అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడంతో, చైనా కూడా రివెండ్ టారిఫ్స్‌తో ఎదురుదాడి చేసింది. దీనితో వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మదుపరుల సంపద సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే .. ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
- ఈ సెషన్స్ లో టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. వాస్తవానికి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించిన రోజే ఈ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి . ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమెరికాకు ఎగుమతులను నిలిపివేసిందన్న వార్తలు రావడంతో టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర క్షీణించి రూ.552 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
- టాటాలకు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ షేర్లు కూడా నేడు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 19.2 శాతం పతనమై రూ.4,491 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. 2020 మార్చి తర్వాత కంపెనీ షేర్లు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
- అలాగే టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా, మొత్తంగా రూ.1.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161 వద్ద ముగిసింది. ఇంత దారుణమైన పతనంలోనూ కొన్ని షేర్స్ లాభపడ్డాయి .
- లాభపడిన షేర్లు : హిందూస్థాన్ యూనిలివర్
- నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, టైటాన్, టీసీఎస్.
- కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) షేర్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. కీలకమైన OMCలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ మార్కెటింగ్, పంపిణీకి ప్రధాన భూమిక వహిస్తాయి. ఈ ప్రకటన తర్వాత, ఆయా ఆయిల్ కంపెనీల స్టాక్ ధరలు భారీగా తగ్గాయి
- ఏయే కంపెనీలు ఏ మేరకు తగ్గాయి:
- BPCL: 6.24% తగ్గాయి
- HPCL: 4.31% తగ్గాయి
- IOC: 5.99% తగ్గాయి