సన్యాస దీక్ష ఇచ్చిన ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి
కంచి కామకోటి పీఠం . . ప్రపంచంలోనే పురాతన పీఠంగా పేరొందింది. శంకర భగవత్పాదుల వారు స్థాపించిన ఈ పీఠానికి పీఠాధిపతిగా అధిష్టించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అన్నవరం ప్రాంతానికి చెందిన ఓ యువ సన్యాసికి ఈ అరుదైన గౌరవం దక్కింది.
కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరం వేద పండితుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రవిడ్ (24) ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున అభిషేకం చేయబడ్డారు . ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చి సంప్రదాయబద్దంగా కార్యక్రమాలు నిర్వహించారు .
గణేశశర్మ 1998లో జన్మించారు. కర్ణాటకకు చెందిన చందుకుట్టు హోసమనే రత్నాకర భట్ శర్మ ఆధ్వర్యంలో వేదవిద్య అభ్యసించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితుడు పల్లమూడి సత్య వెంకట రమణమూర్తి వద్ద శబ్ద మంజరి, ధాతు రూపావళి, సమాస కుసుమావళి, ఇతర సంస్కృత గ్రంథాల్లో తదుపరి అధ్యయనాలు అభ్యసించారు. రుగ్వేద పండితుడు, సంస్కృత ఉపాధ్యాయుడు కమ్మపల్లి సతీషాచార్యుల వద్ద వేద వివరణ, సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నారు. సంప్రదాయ వేదశిక్షణతో పాటు గణేశశర్మ అన్నవరంలోనే పదోతరగతి వరకు పూర్తి చేసి అధికారిక విద్యను కూడా అభ్యసించారు.
యాదృచ్చికంగా . .. : 2009 మేలో గణేశశర్మ తిరుపతిలో బంధువుల ఇంటికి వెళ్లారు. కంచి కామకోటి పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఆచార్యులు ఆశీర్వదించి రుగ్వేద పండితుడు, ద్వారకా తిరుమలలో సేవ చేస్తున్న రత్నాకరభట్ శర్మ వద్ద వేదవిద్యలో చేర్పించమని సలహా ఇచ్చారు. గణేశశర్మ అక్కడ చేరారు. 12 ఏళ్లు రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణం, ఉపనిషత్తులు నేర్చుకున్నారు. ఆ తర్వాత మంత్ర ఉచ్ఛరణలో ప్రావీణ్యం పొందారు. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో రత్నాకరభట్ కుమారుడు శ్రీనివాసశర్మ మార్గదర్శకత్వంలో వేద గ్రంథాల్లో ఉన్నత శిక్షణ పొందారు. తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేదపాఠశాలలోనూ సేవలు అందించారు. కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు.
జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత మతానికి కాలక్రమంలో ఏర్పడిన కేంద్రపీఠాల్లో తమిళనాడులోని కంచి కామకోటి పీఠం ఒకటి!
మొక్కుబడులు, కృతజ్ఞతలు చెల్లించుకునే జంతు బలులు, రక్తతర్పణాల నుండి మానవ సమాజాలను సాత్విక, ఆధ్యాత్మిక దృక్పధాల్లోకి నడిపిన తాత్వికుడు, మత సంస్కర్త ఆది శంకరాచార్యులు. అస్పృశ్యత కూడదన్న ఆచరణవాది. 2500 ఏళ్ళ క్రితం భారతీయ సామాజిక, మతపరమైన స్ధితిగతులకు ఊహించగలిగితే శంకరాచార్య మత విప్లవవేత్త అని బోధపడుతుంది.
గుంపులు, సమూహాల పూజావిధానాన్ని వైదికమతాన్ని, దేవాలయాల వైపు, దేవతారాధన వైపు తిప్పడం ద్వారా ఆయన సఫల మయ్యారు. దేశ స్థితిగతుల దృష్ట్యా మధ్యేమార్గంగా ఆయన పంచాయతన పూజ రూపంలో బహు దేవతా సంఖ్యను షణ్మతానికి పరిమితం చేశారు.
షణ్మతాలు అంటే ఆరు ప్రధాన హైందవ సంప్రదాయాలు, ఇవి వివిధ దేవతల ఆరాధనను కేంద్రీకరించి ఉంటాయి. ఇవి:
1. శైవం – శివుడిని ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.
2. వైష్ణవం – విష్ణువు లేదా అతని అవతారాలను (రామ, కృష్ణ) ఆరాధించే సంప్రదాయం.
3. శాక్తం – దేవి (శక్తి)ని ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.
4. గాణపత్యం – గణపతిని (వినాయకుడు) ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.
5. కౌమారం – కుమారస్వామి (కార్తికేయ)ని ఆరాధించే సంప్రదాయం.
6. సౌరం – సూర్య దేవుడిని ఆరాధించే సంప్రదాయం.
ఆది శంకరాచార్యులు ఈ ఆరు సంప్రదాయాలను సమన్వయం చేసి, హైందవ ధర్మంలో ఏకత్వాన్ని స్థాపించేందుకు కృషి చేశారు. ఈ షణ్మతాలు ఒక్కొక్కటి విభిన్న దేవతలను ఆరాధించినప్పటికీ, అన్నీ ఒకే బ్రహ్మతత్త్వాన్ని సూచిస్తాయని శంకరులు బోధించారు. ఇది అద్వైత వేదాంత సిద్ధాంతంతో సమన్వయం చేయబడింది.
ఈ విధంగా, షణ్మత స్థాపన హైందవ ధర్మంలో వైవిధ్యాన్ని గౌరవిస్తూనే ఏకత్వాన్ని ప్రోత్సహించింది.
అద్వైత తత్వం: ఈ లోకమంతా విడివిడిగా కనిపించినా, నిజానికి అన్నీ ఒక్కటే అని చెప్పే తత్వమే అద్వైతం. మనం చూస్తున్న ఈ జగత్తు తాత్కాలికం, మాయ వల్ల కలిగిన భ్రమ మాత్రమే. అసలు నిజం — బ్రహ్మం మాత్రమే, అది ఎప్పటికీ మారదని, శుద్ధమైన చైతన్యంగా ఉంటుందని శంకరాచార్యులు వివరించారు. మనం అనుకునే “నేను” కూడా బ్రహ్మంతోనే సమానం — జీవాత్మ అంటే పరమాత్మే. ఈ సత్యాన్ని మనం జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు, అజ్ఞానం తొలగిపోతుంది; మనం భయాలను, బంధాలను దాటి నిజమైన స్వేచ్ఛను పొందుతాం — అదే మోక్షం.
అనేక సాంఘిక పరిణామాల నుంచి ప్రపంచమంతా వేర్వేరు ప్రదేశాల్లో సాంస్కృతిక పునర్జీవనం సంభవించిన కాలంలో ఆదిశంకరాచార్యులు (క్రీస్తుపూర్వం) అద్వైత తత్వాన్ని ప్రభోదించారు. ఆయన స్థాపించిన కాంచీపురం (కంచి) పీఠంనుంచి హిందూ దేశమంతటా అద్వైత తత్వం విస్తరించింది. ఆదిశంకరాచార్యులను “నడిచే శివుడు” అని హిందువులు విశ్వసిస్తారు.
కంచిపీఠం ఆధిపత్యం ఒక పరంపరగా సాగుతుంది. వేదాలను వైదిక శాస్త్రాలను అపపోసిన వారిని అనేక వడపోతల ద్వారా, పీఠాధిపతి నిర్ణయానుసారం ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తారు. పీఠాధిపతి మహానిర్యాణానంతరం ఉత్తరాధికారి కంచి స్వామి (పీఠాధిపతి) అవుతారు. ఇది పరంపరగా సాగుతోంది.
ఇపుడు పీఠాధిపతిగా వున్న శంకర విజయేంద్ర సరస్వతి ఈ పరంపరలో 70 వ స్వామి.
68 వ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి (ఇదే పేరుతో అప్పటికి ఏడుగురు కంచిపీఠం అధిపతులుగా వున్నారు) సుదీర్ఘకాలం 1907 నుంచి 94 వరకూ కంచి పీఠాధీశులుగా వున్నారు.
వారిహయాంలో చాలా సంస్కరణలు జరిగాయి. హిందువుల్లో అద్వైతం బ్రాహ్మణులను దాటి బయటకు రావడంలేదన్న అభిప్రాయం బలపడుతున్న సమయంలో ఆయన కంచి పీఠంలోకి అన్ని కులాలవారూ వచ్చేలా చేసి అద్వైతాన్ని సమాజంలో విస్తరింపచేశారు. జ్ఞాన సాధనే మోక్షమార్గమని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా మానవ సమాజాల్లో హేతుబద్ధతను పెంపొందించారు.
చంద్రశేఖరేంద్ర సరస్వతి అనంతరం కంచి పీఠం బాద్యతలు చేపట్టిన 69 వ స్వామి జయేంద్ర సరస్వతి 1994 నుంచి 2018 మధ్యలో వైద్య వసతుల ద్వారా, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం ద్వారా హిందూ మతాన్ని సమాజంలో లోతుగా విస్తరింపచేశారు. అయితే జయేంద్ర సరస్వతి పీఠంలో ఒక అధికారి హత్యకేసులో అరెస్టవ్వడం పెద్ద సంచలనమైంది. హేతువాదాన్ని భుజానవేసుకున్న ఎఐడిఎంకే అధినేత్రి ఎన్నికలకు ముందు ఓట్లకోసం పీఠంలో జరిగిన హత్యను అడ్డుపెట్టుకుని జయేంద్రసరస్వతిని కేసులో ఇరికించారని ప్రజలు నమ్మారు. స్వామి పై ఆరోపణలు రుజువు కాకపోవడం వల్ల జయేంద్ర సరస్వతి నిర్దోషిగా జైలునుంచి బయటపడ్డారు. అయినా శంకరుడి రూపమైన స్వామి హత్యకళంకాన్ని మోయక తప్పలేదు. వారితర్వాత 70 వస్వామిగా (అప్పటి ఉత్తరాధికారి) శంకర విజయేంద్ర సరస్వతి 2018 నుంచి పీఠాధీశులుగా వున్నారు.
గణేశ శర్మ ద్రవిడ్ ఒక ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి దన్వంతరి అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన పూజారి. పూర్వీకులూ ప్రముఖ వేద పండితులే.
వారు 2006లో వేద విద్య ప్రారంభించి ఋగ్వేదంతో పాటు యజుర్వేదం, సామవేదం, దశోపనిషత్తులపై లోతైన అధ్యయనం చేశారు. శ్రీ కాంచి పీఠం శంకరాచార్యుల ఆశీస్సులతో విద్యాభ్యాసం కొనసాగించారు.
ఈ ఉత్తరాధికార అభిషేకం, జగద్గురు ఆది శంకరాచార్యుల 2,534వ జయంతి సందర్భంలో జరగడం విశిష్టతను సంతరిస్తోంది .



