బీహార్ ఓటర్ల జాబితా, ప్రజాస్వామ్యమేనా?

Rama Chandra P

July 7, 2025

ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఓటర్ల జాబితాలో ఓటర్ల సవరణ, నమోదు అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ. ముసాయిదా జాబితాను విడుదల చేయడం, కొత్తగా చేర్చిన పేర్లు, తొలగించిన పేర్ల వివరాలను రాజకీయ పార్టీలతో అందజేయడం సర్వసాధారణం. దీనివల్ల అభ్యంతరాలుంటే తెలియజేయడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఈసారి బీహార్‌లో ఎన్నికల సంఘం ఈ పద్ధతికి తూట్లు పొడిచింది. “ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్” పేరుతో ఒక కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానంలో, ఏయే ఓటర్లను తొలగించారు, ఎవరిని కొత్తగా చేర్చారు అనే వివరాలతో కూడిన ప్రత్యేక జాబితాలను (Addition and Deletion Lists) రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదు. కేవలం ఒకే ఒక ఏకీకృత జాబితాను అందిస్తున్నారు.

ఇది “గడ్డివాములో సూదిని వెతకడం” లాంటిదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లక్షలాది ఓటర్లున్న నియోజకవర్గాల్లో, పాత జాబితాతో కొత్త జాబితాను బేరీజు వేసుకుని, ఏ పేరు పోయిందో, ఏ పేరు వచ్చిందో తెలుసుకోవడం అసాధ్యమని వాపోతున్నాయి. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని, అక్రమాలకు ఆస్కారం కల్పించడానికే ఈ గోప్యత నాటకమని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు వంటి పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.. తమకు అనుకూలంగా లేని ఓటర్లను గుట్టుచప్పుడు కాకుండా జాబితా నుంచి తొలగించి, దొంగ ఓట్లను చేర్చే కుట్ర కోణం ఇందులో దాగి ఉందని వారు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు .

ఎలక్షన్ కమిషన్ పై నీలినీడలు

ప్రతిపక్షాలు వారు ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) నుంచి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వరకు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల, ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ మార్పులు చేశామని చెబుతున్నారు. పాత జాబితాలను, మార్పులను పరిశీలించుకోవడానికి ఆన్‌లైన్‌లో సౌకర్యం ఉందని, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవచ్చని సూచిస్తున్నారు.

ఈ వాదనతో ప్రతిపక్షాలు ఏకీభవించడం లేదు. ఆన్‌లైన్ వ్యవస్థలు అంత పటిష్టంగా లేవని, లక్షలాది ఓటర్ల వివరాలను అలా పరిశీలించడం ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు కూడా సహకరించడం లేదని, కావాలనే సమాచారాన్ని దాచిపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు.

గతంలోనూ ఇలాంటి . …

ఓటర్ల జాబితాలో గందరగోళాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ, ఒక వ్యవస్థీకృత పద్ధతిలో, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే పారదర్శకత లోపించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇది కేవలం ఓటర్ల పేర్ల తొలగింపు, చేర్పులకు సంబంధించినది కాదు. ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉండే నమ్మకానికి సంబంధించినది. “మా ఓటు భద్రంగా ఉందా? మా పేరు జాబితాలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో మేమెలా ఓటు వేయాలి?” అనే సందేహం ఒక్కసారి ప్రజల్లో కలిగితే, అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపైనే వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రజల నుంచి ప్రతిఘటన లేకపోతే, ప్రజాస్వామ్య వాదులు దీనిపై ఉద్యమాల్ని నిర్మించకపోతే ఈ దుర్నీతి అన్ని రాష్ట్రాలకూ విస్తరించే ప్రమాదం వుంది.

You May Also Like…

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

తరిగిపోతున్న ఆయుధాలు - ఇరాన్​తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం - పెంటగాన్...