ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న హర్మూజ్ వ్యవహారం సంక్లిష్టంగా మారింది. అమెరికా తమ షరతులను పూర్తిగా అంగీకరించిన తర్వాతే హర్మూజ్‌ను తిరిగి తెరుస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) స్పష్టం చేసింది. అలాగే హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఒమన్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు హర్మూజ్‌లో అబుదాబికి చెందిన అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి జరిగింది.
హర్మూజ్ జలసంధి తెరవడం అనేది నిర్దిష్ట విధానాలు, షరతులకు లోబడి ఉంటుందని ఐఆర్జీసీ ప్రతినిధి సర్దార్ మొహెబీ తెలిపారు. ప్రాంతీయ చర్చల్లో అమెరికా జోక్యాన్ని నిలిపివేయాలని చేశారు. హర్మూజ్ జలసంధి పునఃప్రారంభానికి సంబంధించి తమ డిమాండ్లను అమెరికా అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహమ్మద్ బాగెర్ కూడా పలు షరతులను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా బెదిరింపులను నిలిపివేయడం, సైనిక చర్యలను ఆపడం, గల్ఫ్ ప్రాంతం నుంచి ఆపరేషన్లలో పాల్గొంటున్న నౌకా, వైమానిక బలగాలను వెనక్కి తీసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఘర్షణల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని కూడా టెహ్రాన్ కోరుతోంది.
ఒమన్‌తో ఒప్పందానికి చేరువలో
ఇక హర్మూజ్‌లో వాణిజ్య నౌకల రాకపోకలకు సంబంధించి ఒమన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. కొత్త నౌకాయాన విధానంపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యనించారు. అయితే శాంతి కోసం చర్చలు జరిపినా, ఇరాన్ ప్రజల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దేశీయ సామర్థ్యాలు, ప్రజలపైనే తమ ప్రభుత్వం ప్రధానంగా ఆధారపడుతుందని పేర్కొన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పర్షియన్ గల్ఫ్ దేశాలను ఇరాన్‌కు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని పెజెష్కియాన్ ఆరోపించారు.


