”భారీ మెజార్టీ . .. అంటే ఓడిపోయిన అభ్యర్థి కంటే భారీగా ఓట్లు రావడం . . ఇక్కడ జరిగిన ఎన్నికలలో భారీ కాదు . . అతి భారీ కూడా అనలేం . .. ఏమనాలి ? ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ తిరుగులేని మెజారిటీతో గెలిచారు. ఆయన సారథ్యంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని మిత్రపక్షాలు మార్చి 15న జరిగిన ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఏకంగా 99.93 శాతం ఓట్లను సాధించాయి. దేశంలోని కేవలం 0.07 శాతం మంది ప్రజలే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఓటర్లకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తున్నామనే ప్రచారం చేసుకునేందుకే ఈ అవకాశాన్ని ఓటర్లకు కిమ్ జోంగ్ ఉన్ ఇస్తున్నారని అంటున్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో అత్యధికంగా 99.99 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పార్టీలకు చెందిన 687 మంది ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తర కొరియా 15వ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల సమాచారంతో ఈమేరకు ఆ దేశ మీడియాలో కథనాలు పబ్లిష్ అయ్యాయి . . ఈనేపథ్యంలో తదుపరిగా నూతన సభ్యులతో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశమై, కిమ్‌ను మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకునే అంశంపై ప్రకటన చేయనుంది. రాజ్యాంగంలో చేయాల్సిన కీలక సవరణలపై ఈ సభ చర్చించనుంది.
మళ్లీ దేశ అధ్యక్షుడిగా కిమ్
కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ లాంఛనంగా ఒక ప్రకటన విడుదల చేయాల్సిన ఇది . ఫిబ్రవరి నెలలో జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 9వ సమావేశంలో చేసిన తీర్మానాల ప్రకారం, రాజ్యాంగ సవరణలకు కసరత్తును మొదలుపెట్టనుంది. అధికారికంగా దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని కిమ్ జోంగ్ ఉన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రాజ్యాంగంలో సవరణలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా వ్యవస్థాపక పత్రంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు శత్రుదేశాలనే అంశం ఉందనే విషయాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 9వ సమావేశంలోనూ దీనిపై ప్రత్యేక తీర్మానాలు చేశారు. పార్టీ ఛార్టర్‌లో మార్పులు,చేర్పులు చేశారు.
దక్షిణ కొరియాపై కిమ్ ప్రకటన
దక్షిణ కొరియా తమకు శత్రుదేశమని 2024లోనే అధికారికంగా కిమ్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనకు రాజ్యాంగబద్ధత, చట్టపరమైన ఆమోదాన్ని కల్పించే దిశగా ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్ జోంగ్ ఉన్ చేసే అధికారిక ప్రకటన కోసం దక్షిణ కొరియా సహా ఇతర ఇరుగుపొరుగు దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఉత్తర కొరియా అంతర్జాతీయ సంబంధాలు, శత్రుదేశాలు, మిత్రదేశాలపై ఆయన చేయనున్న ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
రబ్బరు స్టాంపు ఉత్తర కొరియా అసెంబ్లీ
కిమ్ జోంగ్ ఉన్ కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీని రబ్బరు స్టాంపు లాంటిదని చెబుతుంటారు. వాస్తవానికి దేశంతో ముడిపడిన అన్ని చట్టాలను రూపొందించే, ఆమోదించే అధికారాలు ఈ సభకు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాలన్నీ కిమ్ ఆధ్వర్యంలో నడిచే వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సిద్ధాంతాల ప్రకారమే జరుగుతుంటాయి.
ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది కొత్తవాళ్లే
ఉత్తర కొరియా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, దాదాపు 70 శాతం మంది పాత ప్రజాప్రతినిధుల స్థానంలో కొత్తవారు ఎన్నికయ్యారు. కిమ్ జోంగ్ ఉన్ అధికార పీఠానికి మరింత బలాన్ని చేకూర్చేందుకే, బలమైన ప్రజాప్రతినిధులు తయారుకాకుండా అడ్డుకునేందుకే ఇంతగా మార్పులు చేశారని పరిశీలకులు అంటున్నారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికైన 687 మందిలో జో యోంగ్ వన్, కిమ్‌కు అత్యంత సన్నిహితుడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవిని ఈయనకే కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన చోయీ ర్యోంగ్ హయీకి ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని ఇవ్వలేదని సమాచారం. కొత్త ఎంపీల జాబితాలో కిమ్ సోదరి కిమ్ యో జాంగ్, విదేశాంగ మంత్రి చోయీ సన్ హుయీ కూడా ఉన్నారు. .



