మావోయిస్టులు ఉనికి కోల్పోయినట్లేనా ?

Ram Maddipati

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. వరుస ఎన్ కౌంటర్ల తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ వందల సంఖ్యలో సభ్యులను కోల్పోయింది. AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఎక్కువగా సంచరించే మావోలు . … దేవీపట్నం మండలంలోకి వచ్చేసారు. దశాబ్ద కాలంగా దేవీపట్నం మండల పరిసరాలలో మావోల కదలికలు లేవనే చెప్పాలి . అయితే AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో నిఘా పెరగడంతో ఆయా ప్రాంతాలలో సురక్షితం కాదని భావించిన మావోలు . …దేవీపట్నం ఏరియాపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది .

ఏపీలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అడ‌వుల్లో భ‌ద్ర‌తా ద‌ళాల గాలింపు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఒక మ‌హిళ స‌హా ముగ్గురు మావోయిస్టు కీల‌క నేత‌లు మ‌ర‌ణించారు. రంప‌చోడ‌వ‌రం, మారేడుమిల్లి ప్రాంతాల స‌మీపంలోని కొండ‌మొద‌లు, కొయ్య‌ల‌గూడెం, చింత‌కూరు వ‌ద్ద ఇరువ‌ర్గాల‌కు భీక‌ర కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌నలో చ‌నిపోయిన వారిని మావోయిస్టు అగ్ర‌నేత చ‌ల‌ప‌తిరావు భార్య అరుణ‌, గాజ‌ర్ల ర‌వి అలియాస్ ఉద‌య్‌, అంజు గా గుర్తించిట్టు తెలుస్తోంది. చ‌ల‌ప‌తిరావు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో చ‌త్తీస్‌గ‌ఢ్ ఒడిశా రాష్ట్రాల స‌రిహ‌ద్దులో జ‌రిగిన భ‌ద్ర‌తాద‌ళాల కూంబింగ్‌లో జ‌రిగిన కాల్పుల్లో మ‌ర‌ణించాడు.

కాగా ఘ‌ట‌నా స్థ‌లంలో మూడు ఏకే 47 రైఫిల్స్ స‌హా భారీగా ఆయుధాల‌ను భ‌ద్ర‌తాద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. హ‌తుల్లో అరుణ మావోయిస్టు స్పెష‌ల్ జోన్ క‌మిటీ స‌భ్యురాలు కాగా గాజ‌ర్ల ర‌వి కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా, అంజు ఆంధ్రా ఒరిస్సా బోర్డ‌ర్ స్పెష‌ల్ జోన్ క‌మిటీ ఏసీఎంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అరుణ 2018లో జ‌రిగిన నాటి టీడీపీ ఎమ్యెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హ‌త్య కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఆమెపై రూ. 20 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. చ‌నిపోయిన‌వారి మృత‌దేహాల‌ను రంప‌చోడ‌వ‌రం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇటీవ‌లికాలంలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఈ ప్రాంతమంతా ఉన్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు తాజా ప‌రిణామాల‌తో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఒక‌ప్పుడు ఏవోబీ తో పాటు విశాఖ‌, తూర్పుగోదావ‌రిజిల్లాల్లోని దండ‌కార‌ణ్య ప్రాంతం మావోయిస్టుల‌కు పెట్ట‌నికోట‌గా ఉండేది. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌నుంచి ప‌లువురు యువ‌కులు ఈ ఉద్య‌మం ప‌ట్ల ఆకర్షితులై చేర‌డంతోపాటు, గ్రామాల్లో ప‌లువురు సానుభూతిప‌రులు సైతం ఉండేవారు. అందుకే మావోయిస్టు ఉద్య‌మం బ‌లంగా విస్తరించింది. భ‌ద్ర‌తా ద‌ళాల‌కు.. మావోయిస్టుల‌కు త‌ర‌చుగా కాల్పులు జ‌రుగుతూ ఇరువైపులా ప్రాణ‌న‌ష్టం జ‌రిగేది. కూంబింగ్ భారీస్థాయిలో జ‌రుగుతున్న స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా తీవ్ర‌వాదులు స‌రిహ‌ద్దుల్లోని చ‌త్తీస్‌గ‌ఢ్ ఒడిశా ప్రాంతాల్లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో త‌ర‌లిపోయి షెల్ట‌ర్ తీసుకునేవారు. త‌మ‌కు అనువైన స‌మ‌యంలో ఒక్క‌సారిగా విరుచుకుప‌డి ఎదురుదాడి చేసేవారు. ఈ కార‌ణంగానే వారిని ఎదుర్కోవ‌డం పోలీసుల‌కు పెనుస‌వాల్‌గా ఉండేది.

కొన్నేళ్ల క్రితం తీవ్ర‌వాద ఉద్య‌మం బ‌లంగా ఉన్న స‌మ‌యంలో ఏవోబీలోను, బ‌స్త‌ర్ అడ‌వుల్లోనూ కూంబింగ్‌కు వెళ్లిన భ‌ద్ర‌తాద‌ళాల‌పై ఊహించ‌నివిధంగా చుట్టుముట్టి మావోలు భీక‌ర‌మైన దాడులు చేశారు. 2008 జూన్ 29న ఒడిశా రాష్ట్రంలోని బ‌లిమెల జ‌లాశ‌యంలో గ్రేహౌండ్స్ ద‌ళాలు ప్ర‌యాణిస్తున్న ప‌డ‌వ‌పై మావోయిస్టులు తూటాల వ‌ర్షం కురిపించ‌డంతో 32మంది గ్రేహౌండ్స్ సిబ్బంది, ఐదుగురు పోలీసులు స‌హా మొత్తం 38 మంది మ‌ర‌ణించారు. 2010 ఏప్రిల్‌లో చ‌త్తీస్‌గడ్ రాష్ట్రంలోని చింత‌ల్నార్ వ‌ద్ద కూంబింగ్‌కు వెళ్లిన 200 మంది భ‌ద్ర‌తాద‌ళాల‌ను దాదాపు వెయ్యిమంది మావోయిస్టులు చ‌క్ర‌వ్యూహంలో బంధించి జ‌రిపిన మార‌ణ‌హోమంలో 76మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జ‌రిగిన మావోయిస్టు దాడుల్లోనే ఇది అతిపెద్దది. 2023 ఏప్రిల్ నెల‌లో మ‌ళ్లీ దంతెవాడ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వ‌స్తున్న ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని మందుపాత‌ర‌తో పేల్చి 10మందిని బ‌లిగొన్నారు. మావోల దాడుల్లో ఇవి కొన్ని మాత్ర‌మే.

మావోయిస్టుల స‌మ‌స్యను బీజేపీ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. కేంద్ర హోం శాఖ‌.. మావోయిస్టు ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో అణ‌చివేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో సీఆర్‌పీఎఫ్ కోబ్రా ద‌ళాలు మావోల ప్రాబ‌ల్య‌మున్న రాష్ట్రాల పోలీసుల స‌హ‌కారం స‌మ‌న్వ‌యంతో వారున్న అట‌వీ ప్రాంతాల‌ను కొన్ని నెల‌లుగా ప్ర‌ణాళిక ప్రకారం జ‌ల్లెడ ప‌డుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ జ‌రుగ‌ని స్థాయిలో మావోల‌తో దాదాపు యుద్ధం చేస్తున్నాయి. గ‌త రెండు మూడు నెలల్లోనే మావోయిస్టు అగ్ర‌నాయ‌క‌త్వంతో స‌హా రెండువంద‌ల‌మందికి పైగా భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో హ‌త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఏం చేయాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితిని ఎదుర్కొంటున్న మావోయిస్టులు చెల్లాచెదురై షెల్ట‌ర్ తీసుకునేందుకు ఈ ప్రాంతానికి వ‌చ్చిన‌ట్టు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఆయుధాలు చేత‌బ‌ట్టి హింసావాదంతో వ్య‌వ‌స్థ‌ల‌ను మార్చవ‌చ్చ‌ని న‌మ్మే కాలం చెల్లిన ఆలోచ‌నావిధానం, మారిన సామాజిక ఆర్థిక అంశాల‌ను గుర్తించ‌లేని పిడివాదం.. సామాన్య ప్ర‌జ‌ల్లో ఉద్య‌మంపై ఒక‌నాటి సానుభూతి క్ర‌మేణా క‌రిగిపోవ‌డం మావోయిస్టు ఉద్య‌మం బ‌ల‌హీన‌ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పాలి. మారిన సామాజిక, ఆర్థిక‌ ప‌రిస్థితుల కార‌ణంగా యువ‌త‌కు అభివృద్ధి ఫ‌లాలు అంద‌డంతో కొత్త‌గా ఉద్య‌మం వైపు ఆక‌ర్షిత‌మ‌య్యేవారు క‌రువ‌య్యారు. ఇదే స‌మ‌యంలో కొంద‌రు మావోయిస్టు పార్టీ నేత‌లు తెలంగాణ‌లోనూ ఇటు ఏపీ, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోనూ కొన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి ఉద్య‌మాన్ని త‌మ స్వార్థం కోసం వాడుకున్నార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఒక‌ర‌కంగా వారి వెన్నుపోటు పార్టీని త‌ప్పుడు మార్గం ప‌ట్టించింది. మావోయిస్టుల‌ను త‌మ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు, రాజ్యాధికారం చేజిక్కించుకునేందుకు అత్యంత వ్యూహాత్మ‌కంగా వాడుకున్న ఆ నేత‌లు తమ‌కు అధికారం ద‌క్కాక ఉద్య‌మాన్ని అంతం చేసేందుకు త‌మ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు. ఉద్య‌మం బ‌ల‌హీనం కావ‌డం మొద‌లైంది ఆ కాలంలోనే. ప్ర‌జాస్వామ్య‌ వ్య‌వ‌స్థ‌లో లోపాల‌పై పోరాడాల్సింది పోయి వ్య‌వ‌స్థ‌పైనే పోరాటం సాగిస్తామ‌న‌డం అర్థ‌ర‌హితం అవివేకం. మావోయిస్టు ఉద్య‌మం ఉత్ధాన ప‌త‌నాలు చెప్పే పాఠ‌మ‌దే. అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించే ధైర్య‌మున్న అతికొద్దిమంది యువ‌త ప్ర‌జాస్వామ్యానికి అనుగుణంగా పోరాడిఉంటే జాతిని ముందుకు న‌డిపించే నాయ‌కులుగా ఎదిగేవారు. ఆవేశం, అతివాదంతో ఆయుధాలు ప‌ట్టి అడ‌విపాలై త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుకోత మిగిల్చారు.

You May Also Like…