ఒకప్పుడు పాకిస్తాన్ లో ఎంపీ – భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ

Rama Chandra P

May 1, 2025

భారత్ పౌరసత్వం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వైనం

ఒకప్పుడు అతను పాకిస్థాన్ పార్లమెంట్ మెంబర్ . అంటే ఎంపీ అన్న మాట . పరిస్థితులు ఎలా తారుమారవుతాయో ఇతని ఉదంతం ఒక ఉదాహరణ . ఆ ​ మాజీ ఎంపీ ప్రస్తుతం భారత్​లో ఐస్​క్రీములు అమ్ముకుంటున్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్​ భుట్టో ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న దివాయా రామ్​, హరియాణాలోని ఫతేబాద్​లో ఐస్​క్రీమ్​ వ్యాపారం చేసుకుంటున్నారు. 25ఏళ్ల క్రితం భారత్​కు వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడిపోయారు. తాజాగా భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీసాలు రద్దు చేయగా ఈయన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ఆయన భారత్​కు ఎందుకు వచ్చారు? జీవనం సాగించేందుకు ఐస్​క్రీములు వ్యాపారం ఎంచుకున్నారు .

పాకిస్థాన్​కు చెందిన దివాయా రామ్​ 1989లో మైనార్టీల రిజర్వ్​ స్థానంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, పార్లమెంట్​ సభ్యులుగా ఉన్నా ఆయన కుటుంబంపై దాడులు మాత్రం ఆగలేదు. ఒకసారి దివాయా రామ్​ కూతురిని కిడ్నాప్​ చేసినా, పోలీస్ వ్యవస్థ కూడా ఈయనకు సహకరించలేదు . దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఎంపీ పదవికి రాజీనామా చేసి కుటుంబంతో సహా భారత్​కు వచ్చేశారు. భార్య రాజో రాణి, 8మంది కుమారులు, ఇద్దరు కూతుళ్లు సహా 13 మంది వచ్చారు. ఆ తర్వాత ఒక కుమార్తె జన్మించగా, ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యుల సంఖ్య 30కి చేరింది. తొలుత నెల రోజుల టూరిస్ట్​ వీసాతో వచ్చిన ఆయన, తర్వాత ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తున్నారు . అనంతరం ఐదేళ్లకు ఆయన వీసాను 2018 వరకు పొడిగించారు.

పాకిస్థాన్​లో వేధింపులు తాళలేక దివాయా రామ్​ బంధువు రామ్ ప్రకాశ్​ కుటుంబం కూడా 2006లో భారత్​కు వచ్చి స్థిరపడింది. ఫతేబాద్​లోని సర్దావాలాకు వచ్చి స్థిరపడి, ఇక్కడే వివాహం చేసుకున్నాడు. అనంతరం అతడి కుటుంబంలోని ఆరుగురికి భారత పౌరసత్వం దక్కగా, ఇంకా కొందరివి ప్రాసెస్​లో ఉన్నాయి. కాగా, జమ్ము కశ్మీర్​ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్​ వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత్‌ విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్​కు తిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ నుంచి 1,367మంది పౌరులు భారత్​ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

2018 వరకు వీసాతో ఉన్న దివాయా రామ్​ కుటుంబం శరణార్థిగా భారత్​లోనే ఉంటున్నారు. అనంతరం 2018లో వీసా గడువు పెంపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన వీసా గడుపు పెంచడానికి స్థానిక నేతలతో పాటు అందరి చూట్టూ తిరిగారు. CAA చట్టం ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా పాకిస్తాన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ఆ దేశ పౌరులైన . . దీర్ఘకాలంగా ఇక్కడే ఉంటున్న వారికి భారత్ పౌర సత్వం విషయంలో మానవత్వంతో ఆలోచించి . .. నిర్ణయం తీసుకోవాలి .

You May Also Like…