దుబాయ్‌లో బంగారం ధర చీప్- నిజమేనా ?

Abhi Correspondent

July 28, 2025

ఒక్కో వ్యక్తి దుబాయ్ నుంచి ఎంత గోల్డ్ తెచ్చుకోవచ్చు

‘బంగారు నగరం’గా దుబాయ్ కి పేరు . పేరుకు తగ్గట్టే ఆ ‘గోల్డ్ సిటీ’లో రోజూ జోరుగా పసిడి షాపింగ్ జరుగుతుంటుంది. ప్రజలు దేశవిదేశాల నుంచి వచ్చి మరీ పెద్దఎత్తున స్వర్ణాన్ని కొనేస్తుంటారు. ఈ క్రేజ్ వల్లే గోల్డ్ సిటీగా దుబాయ్ విశ్వ ఖ్యాతిని గడించింది. ఇంతకీ దుబాయ్‌లో బంగారాన్ని కొనేందుకు జనం ఎందుకు ఎగబడుతున్నారు? అంటే, అక్కడ పసిడి రేట్లు తక్కువ. భారత్ కంటే దుబాయ్‌లో తక్కువ రేటుకే స్వర్ణం లభిస్తుంది. అక్కడ పసిడి ధర ఎందుకు తక్కువగా ఉంది? పన్నులేం విధించరా? అక్కడి బంగారం స్వచ్ఛత విషయంలో ఫర్వాలేదా ? లేక క్వాలిటీ తేడా ఉంటుందా ? ??

దుబాయ్‌ నుంచి భారత్‌, చైనాలకూ గోల్డ్
దుబాయ్‌లో బంగారం రేటు తక్కువగా ఉండటంపై పలువురిలో కొన్ని అపోహలు ఉన్నాయి. అక్కడ బంగారు గనులు ఉండబట్టే, తక్కువ రేటుకు గోల్డ్‌ను అమ్ముతున్నారని కొందరు భావిస్తుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదు. దుబాయ్‌లో ఒక్క గోల్డ్ మైన్ కూడా లేదు. అక్కడ విక్రయిస్తున్న బంగారమంతా ఆఫ్రికా దేశాలు, తుర్కియే (టర్కీ), స్విట్జర్లాండ్, రష్యా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాలు భారత్‌, చైనా. ఈ రెండు దేశాలకు చెందిన బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు ఏటా వందల టన్నుల బంగారాన్ని దుబాయ్‌లోని హోల్‌సేల్ గోల్డ్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఇందుకోసం ఈ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. భారత, చైనాల పౌరులు కూడా దుబాయ్‌ టూర్‌కు వెళ్లినప్పుడు, బంగారాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే దీనికి నిర్దిష్ట పరిమితి ఉంటుంది.

ఎంత బంగారాన్ని తెచ్చుకోవచ్చు? పన్నులు ఎంత ?

  • మన దేశంలో మనం ఎంతైనా బంగారాన్ని కొనొచ్చు. దానిపై ఎలాంటి పరిమితి లేదు. భారతీయులు దుబాయ్‌లో ఎంత బంగారాన్ని కొని తెచ్చుకోవచ్చు? అనే దానిపై నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. అంతకుమించిన మోతాదులో బంగారాన్ని దుబాయ్‌ నుంచి మనదేశానికి తీసుకురావడానికి వీల్లేదు.
  • లగేజీలో గరిష్ఠంగా ఒక కేజీ దాకా బంగారాన్ని దుబాయ్ నుంచి భారత్‌కు తెచ్చుకోవచ్చు. అయితే విదేశాల్లో కనీసం ఆరు నెలల పాటు గడిపి, భారత్‌కు తిరిగొస్తున్న వారికే ఈ పరిమితి వర్తిస్తుంది. ఈ బంగారంపై అన్ని రకాల సుంకాలను చెల్లించాలి. కొనుగోలుకు సంబంధించిన పత్రాలన్నీ కస్టమ్స్ అధికారులకు చూపించాలి.
  • పురుషులు 50 నుంచి 100 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 100 నుంచి 200 గ్రాముల బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
  • పురుషులు 100 గ్రాములకుపైగా బంగారం, మహిళలు/బాలల 200 గ్రాములకుపైగా బంగారంపై 10 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.
  • వాణిజ్య అవసరాల కోసం బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై జీఎస్‌టీ, వ్యవసాయ మౌలిక సదుపాయాల వికాస సెస్ (ఏఐడీసీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ విధిస్తారు.
  • భారతీయ మహిళలు, 15 ఏళ్లలోపు బాలలు గరిష్ఠంగా 40 గ్రాములు లేదా రూ.1 లక్ష విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. భారతీయ పురుషులు గరిష్ఠంగా 20 గ్రాములు లేదా రూ.50వేలు విలువైన బంగారు ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఈ క్రమంలో భారతీయ మహిళలు, పురుషులు, బాలలు ఎలాంటి సుంకాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చే బంగారం బరువు ఒక కేజీకి మించకూడదు. కొనుగోలుకు సంబంధించిన రశీదులన్నీ విమానాశ్రయంలోని అధికార వర్గాలకు చూపించాలి.
  • వ్యక్తిగతంగా దుబాయ్ నుంచి తెచ్చుకునే బంగారంపై, దాని మోతాదు ఆధారంగా 3 శాతం, 6 శాతం, 10 శాతం మేర భారత్‌లో కస్టమ్స్ సుంకాన్ని విధిస్తారు.
  • పురుషులు 20 నుంచి 50 గ్రాముల బంగారం, మహిళలు/బాలల 40 నుంచి 100 గ్రాముల బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు.

దుబాయ్‌లో గోల్డ్ రేట్లు ఎందుకు తక్కువ?
భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం రేట్లు తక్కువ. దీనికి ప్రధాన కారణం అక్కడి పన్నుల వ్యవస్థే. దుబాయ్‌లో బంగారం విక్రయాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను విధించరు. అయితే ప్రతీ విక్రయంపై 5 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను విధిస్తారు. వ్యాట్‌పై మనకు ఫుల్ రీఫండ్ లభిస్తుంది. అయితే దీన్ని పొందేందుకు నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది. మొత్తం మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండానే దుబాయ్‌లో బంగారాన్ని కొనేయొచ్చన్న మాట. ఈ ప్రత్యేకత వల్లే బంగారు నగరంగా దుబాయ్ అవతరించింది.

దుబాయ్‌లో బంగారం క్వాలిటీ ???
దుబాయ్‌లో విభిన్న రకాల స్వచ్ఛతలతో కూడిన బంగారం లభిస్తుంది. 24 క్యారట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైంది. అంటే ఈ బంగారంలోని 1000 భాగాల్లో 1000 కూడా స్వచ్ఛంగా ఉంటాయన్న మాట. 22 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 916.66 భాగాలు స్వచ్ఛమైనవి. ఇందులో 22 క్యారట్ల బంగారం, 2 భాగాల్లో జింక్, కాపర్, నికెల్, ఐరన్, కాడ్మియం, అల్యూమినియం, సిల్వర్, ప్లాటినం, పలాడియంల మిశ్రమం ఉంటుంది. వీటిని ‘అలాయ్డ్ మెటల్స్’ అంటారు. ఇవన్నీ ఉండటం వల్ల 22 క్యారట్ల బంగారం ఆభరణాల తయారీకి అనువుగా ఉంటుంది. 21 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 875 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 875 అని కూడా పిలుస్తారు. ఇందులో 21 క్యారట్ల బంగారం, 3 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి. 18 క్యారట్ల బంగారంలోని 1000 భాగాల్లో 750 భాగాలు ప్యూర్. దీన్ని గోల్డ్ 750 అని అంటారు. ఇందులో 18 క్యారట్ల బంగారం, 6 భాగాల్లో ‘అలాయ్డ్ మెటల్స్’ ఉంటాయి.

You May Also Like…