జామకాయలు శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిదని డాక్టర్లు అంటుంటారు. ముఖ్యంగా స్త్రీలకు ఎన్నో ఉపయోగాలున్నాయి. నెలసరిలో నొప్పి, ఎన్టీడీ లాంటి సమస్యలున్న మహిళలకు ఈ జామకాయ ఎంతో మేలుచేస్తుంది. మరి అలాంటి జాయకాయల గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలున్నాయి. జామకాయలో విటమిన్లు, సోడియం, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో నెలసరిలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. జామపండ్లు తినడం వల్ల గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ (ఎన్టిడి) సమస్య ఉన్న స్త్రీలలో గర్భస్రావం, శిశు మరణాల్లాంటివి సాధారణం. జామకాయలు ఆ సమస్యను చాలా వరకూ నివారిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. మధుమేహం ఉన్నవారు చాలా రకాల పండ్లు తినకూడదు. కానీ జామ మాత్రం తినొచ్చు. ఇది రక్తంలో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే హార్ట్ అటాక్ ను అరికడుతుంది. ఇందులోని బి-3, బి-6 రక్తాన్ని సాఫీగా సరఫరా చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది సౌందర్య సాధనం కూడా. దీంతో చర్మం మృదువుగా ఉంటుంది. ముఖంలో నునుపు, మెరుపు సంతరించుకుంటాయి. పీచు పుష్కలంగా ఉంటుంది కనుక జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది. మరీ పండిపోకుండా దోరగా ఉన్న వాటిని తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే అమ్మాయిలు ఈ పండ్లు రోజుకొకటి తింటే చాలు మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జామలో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా అధికమే.. తరచూ తిన్నట్లయితే ఆ మహమ్మారికి దూరంగా ఉన్నట్లే. వీటిలో ఉన్న సి విటమిన్ నోటిపూతను రానివ్వదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్లకు మేలు చేస్తుంది. చయాపచయ క్రియ (మెటబాలిజం)ను క్రమబద్ధం చేస్తుంది. తీపి పెద్దగా ఇష్టపడని వాళ్లు ఉప్పూకారం లేదా మిరియాల పొడి అద్దుకుని తినొచ్చు. పండిన కాయలతో హల్వా, సాస్.. పచ్చివాటితో కూర, పచ్చడి కూడా చేసుకుంటారు. మొత్తంమీద జామ మనకు అతి తక్కువ ధరతో దొరికే దివ్య ఔషధం.