టూరిజం అనగానే గుర్తొచ్చేవి విదేశాలు. బయటి దేశాల్లోనే అందమైన ప్రదేశాలుంటాయి అనే నమ్మకానికి కారణం సినిమాలు కావచ్చు. అయితే మనదేశంలో కూడా చాలా అద్బుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. అందులో విదేశాలను తలదన్నే టూరిస్ట్ స్పాట్లు విశాఖపట్నం జిల్లాలో చాలానే ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ తూర్పుకనుమల కమనీయ అందాలు చూస్తే మంత్ర ముగ్దులైపోతాం. అలా చూస్తూ నిశ్చేష్టులైపోవడం నిజం. అందం అంటేనే గుర్తొచ్చేది విశాఖ. అందులోను ఏజెన్సీ ప్రాంతానిది చాలా ప్రముఖం.
విశాఖ ఆదివాసీ ప్రాంతంలో చాలా పర్యాటక ప్రాంతాలున్నాయి. అందులో అరకు లోయలు, బొర్రాగుహలు,, లంబసింగి వంటివి. ఈ ప్రాంతంలో అడవి ప్రాంతం, జలపాతాలు, కొండలు వంటి ఎన్నో మనలను కట్టిపడేసే అందాలు కనువిందు చేస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
అయితే ఇప్పుడు అందరి దృష్టి పాడేరులో ఉన్న వంజంగి ప్రాంతంపై పడింది. గిరిజన ప్రాంతంలోని మిగతా వాటితో పాటు పర్యాటకుల తాకిది వంజంగికి ఎక్కువయింది. అక్కడ ప్రకృతి తన అందాలను ఆరబోస్తోంది. ఈ వంజంగి గ్రామం పాడేరు నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. విశాఖ నుంచి సరిగ్గా 100 కిలోమీటర్లు. విశాఖ నుంచి బైక్, కార్ పై వెళ్లే మూడుగంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3.500 అడుగుల ఎత్తులో ఉంది.
విశాఖఏజెన్సీ తూర్పుకనుమల్లో ఉండే ఈ వంజంగి కొండపై నుంచి ప్రకృతి అందాలు మనలను తన్వయత్వానికి గురిచేస్తాయి. కొండపై నుంచి చూస్తే మేఘాలు పాల సముద్రాన్ని తలపిస్తాయి. మేఘాలపై తేలుపోతున్నట్టు అనిపిస్తుంది. సూర్యోదయాన్ని చూడాలంటే ఇక్కడి నుంచే చూడాలంటారు పర్యాటకులు. అందుకు ముందురోజే పాడేరు చేరుకుని రాత్రికి అక్కడే ఉండి వేకువజామునే వంజంగి కొండకు చేరుకుని సూర్యోదయం కోసం పడిగాపులు పడతారు. చూశాక ప్రపంచాన్నే మర్చిపోతారు. అనంతమైన మానసిక ఉల్లాసాన్ని మోసుకుని వెళ్తారు.
కొండపైకి వెళ్లడానికి కూడా ఎక్కువగా కష్టపడవలసిందిలేదు. దీంతో శని, ఆదివారాలు, సెలవు ఉంటే చాలు అధిక సంఖ్యలో టూరిస్టులు వంజంగి కండపైకి వచ్చి వాలిపోతున్నారు. వంజంగిలో అయిదు పైగా వ్యూపాయింట్స్ ఉన్నాయి. వంజంగి వ్యూ పాయింట్, వంజంగి క్లౌడ్ హిల్ టాప్, వంజంగి సన్ వ్యూ, కొత్త వలస వ్యూపాయింట్, ట్రెక్కర్స్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి.