ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్లో ప్రచారాన్ని ముగించారు. జమ్మూలో జరిగిన సభలో కాంగ్రెస్-NC కూటమిపై మండిపడ్డారు. మూడు కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ల స్థావరాల మీద సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తున్నామని చెప్పారు. నవభారతంలో చొరబాట్లుకు తావులేదని , టెర్రరిస్టులకు సర్జికల్ స్ట్రయిక్స్‌తో గుణపాఠం చెప్పామని మోదీ అన్నారు. సెప్టెంబర్ 28న సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. తొలిదశ పోలింగ్ సరళి చూస్తే బీజేపీ ఘనవిజయం ఖాయమనిపిస్తోందన్నారు.
అనంతరం హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం హిసార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంతర్గత కలహాలనూ ప్రధాని మోదీ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్‌లో పోరు నడుస్తోందని, తండ్రి, కొడుకులిద్దరూ సీఎం సీటు కోసం కుస్తీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
నాయకుల మధ్య ఐక్యత తీసుకురాలేని పార్టీ రాష్ట్రంలో సుస్థిరతను ఎలా తెస్తుంది? హర్యానా ప్రజలు కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాల వలలో చిక్కుకోరు. దేశంలోనే అత్యంత మోసపూరిత, నిజాయితీ లేని పార్టీ కాంగ్రెస్ అని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌లో దళితులు, వెనుకబడిన వారికి పూర్తిగా తలుపులు మూసుకుపోయాయన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ రాజకుటుంబం చెబుతోందని, వారి ఆలోచనే దళితులు, వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకమని ప్రధాని మోదీ అన్నారు.