేసు కారణంగానే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన సంగతి తెలుగు ప్రజలు అంత తేలికగా మరచిపోలేరు. అంతేకాదు.. ఈ కేసులో నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నాడు కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ చేయడంతో ఫోన్ ట్యాపింగ్ అంశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అనుమానంతోనే చంద్రబాబునాయుడు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా హైదరాబాద్ ను వదిలి ఏపీ నుంచే పాలన సాగించేందుకు సిద్ధపడ్డారన్న విశ్లేషణలు వచ్చాయి.
రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే వెలుగులోకి..
అయితే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ సహాయంతో చేసిన కుట్రగా భావించిన రేవంత్‌రెడ్డి ఆ తర్వాత కాలంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన సీఎం అయిన నాటినుంచి గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై గట్టిగా దృష్టి సారించారు. నాటి ప్రభుత్వంలో దీనికి సంబంధించి పనిచేసిన కీలక అధికారుల విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పోలీస్ అధికారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే . అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా కెసిఆర్ అండ్ కో కు కూడా ఉచ్చు బిగుస్తోంది .
ఫోన్ ట్యాపింగ్ ప్రాథమిక హక్కుల హననమే
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ప్రజల హక్కులకు రక్షణ కల్పించాలి. మించిదని చెప్పాలి . ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు . చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు . ఆ సమయంలో జగన్ కోరిక మేరకు కెసిఆర్ . .. చంద్రబాబు తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాయినట్లు బలమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి . దీనికి సంభిందించి ఇప్పటికే కొన్ని అధరాలు సేకరించినట్లు తెలుస్తోంది .
by Ram Maddipati | May 14, 2025 | ఆంధ్రప్రదేశ్
తక్కువ వడ్డీపై అప్పు – ముందుకు వచ్చిన పలు సంస్థలు
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన విదేశీ బ్యాంకులు
ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ప్రారంభం అవుతున్నాయి . ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేసే ప్రక్రియతో పాటు టెండర్ల ప్రక్రియకూ రంగం సిద్దమవుతుండగా.. ఇప్పుడు వీటికి మరో గుడ్ న్యూస్ అందింది. దీంతో ఇవాళ ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది.
విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. రెండు మెట్రో ప్రాజెక్ట్‌లకు అయ్యే వ్యయంలో రూ.12,000 కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వేగంగా ముందుకు వెళ్తోంది.
విశాఖ, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్‌కు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ తొలిదశలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్ నిర్మించనున్నారు.
విజయవాడ మెట్రో రైల్ రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో రెండు కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు .
by Ram Maddipati | May 14, 2025 | జాతీయం
భారత్ ను ప్రపంచంలో అగ్రగామి శక్తిగా చూపెట్టిన స్వదేశీ క్షిపణి
”దేశ ప్రజలకు సురక్షితమైన తాగునీరు, అందరికీ కడుపునిండా తిండి పెట్టడానికే తికానలేని దాయాది దేశం పాకిస్తాన్. మనపై అణుయుద్ధం చేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతోంది. తీవ్రవాదులతో అరాచకాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కి మనచేతిలో చావు దెబ్బ తిన్నా ఇంకా బుద్ధి వచ్చినట్లు కనిపించడంలేదు . .”
పాకిస్థాన్ భారత్ పై అణు ఆయుధాల ప్రయోగిస్తానని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ అణు నియంత్రణా కేంద్రం పక్కనే భారత్ సూపర్ సోనిక్ మిస్సైల్ “బ్రహ్మోస్” ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరిణామాన్ని పాకిస్థాన్ బ్లాక్ మెయిల్ కు భారత్ మౌన సమాధానంగానే దేశదేశాల దౌత్య వర్గాలు భావిస్తాయి. అణు ఆయుధాలు ఉన్న రెండు దేశాలు నేరుగా తలపడటం ప్రపంచంలో ఇదేమొదటి సారి.
భారత్ ఆయుధం “బ్రహ్మోస్” టార్గెట్ ప్రకారం పాక్ అణు నియంత్రణ కేంద్రం వరకూ వెళ్ళిన పరిమాణం పట్ల దేశదేశాల అధినేతలు నోరు మెదపకపోయినా మన సామర్ధ్యాన్ని అర్ధం చేసుకున్నారు.
భారత్ సాధనా సంపత్తిపై ప్రపంచం ఏమీ మాట్లాడకముందే అమెరికా ట్రంపు భారత్ అడగని “పెద్దన్న” బాధ్యతను నెత్తిన వేసుకుని “నా మాట విని యుద్దం ఆపేసిన భారత్ పాకిస్థాన్ లకు అభినందనలు” అని ట్విట్టర్ లో “అంతా నా వల్లే” అనే బిల్డప్ ఇచ్చారని అర్థమౌతుంది.
ఆపరేషన్ సిందూర్ లో కీలకమైన “బ్రహ్మోస్” ఆయుధం గురించి ఇక్కడ తెలుసుకుందాం!
బ్రహ్మోస్: భారత రక్షణ శక్తికి ప్రతీక
భారత్, రష్యా సంయుక్త సహకారంతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, ఆధునిక యుద్ధ సాంకేతికతలో ఒక అద్భుత విజయంగా నిలుస్తోంది. భారత డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రష్యా NPO మషినోస్ట్రోయెనియా సంస్థల సమన్వయంతో రూపొందిన బ్రహ్మోస్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన క్షిపణులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే ఇపుడు వరల్డ్ వైడ్ మన రక్షణ సామర్ధాన్ని చాటి చెపుతోంది .
మాక్ 2.8 నుండి మాక్ 3 వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్, శత్రు రక్షణ వ్యవస్థలను అధిగమించగల సామర్థ్యంతో అసమానమైన శక్తిని ప్రదర్శిస్తుంది. 290 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ల వరకు విస్తరించిన దాని పరిధి, భూమి, సముద్రం, గాలి, జలాంతర్గాముల నుండి ప్రయోగించగల బహుముఖతతో, దీనిని యుద్ధ రంగంలో అప్రతిహత ఆయుధంగా నిలిపింది. అధునాతన గైడెన్స్ సిస్టమ్ తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ దీని స్టీల్త్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, అయితే “ఫైర్ అండ్ ఫర్గెట్” సూత్రం దాని ఖచ్చితత్వాన్ని 99.99% స్థాయికి పెంచుతుంది.
భారత్ రక్షణ సామర్ధ్యానికి ఆనవాలు
బ్రహ్మోస్ యొక్క వివిధ వెర్షన్‌లు—బ్రహ్మోస్-I, ఎక్స్‌టెండెడ్ రేంజ్ (ER), బ్రహ్మోస్-NG, హైపర్‌సోనిక్ బ్రహ్మోస్-II—భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా దాని సాంకేతిక పరిణామాన్ని సూచిస్తున్నాయి. మాక్ 8 వేగంతో 1,500 కిలోమీటర్ల పరిధిని లక్ష్యంగా చేసుకున్న బ్రహ్మోస్-II, హైపర్‌సోనిక్ యుగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపనుంది.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్థాన్‌లోని లక్ష్యాలపై వినియోగం బ్రహ్మోస్ యుద్ధ సామర్థ్యాన్ని స్పష్టం చేసింది. అంతేకాక, ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల నుండి వస్తున్న ఆర్డర్లు, బ్రహ్మోస్ ప్రపంచ గుర్తింపును హైలైట్ చేస్తున్నాయి.
బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదు—ఇది భారతదేశ రక్షణ సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణ, మరియు అంతర్జాతీయ సహకారం యొక్క సమ్మేళనం. దీని ఉనికి శత్రువులకు హెచ్చరికగా, మిత్రదేశాలకు భరోసాగా నిలుస్తోంది. బ్రహ్మోస్ ద్వారా, భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి గట్టిగా చెప్తోంది.
లక్ష్యాన్ని చూశారు…గురిచూసి కొట్టారు….శతృవు చేతులు ఎత్తేశాక… ఉగ్రవాదిని లేపెయ్యడమే…నువ్వు మా జాగా ఖాళీ చేసిపోవడమే… ఇక మాటల్లేవ్…మాట్లాడుకోవడాల్లేవ్…అని దిగ్బంధనం చేశారు. చుట్టూ బిగబట్టి శతృవుని కాళ్ళ బేరానికి రప్పించుకున్న చాణక్య నీతి చూపించారు. యుద్ధతంత్రంతో
భారత్ ను అజేయ శక్తిగా ప్రపంచం ముందు నిలబెట్టారు
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతీయతకు జయహో జయహో జయహో. భారత్ మాతాకీ జై . ..