తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం అదేనా..?

Ram Maddipati

బీజేపీ వ్యూహం వెనుక 2029 లక్ష్యం కనిపిస్తోందా ? ?

బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల‌కు పార్టీ కొత్త అధ్య‌క్షుల‌ను నియ‌మించింది. దీంతో ఆ పార్టీ భ‌విష్య‌త్తు వ్యూహాల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో తాజాగా వాడిగా వేడిగా చ‌ర్చ జరుగుతోంది.

కాషాయ పార్టీ మొద‌టినుంచీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక విషయంలో తనదైన విలక్షణతను చాటుకుంటోంది. పార్టీ బలపడేందుకు ఇతర పార్టీల్లో కీలక పదవుల్లో పనిచేసినవారిని పార్టీలోకి చేర్చుకున్నా వారిని అధ్యక్ష పదవుల్లో నియమించడం లేదు. తొలినుంచీ పార్టీనే న‌మ్ముకుని ఉన్నవారిని మాత్రమే అందుకు ఎంచుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును, ఏపీ పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ ను ఎంపిక చేయడం దీనినే సూచిస్తోంది. పార్టీ కోసం కష్టపడేవారిని తప్పక గుర్తిస్తామని చాటుతూ పార్టీ క్యాడర్లో మొరాలిటీని పెంచేందుకు ఈ విధానం ఆపార్టీకి ఉపకరిస్తోంది.

తాజాగా తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి పార్టీ నియ‌మించిన అధ్య‌క్షుల‌ను స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్యూహాత్మ‌కంగానే ఎంచుకుంది. ఇద్ద‌రూ ఆర్ఎస్ఎస్ నేప‌థ్య‌మున్న‌వారే. ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌రావు వెల‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. బీఆర్ఎస్ అధినేత‌.. మాజీ సీఎం కేసీఆర్ ది కూడా అదే సామాజిక‌వ‌ర్గమ‌న్న విష‌యం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజిక‌వ‌ర్గం మొద‌టినుంచీ అధిక‌శాతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూవ‌స్తోంది. ఇక సంఖ్యాప్ర‌కారం త‌క్కువే ఐనా రాజ‌కీయంగా ఆ ప్రాంతంలో గ‌ట్టి ప్రభావం చూప‌గ‌ల స‌త్తా వెల‌మ‌ల‌ది. ఈ నేప‌థ్యంలోనే బీఆర్ఎస్‌ను మ‌రింత బ‌ల‌హీన‌ప‌ర‌చేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది. వెల‌మ‌ల‌తో పాటు.. బీసీలు, ఇత‌ర సామాజిక‌వ‌ర్గాల మ‌ద్ద‌తుతో అధికార‌ కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు సాగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి తెలంగాణ‌లో అధికారం సాధించాల‌న్న స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యంతో బీజేపీ అధిష్టానం పావులు క‌దుపుతోంది. కాళేశ్వ‌రంలో అవినీతి, ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో పాత్ర‌, ఫోన్ ట్యాపింగ్ అంశాల‌ను ఆయుధంగా చేసుకుని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోలేక‌పోతే అది త‌న‌కే మేలు చేస్తుంద‌ని బీజేపీ న‌మ్ముతోంది. ఆ కార‌ణంగానే కాంగ్రెస్ మీదే విమర్శల దాడిని పెంచుతోంది. ప్ర‌జ‌లపై ప్ర‌భావం చూపే అంశాల‌పైన‌, క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల‌పైనా భారీ స్థాయిలో ప్ర‌చారం, పోరాటం చేస్తూ ప్ర‌త్యామ్నాయ శ‌క్తి బీజేపీ మాత్ర‌మేన‌ని ప్ర‌జ‌లు భావించేలా పార్టీని బ‌లోపేతం చేయ‌డం. ఇందుకు అనుగుణంగా కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియాను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది.

ఏపీలో ఇప్ప‌టికిప్పుడు బ‌ల‌ప‌డ‌క‌పోయినా ప‌ర‌వాలేదు. అక్క‌డ తాను భాగ‌స్వామిగా ఉన్న కూట‌మే అధికారంలో ఉంది. క‌నుక బీజేపీ అధిష్ఠానం ఏపీ కంటే తెలంగాణ‌కు ప్రాధాన్య‌మిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఆ కార‌ణంగానే ఏపీలో సీఎం చంద్ర‌బాబునాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన పోల‌వ‌రం – బ‌నక‌చ‌ర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆధ్వ‌ర్యంలోని నిపుణుల క‌మిటీ అనుమ‌తులు నిరాక‌రించింది. ఒక‌వేళ ఈ ప్రాజెక్టును ఏపీ ప్ర‌భుత్వం ప్రారంభించి ఉంటే తెలంగాణ‌లో బీజేపీకి రాజ‌కీయంగా న‌ష్ట‌మ‌ని ఆ పార్టీ భావించిన‌ట్టు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే దీనిని ఆయుధంగా మ‌లుచుకుని అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ లాభ‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తాయ‌ని బీజేపీ భావించింది. ఇదే అంశంపై ఇప్ప‌టికే ఆ పార్టీలు రెండూ ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలించేందుకు సిద్ధమ‌య్యాయి. ఇప్పుడు బీజేపీ ఆ అవ‌కాశం లేకుండా చేసింది.

నిజానికి 2024 ఎన్నిక‌ల‌కు కొద్దికాలం ముందుదాకా ఏపీలో బీజేపీ- టీడీపీ సంబంధాలు ఏమంత స‌జావుగా లేవు. నాటి వైసీపీ ప్ర‌భుత్వానికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప‌రోక్ష మ‌ద్ద‌తు ఉంద‌న్న భావం జ‌నంలో సైతం విస్తృతంగా ఉన్న స‌మ‌య‌మ‌ది. టీడీపీ- బీజేపీ క‌లిసి న‌డ‌వడం సాధ్య‌మేనా అన్న అభిప్రాయం ఉండేది. అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీతో క‌లిసిన‌డ‌వాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకోవ‌డంతోపాటు మూడు పార్టీల కూట‌మి ఏర్పాటుకు గ‌ట్టిప్ర‌య‌త్నం చేయ‌డంతో ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోయింది. ఈ నేప‌థ్యంలోనే ఏపీలో బీజేపీ ప‌రిస్థితి తెలంగాణ‌కు భిన్నంగా ఉంది. ఎన్డీఏ భాగస్వామిగా తిరుగులేని విజయం పొందినప్పటికీ, పార్టీకి అక్కడ మద్దతు స్వల్పమే. అందుకే పార్టీ బ‌లోపేతానికి నెమ్మ‌దిగా అడుగులు వేయాల‌నుకుంటోంది. భవిష్యత్తు నిర్మాణం పైన దృష్టి పెట్టిందని అర్థమవుతోంది.

పార్టీ ఏపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ కుటుంబం మొద‌టినుంచీ ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం క‌లిగిఉంది. ఆయ‌న తండ్రి కూడ ఆర్ఎస్ఎస్‌లో కీల‌కంగా ప‌ని చేశారు. మాధ‌వ్ 2017లో జ‌రిగిన శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నిక‌ల్లో అదే స్థానం నుంచి మ‌రోసారి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఉత్తరాంధ్రకు చెందిన మాధ‌వ్‌కు సౌమ్యుడిగా పేరుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్టుగా మిత్ర‌ప‌క్షాల‌తో స‌మ‌న్వ‌యం, సంయ‌మ‌నం పాటిస్తూ సొంత పార్టీ బ‌లోపేతానికి కృషి చేయ‌గ‌ల స‌త్తా ఆయ‌నకుంద‌ని బీజేపీ భావించ‌డంతోనే ఆయ‌న‌కు పార్టీ రాష్ట్ర ప‌గ్గాలు అందించిన‌ట్టు తెలుస్తోంది.

You May Also Like…