బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇంత దారుణ పతనానికి కారణాలు ఏమిటి?
ఇప్పట్లో ధరలు పెరుగుతాయా?
కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం కూడా పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువ, సరఫరా వ్యవస్థలో మార్పులు, కొనుగోళ్లలో హెచ్చుతగ్గులు పసిడి, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
క్యాప్స్ గోల్డ్ వెబ్సైట్ వివరాల ప్రకారం, హైదరాబాద్లో గురువారం… (19-11-2026..) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,480 ఉండగా, శుక్రవారం (20-11-2026) నాటికి రూ.5,320 తగ్గి, రూ.1,28,160కు చేరుకుంది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,800గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 3,552డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల సంగంతేంటి?
ఇక వెండి ధరల విషయానికొస్తే, శుక్రవారం వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్లో గురువారం కిలో వెండి ధర రూ.1,64,865 ఉండగా, శుక్రవారం నాటికి రూ.9,965 తగ్గి, రూ.1,54,900కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ సిల్వర్ ధర 41.93డాలర్ల వద్ద ఉంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లో జరిగే పరిణామాలు వెండి ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి. 2027 ఏప్రిల్ నాటికి వెండి కిలో… రూ 3 – రూ 3.20 లక్షలకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.
బిల్లులు, చెల్లింపు రశీదులు భద్రం
బంగారు ఆభరణాలు, నాణేలు లేదా కడ్డీలు కొనుగోలు చేసేటప్పుడు బిల్లులు, రశీదులు భద్రపరచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన బంగారానికి సంబంధించి వారసత్వ పత్రాలు, కుటుంబ వివరాలు, పాత రశీదులు వంటి ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రశ్నలు ఎదురైతే బంగారం మూలాన్ని వివరించడం సులభమవుతుందని అంటున్నారు. అలాగే, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిన అవసరం కొన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు ఉంటుంది. ముఖ్యంగా వార్షిక ఆదాయం రూ.50 లక్షలకు మించిన వ్యక్తులు ఐటీఆర్లోని ఆస్తులు, అప్పుల వివరాల విభాగంలో బంగారంతో సహా సంబంధిత ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి అవసరం ఉంటుంది.



