Those who are spewing venom at Amaravati must be stopped
‘అమరావతి వల్ల ఒక సామాజిక వర్గం మాత్రమే లబ్ది పొందుతుంది. లక్ష కోట్లు ఇక్కడే పెట్టి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను వదిలేస్తారా ? ‘ ఇలాంటి విష ప్రచారాలతో 2014-2019 మధ్య కాలంలో రాజకీయంగా లబ్ది పొందడమే కాదు . . టీడీపీని , ఆ పార్టీ కీలక నేతలపై జనంలో అనుమానాలు క్రియేట్ చేయడంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ అయింది.
జగన్ మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి జనం మూలన కూర్చోబెట్టినా.. కొందరు కీలక నేతలైతే కుదేలయ్యారు కానీ , ,ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. విష ప్రచారాలను చొప్పిస్తూనే ఉన్నారు . వీరిని కట్టడి చేయడం కూటమి సర్కార్ కి చేతకావడంలేదనే చెప్పాలి. ఒకటీ , ఆరా కేసులు పెట్టినా వాళ్లలో భయం పుట్టించలేకపోతున్నారన్న విమర్శలు కూటమి కేడర్ నుంచే బలంగా వినిపిస్తున్నాయి .
అమరావతిపై విషం చిమ్మడం ఆపలేరా ?
‘‘అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు అప్పులు చేసి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన సొమ్మును ఒకేచోట ఖర్చు చేయడం ఏమిటి?’’ అంటూ ప్రజలలో విష ప్రచారం చేస్తున్న వారికీ వాస్తవాలు తెలుసు . అయినా విషం చిమ్ముతున్నారు . అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయింది. హైదరాబాద్‌లో, అంటే సైబరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నుంచి అందుతున్న ఫలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని గుర్తు చేసుకోవాలి .
రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు అవసరమా? అని వైసీపీ సోషల్ మీడియాతో పాటు , ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ గొంతు చించుకుంటూనే ఉన్నారు . ఇలాంటి వాళ్లు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది. హైదరాబాద్‌లో ఇప్పటికీ ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకొనే వారికి ఈ భూములను ఆకర్షణగా చూపుతున్నారు. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా ముందుకు రావాలి. ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా నిర్మాణాలు జరిగినప్పుడే రాజధానికి ఒక రూపు వస్తుంది. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నసుగుతున్నవారు ఈ విషయం తెలుసుకోవాలి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటానికి కారణం ??? చెన్నయ్, బెంగళూరు, ముంబై వంటి మహానగరాలు ఉండటం వల్లనే ఈ రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతుంది . ఇలాంటివన్నీ ప్రజలలోకి వెళ్లేలా కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలి .
మేధావుల ముసుగులో . ,
అమరావతిపై లేనిపోని విష ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా , మేధావుల ముసుగులో జనాన్ని రెచ్చగొడుతూ . . రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారి ప్రతి చర్యలను గమనించడానికి పోలీసు శాఖలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి . .. నిఘా ద్వారా విష బీజాలు నాటే వారిని ఆదిలోనే అడ్డుకోవాలి . లేకపోతె . .. అమరావతి అనే మహా యజ్ఞంలో విషం చిమ్మే వారు మరింత పెట్రేగిపోయే ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ గ్రహించి మేల్కోవాలి. మెతక వైఖరి వీడి , అరాచకవాదులపై కొరఢా ఝళిపించాలి .



