జనవరి 18 నుంచి 4 రోజుల పాటు దావోస్‌లో పర్యటన – ప్రపంచ ఆర్థిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దావోస్‌కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహిస్తారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏఐ మోలర్ మేర్క్స్ సంస్థల సీఈవో లతో చర్చలు జరుపుతారు. స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. ఏపీ లాంజ్ దీనికోసం వేదిక కానుంది. సీఎంతో పాటు మంత్రి లోకేశ్ కూడా పర్యటనకు వెళ్లనున్నారు.
ఈనెల 19 నుంచి జరగనున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం నేడు దావోస్ బయల్దేరి వెళ్లనుంది. ఈ రాత్రి విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి దిల్లీ వెళ్లనున్న సీఎం, అక్కడి నుంచి జ్యూరిచ్‌కు వెళ్తారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో చంద్రబాబుతో స్విట్జర్లాండ్‌లో భారతీయ రాయబారి మృదుల్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లు కూడా సీఎంతో సమావేశం అవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి హాజరవుతారు.
పొలిటికోకు ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్యూ: ప్రపంచం నలుమూలల 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్టీలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. అనంతరం జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ వెళ్తారు. దావోస్‌లో తొలిరోజు యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల మధ్య జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తర్వాత టాటాసన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశం అవుతారు.
సీఈఓలతో భేటీ: దావోస్ రెండో రోజు పర్యటనలో భాగంగా హోటల్ మోరోసాని ప్రోమెనేడ్‌లో “ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ – ఏపీ అడ్వాంటేజ్” పేరిట సీఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో సీఎం పాల్గొంటారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం ఛైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అవుతారు. ఈ భేటీలో లోకేశ్ కూడా పాల్గొంటారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తోనూ సీఎం సమావేశం కానున్నారు. ముఖాముఖి భేటీల అనంతరం ఏపీ లాంజ్‌లో నిర్వహించనున్న “వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్‌ప్రెన్యూర్” ప్యానల్ డిస్కషన్‌కు హాజరవుతారు.
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్‌కు కూడా ప్రత్యేక ఇంటర్వూ ఇస్తారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తిలతో సీఎం కొద్దిసేపు సమావేశం అవుతారు. ప్రపంచ ఆర్ధిక సదస్సు సెషన్‌లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్ధిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లిజెర్ అర్టెడా, రాయబారి ఆండ్రియా రౌబర్‌తో సీఎం చర్చలు జరుపుతారు. అలాగే స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు, భారత- స్విస్ ఫ్రెండ్ షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సమావేశం కానున్నారు. అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్‌తో సీఎం భేటీ అవుతారు.
దావోస్‌లో మూడో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హొరైసిస్ ఛైర్మన్ ఫ్రాంక్ రిచర్‌తో భేటీ కానున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఈఓ కుష్భు అవస్థి, కాలిబో ఏఐ అకాడెమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ శాండ్స్చెఫర్‌లు సమావేశం ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతారు. దీని తర్వాత ఏపీ సీఎన్ఎఫ్ నిర్వహించే “హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్” పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి హాజరుకానున్నారు. “ట్రిలియన్ డాలర్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్” అనే అంశంపై చర్చలోనూ సీఎం పాల్గోంటారు.



