మహిళల కోసం నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణ వ్యాప్తంగా ‘టీమ్ శివంగి’ ఏర్పాటుపై సర్కార్ యోచన
శభాష్ షర్మిల మేడం . .. ఎస్పీ జానకి షర్మిల అంకురార్పణకు అభినందనలు
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఓ స్పెషల్ లేడీ కమాండో స్పెషల్ టీమ్ ఫామ్ చేసారు. ఆమధ్య నలుగురు తునికాకు కూలీలు దట్టమైన అడవిలో తప్పిపోతే తనే రంగంలోకి దిగి ఆమె కాపాడిన తీరు ఇంకా ఎవరూ మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి ఈ ఇనీషియేటివ్ ద్వారా అందరి అభినందనలు అందుకుంటున్నారు.
దేశంలోని త్రివిధ దళాలలో స్పెషల్ కమాండో ఫోర్సులు, ఆర్మీ కమాండోలు, నేవీలో మార్కోస్, అలాగే ఎన్‌ఎస్జీ, ఎస్‌పీజీ వంటి అత్యుత్తమ బలగాలు, గ్రేహౌండ్స్ వంటి రాష్ట్ర బలగాలు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మహిళా కమాండోలు ఏ రాష్ట్రంలో లేరు. ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనతో ‘టీం శివంగి’ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్‌కు అధునాతన ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. వాటిని వినూత్న రీతిలో వాడేలా తీర్చిదిద్దారు.
మహిళలకు శారీరక దృఢత్వం పెంపొందించడమే కాకుండా, రన్నింగ్ రేసులు, వర్టికల్ రోప్ క్లైంబింగ్, డిఫెన్స్ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, పేలుడు పదార్థాల వినియోగం, అన్ని రకాల ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాల ఫైరింగ్, నిర్వహణ, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేని నావిగేషన్, ఆకస్మిక వ్యూహాలు, శత్రు కదలికల అంచనా, అడవిలో సంకేతాలను అర్థం చేసుకోవడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడులు, ఎదురు దాడులపై]పర్‌ఫెక్ట్ శిక్షణ అందించారు.
ఒక్కొక్కరిని ఒక్కో విభాగంలో నిపుణులుగా తీర్చిదిద్దారు. కొంతమందికి యుద్ధ తంత్రాలపై, మరికొంతమందికి ఫీల్డ్ సిగ్నల్స్, ఇంకొంతమందికి ఫైరింగ్, మరో వర్గానికి నిఘా వ్యవస్థలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వీరందరినీ ఒక సమర్థవంతమైన స్పెషల్ టీమ్‌గా రూపొందించారు.