అతడో స్టార్కిడ్. ఇంకా చెప్పాలంటే ఘన చరిత్ర కలిగిన అక్కినేని కుటుంటం లెగసీని అందిపుచ్చుకున్న మూడో తరం యువ హీరో. అతడి వెనుక ఓ పేరొందిన ప్రొడక్షన్ హౌస్ ఉంది. వెండితెరపై ఎంట్రీ ఇవ్వకముందే దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న చార్మింగ్ బాయ్. సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ కావడానికి అన్ని అర్హతలూ అతడికి ఉన్నాయి. ఇన్ని అనుకూలతలున్నా సినిమాల్లో మాత్రం అతడికి ఇప్పటికీ సరైన హిట్ మూవీ పడకపోవడం ఆశ్చర్యమే. అవును మనం చెప్పుకుంటున్నది అఖిల్ అక్కినేని గురించే. ఎన్నో అంచనాల మధ్య ‘అఖిల్’ మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ యువ హీరోకు ఆ చిత్రం డిజాస్టర్ కావడం నిరాశను మిగిల్చింది. ఆ తరువాత వచ్చిన ‘హలో’ , ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలు కూడా ఆశించిన విజయాలనివ్వలేదు.
గత ఏడాది వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతో తొలి సక్సెస్ ను చూసిన ఈ యువ హీరో ఈసారి ‘ఏజెంట్’ గా పవర్ఫుల్ యాక్షన్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సీక్రెట్ స్పైగా అలరించబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ లుక్స్ అదరహో అనిపించేలా ఉండటంతో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయిందనిచెప్పాలి. ఈ చిత్రంలో యాక్షన్ పరంగా అక్కినేని యువ హీరో అభిమానుల్ని ఎంతగానో మెప్పిస్తాడని చిత్ర బృందం గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది. సీక్రెట్ ఏజెంట్‌గా మెప్పించడానికి అఖిల్ గంటల తరబడి జిమ్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నట్టు అతడి లుక్స్ చెపుతున్నాయి. ఇక మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండటం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జూలై 15న విడుదల చేయనున్నారు.
కాగా ఈ చిత్రం టీజర్‌ను అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం ద్వారా దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. నాగ్ కు బాలీవుడ్లో సైతం హీరోగా మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆయన తనయుడిగా అఖిల్ మూవీ పట్ల అక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉండటం సహజం. దానికి తగినట్టుగానే ఈ చిత్రానికి సంబంధించిన బాలీవుడ్‌లోనూ భారీగా ప్రమోషన్లు నిర్వహించేందుకు ఈ చిత్రం టీం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రం ఆశించినవిధంగా హిట్ అయితే టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా స్టార్ వచ్చినట్టే.