“పాలకుల ముందు చూపులేకపోవడం వల్ల పలు చిన్న చిన్న దేశాలు ఆర్ధిక, ఆహార, ఇంధన సంక్షోభాలలో కొట్టుముట్టాడుతున్నాయ్..”
మన పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుముట్టాడుతోంది. ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో ఆ చిన్న దేశం అతలాకుతలం అవుతోంది. జూన్ నెలలో 8.6 బిలియన్ డాలర్ల విదేశీ రుణం కట్టకపోవటంతో ఈ దేశం డిఫాల్టర్‌గా మారింది. లంకతో పాటు మొత్తం 16 దేశాలు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. లెబనాన్, రష్యా, సురినేమ్, జంబియా కూడా డిఫాల్టర్‌గా మారాయి. . ఆ దేశాల్లో బెలారస్, ఈక్వెడార్, నైజీరియా, అర్జెంటీనా, ఉక్రెయిన్, ట్యునీషియా, ఘనా, ఈజిప్ట్, కెన్యా, ఇథియోపియా, ఎల్‌సాల్వెడార్, పాకిస్థాన్, ఉన్నాయి.
నైజీరియా
దేశ ఆదాయంలో 30 శాతం వరకు అప్పుల వడ్డీలనే కడుతున్నది. ఒక ఏడాదిలో 500 మిలియన్ డాలర్ల అప్పును ఈ దేశం తీర్చాల్సి ఉన్నది. ఈ అప్పు తీర్చకపోతే నైజీరియా కూడా డిఫాల్టర్‌గా మారే అవకాశం ఉన్నది.
అర్జెంటీనా
విదేశీ అప్పుల్లో అర్జెంటీనాది రికార్డు. అప్పులు కట్టలేక ఈ దేశం తొమ్మిది సార్లు చేతులెత్తేసింది. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థను ఆశ్రయించి, 4 కోట్ల డాలర్ల రుణాన్ని కోరింది.
ఉక్రెయిన్
రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. భారీగా విదేశీ అప్పులు పేరుకుపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా 1.2 బిలియన్ డాలర్ల అప్పు తీర్చాల్సి ఉన్నదీ దేశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశం దావాను ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఈజిప్ట్
వచ్చే ఐదేండ్లలో ఈ దేశం కట్టాల్సిన విదేశీ రుణం 100 బిలియన్ డాలర్లు. అందులో 2024లోగా 3.3 బిలియన్ డాలర్ల అప్పు కట్టాలి. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలు దిగుమతి చేసుకొంటున్న ఈ దేశంలో మరో మూడు నెలలకు సరిపడా నిల్వలే ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఈ దేశానికి గోధుమలను ఎగుమతి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశాల్లో యద్ధ వాతావరణం ఉండటంతో ఈజిప్ట్ ప్రజలు ఆకలితో అల్లాడే పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నది.
ఘనా
దేశ రెవెన్యూలో 50 శాతం ఆదాయం విదేశీ అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతున్నది. ఇక్కడ ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరుతున్నది.
ట్యునీషియా
ఈ దేశంలో ద్రవ్యోల్బణం 7 శాతం పెరిగింది. 80 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య లోటు ఉన్నది. ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ఈ దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం చేసే అవకాశాలు కుచించుకుపోయాయి. బడ్జెట్లో 10% లోటు ఉన్నది..
కెన్యా
కెన్యా తన రెవెన్యూలో 30 శాతం అప్పుల వడ్డీలే కడుతున్నది. ఆ దేశ బాండ్ల విలువ సగానికి పడిపోయాయి. 2024లోగా 2 బిలియన్ డాలర్ల విదేశీ అప్పు తీర్చాల్సి ఉన్నది.ఇథియోపియా జీ20 కామన్ ఫ్రేమ్‌వర్క్ ప్రోగ్రాం కింద ఎప్పటికప్పుడు అప్పులు తీర్చాలనుకొన్నా, అక్కడ సైనికులకు, రెబల్స్ జరుగుతున్న యుద్ధంతో పరిస్థితులు అందుకు సహకరించటం లేదు. ఈ దేశానికి 1 బిలియన్ డాలర్ల విదేశీ అప్పు ఉన్నది.
ఈక్వెడార్
పెట్రో ఉత్పత్తులు, ఆహార పదార్థాలపై భారీగా సబ్సిడీలు ఇవ్వటంతో ఈ దేశ అప్పులు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 2.4 శాతంగా ఉన్న జీడీపీ వచ్చే ఏడాదికి 2.1 శాతానికి పడిపోయే అవకాశాలున్నాయి.
ఎల్సాల్వేడార్
బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించినా విదేశీ అప్పు తీసుకోవటానికి ఎలాంటి అవకాశాలు లేని పరిస్థితి ఈ దేశానిది. ఈ దేశం తీర్చాల్సిన 800 మిలియన్ డాలర్ల అప్పు గడువు ముగియబోతున్నది
పాకిస్థాన్
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఎక్కువయ్యాయి. దేశీయ అవసరాల కోసం విదేశీ దిగుమతులు ఎక్కువయ్యాయి. దీంతో కరెంటు ఖాతా లోటు పెరిగిపోయింది. విదేశీ నిల్వలు 9.8 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు తగ్గిపోయాయి.
బెలారస్
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన ఉండటం ఈ దేశానికి మరింత చేటు చేస్తున్నది. బెలారస్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.