వాతావరణ మార్పులపై ఈ అధ్యయనం అమోఘం

Abhi Correspondent

2058లో తలెత్తబోయే దుష్ప్రభావాలపై అంతర్జాతీయ సంస్థ తో స్టడీ

ఎన్జీటీ సూచనలతో అమరావతిలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం – వచ్చే నెల చివరికి నివేదిక సిద్ధం

” వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది . రాజధాని అమరావతిలో రానున్న దశాబ్దాలలో ఎదురు కాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి …. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు . జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సూచన మేరకు రాజధాని నగరానికి సంబంధించి వాతావరణ మార్పులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా సంభవించే దుష్ఫలితాలను నివారించేందుకు CRDA తయారు చేయిస్తోంది. కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బహుళ జాతి సంస్థ అయిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ లోకల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇనీషియేటివ్స్‌- ఇక్లీ(ICLEI) ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా అధ్యయనం సాగుతోంది. అక్టోబరు చివరి నాటికి పూర్తి నివేదికను సమర్పించనుంది.

అమరావతి వాతావరణంపై విశ్లేషణ : రాజధాని అమరావతి నగరంలో వాతావరణంపై సమగ్ర విశ్లేషణ జరుగుతోంది. వాతావరణ మార్పులకు సంబంధించి గత వాతావరణ గణాంకాలను ఇక్లీ సంస్థ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వర్షపాతం, వాయు నాణ్యతపై ప్రభావం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ సాగుతోంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత ప్రతి ఏటా 0.22 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి 0.2 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర పెరుగుదల కనిపిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ప్రతి దశాబ్దానికి 0.32 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గణాంకాలు వివిరించారు . 2015 – 2024 కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏటా 4.5 మిల్లీమీటర్ల చొప్పున వార్షిక వర్షపాతం పెరుగుతోంది. పెరుగుదల ప్రధానంగా నైరుతి రుతుపవనాల్లో కనిపించింది. వర్షం పడే రోజులు తగ్గుతున్నాయి. ప్రతి దశాబ్దానికి 2.6 రోజుల చొప్పున తరుగుదల నమోదైంది. కానీ వర్ష తీవ్రత మాత్రం పెరుగుతోంది.

2058 నాటికి వాతావరణ మార్పులు : రాజధానికి సంబంధించి నీటి సరఫరా, వృథా నీరు, వర్షపు నీరు, ఘన వ్యర్థాలు, రవాణా, విద్యుత్తు, భవనాలు, ఆరోగ్యం, హరితం, జీవవైవిధ్యం, గాలి నాణ్యత అంశాలపై ఇక్లీ ముమ్మరంగా అధ్యయనం చేస్తోంది. వీటికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే సమస్యలను ఎలా అధిగమించాలన్న దానిపై సూచనలు కూడా ఇవ్వనుంది. ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతికి మొదటి దశలో 386 MLD నీరు, వైకుంఠపురం నుంచి రెండో దశలో 539 MLD చొప్పున 2058 నాటికి మొత్తం 925 MLD నీరు అవసరమవుతుందని అంచనా. 15 శాతం మేర నీటి నష్టాలు ఉంటాయని లెక్కగట్టారు.

2058 నాటికి వృథా నీరు 723 MLD వస్తుందని, ఈ నీటిని శుద్ధి చేసేందుకు 12 STPలు, 1 CETP నిర్మించాల్సి ఉంది. శుద్ధి చేసిన నీటిలో పచ్చదనం కోసం వినియోగించుకోవచ్చు. రాజధాని నగరంలో 2058 నాటికి రోజుకు 3,956 టన్నుల మేర ఘన వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉంది. ఇందులో తడి చెత్త 2,028 టన్నులు కాగా, పొడి చెత్త 1,436 టన్నులు. ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాజధానిలో విద్యుత్తు వినియోగం 220.5 మిలియన్‌ కిలోవాట్‌ అవర్‌. 2058 నాటికి డిమాండ్‌ 10,756 మిలియన్‌ కిలోవాట్‌ అవర్‌కు చేరుకోవచ్చని అధ్యయనంలో గుర్తించారు. సౌరవిద్యుత్తు డిమాండ్‌ 7,954 మిలయన్‌ కిలోవాట్‌ అవర్‌గా ఉంటుందని అంచనా.

అమరావతిలో సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీలు : అమరావతిలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీల సెంటిగ్రేడ్‌. రాజధానిని హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేయాలన్నది బృహత్‌ ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఖాళీ స్థలాలు, రహదారుల వెంబడి పచ్చదనం పెంచితే భూమి ఉపరితల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర తగ్గే అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు. పచ్చదనం తక్కువగా ఉన్న అనంతవరం, లింగాయపాలెం, నేలపాడు, వెంకటపాలెం, నవులూరులో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తేలింది.

You May Also Like…