పాటలతో జనంలో చైతన్యం నింపిన యువకుడు ప్రధాని . ..
—————————————-
నేపాల్.. హిమాలయాల ఒడిలో ఒదిగిపోయిన అందమైన దేశం. కానీ అక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ రణరంగమే. ఒకప్పుడు రాజుల ఏలుబడి, ఆ తర్వాత కుర్చీలాటలో మునిగిపోయిన నేతలు. సరిగ్గా ఇలాంటి టైంలోనే సీన్ లోకి వచ్చాడు బాలెన్ షా.
”చేతిలో మైక్ పట్టుకుని పాటలు పాడే ఒక రాపర్, ఇవాళ దేశ గమనాన్నే మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక గెలుపు కాదు, హిమాలయాల్లో పుట్టిన నిప్పుకణిక…” అంటూ యావత్ నేపాల్ కీర్తిస్తోంది .
మార్చి 2026. ఫలితాలు వస్తుంటే పాత తరం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 18 ఏళ్లలో 15 ప్రభుత్వాలను మార్చిన నేపాల్ ప్రజలు..
ఈసారి విసిగిపోయి ఒక కొత్త దారి వెతుక్కున్నారు. యువత ఐక్యమై బాలెన్ షా వెనుక నడిచింది. కాట్మండు మేయర్‌గా అక్రమ కట్టడాలను కూల్చినప్పుడే అర్థమైంది, ఇతను మామూలోడు కాదని!
ఆ రాత్రి.. కాట్మండు వీధుల్లో..
చలి గాలులు వీస్తున్నాయి. ఫలితాలు దాదాపు ఖాయమైపోయాయి. పాత పార్టీ ఆఫీసుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంటే, బాలెన్ అనుచరులు మాత్రం వీధుల్లో సందడి చేస్తున్నారు.
ఒక ముసలాయన అంటున్నాడు:
“ఒరేయ్.. రాజులు పోయారు, రౌడీలు వచ్చారు. ఇన్నాళ్లకు కష్టాలు తెలిసిన కుర్రాడు వస్తున్నాడురా!”
బాలెన్ షా మేడ మీద నుంచి జనాలను చూస్తూ నవ్వాడు. పక్కనే ఉన్న మిత్రుడు అడిగాడు, “ఏంటి బాలెన్.. గెలిచేశాం కదా? నెక్స్ట్ ఏంటి?”
“ఇది గెలుపు కాదు దోస్త్.. ఒక పెద్ద బాధ్యత. పాటల్లో విమర్శించడం ఈజీ, కానీ పాలనలో చేసి చూపించడం కష్టం. నేపాల్ ఇన్నాళ్లు చీకట్లో ఉంది, ఇక వెలుగు చూడాలి.”
ట్విస్ట్ ఏంటంటే..
నేపాల్ రాజకీయాల్లో ఎప్పుడూ భారత్, చైనాల ప్రమేయం ఉంటుంది. కానీ బాలెన్ షా మాత్రం ‘నేపాల్ ఫస్ట్’ అంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలా ఇతను కూడా ఒక ఎంటర్ టైనర్ నుంచి లీడర్ గా మారాడు. అయితే అధికారం అంటే పదునైన కత్తి. బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా తప్పులు చేస్తే ప్రజలు క్షమించరు.
హిమాలయాల్లో మంచు కరుగుతోంది.. పాత రాజకీయాల మకిలి కూడా వదులుతోంది. కానీ ఈ కొత్త కెరటం ఎంత కాలం నిలబడుతుంది? అప్పుడే కథ అయిపోలేదు.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! వెనుకబాటుతనంతో అల్లాడుతున్న నేపాలీలకు దారిదీపం దొరికింది .



