విభజన తర్వాత చట్ట సభల్లో ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీ– భవిష్యత్తుపైనే నాయకుల ఆశలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అయితే కేంద్రంలో తాను అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర విభజన చేసిన తర్వాత ఆ పార్టీ ఆశించిన రాజకీయ ప్రయోజనాలు తెలంగాణలో సైతం దక్కించుకోలేకపోయిందన్నది నిజం. పదేళ్ల తర్వాత రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆయన పోరాటంతోపాటు పలు అంశాలు కలిసివచ్చి అధికారం దక్కించుకోవడం వేరే సంగతి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పటంలో ఆ పార్టీ దాదాపు కనుమరుగైన స్థాయికి క్షీణించిందని చెప్పాలి. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి స్వయంకృతమే. గతంలో దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచిన సమయంలోనూ ఆ పార్టీకి అండగా నిలిచింది తెలుగు ప్రజలే. తిరిగి ఆ పార్టీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో ప్రధాన పాత్ర ఉమ్మడి ఏపీది. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రాతినిధ్యంలో కూడా ఏపీలో ఆ పార్టీ నామమాత్రంగా మిగిలింది.
విభజన గాయమా.. ప్రత్యర్థుల వ్యూహమా..?
2014లో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రం కావడం, ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేసే అంశంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుంది. అయితే సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలు పట్టించుకోకపోవడంతోపాటు పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదించిన తీరు ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఇక్కడి ప్రజలు శిక్షించారు. అయితే ఈ ఘటన జరిగి దశాబ్దకాలం గడచినా ఆ పార్టీ ఇక్కడ ఒక మోస్తరు స్థాయిలోనైనా కోలుకోలేకపోవడానికి కారణం మాత్రం ఆ పార్టీ అధిష్ఠానం నిర్లక్ష్యమేనని చెప్పాలి. రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణలో నాటి టీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గరిష్ట ప్రయోజనం దక్కించుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తప్పుడు వ్యూహాలే కారణం. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలే కాంగ్రెస్‌కి ఘోర పరాభవాన్ని తేటతెల్లం చేశాయి.
కాంగ్రెస్ పార్టీ తప్పిదాలే వైసీపీ పునాదులు
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తాను ఏంచేసినా చెల్లుతుందని, భవిష్యత్తు రాజకీయ పరిణామాలు తాను ఆశించినట్టే ఉంటాయని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. మరోపక్క బీజేపీ నుంచి దేశవ్యాప్తంగా ఎదురయ్యే ముప్పును కూడా చాలా తక్కువగా అంచనా వేసింది. తెలంగాణ ఇచ్చింది తానే కాబట్టి అక్కడి ప్రజలు తనవెంటే ఉంటారని భావించింది. కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మాటలు విని చేతులారా వదులకుంది. ఇక ఏపీలో తాత్కాలికంగా నష్టపోయినా సంప్రదాయ ఓటు బ్యాంకు భవిష్యత్తులో తిరిగి తన నీడకే చేరుతుందని భావించింది. వైఎస్సార్ తనయుడైన జగన్మోహన్‌రెడ్డి పార్టీ ఈ పరిణామం ద్వారా బలపడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు. తాను అమలు చేసే వ్యూహం ప్రకారం జగన్ తిరిగి తనగూటికే చేరక తప్పదని అనుకుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలన్నీ ఘోర తప్పిదాలుగా మారి పార్టీ దుస్థితికి కారణమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటుబ్యాంకే వైసీపీకి పునాది
వైసీపీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న జగన్మోహన్‌రెడ్డి ఈ పరిణామాలను, అవకాశాన్ని తెలివిగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును, క్యాడర్‌ను గంపగుత్తగా సొంతం చేసుకుని ఏపీలో బలమైన రాజకీయనేతగా ఆవిర్భవించారు.2014 అసెంబ్లీ ఎన్నికలు: 175 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓటు షేర్ 2% కంటే తక్కువ. 2019 అసెంబ్లీ ఎన్నికలు: ఓటింగ్‌లో పార్టీ ఉనికే కన్పించలేదు – రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ 1% లోపే. 2024 ఎన్నికలు: కాంగ్రెస్ పోటీ చేసినా, ఫలితాలు నామమాత్రమే. టీవీ చర్చల్లోనైనా పేరు వినిపించనంత స్థాయిలో వెనుకబడిపోయింది.
నాయకత్వ లోపం – నిస్సత్తువగా పునర్నిర్మాణం
విభజన తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు మిగల్లేదు. పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వచ్చిన లోటును పార్టీ ఇప్పటికీ పూడ్చుకోలేకపోయింది. అంతేకాదు.. వైఎస్సార్ హయాంలో ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఇతర నాయకులను ఎదగనివ్వకపోవడం తాలూకు దుష్పరిణామాలను ఇప్పుడు అనుభవిస్తోంది. ఆయన వారసుడైన జగన్ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ రూపంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. వైఎస్ షర్మిలను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించినా పార్టీ కోలుకుంటున్న సూచనలు ఏమాత్రం కానరావడం లేదు.
భవిష్యత్ లో పుంజుకునేందుకు ప్రయత్నాలేవీ..?
కేంద్రంలో వరుసగా మూడు ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోవడం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెనుశాపంగా మారింది. గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను నిర్వహించిన సమయంలోనూ ఏపీకి ఏమంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంలోని ఆంతర్యం ఏమిటో అర్ధం కాదు. నిజానికి రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీల్లో ఒకరైనా కొన్నిరోజులపాటు ఏపీలో పర్యటించి గతంలో పార్టీ తరపున రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని ప్రజలను కోరకపోవడం వారి రాజకీయ అపరిపక్వతగానే భావించాలి. ఏదేమైనా గతంలో బలమైన క్యాడర్‌ను కలిగిఉన్నరాష్ట్రంలో పార్టీ తిరిగి పుంజుకోవాలంటే కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. యువతను ఆకర్షించే విధానాలు, స్థానిక నేతల ప్రోత్సాహం, ఓర్పుతో కేడర్ మళ్లీ తయారు చేయడం.. విభజనపై బాధ్యతను అంగీకరించి, ప్రజల్లో విశ్వాసం కలిగించగల సామర్థ్యం ఉన్న ఓ మానవీయమైన నాయకత్వం..ఇవన్నీ కలిస్తేనే పార్టీ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగలదు. కానీ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ దిశగా తొలి అడుగులు వేసే ప్రయత్నం కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం వహించిన పీసీసీ కార్యాలయాల్లో చురుకైన కార్యకలాపాలు లేవు. జిల్లాల్లో పాత నాయకులు పార్టీకి దూరమవుతున్నారు.
ముగింపు మాట
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే రాజకీయ విశ్లేషకులు హాస్పాస్పదంగా స్పందించే పరిస్థితి ఉంది. అయితే, రాజకీయాల్లో శాశ్వతంగా ఇదే ముఖచిత్రం ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని ప్రత్యామ్నాయ శక్తిగా మారగలిగే గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. ప్రజలు తమ అభిప్రాయం మార్చుకుంటే పార్టీల తలరాతలు తిరిగి రాయగలరు. ఆ దిశగా పార్టీ చేసే కృషి మాత్రమే ప్రజాదరణకు దగ్గర చేయగలదు అందుకు తగిన సంస్కరణలు, కొత్త దారులు అవసరం. లేకపోతే “ఒకప్పుడు ఏపీని పాలించిన అభయ హస్తచిహ్నం… ఇప్పుడు జాడలు మిగలని జ్ఞాపకమే..”! అన్నట్టుగా చరిత్రలో మిగిలిపోతుంది.



