ట్రంప్ కి నాటో షాక్ . ..

Rama Chandra P

March 17, 2026

హోర్ముజ్‌ జలసంధి వద్దకు యుద్ధనౌకలను పంపేందుకు బ్రిటన్‌, జర్మనీ, బెల్జియం, స్పెయిన్‌, డెన్మార్క్‌ , ఫ్రాన్స్‌ నో

  • ఆ బాటలోనే ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు
  • ముందు యుద్ధం ఆపండి: చైనా హితవు
  • నేను కోరిన సాయం చేయకపోతే నాటో దేశాల భవిష్యత్తు చెడ్డగా ఉంటుంది: ట్రంప్‌
  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
  • దుబాయి ఎయిర్‌పోర్టు వద్ద ట్యాంకర్‌ ధ్వంసం

‘‘హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసేయడం వల్ల ఇబ్బందిపడే దేశాలన్నీ.. నౌకల రవాణాకు ఆ మార్గం తెరిచే ఉంచేందుకు తమ నౌకాదళాలను పంపాలి. ప్రపంచ శాంతి భద్రతల కోసం అందరం కలిసికట్టుగా ఈ పని చేద్దాం’’ అంటూ ట్రంప్‌ ఇచ్చిన పిలుపునకు అమెరికా మిత్రదేశాలే నిష్కర్షగా ‘నో’ చెప్పేశాయి. చైనా, ఫ్రాన్స్‌, జపాన్‌, దక్షిణ కొరియా, యూకే.. తదితర దేశాలు హోర్ముజ్‌ జలసంధి వద్దకు తమ తమ యుద్ధనౌకలను పంపుతాయని ఆయన ఆశించగా.. వాటిలో ఒక్క దక్షిణ కొరియా మాత్రమే ఆయన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. మిగతా దేశాలేవీ సానుకూలంగా స్పందించలేదు. తమకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని జపాన్‌ ప్రధాని టకైచీ ఆ దేశ పార్లమెంటు సాక్షిగా తెలుపగా.. ఆస్ట్రేలియా కూడా అదే మాట చెప్పింది. యుద్ధనౌకలను హోర్ముజ్‌ జలసంధికి పంపడం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయంటూ యూకే ప్రధాని స్టార్మర్‌ ట్రంప్‌ అభ్యర్థనను తోసిపుచ్చారు. విస్తృత యుద్ధంలో అడుగుపెట్టాలని బ్రిటన్‌ అనుకోవట్లేదన్న ఆయన.. తమ దేశం ఈ వివాదంలో వాషింగ్టన్‌ను అనుసరించదని స్పష్టం చేశారు. హోర్ముజ్‌ జలసంధిని తెరవడానికి మిత్రదేశాలతో కలిసి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నానని.. కానీ, అది నాటో మిషన్‌ కాదని స్టార్మర్‌ స్పష్టం చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి జాన్‌ వేడ్‌ఫుల్‌ కూడా ట్రంప్‌ పిలుపునకు ప్రతికూలంగా స్పందించారు. సముద్ర మార్గాలను కాపాడుకునే విషయంలో జర్మనీ ఎప్పుడూ నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుందని.. కానీ, హోర్ముజ్‌ వద్దకు తమ దేశ నౌకలు ఇప్పటికిప్పుడు వెళాల్సిన అవసరం తనకు కనపడట్లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యంత శక్తిమంతమైన అమెరికా యుద్ధనౌకలు చేయలేని పనిని యూరప్‌ దేశాలకు చెందిన యుద్ధనౌకలు చేస్తాయని ట్రంప్‌ ఎలా అనుకుంటున్నారని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ ప్రశ్నించారు. ఇది అసలు తమ యుద్ధం కాదని.. ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని వ్యాఖ్యానించారు. ఇక, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి క్యాథరిన్‌.. హోర్ముజ్‌కు తామేమీ యుద్ధనౌకలను పంపబోమని కిందటివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటో సభ్యదేశాలైన స్పెయిన్‌, బెల్జియం, ఇటలీ, డెన్మార్క్‌ కూడా ఈ యుద్ధంలో పాల్గొనబోమని సంకేతాలిచ్చాయి. దీనిపై నాటో ప్రతినిధులు స్పందించారు. కూటమిలోని సభ్యదేశంపై బయటి దేశాలేవైనా దాడి చేస్తే.. అప్పుడు నాటో దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడుతాయని, అదే నాటో దేశమే వేరే దేశంపై యుద్ధానికి దిగితే.. మిగతా సభ్యదేశాలు కూడా ఆ దేశంతో కలిసి దాడులకు దిగాలనే నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు.

ఏప్పుడో చెప్పా..

యూకే, జపాన్‌, ఆస్ట్రేలియా తమ నిర్ణయాలను ప్రకటించకముందే ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్‌ జలసంధిని తెరవడానికి మిత్రదేశాలు సహాయం చేయడంలో విఫలమైతే.. నాటో కూటమి భవిష్యత్తు చాలా చెడ్డగా ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు! ‘‘నాటో అని మనకి ఒక కూటమి ఉంది. దాని విషయంలో మేం చాలా మంచిగా ప్రవర్తించాం. ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిన అవసరం లేకపోయినా.. మేం వారికి సాయం చేశాం. ఇప్పుడు వారు (నాటో దేశాలు) మాకు సాయం చేస్తారో లేదో చూస్తాం. మేం వారి కోసం నిలబడతాంగానీ, వారు మాకోసం నిలబడరని నేనెప్పుడో చెప్పాను. ఈసారి కూడా వారు మా కోసం వస్తారని నేను అనుకోవట్లేదు. నాటో దేశాలు అసలు స్పందించకపోయినా.. ప్రతికూలంగా స్పందించినా అది కూటమి భవిష్యత్తుకు చెడు చేస్తుంది’’ అని పేర్కొన్నారు. అలాగే.. హోర్ముజ్‌ జలసంధిపై తాను ఏడు దేశాల సాయం కోసం కోరగా.. అందులో కొన్ని అంగీకరించినట్టు ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అయితే, అంగీకారం తెలిపిన దేశాలేవో ఆయన వెల్లడించలేదు. కాగా, హోర్ముజ్‌లో నౌకల సురక్షిత రాకపోకల విషయంలో మిత్రదేశాలన్నీ అమెరికాకు హ్యాండివ్వగా.. చైనా అత్యంత జాగ్రత్తగా స్పందించింది. ఉద్రిక్తతలు మరింతగా పెరగకుండా ఉండాలంటే ఇరుపక్షాలూ సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని సూచించింది.

జలసంధిని తెరవలేకపోతే..

హోర్ముజ్‌ను ఇరాన్‌ మరికొంతకాలం ఇలాగే మూసి ఉంచితే.. ట్రంప్‌ ఖార్గ్‌ ద్వీపం స్వాధీనం దిశగా అడుగులు వేయొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచా రం. అయితే, ఖార్గ్‌ స్వాధీనానికి కేవలం వైమానిక దాడులు చాలవని.. అమెరికా సైన్యం రంగంలోకి దిగాల్సి ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్‌ ఆ పని చేస్తే.. చుట్టుపక్కల ఉన్న గల్ఫ్‌ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్‌ దాడులు చేసే ప్రమాదం ఉందని, అప్పుడు పరిస్థితి మరింత తీవ్రమవుతుందని వారు పేర్కొంటున్నారు.

You May Also Like…

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే  లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తన ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న భూగర్భ క్షిపణి...