ఇటీవల పాండిచ్చేరి మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్విహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. వేషధారణ నుంచి వ్యవహార దక్షత వరకు ఆమెది ఓ విశిష్ట శైలి. అదే గౌరవ భావనతో సామజిక మాధ్యమ ముఖాముఖిలో ప్రయోక్త “మేడమ్.. ప్రతి జీవన మలుపులోనూ మీకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.మీరు మీలాగ ఉండటానికే ఇష్టపడుతున్నారు. మీ జీవన విధానంలో వ్యక్తిత్వ నిర్మాణంలో మీరు ఇంతటి ప్రత్యేకత, స్పష్టత ఎలా అలవడ్డాయి?” అని ప్రశ్నించారు. అప్పుడు ఈ మానవి మందహాసంతో “నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ నా జీవితం నా అధీనంలో ఉంచాలని ఆకాంక్షిస్తూ ఉండేదాన్ని. నాకు నచ్చిన రీతిలో నా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆశ పడుతూ ఉండేదాన్ని. అందుకే విద్యాబ్యాసం దగ్గర నుంచి వృత్తి వ్యవహారాల వరకు ఏ విషయంలోనూ నేను ఎవరి ప్రభావానికి లోను కాలేదు. నా ఆసక్తి, అభిరుచిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకున్నాను. నా అంతరాత్మ ఆదేశం మేరకే ముందుకు నడిచాను. నడుస్తున్నాను. చివరకు సైకిల్ సవారీలాంటి చిన్న చిన్న సరదాలు విషయంలో కూడా నేను అందరి కన్నా విభిన్నంగా ఆలోచించేదాన్ని. ఆ ఆలోచనల్ని అమలు చేసేదాన్ని.
చండీఘడ్ లో చదువుకునే రోజుల్లో నా మిత్రులందరూ వాతావరణం ప్రశాంతంగా ఉన్నపుడు, రోడ్డుపై రద్దీ లేనపుడు సైకిళ్ళు తీసుకొని బయటకు వచ్చేవారు. కానీ నేను వారికీ భిన్నంగా వాన వచ్చినప్పుడల్లా సైకిల్ పై సవారీకి రహదారి పైకి వచ్చేదాన్ని. గాలికి ఎదురు తొక్కుతూ ఉంటె, నాకు ఆ అనుభవం ఎంతో ఆనందాన్నిచ్చేది. ఆలా గాలి వాలుకు వ్యతిరేకంగా ముందుకు సాగిపోవటం వల్ల నా దృక్పధం, పట్టుదల మరింత పెరిగాయ్. అది నా టెన్నిస్ ఆటకు , భవిష్యత్ జీవితానికి ఎంతో తోర్పడింది. భిన్నంగా ఆలోచించాలంటే ధైర్యం ఉండాలి. ‘Dare to be different ‘కానీ నీలా నువ్వు జీవించడానికి ఆ ధైర్యమే అండగా నిలుస్తుంది. ఆయుధం అవుతుంది.” అంటారు కిరణ్ బేడీ. అందుకే ఆమె ఇటీవల పాండిచ్చేరి లో పాలనాపరంగా అనూహ్యమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.