భూతలదాడులకు దిగితే అమెరికా సైనికులు సొరచేపలకు ఆహారం అవుతారు: ఇరాన్ డెడ్లీ వార్నింగ్
ఇరాన్ – అమెరికా యుద్ధం ఎటుదారితీస్తుందోనన్న ఆందోళన ఎక్కువవుతోంది . ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఇరాన్ సైన్యం చేసిన క్షిపణిదాడిలో సౌదీఅరేబియాలోని ప్రిన్స్‌సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసమైంది. బోయింగ్-707 మోడల్లో మార్పులు చేసి గగనతలంలో ఓ కమాండ్ సెంటర్లా రూపొందించిన ఈ3-సెంట్రీ అవాక్స్ చాలా శక్తిమంతమైంది. 250 మైళ్ల పరిధిలో గగనతలంలో ఏం జరిగినా ఈ విమానం అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదు.
పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో యుద్ధం భీకరంగా మారుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుగా హూతీ రెబెల్స్ దాడులు మొదలుపెట్టగా, భూతల దాడుల ప్రచారం మధ్య అమెరికాకు చెందిన మెరైన్లు పశ్చిమాసియాకు చేరుకోవటం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎటాక్ చేస్తుండగా, మరోవైపు టెహ్రాన్ సహా ఇతర ప్రాంతాల్లో ఐడీఎఫ్ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా భూతల దాడులు ప్రారంభిస్తే వారి సైన్యం పర్షియన్ గల్ఫ్ సొర చేపలకు ఆహారం అవుతారని ఇరాన్ హెచ్చరించిడాం చర్చకు దారితీసింది . యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో 216 మంది చిన్నారులు సహా 2076 మంది మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు ఇంతవరకు ససేమిరా అన్న ఇరాన్, కాస్త బెట్టువీడినట్లు తెలుస్తోంది. షరతులతో కూడిన చర్చలకు అంగీకరించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్‌లో ఆదివారం మధ్యవర్తిత్వ ప్రక్రియపై జరిగే ప్రతిపాదిత చర్చలు యుద్ధ విరమణ లేదా తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. తక్షణమే దాడులు ఆపాలని, భవిష్యత్తులో దాడులు చేయబోమని విశ్వసనీయమైన గ్యారంటీ ఇవ్వాలనే షరతులు పెట్టినట్లు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చలకు ఇరాన్ 5 షరతులు పెట్టినట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.
ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు గల్ఫ్దేశాలు ప్రకటించాయి. గల్ఫ్ దేశాలకు డ్రోన్లతో రక్షణ కల్పించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హామీ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళ ఆయుధ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) పేర్కొంది. ముఖ్యమైన ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై దాడులను కొన్నిరోజుల్లో పూర్తిచేస్తామని తెలిపింది.



