ఏపీ మెట్రో . .. రయ్ రయ్

Ram Maddipati

తక్కువ వడ్డీపై అప్పు – ముందుకు వచ్చిన పలు సంస్థలు

విజ‌య‌వాడ‌, విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్​ల‌కు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన విదేశీ బ్యాంకులు

ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ప్రారంభం అవుతున్నాయి . ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేసే ప్రక్రియతో పాటు టెండర్ల ప్రక్రియకూ రంగం సిద్దమవుతుండగా.. ఇప్పుడు వీటికి మరో గుడ్ న్యూస్ అందింది. దీంతో ఇవాళ ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది.

విజ‌య‌వాడ‌లో ప్రతిపాదిత మెట్రో కారిడార్​ల‌ను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు ప‌రిశీలించారు. రెండు మెట్రో ప్రాజెక్ట్​ల‌కు అయ్యే వ్యయంలో రూ.12,000 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా వేసినట్లు తెలుస్తోంది.

విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజ‌య‌వాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం స‌మీక‌రించాల‌ని నిర్ణయించారు. త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకుల‌తో మెట్రో కార్పొరేష‌న్ ఎండీ సంప్రదింపులు జ‌రుపుతున్నారు. త్వర‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌తో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చ‌ర్చలు జ‌ర‌ప‌నున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వేగంగా ముందుకు వెళ్తోంది.

విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్​కు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ తొలిదశలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్‌, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్‌, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్‌ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్‌ నిర్మించనున్నారు.

విజయవాడ మెట్రో రైల్ రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో రెండు కారిడార్​లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు .

You May Also Like…