రాజకీయ లబ్ది కోసమే జగన్ . … విజయమ్మ పిటిషన్

Abhi Correspondent

షర్మిలతో దీర్ఘకాల వైరుధ్యాల ఫలితంగానే జగన్‌ పిటిషన్‌ – రాజకీయ మైలేజీకి జగన్ కుటుంబ వివాదాన్ని వాడుకోవడం బాధాకరం – చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించిన వైఎస్ విజయమ్మ

” వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లి . . షర్మిలతో ఉన్న దీర్ఘకాల వైరుధ్యాలు, రాజకీయ కలహాల కారణంగానే జగన్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌-NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. ;; అని అతని తల్లి , వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అన్నాచెల్లెలి వివాదాల్లో తాను ఇరుక్కుపోయానని ఈ మేరకు చెన్నై నేషనల్‌ కంపెనీ లా అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌(NCLAT)కి నివేదించారు. రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని వాపోయారు.

ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ను జగన్‌ ఆశ్రయించడానికి కారణం చెల్లి షర్మిలకు, ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదని తల్లి విజయమ్మ చెన్నైలోని ఎన్‌సీఎల్‌ఏటీకి నివేదించారు. అందుకోసమే సరస్వతి పవర్ లిమిటెడ్‌లో వాటాల బదలాయింపు, రిజిస్టర్‌లో వాటాదారుల పేర్ల మార్పుపై ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌లో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారని విజయమ్మ పేర్కొన్నారు. ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని ఆవేదన వెలిబుచ్చారు.

జగన్ రాజకీయ ప్రాపకం కోసమే : కుటుంబ వివాదానికి కార్పొరేట్‌ రంగు పులిమి వాటిని జగన్‌ తన రాజకీయ మేలేజీకి వాడుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్‌డీడ్‌లు కుటుంబసభ్యుల మధ్య జరిగిన ఒప్పందమని చట్టప్రకారం దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ కార్పొరేట్‌ వివాదానికి సంబంధించినది కాదని అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుద్ధ్యాల ఫలితమేనని విజయమ్మ తేల్చిచెప్పారు. ప్రైవేటు, వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్‌ రంగు అద్ది తమ ప్రతిష్ఠను దెబ్బతీసి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమేనన్నారు.

అది చట్టవిరుద్ధం : విజయమ్మ, జనార్దన్‌రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్‌ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్‌లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్‌సీఎల్‌టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్‌ తదితరుల పేర్లను పునరుద్ధరించాలంటూ జులై 29న తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీ(NCLAT)లో విజయమ్మ అప్పీల్‌ దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఎం.మహర్షి విశ్వరాజ్‌ ఈ అప్పీల్‌ను దాఖలు చేశారు. సరస్వతి పవర్ దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి దీన్ని చెన్నై అప్పీలెట్ బెంచ్ త్వరలో విచారించనుంది.

అప్పుడే రాజీనామా : సరస్వతి పవర్‌లో తాను ప్రధాన వాటాదారునేనని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో దాఖలు చేసిన అప్పీలులో విజయమ్మ స్పష్టం చేశారు. వాటాల బదలాయింపునకు ముందు తనకు 48.99 శాతం వాటాలున్నట్లు పేర్కొన్నారు. 2021 జులై 26న జగన్‌ 74 లక్షల 26 వేలు, భారతీరెడ్డి 40 లక్షల 50 వేల వాటాలను ప్రేమతో తన పేరిట గిఫ్ట్‌డీడ్‌లు ఇచ్చారని వివరించారు. 2021 ఆగస్టు 14న డైరెక్టర్ పదవికి జగన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. గిఫ్ట్‌ ఒప్పందాలను కానీ, వాటాల కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును కానీ ఏ సివిల్‌ కోర్టులోనూ జగన్ సవాల్ చేయలేదని విజయమ్మ పేర్కొన్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ ముసుగులో వాటిని ట్రైబ్యునల్‌లో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్ పెండింగులో ఉండగా ట్రైబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తే సెటిల్‌ కాని 99.75 శాతం వాటా అస్తవ్యస్తమవుతుందని విజయమ్మ ఆందోళన వెలిబుచ్చారు. సభ్యుల రిజిస్టర్‌పై యథాతథ స్థితి కొనసాగిస్తే జగన్‌, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని విజయమ్మ తెలిపారు. ట్రైబ్యునల్‌ ఉత్తర్వులతో జగన్, భారతి, క్లాసిక్‌ రియాల్టీల పేర్లను తప్పుగా పునరుద్ధరిస్తే తనకు నష్టంతోపాటు మరిన్ని వివాదాలకు తెరతీసినట్లవుతుందని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీకి విజయమ్మ నివేదించారు.

You May Also Like…