పి. గన్నవరంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి వెళ్లిన మూడు రోజులకే ఆ పార్టీలో ముసలం ఎందుకు పుట్టింది? నియోజకవర్గంలోని మూడు మండలాల టిడిపి అధ్యక్షులు మూకుమ్మడిగా ఎందుకు రాజీనామాలు చేశారు? నియోజకవర్గ టిడిపి ఇంచార్జి విషయంలో పార్టీ అధిష్టానం ఏదో నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయానికి వచ్చి ముగ్గురు మండల అధ్యక్షులు రాజీనామా చేసేలా చక్రం తిప్పిన నాయకులు ఎవరు? ఆ నాయకులు అధిష్టానం నిర్ణయాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారా? లేక అధిష్టానాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? పి. గన్నవరం నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలపై ‘Abhi News’ అందిస్తున్న ప్రత్యేక కథనం…
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ అధిష్టానం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ముందుకు నడిచిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అధిష్టానం ఆలోచనను ధిక్కరిస్తూ పి. గన్నవరం మండల టిడిపి అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి, అంబాజీపేట మండల టిడిపి అధ్యక్షులు గుడాల ఫణి, అయినవిల్లి మండల టిడిపి అధ్యక్షులు శ్యాం సుందర్ రాజీనామా చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాలలోనే హాట్ టాపిక్ గా మారింది. పి. నియోజకవర్గ టిడిపి కో- కో ఆర్డినేటర్ మోకా ఆనందసాగర్ ను నియోజకవర్గ టిడిపి ఇంచార్జిగా నియమించాలని అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చిందని, దీనికి వ్యతిరేకంగా తాము రాజీనామా చేస్తున్నామని మండల టిడిపి అధ్యక్షులు చెబుతున్నారు. వాస్తవానికి అధిష్టానం ఈ నియోజకవర్గం ఇంచార్జి నియామకం విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోనూ లేదు.. ప్రకటించనూ లేదు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో పర్యటించినపుడు పార్టీలో ఎస్సీ సామాజిక వర్గ ముఖ్య నేతగా వేదికపై ఆనంద్ సాగర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది నచ్చని అమలాపురం పార్లమెంట్ స్థాయి ప్రజా ప్రతినిధి ఈ మండల నేతలతో గ్రూపు రాజకీయాలకు తెర లేపినట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిపాడ్ వద్ద ఆయనకు స్వాగతం పలికే విషయంలో పి. గన్నవరం నాయకులకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు అనుచరులు పి. గన్నవరం నియోజకవర్గంతో సంబంధం లేకుండానే సీఎంకు స్వాగతం పలికే వారి జాబితాలో చేరిపోయారు. టిడిపి జోనల్ కోఆర్డినేటర్ సుజయ కృష్ణ రంగారావు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ లను తప్పుదారి పట్టించి పార్టీలో ఏ పదవి లేని వారు సైతం సీఎం హెలిపాడ్ ప్రదేశానికి చేరుకుని హంగామా సృష్టించారు. ఇది పి. గన్నవరం నియోజకవర్గ ముఖ్య నేతలలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ టిడిపి పరిస్థితిపై సమీక్ష చేస్తున్న సమయంలో టిడిపి సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు డొక్కా నాథ్ బాబు సీఎం ఎదుటే తన అసంతృప్తి బయట పెట్టారు. నియోజకవర్గంకు సంబంధించి వాస్తవ నివేదికలు మీకు చేరడం లేదని నాథ్ బాబు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.
Cast Politics
పి. గన్నవరం నియోజకవర్గం నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకులు ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ నుండి టిడిపి సీనియర్ నేత నామన రాంబాబు ఉమ్మడి తూర్పుగోదావరికి జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులుగా, రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ గా కూడా నామన రాంబాబు సేవలందించారు. మరో ముఖ్య నేత డొక్కా నాథ్ బాబు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా పని చేశారు. పి. గన్నవరం నియోజకవర్గంలో టిడిపి తరపున ఎవరికి పదవులు ఇవ్వాలి? ఎమ్మెల్యేగా ఎవరిని పోటీ చేయించాలి అనేది అధిష్టానంకు సూచించే స్థాయి ఈ ఇద్దరు నాయకులకు ఉండేది. ఇదంతా గతం. దశాబ్ద కాలంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతోంది. 2019లో ఓటమి తరువాత పి. గన్నవరం టిడిపికి ఇంచార్జినే నియమించలేదు అధిష్టానం. ఆ సమయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆయన సతీమణి, జిల్లా టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పి. గన్నవరం నియోజకవర్గం టిడిపిపై పెత్తనం చలాయించారు. ఆ తరువాత నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ గా నామన రాంబాబును, కో- కోఆర్డినేటర్లుగా మోకా ఆనంద్ సాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణలను అధిష్టానం నియమించడంతో పి. గన్నవరం టిడిపి రాజకీయాలు కులాల వారీగా చీలిపోయాయి.
2024లో పొత్తులో భాగంగా పి. గన్నవరం జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యే అయ్యారు. కూటమి పరంగా అంతా బాగానే ఉన్నా టిడిపిలో మాత్రం గ్రూప్ తగాదాలు పెరిగి పోయాయి. అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ పి. గన్నవరం టిడిపిపై ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ గ్రూపులు పెరగడానికి కారణం అని టిడిపి క్యాడర్ బాహాటంగానే చెబుతోంది.
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ కు పి. గన్నవరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి పదవి ఇప్పించి ఈ నియోజకవర్గంను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ఎంపీ హరీష్ గత కొంత కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో మోకా ఆనంద్ సాగర్ కి లభించిన ప్రాధాన్యతతో అతనికి ఇంచార్జి పదవి ఇస్తే తన పెత్తనానికి ఇక్కడ చెక్ పడుతుందనే భావనతో హరీష్ ఇక్కడ మండల టిడిపి అధ్యక్షుల రాజీనామాకు తెర లేపారని ప్రచారం జరుగుతోంది. మండల టిడిపి అధ్యక్షుల రాజీనామాపై పార్టీ అధిష్టానం ఆరా తీసినపుడు సైతం హరీష్ పాత్ర ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.



