దద్దరిల్లిన సరిహద్దు- మూడోరోజు 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల దాడి- భారత్ స్ట్రాంగ్ కౌంటర్! 

Abhi Correspondent

May 10, 2025

 ఆపరేషన్ సిందూర్ పై శనివారం ఉదయం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను మీడియా ముందు పెట్టింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో కల్నల్‌ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ..  పాక్ సైన్యం భారత సరిహద్దుల వైపు కదులుతోందని చెప్పారు.

ఆపరేషన్‌ సిందూర్ తర్వాత భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ 26 ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులకు యత్నించగా భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్‌ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించగా, భారత్‌ వాటిని నిర్వీర్యం చేసింది. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్, అవంతీపొరా ఎయిర్‌బేస్‌ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. డ్రోన్‌ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్థాన్‌ కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌పై పాక్‌ హైస్పీడ్‌ మిస్సైల్స్‌తో దాడి చేసిందని చెప్పారు. పాక్‌లోని గురుద్వారాలపై భారత్‌ దాడి చేసిందనేది అవాస్తవమన్నారు. అఫ్గానిస్థాన్‌పైన భారత్‌ మిస్సైల్‌ ప్రయోగించిందనేది వాస్తవం కాదని విక్రమ్‌ మిస్రీ స్పష్టం చేశారు. మరోవైపు భారత S-400 వ్యవస్థను ధ్వంసం చేసినట్టు పాకిస్థాన్ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. సూరత్‌గఢ్ సిర్సాలోని వైమానిక స్థావరాలను నాశనం చేసినట్టు పాక్ చేసిన ప్రచారంలో నిజం లేదన్నారు. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు వాదనలను తోసిపుచ్చారు.

ఆగని పాక్​ కవ్వింపు చర్యలు
మరోవైపు సరిహద్దుల్లో వరుసగా మూడోరోజూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్‌ సైన్యం విచ్చలవిడి కాల్పులు కొనసాగించింది. సాంబా సెక్టార్‌లో కాల్పులు, మోర్టార్ దాడులతో తెగబడింది. పూంఛ్‌ సెక్టార్‌లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని సైనిక వర్గాలు తెలిపాయి. పాక్‌ దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకొని బారాముల్లా, కుప్వారా, బందిపొరా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి బంకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

You May Also Like…