గూగుల్ డేటా సెంటర్ పై కుట్ర . ..

Rama Chandra P

భూములు ఇవ్వొద్దంటూ రైతులను రెచ్చగొడుతున్న వైసీపీ

వరల్డ్ ఫెమస్ టెక్నీకల్ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ ను అడ్డుకునే కుట్రకు వైసీపీ నేతలు తెరతీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. ఐటీ దిగ్గజ సంస్థ ఏకంగా 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. కొందరు రైతుల ఫోర్జరీ సంతకాలతో, చనిపోయిన రైతు పేరుతో హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. గూగుల్‌ ప్రాజెక్టుకు భూములు ఇవ్వవద్దని . . మిగతా రైతులనూ రెచ్చగొడుతున్నాయి. ఆ భూములు తమకే ఇస్తే ఎక్కువ డబ్బులిస్తామని ప్రలోభపెడుతున్నాయి. దీని పై స్థానిక తహసీల్దార్‌ ఈ నెల 3న ఫిర్యాదు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేశారు.

రిటైర్డ్ ఐఏఎస్‌ బినామీతో కంప్లీన్ట్ . : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ చుట్టుపక్కల రైతులను మభ్యపెట్టి డీ-పట్టా భూముల్ని కొనేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారికి బినామీగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఈ కుట్ర పన్నారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ పేరుతో డీ పట్టా భూముల విక్రయాలకు తెర తీయడంతో ఆ విషయం బయటకు రావడానికి ముందే అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఆ ఐఏఎస్‌ అధికారి విశాఖ చుట్టుపక్కల ఎడాపెడా ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానిపై విచారణ కూడా కూటమి సర్కార్ పక్కపెట్టింది . ఆయన తరఫున బినామీగా వ్యవహరించిన వ్యక్తి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో రైతులకు అడ్వాన్స్‌లు చెల్లించి, వారితో ఒప్పందాలు చేసుకొని డీ పట్టా భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే తర్లువాడలో 308 ఎకరాల్ని గూగుల్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 200 ఎకరాల డీ పట్టా, శివాయ్‌ జమేదార్‌ భూములను రైతులకు పరిహారమిచ్చి భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తోంది. ఆ బినామీ గుప్పిట్లో పెట్టుకున్న 76 ఎకరాలు కూడా ఆ భూముల్లో ఉన్నాయి. దీంతో భూ సేకరణ ప్రక్రియనే అడ్డుకునేందుకు కుట్ర పన్ని రైతులతో కోర్టులో కేసు వేయించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీపట్టా భూముల కొనుగోలులో దళారిగా వ్యవహరించి, ఆనందపురం మండలంలోని ఒక పంచాయతీ సర్పంచి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆ బినామీ తరఫున రైతుల్ని ప్రలోభ పెట్టే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిని తానేనని కూడా ఆ దళారి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు వస్తున్న రైతులను అడ్డుకుంటున్న వారిపై, రైతుల సంతకాలు ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇలాంటి కుట్రలను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ పకడ్బందీగా వ్యవహరించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి .

You May Also Like…